అపజయాలు చేసిన ఆత్మహత్య ఉదయ్ కిరణ్


Sun,March 31, 2019 04:03 AM

చిత్రం..నువ్వునేను..మనసంతానువ్వే...మూడు భిన్నమైన కథాంశాలతో వరుస విజయాలు సాధించిన చిత్రాలు. అప్పటి వరకు మూసా దోరణితో సాగుతున్న ప్రేమకథలకు కొత్త నిర్వచనం చెప్పిన చిత్రాలు. ఈ మూడు చిత్రాల విజయంతో హ్యాట్రిక్ హీరోగా వెండితెర మీదా వెలిగిన నటుడు ఉదయ్ కిరణ్. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో ఒక అగ్రహీరో కూతురుతో ఎంగేజ్‌మెంట్, ఆ తర్వాత రద్దుకావడం, మరో యువతితో ప్రేమ, పెళ్లి. ఆ తర్వాత కెరీర్‌లో సరైన హిట్ లేకపోవడం సినిమాలు వరుసగా పరాజయం పాలవ్వడం ఆయనను కుంగదీశాయి. ఒకవైపు ఇండస్ట్రీ నుంచి సహాకారం లేకపోవడం, హీరో అనే ఇమేజ్ నుండి బయటపడలేని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల నేపథ్యమే ఈ చివరిపేజి.

-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

17 జూన్ 2000

ఉదయం ఆటతో టాలీవుడ్‌లో ఒక సినిమా విడుదలయింది. సినిమా ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఆ సినిమా పోస్టర్లే ప్రేక్షకులను సినిమా థియేటర్‌కు రప్పించాయి. ఇద్దరు యువతీయువకులు భుజానికి కాలేజీ బ్యాగులు వేసుకుని, పాపతో ఉన్న బుట్టను చెరొవైపు పట్టుకుని వెళుతున్న దృశ్యంతో కూడిన పోస్టర్లవి. వారిద్దరి మొఖాలు కనిపించకుండా వెనుకవైపు నుండే కనిపించేలా వేసిన ఆ పోస్టర్లు అప్పట్లో సంచలనం. అప్పటికే భిన్నమైన పాటలతో ఆకట్టుకున్న ఆడియో, ఇప్పుడు పోస్టర్లు. ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగెత్తించాయి. ఇంతకీ ఆ చిత్రం పేరెంటో తెలుసా? చిత్రం(సినిమా) పేరుకు తగ్గట్లు కథాంశం కూడా చిత్రమే. అంతే ఒక రాత్రితో ఆ చిత్ర కథనాయకుడు పెద్ద హీరో అయిపోయాడు. వాజపేయాజుల ఉదయ్ కిరణ్. అప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. అసలు సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. అత్యంత సహజ నటనతో తనను తను నిరూపించుకుని నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత సంవత్సరమే రెండు నెలల తేడాతో రెండు సినిమాలు నువ్వునేను, మనసంతానువ్వే విడుదలయ్యాయి. రెండు దేనికవే వేర్వేరు కథాంశాలు. సూపర్ హిట్. అంతే ఉదయకిరణ్ లవర్‌బాయ్‌గా చిత్ర పరిశ్రమలో వెలిగిపోయాడు. హ్యాట్రీక్ హీరోగా ఇండస్ట్రీ పొగడ్తలతో ముంచెత్తింది. కేవలం రెండు సంవత్సరాల వయస్సు కలిగిన యువ హీరోతో సినిమాలు తీయడానికి డైరెక్టర్లు క్యూ కట్టారు.
Udaikiran

2014 జనవరి 5, ఆదివారం హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్, సమయం మధ్యాహ్నం 3 గంటలు. ఫేస్‌బుక్ సంస్థలో పనిచేసే ఉదయ్‌కిరణ్ భార్య విషిత తన స్నేహితుని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు మణికొండ వెళ్లాలనుకున్నారు. ఎలాగు తన స్నేహితుడు ఉదయ్‌కు తెలిసిన వాడే కావడంతో ఆయనను కూడా రమ్మని పిలిచింది. అయితే తనకు పని ఉందని చెప్పి వెళ్లడానికి నిరాకరించాడు. దీంతో ఆమె ఒక్కతే వెళ్లడానికి నిర్ణయించుకుంది. అయితే ఒక్కడినే ఇంట్లో ఉంచడం ఇష్టం లేక మణికొండలో ఉండే తన తల్లిదండ్రుల్ని ఉదయ్‌కు తోడుగా ఇంట్లో ఉంచి విషిత పార్టీకి వెళ్లారు. రెండు గంటలు గడచిన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అత్త మేఘల, మామ గోవిందరాజన్‌లను మణికొండలోని వాళ్ల ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఉదయ్ చెప్పారు. మణికొండలో పార్టీ ముగియగానే తాను రాత్రి 11 గంటలకు వచ్చి విషితను పికప్ చేసుకుంటానని, మీరు ఇంటికి వెళ్లిపొమ్మని ఆయన కోరడంతో వాళ్లిద్దరూ వెళ్లిపోయారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకున్న విషిత 11 గంటల ప్రాంతంలో అక్కడే ఉండే తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉదయ్ రాక కోసం వేచి చూశారు. పావు గంట గడచినా రాకపోయే సరికి ఫోన్ చేశారు. ఫోన్ మోగుతున్నా ఎత్తకపోవడంతో మరో మూడుసార్లు ప్రయత్నించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఉదయ్ రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన విషిత... తన మేనమామ, తండ్రితో కలిసి మణికొండ నుంచి బయల్దేరారు. అప్పటికీ సమయం ఒంటిగంట కావస్తోంది. శ్రీనగర్ కాలనీలోని ప్లాటుకు వచ్చి తలుపు తట్టగా స్పందన లేకపోవడం, ఉదయ్ అంటూ పిలిచినా పలకకపోవడంతో మారుతాళం చెవితో తలుపులు తీసుకుని లోపలకు వెళ్లారు. లోపల నుంచి మూసి ఉన్న వ్యాయామశాల తలుపు ఎంతకూ తెరుచుకోకపోవడంతో వాచ్‌మెన్లు మరికొందరితో కలసి బలవంతంగా తెరిచారు. అక్కడ ఉరివేసుకుని ఉదయ్ కిరణ్ కనిపించడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం ఉరి వేసుకున్న తాడును తొలగించి కిందకు దింపారు. కొనప్రాణమైనా ఉంటుందని ఆశించి అపోలో ఆస్పత్రి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అంబులెన్స్‌లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఉదయ్ మృతి చెందినట్లుగా ప్రకటించారు.

2014, జనవరి 6 ఉదయం 5 గంటలు అన్ని తెలుగు చానల్స్‌లో అదే వార్త సినిమా హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహాత్య....ఆయనది ఆత్మహత్యనా? లేక హత్యనా? అని.ఆయన ఒంటిపై గాయాలున్నాయని, ఆయనను హత్య చేసి ఉరివేశారని, రకరకాల వార్తలు. తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురిచేసింది. మరణంపై ఎన్నెన్నో ఊహగానాలు, ఒక ప్రముఖ హీరో కూతురుతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని రద్దు చేసుకోవడంతో ఆయన కుటుంబం ఉదయ్‌కిరణ్‌పై కక్ష గట్టారని, ఆవకాశాలు రాకుండా చేశారని, అందువల్లే అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, తినడానికి ఏమి లేదని, కనీసం పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నాడని పుకార్లు షికారు చేశాయి. మరో వైపు ఆయన భార్యపై కూడా ఆరోపణలు. సినిమాలు లేకపోవడం వల్ల ఆయనను ఆమె హింసించేది అని. సరిగా చూసుకోకపోయేదని, అవసరానికి డబ్బులు ఇవ్వకపోయేదని ఇలా ఎన్నో అనుమానాపు పుకార్లు. గతంలో ఒకమ్మాయిని ప్రేమించిన ఉదయ్ ఆ తర్వాత ఆ అమ్మాయి దూరం కావడంతో కొంత డిఫ్రెషన్‌కూ లోనయ్యాడు. అదే సమయంలో ప్రముఖ హీరో కూతురుతో ఎంగేజ్‌మెంట్ క్యాన్సల్ కావడం కూడా కారణమేనంటూ మరో వార్త.
Udaikiran1

అసలేం జరిగింది

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఒక్క సారిగా ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ఉదయ్ సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు అయితే చాలా సినిమాలు చేసినప్పటికీ కెరీర్ పరంగా నిలదొక్కుకోలేకోపోయాడు. ఓ ప్రేమ, ఓ నిశ్చితార్థం బ్రేకప్ కావడంతో పరిస్థితి మరింత చేజారింది. నిరంతరం సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొనేందుకు ప్రయత్నించాడు. స్టార్ ఇమేజ్ చట్రం నుండి ఉదయ్ కిరణ్ బయట పడలేకపోయారని, చెన్నైలో జరిగిన భారతీయ సినిమా వందేళ్ల సినిమా వేడుకకు ఆహ్వానం రాలేదని మదనపడ్డాడని ఆయన భార్య పోలీసులకు తెలిపింది. నిజానికి ఉదయ్, విషిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందు ఉదయ్ కిరణ్‌తో ఏడాదిన్నర పాటు ప్రేమాయణం సాగింది. పెళ్లికి ముందు లేదా వివాహం తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. అయితే ఉదయ్ తండ్రికి పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఆయన పెళ్లికి కూడా రాలేదు. సినిమా అవకాశాలు తగ్గడం, కొన్ని ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్రా సమస్యల కారణంగా ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. సినిమాల్లో ఎప్పుడు ఎలా జరుగుతుందో ఏమౌతుందో ఎవరికీ తెలీదు. పైకి ఎదగడం, కిందికి పడిపోవడం ఇక్కడ సర్వ సాధారణం. సెన్షేషనల్ హిట్స్ తో దూసుకుపోయిన లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ చివరి రోజుల్లో ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాకపోవడంతో అలమటించిపోయాడు. వరుసగా ప్లాపులు రావడంతో క్రమేపి సినిమాలు తగ్గిపోయాయి. ఛాన్స్ ఇమ్మని అడగలేక , సినిమాల్లో ఎవరూ ఛాన్స్ ఇవ్వక, తనలో తానే కుమిలిపోయిన ఉదయ్ చాలా కాలంగా మూడిగా ఉంటున్నాడు. చివరికి భార్యతోనూ మనసువిప్పి మాట్లాడం లేదని ఆమె తెలిపిన అంశం. ఆయన చనిపోయే ముందు రాసిన లేఖలోనూ తన భార్యను చాలా మిస్ అవతున్నానని, అటు తండ్రిని మిస్ అయ్యానని తెలిపాడు. ఏదేమైనా ఉదయ్ కిరణ్ స్టార్ డమ్ నుంచి బయటకు రాలేకపోవడం, అవకాశాలు రాని సమయంలో ఆయన మానసిక పరిస్థితిని అంచనా వేయకపోవడం, ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆయన పట్ల పట్టనట్లు ఉండడం, ఇటు భార్య తప్ప ఆయనకు మనోధైర్యాన్నిచ్చే కుటుంబ సభ్యులు లేకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారనేది నిజం. ఆ కారణంగానే సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు.

2527
Tags

More News

VIRAL NEWS