ఇక్కడ.. మీ కుక్క జాగ్రత్త!


Sun,March 31, 2019 02:55 AM

జార్జ్ డేవిడ్.. పెంపుడుకుక్కతో కలిసి ఓ బ్రిడ్జి దగ్గరకు వాకింగ్‌కు వెళ్లాడు. అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలా లేదు. దట్టమైన చెట్లు, శిథిలావస్థలో ఓ కోట కనిపిస్తున్నాయి. దాని దగ్గరే ఉన్నది ఈ బ్రిడ్జి. చూడడానికి పురాతనంగా, అనుమానాస్పదంగా కనిపించింది. జార్జ్ తన కుక్కతో కలిసి అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఉన్నట్టుండి ఆ కుక్క జార్జ్‌ను వదిలి ఆ బ్రిడ్జి కుడివైపు వెళ్లి నిల్చుంది. జార్జ్ దాన్ని మామూలే అనుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే ఆ కుక్క బ్రిడ్జి అవతలివైపు దూకింది. అవాక్కయిన జార్జ్ వెళ్లి చూశాడు. బ్రిడ్జి కింద బండరాళ్ల మీద ఆ కుక్క రక్తపు మడుగులో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. అప్పుడే కండ్లు పక్కనే ఉన్న ఓ బోర్డ్ మీద పడ్డాయి. ప్రమాదకరమైన స్థలం. మీ కుక్కను జాగ్రత్తగా పట్టుకోండి అని ఇంగ్లిష్‌లో రాసుంది..

ప్రపంచం ఎన్నో వింతలూ.. విశేషాలకు నెలవు. ఆశ్చర్యపరిచే ఘటనలు, అవ్వాక్కనిపించే విషయాలు. మిస్టరీగా మిగిలిన ఎన్నో అంశాలు. వాటిలో ఒకటే స్కాట్‌లాండ్‌లోని డాగ్స్ సూసైడ్ బ్రిడ్జి. ఇప్పటి వరకూ 600లకు పైగా కుక్కలు అక్కడ ఆత్మహత్య చేసుకున్నాయి. ఆ బ్రిడ్జి మీదకు వెళ్లిన ఏ శునకమైనా సరే అక్కడి నుంచి దూకి చచ్చిపోతున్నది. కొన్ని కుక్కలు దూకినప్పుడు ప్రాణాలతో బయటపడుతున్నాయి. వాటిని రక్షించి తిరిగి బ్రిడ్జి మీదకు తీసుకెళ్లినప్పుడు మళ్లీ దూకేవి. సుమారు 50 ఫీట్ల ఎత్తున్న ఈ బ్రిడ్జి మీదకు వెళ్లిన ప్రతి శునకం ఆత్మహత్య చేసుకుంటుండంతో ఆ బ్రిడ్జికి ద బ్రిడ్జ్ అఫ్ డెత్ అని పేరు పెట్టారు. 1950లో మొదటి సారి ఇక్కడ ఓ కుక్క ఆత్మహత్య చేసుకోవడాన్ని గుర్తించారు. అప్పటి నుంచి వరుసగా ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
Dogbridge

ఈ బ్రిడ్జి స్కాట్‌లాండ్‌లోని గ్లాస్‌గౌవ్ పట్టణ శివారులోని మిల్టన్ గ్రామంలో ఉంది. దీన్ని 1895లో హెచ్‌ఈ మిల్నర్ అనే ఇంజినీర్ డిజైన్ చేశాడు. అప్పట్లో లార్డ్ ఓవర్‌టోన్ అనే వ్యక్తి తన కోటకు వెళ్లే దారి కోసం దీన్ని నిర్మించాడు. 1950 తర్వాత అక్కడ వరుసగా కుక్కల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి. ఈ ఆత్మహత్యల వెనుక కారణాలు ఎవరికీ అంతుచిక్కలేదు. దీంతో కుక్కలను రక్షించడానికి బ్రిడ్జి ప్రారంభంలోనే ప్రమాదకరమైన స్థలం. మీ కుక్కను జాగ్రత్తగా పట్టుకోండి అనే బోర్డును ఏర్పాటు చేశారు.

ఆత్మలే కారణమా?

ఆత్మహత్య చేసుకునే జీవుల్లో మనుషులే ఉంటారు. కానీ కుక్కలు ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా ఉంది. ఎందుకు చనిపోతున్నాయో ఎవరూ కచ్చితమైన జవాబులు చెప్పలేకపోయారు. దీని వెనుక కొన్ని కారణాలు ప్రచారంలో ఉన్నాయి. లార్డ్ ఓవర్‌టోన్ 1908లో చనిపోయాడు. దీంతో ఆయన భార్య తరచూ ఈ బ్రిడ్జిపై విచారంగా తిరుగుతూ కనిపించేది. ఆమె కూడా చనిపోయిందనీ, తర్వాత ఆమె ఆత్మ కూడా అలా విచారంగా తిరుగుతోందనే వదంతులు వచ్చాయి. అందుకే ఆ బ్రిడ్జిపైకి వెళ్లిన వారు కారణం లేకుండానే విచారానికి లోనవుతారని స్థానికులు చెప్తుంటారు. ఆ తర్వాత కొన్నేండ్లకు ఓ వ్యక్తి తన రెండు నెలల కొడుకును ఈ బ్రిడ్జిపై నుంచి విసిరేసాడట. అదలా ఉండగా అతను కూడా ఈ బ్రిడ్జి దగ్గర ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించేవాడని స్థానికులు అంటారు. కేవలం శునకాలు మాత్రమే కాదు ఒక్కోసారి మనుషులు కూడా విచారణకు లోనై ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకుంటారక్కడ. బ్రిడ్జి కుడివైపు నుంచే ఈ కుక్కలు అన్నీ ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తున్నది. దీనికంతటికీ కారణం ఆ ప్రాంతంలో ఆత్మలు సంచరించడమే అనే వదంతులు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ మిస్టరీని చేధించడానికి 2005లో తొలిసారి కుక్కల మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ సాండ్స్ ఈ వంతెన దగ్గరకు వెళ్లాడు. తనతోపాటు ఓ కుక్కను తీసుకెళ్లాడు. అతని బృందంతో సందర్శించిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని తెలియజేశాడు నాతో తీసుకెళ్లిన కుక్క ఈ బ్రిడ్జిమీద నుంచి దూకింది. కానీ అది ప్రాణాలతో బయటపడింది. ఆ కుక్క సంగతి అలా ఉంచితే, అక్కడ నిలుచున్నంత సేపు నాకు కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఫీలింగ్ కలిగింది అని డేవిడ్ తెలిపాడు.

కేవలం కుక్కలను మాత్రమే ప్రభావితం చేయగల ఫ్రీక్వెన్సీ బ్రిడ్జి దగ్గరుంది. ఇది బ్రిడ్జి నిర్మాణంలో లోపం. దీంతో పాటు బ్రిడ్జి కింది నుంచి ప్రవహించే నీళ్లు ఆవిరవుతున్నప్పుడు చుట్టుపక్కల ఉండే ఎలుకలకు, ఉడుతలకు తాకి వచ్చే వాసన కుక్కలను ప్రభావితం చేస్తుంది. బ్రిడ్జిపై నుంచి కనిపించే రంగులు కుక్కల్లో ఉండే వర్ణాందత్వం కారణంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ సందర్భంలో అనాలోచితంగా దూకేస్తున్నాయి. ఈ అంశాలే మనుషులను కూడా ప్రభావితం చేస్తాయి. కానీ కుక్కలు త్వరగా ప్రభావానికి గురవుతాయి అని డేవిడ్ సాండ్స్ చెప్పాడు.

516
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles