ఓటు.. ఒక బాధ్యత


Sun,March 31, 2019 03:15 AM

ప్రజలచేత, ప్రజల కొరకు ప్రజలే పాలకులుగా గల అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం మనది. ప్రపంచంలో మరే దేశంతోనూ పోల్చడానికి వీల్లేని విధంగా మనదేశ ప్రజాస్వామ్యానికి రాజ్యంగ నిర్మాతలు బలమైన పునాదులు వేశారు. ఆ పునాదులే ఆసరాగా మనదేశం ఎన్నో ఆటుపోటులను, ఆటంకాలను తట్టుకొని నిలబడింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన రాజ్యాంగాన్ని కలిగి ఉండి, రాజ్యాంగ బద్ధంగా పాలన సాగిస్తూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ వస్తున్నది. మనదేశం తన ప్రజాస్వామిక వ్యవస్థను రోజురోజుకూ పరిపుష్టం చేసుకొని, ప్రపంచానికే పాఠాలు నేర్పుతున్నది. మనదేశ పాలనే ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచి ఆయా దేశాలు ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయడానికి ఊతమిస్తున్నది. 1951లో తొలిసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాపాలనకు ఊపిరిపోసి బలమైన ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్నది. ఈ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఓటు వేయడం ఒక బాధ్యతగా తీసుకుని ప్రతి ఓక్కరూ ఓటుహక్కును వినియోగించుకుంటారని ఆశీద్దాం.

-మధుకర్ వైద్యుల, సెల్: 91827 77409

1947 ఆగస్టు 15న భారతదేశం పరాయి పాలన నుంచి విముక్తి పొందింది. ఎన్నో అవమనాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వాంతంత్య్ర భారతంలో ప్రజలే పాలకులుగా ఉండాలన్న ఆకాంక్షతో దేశం ప్రజాస్వామ్యం వైపు అడుగులువేసింది. ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ భావన లేదా ప్రభుత్వ ఏర్పాటు విధానం. ఇందులో ప్రజలు నిర్ణయాధికారాన్ని కలిగిఉంటారు. ప్రజాస్వామ్యమనేదానికి ప్రతీ ఒక్కరికి ఆమోదయోగ్యమైన (నిర్దిష్టమైన) నిర్వచనం అంటూ ఏదీ లేదు. కాని రాజనీతి శాస్త్రం వివరణ ప్రకారం ప్రజాస్వామ్యం రెండు ప్రధాన నియమాలను అనుసరిస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానం, అందరూ స్వతంత్రాన్ని అనుభవించుట. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ నిర్వచించిన దానిని బట్టి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు.
IndiaVotes

ఐక్యతే నిలబెట్టింది

పరాయి పాలన నుంచి విముక్తి పొంది స్వతంత్ర భారతంగా ఆవిర్భవించిన తర్వాత దేశ భవిష్యత్‌పై ఎన్నో అనుమానాలు. దేశమంతా భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు, భాషలు, కులమత వైరుధ్యాలు, చిన్నా, పెద్దా మతాలు, కులాలు, జాతులు, ఒక్కో ప్రాంతానికి మరో ప్రాంతానికి నడుమ వాతావరణ తేడాలు. ఇన్ని వైరుధ్యాల నడుమ ప్రజాస్వామ్యమెక్కడ బతికి బట్టకడుతుందని సందేహించినవారున్నారు. భిన్న స్వరాలు వినిపించే ఈ జాతిని ఒక్కటిగా పట్టి ఉంచే మంత్రదండమేదీ లేదని ఎద్దేవా చేసిన వారూ ఉన్నారు. వ్యవసాయం తప్ప మరేమీలేని పేదరికం తాండవించే చోట ప్రజాస్వామ్యం ఎన్నాళ్లు మనగలుగుతుందని ప్రశ్నించినవారూ ఉన్నారు. ఎన్నెన్నో ప్రతికూలతల నడుమ పురుడు పోసుకున్న దేశం పురిటినొప్పులు తీరకుండానే అంతఃకలహాలతో కుప్పకూలుతుందని, అంతర్యుద్ధాలు చెలరేగి దేశం ఛిన్నాభిన్నమవుతుందని భావించిన దేశాలెన్నో. ఇక్కడి ప్రజాస్వామ్యాన్ని కూనరిల్లేలా చేయాలని కుట్రలు, కుతంత్రలు పన్నిన శత్రువులెందరో. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయులమంతా కలిసే బతుకుతాం అంటూ మేరా భారత్ మహాన్ అని ఐక్యతను చాటుతూనే ఉంది. భిన్నత్వాలెన్నున్నా ఏకత్వమే మా అభిమతం అని చాటి, ప్రజల్నే పాలకులుగా ఎన్నుకొని బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్నాం. మనకోసం, మన పాలకులను, మనమే ఎన్నుకొని మనల్ని మనమే పరిపాలించుకునే అద్భుత ఐక్యతను చాటుతూనే ఉన్నాం.

ఎన్నికల కమిషన్

స్వతంత్ర దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ భారత ఎన్నికల కమిషన్. 1950 జనవరి 25న ఏర్పాటు చేయబడిన ఈ కమిషన్ సుప్రీం కోర్టు వలే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు. దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, శాసన మండళ్లకు జరిగే ఎన్నికలను కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణ, మార్గ నిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతను రాజ్యాంగం కమిషన్‌పై ఉంచింది. ఎన్నికల కమిషన్ అధినేతను ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటారు. మొదట్లో ఒక కమిషనర్ ఉండేవారు. 1989 అక్టోబర్ 16 న మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించారు. అయితే అది కేవలం 1990 జనవరి1వరకు మాత్రమే కొనసాగింది. మళ్ళీ 1993 అక్టోబర్ 1న ఈ నియామకాలు జరిగాయి. అప్పటి నుంచి ముగ్గురు సభ్యుల కమిషన్ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నది. ముగ్గురు కమిషనర్లతో పాటు ఢిల్లీలో ఉన్న కమిషన్ కార్యాలయంలో కొంతమంది డిప్యూటీ కమిషనర్లు, 300 మంది ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ర్టాల్లో, ప్రధాన ఎన్నికల కమిషనరుచే నియమించబడే ముఖ్య ఎన్నికల అధికారి, కొందరు సహాయక సిబ్బంది ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే 50 లక్షల పైచిలుకు సిబ్బంది యావత్తూ తాత్కాలికంగా ఎన్నికలు ముగిసేవరకు కమిషన్ అదుపాజ్ఞలలో పనిచేస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనరును, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం ఐదేండ్లు, ఆ వ్యక్తికి 65 ఏళ్ళ వయసు వచ్చే వరకు -ఏది ముందయితే అది.

ఐదేండ్ల కాల పరిమితి

ప్రజాస్వామ్యానికి పునాది వేసే క్రమంలో నిర్వహించే ఎన్నికలకు భారతరాజ్యంగం నిర్దేశించిన ఐదేండ్ల నియమిత కాలపరిమితిని విధించుకున్నది. దీన్ని అనుసరించి అతి కొన్ని సందర్భాల్లో మినహాయించి, ప్రతీ ఐదేండ్లకోసారి పార్లమెంటుకు,శాసనసభలకు ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నది. 1951లో జరిగిన తొలి ఎన్నికలనుంచి 2014 వరకు మొత్తం పదహారు సార్లు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పార్లమెంటుతో పాటు రాష్ర్టాల శాసన సభలకు కూడా ప్రతి ఐదేండ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంత వరకు దేశంలోని 29 రాష్ర్టాల్లో మొత్తం 357 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి, పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో జరిగిన యుద్ధాల సందర్భంగానూ మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎటువంటి విఘాతం కలుగలేదు. పైగా పొరుగుదేశాలు కల్పించిన ఆటంకాల వల్ల దేశంలోని పౌరులందరిలోనూ ఐక్యత మరింత బలపడుతూ వచ్చింది.
IndiaVotes1

రాజకీయ పార్టీలకు కొదువలేదు

ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో రెండు లేదా మూడు రాజకీయ పార్టీలు మాత్రమే కనిపిస్తాయి. కానీ స్వతంత్ర భారతదేశంలో ఎవరైన తమకు నచ్చిన పేరుతో రాజకీయ పార్టీ స్థాపించవచ్చు. రాజ్యాంగం, ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఆయా పార్టీలకు ఉంటుంది. తొలి ఎన్నికలు జరిగిన 1951-52,53 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. 2009 నాటికి 1,162 రాజకీయ పార్టీలుంటే 2,014 ఎన్నికల్లో 464 పార్టీలు పోటీ చేశాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 363 మాత్రమే పోటీ చేశాయి. అయితే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశంలో మొత్తం ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీల సంఖ్య 2,293గా ఉంది. వీటిలో గుర్తింపు పొందిన ఏడు జాతీయ పార్టీలు, 59 ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 2,143 పార్టీలు ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి మధ్య కాలంలో మరో 149 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 58 పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ మధ్య రిజిస్టర్ అయిన 149 పార్టీల్లో బీహార్‌లో బహుజన్ అజాద్ పార్టీ, యూపీలో సమ్మోహిక్ ఏక్తా పార్టీ, రాజస్థాన్‌లో రాష్ట్రీయ సాఫ్ నీతి పార్టీ, ఢిల్లీలో సబ్సీబడీ పార్టీ, తెలంగాణలో భరోసా పార్టీ అవతరించాయి. అయితే ఎన్నికల గుర్తు లభించని పార్టీలకు సొంతంగా పోటీ చేసే అర్హత లేదు. ఎన్నికల సంఘం వద్ద లభించే 84 గుర్తుల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది.

అందరికీ సమాన అవకాశాలు

దాదాపు 130 కోట్ల జనాభాలో 90 కోట్ల మంది ఓటర్లు..., 29 రాష్ర్టాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల సమాహారం ఈ దేశం. ఇంత పెద్ద దేశంలో ప్రజలందరికీ అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు కొన్ని నియోజకవర్గాలను ప్రత్యేకించడం భారత్‌లోనే జరిగింది. ఒకప్పుడు కేవలం వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలను ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్నీ కలిగిస్తున్నది. కుల, మత, వర్గ, లింగ భేధం చూపకుండా నిర్దిష్ట వయస్సు వచ్చిన వారందరికీ ఒకే సారి ఓటు హక్కు కల్పించింది ప్రపంచంలో ఒక్క భారతదేశమే. చాలా దేశాల్లో ఇప్పటికీ ధనికులకు, విద్యావంతులకు తప్ప ఓటు హక్కులేదు. ఇక మహిళల విషయం చెప్పనక్కరలేదు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వర్తింపచేశారు. తెలంగాణ వంటి రాష్ర్టాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లను మహిళల కోసం కేటాయిస్తున్నది. 1957-2015 మధ్య లోక్‌సభకు 45-668 మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. చట్టసభల్లో 1951లో 22 (4.50) శాతం ఉన్న మహిళా సభ్యుల సంఖ్య 2014 నాటికి 66 (12.15) కు చేరింది. 1977 (6వ లోక్‌సభ) లో వీరి ప్రాతినిధ్యం 19 (3.51 శాతం) కి పడిపోయింది. 1984లో 43 మంది ఉంటే, 89లో 29కి పడిపోయింది. తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లకు ఎన్నికలపై అవగాహనే అంతగా లేదు. ఏకంగా 28 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. కానీ కాలంతోపాటు వీరిలోనూ చైతన్యం ఎక్కువైంది. 2009 తర్వాత గణనీయమైన మార్పులు వచ్చాయి. ఈసారి మహిళా ఓటర్లు 43 కోట్ల వరకు ఉన్నారు.

ఏ దేశ చరిత్ర చూసినా..

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు 2వందల యేండ్లకు పైగా పరాయిపాలనలో మగ్గి స్వాతంత్య్రాన్ని సంపాదించిన భారతదేశం గడచిన ఏడు దశాబ్ధాలుగా ప్రజాస్వామ్యమే పట్టుకొమ్మగా, రాజ్యంగ బద్దంగా ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజాపాలనను కొనసాగిస్తున్నది. మనతో పాటే స్వాతంత్య్రం పొందిన పాకిస్తాన్ అనేకసార్లు సైనిక పాలన కిందకు వెళ్లింది. ఇక శ్రీలంక, నేపాల్, మాల్దీవుల్లోనూ ప్రజాస్వామ్యం నిలకడను నిలబెట్టుకోలేకపోతున్నవి. మనదేశ రాజ్యంగభరిత పాలనను చూసే ఆసియాలో మయన్మార్, నేపాల్ దగ్గర నుంచి ఉత్తర ఆఫ్రికాలోని ఈజిప్టు, లిబియా, ట్యునీషియా వంటి దేశాలు ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

అభ్యర్థుల ఖర్చు

2019 ఎన్నికల్లో పెద్ద రాష్ర్టాల్లో పోటీ చేసే అభ్యర్థులు 70 లక్షల వరకు, చిన్న రాష్ర్టాల్లో అభ్యర్థులు రూ.54 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చునని ఎన్నికల సంఘం చెబుతున్నది. గతంలో ఈ పరిమితి రూ.40 లక్షలు, రూ. 22 లక్షలుగా ఉండేది.కానీ ఏ అభ్యర్థి పరిమితికి లోబడి ఖర్చు చేయడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు 100 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారంటేనే మన ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత ఉందో అర్థమవుతుంది. ప్రజలను ప్రలోభ పెట్టే ఏ చర్యలను ఎన్నికల కమిషన్ క్షమించదు. ఎన్నికల సమయంలో అవసరానికి మించి డబ్బు చేతిలో ఉంటే అరెస్ట్ చేయడం ఖాయం.

ఈ ఎన్నికలు అతిపెద్దవి

కాలం గడుస్తున్నకొద్దీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అంతకంతకూ వేళ్లూనుకుంటూ, మరింత పారదర్శకతతో ప్రజా విశ్వాసాన్ని పొందుతున్నది. ప్రతీ ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారి శాతంపెరుగుతూనే ఉంది. 2014 సార్వత్రికంలో ఏకంగా 66.4% మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. త్వరలో ఏడు దశల్లో జరిగే 17వ లోక్‌సభ ఎన్నికల్లో 130 కోట్ల జనాభాలో 90 కోట్ల మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.59 కోట్ల మంది కొత్త ఓటర్లు. దేశంలోని మహిళా ఓటర్లు 43.17 కోట్లు, ఇంటర్నెట్ వాడుతున్న ఓటర్లు 45 కోట్లు, ఇక థర్డ్ జెండర్ ఓటర్లు 38,325, ప్రవాసీ ఓటర్లు 75.735, రక్షణ దళాల ఓటర్లు 16లక్షలు, మొత్తం లోక్‌సభ సీట్లు 545, నామినేటెడ్ సభ్యులు 2 (ఆంగ్లో ఇండియన్లు), ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలు 10.6 లక్షలు, ఉపయోగించే ఈవీఎంలు 23.3 లక్షలు, వీవీప్యాట్‌ల సంఖ్య 17.4 లక్షలు, కంట్రోల్ యూనిట్లు 16.3 లక్షలు, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికారులు కోటి మందికిపైగా.

రాజ్యంగమే స్ఫూర్తి

ప్రపంచంలోనే అనేక దేశాల కంటే విస్తీర్ణంలోనూ, చైనా తర్వాత రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారతదేశం.ఇంతటి బృహత్తర దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందంటే దానికి స్ఫూర్తినిస్తున్నది భారత రాజ్యాంగమే. ప్రపంచంలోని అనేక ప్రజాస్వామ్య దేశాలు అమలు చేస్తున్న రాజ్యంగ విధానాలను అధ్యయనం చేసి 450 నిబంధనలు, 12 షెడ్యూళ్లుగా భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపొందించడంలో అంబేద్కర్‌ది కీలక పాత్ర. రాజ్యాంగంలో అవతారిక ప్రముఖమైనది. రాజ్యాంగ నిర్మాణం ద్వారా భారతీయులు తమకు తాము అందివ్వాల్సిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పట్ల తమ నిబద్ధతను, దీక్షను ప్రకటించుకున్నారు. భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ, హోదాలోను, అవకాశాలలోను సమానత్వం; వ్యక్తి గౌరవాన్ని, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుతామని కూడా దీక్షాబద్ధులమై ఉన్నాం. 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి,మాకు మేము సమర్పించుకుంటున్నాం అని రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా వ్యవహరిస్తున్నది. పార్లమెంటు నుంచి గ్రామ స్థాయి వరకు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసిన అధికారాన్ని అట్టడుగు స్థాయి వరకు వికేంద్రీకరించింది. సమాజంలో అణగారిన వర్గాలకు ఎన్నికల్లో పోటీ చేసే అశకాశం కల్పిస్తూ రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టానికి అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నది.
IndiaVotes4

ఒక్కసిరా చుక్క

మనం ఓటు వేయగానే ఎడమ చేతి వేలిపై సిరాతో ఒక గుర్తు వేస్తారు. మన ఓటు హక్కు వినియోగించుకున్నామని తెలియడానికి అదొక గుర్తు. 1951-52లో జరిగిన తొలిసారి ఎన్నికల్లోనే ఈ పద్ధతి ప్రవేశపెట్టారు. అప్పట్లో వేలిపై సిరాని బ్రిటన్ నుంచి దిగుమతి చేసేవారు. 1962లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా దేశీయంగా రూపొందించిన మైసూరు ఇంక్‌ను వాడారు. ఈ సిరా మన వేలిపై పడితే మూడు నుంచి నాలుగు రోజుల వరకు చెరిగిపోదు. ఇది నేరేడు రంగులో ఉంటుంది. ఇందులో 7.25శాతం సిల్వర్ నైట్రేట్ ఉండడం వల్ల అది వెంటనే చెరిగిపోదు. ఇప్పుడు కర్ణాటకలోని మైసూరులో పెయింట్స్ అండ్ వార్నిష్ కర్మాగారంలో ఉత్పత్తి చేస్తున్న ఇంకునే వాడుతున్నాం. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ ఇంకే వాడతారు. ఈ సిరాకి అంతర్జాతీయంగా కూడా డిమాండ్ ఉంది. ఇప్పుడు మనం ఏకంగా 35 దేశాలకు ఎన్నికల సమయంలో మైసూరు ఇంక్‌ను ఎగుమతి చేస్తున్నాం.
IndiaVotes5

తొలి ఎన్నికలు

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి 1951లో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల నుంచే నిర్దిష్టమైన అవగాహనతో, ప్రజాస్వామిక స్ఫూర్తితో ఎన్నికలు నిర్వహిస్తూ భారతావని ప్రపంచంలో ఏ దేశం చేయని సాహసం చేసింది. తొలి ప్రయత్నంలోనే వయసు నిండిన ప్రతీ ఒక్క పౌరుడికి ఓటు వేసే బృహత్తర అస్త్రం అందజేసింది. ఓటు అనేది కేవలం బాధ్యతగానే కాకుండా హక్కుగా పరిగణించేలా ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్నది. 1951లో మొదటి ఎన్నికల సమయంలో దేశ జనాభా 36 కోట్లు. వారిలో 17.30 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి ఎన్నికలతో మొదలైన ఎన్నికల ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతున్నది. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలల పాటు జరిగింది. ఈ ఎన్నికలు 26 రాష్ర్టాలలో 489 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగాయి. ఎన్నికల్లో 53 పార్టీలు పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో 22 మంది మహిళలు విజయం సాధించారు. ఆ కాలంలో బహుసంఖ్య నియోజక వర్గాలుండేవి. అనగా ఒక నియోజకవర్గంలో 2 సీట్లు లేదా కొన్నిసార్లు 3 సీట్లు ఉండేవి. 1960లో ఈ విధానాన్ని రద్దు చేశారు. ఎన్నో పరిమితుల నడుమ జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నది కేవలం 17 కోట్ల మందే! నాటి మొత్తం ఓటర్లలో వీరు 45.7% మాత్రమే.
IndiaVotes2

మొదటి అడుగు ఒంటరే..

స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో మన ఎన్నికల వ్యవస్థని ఒక గాడిలో పెట్టింది మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్‌సేన్. ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) అధికారిగా, న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియను గాడిలో పెట్టిన తీరు మరుపురానిది. ఎన్నికల నిర్వహణకు ముందు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల జాబితా రూపకల్పనలో సుకుమార్ సేన్ బృందానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఓటర్లలో 70 శాతం నిరక్షరాస్యులు కావడం, మహిళా ఓటర్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో ఓటర్ల జాబితా రూపొందించడమే కష్టసాధ్యమైంది. దీంతో చాలామంది ఓటు హక్కు పొందలేకపోయారు. 17 కోట్ల మంది ఓట్లతో తొలి జాబితా రూపొందింది. ఎన్నికల్లో బూత్‌ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బ్యాక్సులు రూపొందించడం వంటివన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసి సుకుమార్ సేన్ బృందం విజయవంతమైంది. నేపాల్, ఇండోనేషియా, సూడాన్ వంటి దేశాలు భారత్ ఎన్నికల నిర్వహణను దగ్గరుండి పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్‌లో తొలి ఎన్నికల నిర్వహణను ప్రశంసించింది.సూడాన్‌లో కూడా సుకుమార్ సేన్ నాయకత్వంలోనే తొలి ఎన్నికలు నిర్వహించారు.
IndiaVotes3

నోటా వచ్చేసింది

నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబౌ. ఈవీఎంలో ఇది చిట్ట చివర ఉంటుంది. ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటరు నోటా ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. ఈ పద్ధతి 2014లోక్‌సభ ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చింది. అంతకు ముందు 2013లో జరిగిన ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు. నోటాకి పడే సగటు ఓట్లు రెండు శాతం కూడా ఇప్పటివరకు దాటలేదు. నోటా అమలు చేసిన దేశాల్లో భారత్ పన్నెండవది.

పెరుగుతున్న ఖర్చు..

లోక్‌సభ ఎన్నికల ఖర్చుని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. పోలింగ్ బూతులు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ సిబ్బందికి ఇచ్చే టీఏ, డీఏ పోలింగ్ సామాగ్రికయ్యే అన్ని రకాల ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. తొలి మూడు సార్వత్రిక ఎన్నికలకి 10 కోట్ల లోపు ఖర్చు అయింది. ఆ తర్వాత రాను రాను ఈ ఖర్చు పెరుగుతూ పోయింది.

1984-85: 100 కోట్లు,
1996: 500 కోట్లు
2004 : 1000 కోట్లు
2009 : 1,114 కోట్లు
2014 : 3,870 కోట్లు

ఒక్కో ఓటరుపై

1977 వరకు (6వ లోక్‌సభ) ఒక్కో ఓటరుపై వెచ్చించిన సగటు వ్యయం రూపాయి లోపే. 1996 నాటికి (11వ లోక్‌సభ) ఈ ఖర్చు పది రూపాయలు దాటింది. 1999, 2004, 2009 ఎన్నికల్లోఇంచుమించు 15 రూపాయలకు చేరింది. 2014లో (16వ లోక్‌సభ) సగటున ఒక్కో ఓటరుపై వెచ్చించిన మొత్తం రూ. 45 పై మాటే.

1282
Tags

More News

VIRAL NEWS