అతివల మనసు దోస్తున్న.. ఆదివాసీ ఆభరణాలు!


Sun,April 14, 2019 01:22 AM

ఆడవాళ్లకు ఏడువారాల బంగారు నగలున్నా.. అందులో వజ్రాలు.. వైఢుర్యాలు పొదిగి ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది.. వాటితో పాటు ఈ మధ్య కాలంలో.. ఒక గ్రాము బంగారు నగలను వార్డ్‌రోబ్‌లోకి చేర్చారు పడతులు.. ట్రెండ్‌కి తగ్గట్టుగా నగలను వేసుకుంటూ మురిసిపోతున్నారు.. ఇప్పటిదాకా ఉన్న నగల్లోకి మరో కొత్త ట్రెండ్ దూసుకొస్తున్నది.. ఈ నగలు ఆదివాసీలు.. గిరిజన తెగల్లో కనిపించేవి ఒకప్పుడు..వాటిని ట్రెండ్‌కి తగ్గట్టుగా మెరుగులద్ది.. ఇతర నగలకు పోటీగా తీసుకొస్తున్నారు ఫ్యాషనిస్టులు.. ఆడవాళ్లు ఈ కొత్త ట్రెండ్‌ని సాదరంగా స్వాగతం పలుకుతున్నారు.. ఈ సరికొత్త నగల ట్రెండ్ గురించే ఈ ప్రత్యేక కథనం..

బంగారు నగలను తలదన్నేలా.. ఇప్పుడు మార్కెట్‌లో వివిధ రకాల నగలు రాజ్యమేలుతున్నాయి. బంగారంలా అనిపించే నగలు ఒక రకమైతే.. స్టోన్స్‌తో వచ్చిన నగలు ఇప్పుడు మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. కాస్త ఫంకీగా ఉండడానికి ట్రైబల్ జువెలరీని కాలేజ్ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తున్నది. అటు ట్రెడీషనల్‌గా ఉండే చీరల మీదకే కాదు.. పొట్టి పొట్టిగా ఉండే డ్రెస్‌ల మీదకీ ఇవి బాగా సూటవుతున్నాయి. ట్రైబల్ జువెలరీ అంటే ఒక యూనిక్ పీస్ అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా మనదేశంలో కంటే ఇతర దేశాల్లో వీటి ఆదరణ మరింత ఎక్కువగా ఉంది. ఎముకలు, కలప, మట్టి, గవ్వలతో ఈ నగలు ఎక్కువగా రూపొందించే వాళ్లు. మట్టికుండే ఆకర్షణ వారి నగలకు కూడా ఉండేది. దాన్ని ఏ మాత్రం తగ్గించకుండా ఇప్పటి డిజైనర్లు ఈ నగలను రూపొందించడం విశేషం. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం ఈ నగల మీద ఆసక్తి చూపుతున్నారు.
Royal-Tribe-by

ఒక్కో చోట ఒక్కోలా..

మనం వేసుకున్న నగలా ఇంకెవ్వరివీ ఉండకూడదని ప్రతీ అమ్మాయి భావిస్తుంది. ఒక్కోరిది ఒక్కో డిజైన్‌లా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా గిరిజన తెగలున్నాయి. ఈజిప్టు, ఇండియా, ఆఫ్రికాలాంటి దేశాల్లో ఈ నగలకు ప్రత్యేకత ఉంది. జంతువుల దంతాలు, ఎముకలతో వీటిని తయారుచేస్తారు. చిన్న చిన్న రంగు రాళ్లు, చెక్కలు.. సహజసిద్ధమైన మెటీరియల్స్‌తో నగలు తయారు చేయడం వారి ప్రత్యేకత. ఇవే కాకుండా.. ఆకులు, పండ్లు, ఈకలు, పువ్వులతో కూడా నగలను తయారుచేసి గిరిజనులు ముచ్చట తీర్చుకునేవారు. ఒక రకంగా డబ్బులతో పనిలేకుండా.. సహజంగా ప్రకృతిలో దొరికే వనరులతోనే నగలుగా చేయడం వల్ల ముచ్చట తీరడంతో పాటు, ఖర్చు తగ్గుతుంది. పైగా ఈ నగలన్నీ హ్యాండ్‌మేడ్ కావడంతో ఫినిషింగ్ కూడా బాగుండేవి. ఇప్పుడు మార్కెట్‌లో దొరికే నగలు చాలావరకు మెషీన్ మేడ్ దొరుకుతున్నాయి.

చాలారకాలు..

ఈ జువెలరీల్లో కూడా చాలా రకాలున్నాయి. ట్రైబల్ జువెలరీలో ము ందు స్థానంలో ఉం డేది బంజారా జువెలరీ. ఈ నగలకు రాజస్థాన్ చాలా ఫేమస్. చాలా కలర్‌ఫుల్‌గా, హెవీగా ఈ జువెలరీ డిజైన్స్ ఉంటాయి. చాలావరకు గిరిజనులే వీటిని తయారు చేస్తారు. కాయిన్స్, డీడ్స్, చైన్లు, మెటల్ మెష్‌లతో ఈ నగలను రూపొందిస్తారు. చెవిపోగులు, బ్రాస్‌లెట్స్, గాజులు, గజ్జెలు, అరవంకీలను తయారుచేస్తారు. మరొకటి బస్తర్. ఇది మధ్యప్రదేశ్‌లో చాలా ఫేమస్. ఎండిపోయిన గడ్డి, బాడ్స్‌తో ఈ నగలు చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి. వీళ్లు.. వెండి, కలప, గ్లాస్, నెమలిపించాలు, కాపర్, అడవుల్లో దొరికే పువ్వులతో ప్రత్యేకమైన నగలను తయారు చేస్తారు. కాయిన్స్‌తో చేసే నగలు వీరి స్టయిల్స్‌కి ఐకాన్‌గా చెప్పుకోవచ్చు.

మరికొంత కొత్తగా..

ఒక్కో తెగల్లో కొన్ని వింత ఆచారాలు ఉన్నట్టే.. నగల్లో వ్యత్యాసం కూడా ఎక్కువగానే ఉంటుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడు రకాల గిరిజన తెగలు ఉంటాయి. ఒకరు విత్తనాలు, ఈకలు, కలపతో చేస్తే.. మరికొందురు ఐరన్ రింగ్స్ ప్రత్యేకమైన నగలు తయారుచేసుకుంటారు. ముక్కుకు పెట్టే ముక్కెరలు కాస్త విచిత్రంగా ఉంటాయి. ఇక్కడి వారిలో మగవాళ్లు కూడా నగలు.. అది కూడా పువ్వుల నగలు ధరించడం ఒక విచిత్ర ఆచారం. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కాపర్ వైరల్లతో, వెండితో, ఐరన్‌తో నగలు చేయిస్తారు. ఛత్తీస్‌గఢ్ వారి నగల్లో లాకెట్స్ పెద్దవిగా ఉంటాయి. చతురస్రాలు, త్రిభుజాకారాలు, అర్ధ చంద్రాకార డిజైన్లతో చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి. మహారాష్ట్ర, కర్ణాకలో బంగారం, వెండి, అల్యూమినియంలతో నగలను చేయించుకొని వారి ముచ్చట తీర్చుకుంటారు. పాత 25 పైసలు, 50 పైసలతో కర్ణాటకలో ప్రత్యేకంగా ఈ నగలను తయారుచేస్తారు.

ప్రస్తుత కాలంలో..

గిరిజనుల నగలను ప్రేరణగా తీసుకొని చాలామంది కొత్త కొత్త డిజైన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. రెడ్ కార్పెట్‌లోనూ ఈ ఫ్యాషన్ రాజ్యమేలుతుందంటే అతిశయోక్తి కాదేమో! వివిధ రంగుల్లో, జామెట్రిక్ డిజైన్లలో ఈ నగలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ హీరోయిన్లు ఈ నగలను ఇష్టంగా ధరిస్తున్నారు. ఈ నగలను ఆఫీసుల్లోకే కాదు.. చిన్న చిన్న సెలబ్రేషన్స్‌లో కూడా ఈ నగలు బాగుంటాయి. కుర్తాలు, టీ-షర్ట్‌ల మీదకి కూడా నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. అందరిలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారొచ్చు. కాశీలో రెడ్ కోరల్ బీడ్స్ దొరుకుతాయి. వాటితో ప్రత్యేకమైన నగలను తయారు చేస్తారు. సిక్కిం ప్రాంతంలో గోల్డ్, సిల్వర్, కోరల్, టర్కూస్‌లతో మాత్రమే ఇక్కడ గిరిజనులు నగలను చేస్తుంటారు. బంగారం 24కేరట్లు ఉండాలన్నది ఇక్కడి వారి నిబంధన.

ప్రతీ మూల..

ఒకప్పుడంటే బస్సు సౌకర్యాలు కూడా లేవు. కాబట్టి ఎక్కడ.. ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో తెలియకపోయేది. అదే.. ఇప్పుడైతే మూలమూలలకు ఇంటర్నెట్ సౌకర్యం రావడంతో ఎక్కడ ఏం జరుగుతుందో ఇట్టే తెలిసిపోతున్నది. అందుకే.. ఏ గిరిజన తెగల్లో ఎలాంటి నగలు ధరిస్తున్నారో ఫ్యాషన్ పండితులు అలాంటి నగలను ఎక్కువగా తయారుచేస్తున్నారు. ఎక్కువ చైన్లు ఉండే ట్రైబల్ నగలు ఎక్కువగా అమ్ముడుపోతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అవేకాకుండా.. రంగురంగుల బీడ్స్‌తో వచ్చే గాజులు, నెక్లెస్‌లు వాడుతున్నారు. బీడ్స్ కాస్త ముదురు రంగులో ఉన్నప్పుడు లేత రంగులు ధరిస్తే మీరు సూపర్‌గా కనిపిస్తారు. మల్టీ కలర్స్‌వి ఎంచుకున్నప్పుడు ఎలాంటి డ్రెస్‌లైనా, రంగులవైనా ధరించొచ్చు.

674
Tags

More News

VIRAL NEWS