ఈ సినిమాకన్నీ సినిమా కష్టాలే!


Sun,March 31, 2019 03:14 AM

సామాజికాంశాలను సినిమాగా తీయ్యాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ అంశంలోని అన్ని కోణాలను స్పృశిస్తూ.. సున్నితంగా తెరకెక్కించాలి. అప్పుడే అది ఆకట్టుకుంటుంది. నలుగురికి నచ్చుతుంది. వీళ్లూ అంతే.. ఏదో పది నిమిషాల షాట్‌ఫిల్మ్ తీద్దామనుకొని.. కెమెరా తీసుకొని అడవులకు వెళ్తే.. పెద్ద సినిమా తీసేంత సబ్జెక్ట్ దొరికింది. అష్టకష్టాలకోర్చి.. అప్పులు చేసి.. బంగారం తాకట్టుపెట్టి మరీ సినిమా తీశారు. చివరికి ఏమైందో తెలుసా?

సినిమా తియ్యడమంటే మామూలు విషయం కాదు. పది నిమిషాల షార్ట్‌ఫిల్మ్‌కే ఎన్నో వ్యయప్రయాసలు ఎదురవుతుంటాయి. ఇక సినిమా అనుకున్నట్లు రావాలంటే.. ఆ చిత్ర బృందానికి సినిమా కనిపిస్తది. ఇక సమాజంపై అవగాహన లేకుండా.. హడావుడిగా సినిమాలు తీస్తే.. ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే కొన్నేళ్ల పాటు అధ్యయనం చేసి.. తీసే సినిమాలే ఉత్తమ, అత్యుత్తమ చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రమే కంతన్.. ది లవర్ ఆఫ్ కలర్. ఎక్కడో మారుమూల అడవుల్లో ఆదివాసీల జీవన పోరాటాన్ని ఆవిష్కరించిన చిత్రమే కంతన్. సమాజంలోని అణగారిన వర్గాలపై చిన్నచూపు, వెలివేతలు, కుల బహిష్కరణలు, అఘాయిత్యాలపై ఈ చిత్రం మాట్లాడుతుంది. వారి ధిక్కార స్వరమై వినిపిస్తుంది.

ఈ ఉత్తమ చిత్రం కథేంటంటే..?

కేరళలోని ఆదియా తెగకు చెందిన ఆదివాసీల జీవన పోరాటాన్ని ఆవిష్కరించిన చిత్రం కంతన్. ఇందులో వృద్ధురాలైన నిత్యామ్మా (దయాబాయి), 12 యేండ్ల అనాథ కుర్రోడు కంతన్ (మాస్టర్ ప్రజిత్), ఓ కుక్క, ఒక మొక్క. ఇవే సినిమాలో ముఖ్యపాత్రలు, కథా వస్తువులు. పేదరికంలో ఉంటూనే ఆనందాన్ని వెతుక్కుంటున్న బామ్మ.. చెట్లు నరికివెయ్యడాన్ని, అటవీ నిర్మూలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వీటితో పాటుగా ఆదివాసీలు, గిరిజనులపై అఘాయిత్యాలు, చిన్నచూపు చూసే విధానంపై గళమెత్తుంది. చెట్ల పెంపకం గురించి అవగాహన కల్పిస్తూ.. ఆదియా తెగ గిరిజనులను చైతన్యవంతం చేస్తుంది. ఒక చెట్టు పదిమంది పుత్రులతో సమానం అనే నినాదానికి కంతన్ భావోద్వేగ సందర్భాలను జోడిస్తూ.. కథ ముగుస్తుంది. ఈ చిత్రం ఎంతోమంది విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నది. ఆదివాసీ సంప్రదాయ సంగీత వాయిద్యాలతో వచ్చే నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ప్రతి ఫ్రేమ్ అందమైన ఫొటోలా తీర్చిదిద్దారు డీఓపీ ప్రియన్. ప్రమోద్ కూవర్ రాసిన స్క్రీన్‌ప్లే సినిమాకు ప్లస్ అయింది. సామాజిక కార్యకర్త అయిన దయా బాయి, మాస్టర్ ప్రజిత్ ఈ చిత్రానికి ప్రాణం పోసి నటించారు. దీంతో కేరళ రాష్ట్రంలో ప్రతియేటా ఇచ్చే స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో కంతన్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. 2018 నవంబర్‌లో కోల్‌కత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగానూ ఎంపికైంది.
Kanthan-Film

అన్నీ సినిమా కష్టాలే..!

ఈ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ పనులను 2017లో ప్రారంభించారు దర్శకుడు షరీఫ్ ఈసా. ఎన్నో కష్టాల నడుమ 2019లో పూర్తి చేశారు. ఈ సినిమా పూర్తి చేసేందుకు వీళ్లు రెండేండ్లు సినిమా కష్టాలను అనుభవించారనే చెప్పాలి. ఎందుకంటే కేవలం షార్ట్‌ఫిల్మ్ మాత్రమే తీస్తే సరిపోతుందని భావించిన చిత్ర బృందం.. స్థానిక ఆదివాసీల కష్టాలు తెలిసి, వారి జీవన పోరాటంపై అధ్యయనం చేశాక పెద్ద సినిమాగా మలిచారు. స్థానిక రౌల భాష నేర్చుకునేందుకు రెండు నెలలు వారితో చిత్రబృందం నివసించింది. మొదట్లో ఈ కథ విన్న ఓ వ్యక్తి 50 వేలు రూపాయల తక్కువ బడ్జెట్‌తో నిర్మిస్తానని మాటిచ్చాడు. తీరా సినిమా పనులు మొదలు పెట్టాక హ్యాండ్ ఇచ్చాడు. దీంతో షరీఫ్ నిర్మాతగా మారాల్సి వచ్చింది. బ్యాంక్‌లో రూ.10 లక్షలు అప్పు తీసుకొచ్చాడు దర్శకుడు షరీఫ్. మళ్లీ కొంత షూటింగ్ తర్వాత డబ్బులు సరిపోకపోవడంతో తన భార్య షబానా ఆరు వారాల నగలు తాకట్టు పెట్టింది. తనకు ఇష్టమైన కెమెరా అమ్ముకొని డబ్బులు సమకూర్చి.. ఎట్టకేలకు ఈ సినిమాను పూర్తిచేశాడు షరీఫ్. చివరికి వారి శ్రమ వృథా కాలేదు. ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా కంతన్ నిలువడంతో.. మా అందరి త్యాగాల ప్రతిఫలమే ఈ అవార్డ్ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు షరీఫ్.

దర్శకుడు ఒకప్పుటి కార్మికుడే!

కంతన్ సినిమాకు దర్శకత్వం వహించిన షరీఫ్ ఒకప్పుడు రబ్బరు కార్మికుడు. కన్నూర్ జిల్లాలోని చప్పరపాడవు గ్రామంలో రబ్బరు తోటల్లో పనిచేశాడు. ఒకరోజు.. రెండ్రోజులు కాదు.. 15 యేండ్లు రోజువారీ కూలి కోసం తపించాడు. రోజూ రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న రబ్బరు తోటలకు నడిచే వెళ్లేవాడు. అక్కడ చెట్లకు రంధ్రాలు చెయ్యడం, కుండలు అమర్చడం అతని దినచర్య. చెట్టుకు 2 రూపాయల చొప్పున.. 300 చెట్లకు రబ్బరు తీసి రోజుకు రూ. 600 వరకూ సంపాదించేవాడు. వార్తాపత్రికలు వేయడం, పశువుల పెంపకం, పెళ్లిళ్లకు వీడియోగ్రఫీ ఇలాంటి పనులూ చేసేవాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) - మలయాళ వార్తాపత్రిక దేశాభిమానికి రిపోర్టర్‌గా పనిచేశాడు షరీఫ్. స్కూల్‌లో నాటకాలకు స్క్రిప్ట్ రాయడం మొదలు.. సినిమాలకు దర్శకత్వం వహించే స్థాయికి వచ్చాడు. గతంలో మూడు షార్ట్‌ఫిల్మ్‌లు కూడా చేశాడు. రెండు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటాడు షరీఫ్.
Kanthan-Film1

837
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles