దత్తత.. ఇక సులువు


Sun,March 31, 2019 02:29 AM

అందరూ ఉన్నవాళ్లే ఒక్కోసారి జీవితాన్ని భారంగా గడుపుతుంటారు. అలాంటిది ఎవరూ లేని వారి సంగతేంటి? అనాథలుగా, అనామకులుగా బతుకాల్సిందేనా? లేదంటే ఎవరైనా దత్తత తీసుకుంటే ఓ దిక్కు, మొక్కు దొరుకుతుంది. కానీ.. అలా ఎంతమంది దత్తత తీసుకుంటున్నారు? అసలు దత్తత తీసుకోవాలంంటే ప్రక్రియ ఏంటి? దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఒక ఎత్తయితే.. దత్తత తీసుకోవడం ఒక బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చే ప్రక్రియను చెప్పే కథే ఇది.

-అజహర్ షేక్, సెల్: 9963422160

మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి దత్తత వ్యవహారాలు వస్తాయి. ఢిల్లీ ప్రధాన కేంద్రంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(సీఏఆర్‌ఏ) సంస్థ నడుస్తున్నది. దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా పిల్లలను దత్తత ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా ఈ సంస్థ నుంచి అనుమతి అవసరం. అనుమతి విషయం పక్కన పెడితే ఇలాంటి విషయం మీద గానీ, ఈ సంస్థ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కారణం అవగాహన లేకపోవడం. మన దేశంతో పాటు విదేశాలకు దత్తత వెళ్లే చిన్నారుల పర్యవేక్షణ, వాళ్లకు సంబంధించిన వివరాలు ఈ సంస్థలో నమోదు చేస్తారు. వారి బాగోగులు, లాభనష్టాల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తారు. ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకుపోవడం కోసం చేంజ్ డాట్ ఓఆర్జీ అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుంది. దీనికోసం దేశంలోని అత్యంత ప్రభావవంతులైన 30 మంది మహిళల్ని ఎంపికచేసింది. షీ క్రియేట్ చేంజ్ పేరుతో ప్రారంభించిన ఈ ఉద్యమంలో భాగమయ్యారు హైదరాబాద్‌కు చెందిన అర్చనా సురేష్. దేశవ్యాప్తంగా ఎంపికయిన 30 మందిలో రెండు తెలుగు రాష్ర్టాల నుంచి ఎంపికయిన ఏకైక మహిళ డాట్ ఓఆర్జీ సహకారంతో హాష్‌ట్యాగ్ ఉద్యమానికి ప్రాణం పోసింది. #adoptionm(దత్తత), #Allkidsneedparents(అందరికీ తల్లిదండ్రులు) పేరుతో ప్రారంభించిన ఈ అవగాహన ఉద్యమానికి మంచి స్పందన లభిస్తున్నది. అర్చన వేసిన మొదటి అడుగుకు వందలమంది తోడు నిలుస్తున్నారు.
Adaption

సీఏఆర్‌ఏ (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) సంస్థ ఏదో పేరుకు నడుపుతున్నామంటే నడుపుతున్నాం అన్నట్టు ఉందని అర్చన బాధను వ్యక్తం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా ఈ సంస్థకు సంబంధించిన వివరాలు కానీ, సమాచారం కానీ లభించడం లేదు. ఈ విషయం మీద ప్రజల్లో అవగాహన కల్పించి పిల్లలు లేని తల్లిదండ్రులకు పిల్లలను, తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లిదండ్రులను కలిగించే ప్రయత్నమే ఈ ఉద్యమ నినాదం. ఐడీ ఫ్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్, ఐటీ రిటర్న్ వంటి వివరాలుంటే ఆరునెలల్లో పూర్తయ్యే సాధారణ దరఖాస్తు విధానం ఇది. పిల్లలు కావాలని దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రుల వివరాలను ఆ శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలను నేరుగా ప్రస్తుత మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి మేనకా గాంధీని కలిసి ఇస్తానంటున్నది అర్చనా సురేష్. ఈ విషయాలను అక్కడ చర్చించి సీఏఆర్‌ఏ, చేంజ్ డాట్ ఓఆర్జీల సహకారంతో విజువల్ యాడ్స్, ఇమేజ్ యాడ్స్ రూపొందించి మల్టీపెక్సీల్లో ప్రసారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. దత్తత విషయంలో చైతన్యం లేకపోవడం వల్ల కేవలం శిశువులను మాత్రమే దత్తత ఇస్తారన్న విషయమే చాలామందికి తెలుసు. కానీ అది తప్పు. 10-18 వయసున్న చిన్నారులను కూడా దత్తత ఇస్తారు. అంత వయసున్న పిల్లలను దత్తత తీసుకోవడానికి చాలావరకు వెనకాడుతున్నారు.

అర్చన సురేష్ ఓ ఐటీ సంస్థలో కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగానికి హెడ్‌గా పనిచేస్తున్నది. లక్షల్లో జీతం. ఇల్లు.. కారు సుఖశాంతుల జీవితం ఇలా అన్ని ఉన్నాయి. ఇదే జీవితం కాదనుకుంది. ఇంత ఇస్తున్న ఈ సమాజానికి తనవంతుగా ఏమైనా చేయాలనుకుంది. అందుకే బ్రింగ్ ఏ స్మైల్ పేరుతో ఒక నెట్‌వర్క్ ప్రారంభించి సేవ కార్యక్రమాలను విస్తరింపజేస్తున్నది. అపార్ట్‌మెంట్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం నగరంలోనే కాకుండా విదేశాలకు విస్తరించింది. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ.. వాళ్ల మొహాల్లో చిరునవ్వులు చిందించేలా తన వంతు ప్రయత్నం చేస్తున్నది అర్చన సురేష్. సోషల్‌మీడియాలో స్టార్ట్ చేసి ఒక నినాదమై (make a difference bring a smile).. ఒక విధానమై (collestion, distribution) సేవా కార్యక్రమాలను ఇంత పెద్ద ఎత్తున చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని చెబుతుంది. ఇప్పటివరకు ఈ గ్రూప్ ద్వారా 500 మంది వాలంటీర్ సభ్యులు పనిచేస్తున్నారు. స్కూల్, ఇంటర్, డిగ్రీ చదువుతున్న సుమారు 50 మంది నిరుపేద అమ్మాయిలను దత్తత తీసుకొని చదివిస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బాగా చదివే నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇస్తున్నది.

595
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles