డీఎన్‌ఏ కలిపింది.. అందరినీ!


Sun,March 31, 2019 03:04 AM

అచ్చం అనుష్కశర్మలాగే ఉన్న అమెరికన్ పాప్‌సింగర్ జులియా మైకెల్ ఫొటో ఈ మధ్య వైరల్ అయింది గుర్తుందిగా. అదే మరి.. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటుంటారు కదా.. అలా మరి.. తన డీఎన్‌ఏను పోలిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని మొదలుపెట్టిన అన్వేషణకు దిమ్మతిరిగే సమాధానం దొరికింది. ఏంటా సమాధానం?

చిన్నప్పుడు తప్పిపోయి.. పెద్దయ్యాక కలుసుకున్న సంఘటనలు అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. మన తెలుగు సినిమాల్లో అలాంటి సీన్లు చాలానే ఉన్నాయి. ఒకరు అనాథగానో.. ఇంకొకరు కోటీశ్వరుడిగానో పెరిగి ఒక్కటైన కథలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందితే.. మరికొన్ని కల్పితాలుగా మిగిలిపోయాయి. అయితే ఈ సంఘటన మాత్రం.. సినిమా స్టోరీని మించిపోయింది. ఇది కథకాదు.. వాస్తవ సంఘటన. తనలా ఉన్న మరొకరిని కలుసుకోవాలన్న కుతూహలమే.. ఓ మహిళకు కుటుంబాన్ని ఇచ్చింది. అది కూడా 40 యేండ్ల తర్వాత. ఆ కుటుంబం వెనుక పెద్ద మిస్టరీని ఛేదించేలా చేసింది ఆమె కోరిక.

ఇదీ ఈ కుటుంబ నేపథ్యం...!

అమెరికాలోని ఇండియానాకు చెందిన హీదర్ హూక్ అనే మహిళకు వింత కోరిక కలిగింది. తన డీఎన్‌ఏని పోలిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కలుసుకుందామని అనుకుంది. వెంటనే www.ancestry.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. తన డీఎన్‌ఏ వివరాలు ఇచ్చింది. అనూహ్యంగా ఓ మహిళ వివరాలు కనిపించాయి. హీదర్ వెంటనే అందులో ఉన్న సమాచారం ఆధారంగా ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేసింది. ఆ మహిళ వివరాలు వచ్చాయి. ఆశ్చర్యపోయిన హీదర్ వెంటనే ఆమెను కలువాలని కోరింది. ఇద్దరూ కవలల్లా ఉండడంతో తను కూడా ఒప్పుకున్నది. ఇదేదో కో ఇన్సిడెంట్ అనుకున్నారు ఇద్దరూ. మళ్లీ.. పలు రకాల వెబ్‌సైట్లలో తమని పోలిన డీఎన్‌ఏల వివరాలు సేకరించారు. ఈ సారి ఓ డజను మంది వివరాలు తెలిశాయి. వారంతా ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరంతా ఒకే డీఎన్‌ఏతో ఉండడం ఓ అద్భుతం అనుకున్నారు. పిచ్చాపాటిగా చాటింగ్‌లు చేసుకున్నారు. ఓ సారి అంతా కలిసినప్పుడు మళ్లీ ఆశ్చర్యపోయారు. కారణం అందరి పోలికలు దాదాపుగా ఒకేలా ఉండడమే.
Father-Doctor

అప్పుడొచ్చింది అనుమానం!

అనుకోకుండా కలిసిన వారంతా ఒకేలా ఉండడంతో అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇలా ఉండడం అసాధ్యం అనుకుంటూనే.. ఒకరి వివరాలు ఒకరు తెలుసుకోవడం ప్రారంభించారు. పరిచయ కార్యక్రమాల్లో ఎలాంటి అనుమానాలు లేవు. ఇక తల్లిదండ్రుల గురించి ఒకరికొకరు ఆరా తీయడం మొదలు పెట్టారు. కొందరు తమ తల్లిదండ్రులకే పుట్టామని, దత్తతలు అంటూ ఏమీ లేవని చెప్పుకున్నారు. మరికొందరేమో తాము పుట్టడానికి తల్లిదండ్రులు.. ఫెర్టిలిటీ ఆస్పత్రుల చుట్టూ తిరిగారని చెప్పుకొన్నారు. వారిలో కొందరు తెలివైన వారు.. తమ తల్లిదండ్రులు వెళ్లిన ఫెర్టిలిటీ ఆస్పత్రుల వివరాలు సేకరించారు. అప్పుడే వారికి దారుణమైన నిజం తెలిసింది.

చివరిగా వెళ్లింది అక్కడికే..!

ఫెర్టిలిటీ ఆస్పత్రులకు వెళ్లిన తల్లుల వివరాలు సేకరిస్తే.. వారంతా చివరిగా వెళ్లింది డాక్టర్ డోనాల్డ్ క్లెయిన్ దగ్గరకే. అతను నిర్వహించే ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్లిన తర్వాతే వారి తల్లులు గర్భం దాల్చారు. ఈ విషయాలు తెలిసి ఆ పిల్లల తల్లిదండ్రులూ షాక్‌కు గురయ్యారు. అప్పుడే అసలు గుట్టు బయటపడింది.
అవి 1960 నుంచి 1970ల మధ్యలో జరిగిన సంఘటనలు. తెలియని వ్యక్తుల నుంచి వీర్యం సేకరించి.. సంతానం లేని వారికి ఫెర్టిలిటీ సెంటర్లలో ఎక్కించే విధానం అమెరికాలో ఉంది. ఇది చట్టబద్ధమైంది కూడా. అయితే డోనాల్డ్ క్లెయిన్ నిర్వహించే ఆ ఫెర్టిలిటీ సెంటర్‌లో అందుకు విరుద్ధంగా జరిగింది. డోనాల్డ్ క్లెయిన్.. బాధితులైన మహిళలను మోసం చేశాడు. తన సెంటర్‌కు వచ్చే మహిళలకు భర్త వీర్యం, డోనర్ల వీర్యం కాకుండా.. నేరుగా తన వీర్యాన్ని ఎక్కించేవాడు. ఇంజెక్షన్ ద్వారా ఫలదీకరణ చెందిన అండాల్లోకి తన శుక్రకణాలను పంపేవాడు. తద్వారా ఆ మహిళలు గర్భం దాల్చారు. ఈ పదేండ్ల వ్యవధిలో ఎంతోమందికి ఇలా గర్భం వచ్చేలా చేశాడు డోనాల్డ్. ఈ విషయం ఎక్కడా.. ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే.. ఈ విధానంపై అప్పట్లోనే అనుమానం వచ్చి ఓ మహిళ.. న్యాయ నిపుణులను ఆశ్రయించింది. తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఆమెదే తప్పు అని వాదించాడు డోనాల్డ్. న్యాయాధికారులు కూడా అతనికే మద్దతు పలికారు.

మోసం బట్టబయలు!

డోనాల్డ్.. మోసం ఎంతో కాలం దాగలేదు. కారణం అతని డీఎన్‌ఏని పోలిన దాదాపు 50 మంది వరకు అతనిపై కేసు పెట్టడమే. బాధిత తల్లిదండ్రులు వారి తరఫున సాక్ష్యం ఇచ్చారు. ఇక చేసేది లేక తప్పును అంగీకరించాడు డోనాల్డ్. తాను మోసం ఎలా చేసిందీ విచారణాధికారులకు వివరించాడు. దీంతో 77 యేండ్ల డాక్టర్ డోనాల్డ్ క్లెయిన్‌కు ఏడాది పాటు జైలు శిక్ష విధించారు. డాక్టర్లే ఇలాంటి మోసాలకు పాల్పడితే.. ఇండియానాలో పెద్దగా శిక్షలు ఉండవు. ప్రస్తుతం కేవలం డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకున్నవారు మాత్రమే వెలుగులోకి రాగా.. పరీక్షలు చేయించుకోని వారు కూడా చాలా మందే ఉండుంటారని అంచనా వేస్తున్నారు.డోనాల్డ్ క్లెయిన్ వీర్యం ద్వారా పుట్టిన పిల్లలు మరింత మంది ఉండే అవకాశముందని చెబుతున్నారు. మొత్తానికి డోనాల్డ్ ద్వారా పుట్టిన వారంతా ఒక కుటుంబం అయ్యారు.

848
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles