సింగిడి రంగుల నేల


Sun,April 14, 2019 01:27 AM

దివిలో విరిసిన హరివిల్లును తరచూ చూస్తూనే ఉంటాం. సప్త వర్ణాలు ఒదిగిపట్టి.. నీళ్లపై విరిసిన ఇంద్రధనుస్సును మీరెప్పుడైనా చూశారా? రంగులద్దుకున్న మేనిగల పాము మీకెప్పుడైనా ఎదురైందా..? రంగు రంగుల ఇండ్లు గల గ్రామాన్ని ఎప్పుడైనా విజిట్ చేశారా? ఇదిగో ఆ వింతలూ విశేషాలు..!

రంగుల గ్రామం..

పేరుకు తగ్గట్టుగానే ఇక్కడి ఇండ్లన్నీ రంగులద్దుకొని చూడముచ్చటగా ఉంటాయి. ఇండోనేషియాలోని రెయిన్‌బో విలేజ్‌లో 200కు పైగా ఇండ్లు ఉన్నాయి. ఇది ఒకప్పుడు మురికి గ్రామం. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో ఉండేది. పట్టించుకునే నాథుడు, అభివృద్ధి చేసే నాయకుడు లేకపోవడం, అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో.. గ్రామస్తులే అభివృద్ధికి నడుం కట్టారు. వనోసరి తెగకు చెందిన గ్రామస్తులు గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. సమీపంలోని పరిశ్రమలు, ఉన్నతాధికారులను కలిసి విరాళాలు సేకరించారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకున్నారు. ప్రతీ ఇంటిని రంగుల హరివిల్లుగా మార్చారు. గ్రామస్తుల కృషిని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామాన్ని ఇప్పుడు టూరిస్ట్ స్పాట్‌గా మార్చింది. పిల్లలను ఆకట్టుకునేలా వివిధ రకాల రంగు బొమ్మలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ గ్రామం సందర్శకులతో కళకళలాడుతున్నది. దీని ద్వారా స్థానికులకు ఉపాధి దొరికింది. ప్రస్తుతం రెయిన్‌బో గ్రామం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది.
Kampung-Pelangi

సప్తవర్ణాల నది..

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలోని రెయిన్‌బో రివర్ వివిధ రంగులను పులుముకుంటుంది. ఒంపులు తిరుగుతూ.. రంగులు రంగరిస్తూ ముందుకెళ్తుంది. ఇదేం మాయ కాదు కానీ ఈ నదిలో మకరేనియా క్లావిగేరా అనే మొక్కలు వివిధ రంగుల్లో మొలకెత్తుతాయి. ఈ మొక్కలు పెరిగే కొద్దీ వివిధ రంగుల్లోకి మారుతాయి. వీటి వల్లనే ఈ నదిలో పారే నీళ్లు వివిధ రంగుల్లో కనిపిస్తాయి. దీనిపై అనేక వాదనలున్నాయి. రాళ్లలో ఖనిజాలు ఉండడంతో నదికి ఈ రంగు వచ్చిందని కొంతమంది చెబుతారు. ఈ నదిని ఇక్కడి స్థానికులు రెయిన్‌బో రివర్, కనో క్రిస్టాలీస్ అని పిలుస్తారు. ఈ నదికి లక్షల యేండ్ల చరిత్ర ఉన్నది. ఇక్కడి వారు దీన్ని షీల్డ్ ఆఫ్ గయానాగా అభివర్ణిస్తారు. నదిలో ఖనిజాలతో పాటు, రాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరుగలేవు. ఈ నదిలో ఏడాదికి ఒక సెంటీమీటర్ చొప్పున మాత్రమే మొక్కలు పెరుగుతాయి. అమెజాన్ అడవి, ఆండియన్ పర్వత శ్రేణులు, ఒరినోకియా మైదాన ప్రాంతం మీదుగా ఈ నది ప్రవహిస్తున్నది. ఒకప్పుడు అందరూ ఈ ప్రాంతాన్ని అత్యంత ప్రమాదకర ప్రాంతంగా భావించేవారు. ప్రస్తుతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుండడంతో ఆ భావనే మారిపోయింది. రెయిన్‌బో నది వల్ల ఈ ప్రాంతానికి మంచి పేరూ వస్తున్నది.

రెయిన్‌బో స్నేక్..

రకరకాల పాములను, రంగు రంగుల పాములను చూస్తూనే ఉంటాం, వాటి గురించి వింటూనే ఉంటాం. అయితే సప్తవర్ణాల మేని కలిగిన పామును బహుశా మీరెవ్వరూ చూసి ఉండకపోవచ్చు. రెయిన్‌బో స్నేక్‌గా పిలవబడే ఈ పాము తన జీవిత కాలంలో ఐదడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఎక్కువగా దక్షిణాసియాలోని మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియాల్లో కనిపిస్తుంది. ఈ పాము ఆహారంగా కప్పల్ని, బల్లుల్ని, తొండల్ని తింటుంది. దీనిలోని వింతైన లక్షణం ఏంటంటే.. బాగా కోపం వస్తే మెడభాగం ముదురు నారింజ రంగులోకి మారిపోతుంది. దీని కోరలు, నాలుక చూస్తే ఎవ్వరైనా భయపడాల్సిందే. మండుతున్న నిప్పులాగా ఎర్రటి రంగులో ఉంటాయి దీని కోరలు. విషం లేకపోయినప్పటికీ ఈ పాము కాటేస్తే భరించలేనంత మంట పుడుతుందట.

496
Tags

More News

VIRAL NEWS