ఎప్పటినుంచో దిష్టితీస్తున్నాయి..


Sun,March 31, 2019 02:22 AM

దిష్టిబొమ్మలా ఏం నిలవడ్డవ్ రా.. అని కదలకుండా, మెదలకుండా ఎవరైనా నిలబడితే మనం కసురుకుంటాం. కొత్తగా కట్టిన ఇంటికి, చేతికొచ్చిన పంటకు కాపలాగా ఓ దిష్టిబొమ్మ పెడతాం. పంట మీద అడవి జంతువులు, పక్షులు దాడి చేయకుండా, ఇంటికి ఎవరి దిష్టి తగలకుండా దిష్టిబొమ్మ పెట్టడం ఆనవాయితీ. ఇంతకీ ఈ దిష్టిబొమ్మ ఎక్కడిది? ఈ ఐడియా మొదటిసారి ఎవరికి వచ్చింది? ఈ దిష్టిబొమ్మ కథేంది.

మొదటి దిష్టిబొమ్మ 3,000 ఏళ్ల కిందటే తయారైంది. దిష్టిబొమ్మల్ని ఇంగ్లిష్‌లో స్కేర్‌క్రో అని పిలుస్తారు. స్కేర్ అంటే బెదిరించడం, క్రో అంటే కాకి. కాకులను బెదరగొట్టడానికి తయారు చేసుకున్న బొమ్మ స్కేర్‌క్రో. ఈ బొమ్మలను కర్ర, వరిచెత్త వంటి వాటితో తయారు చేసి, పాత బట్టలను తొడుగుతారు. వీటిని దిష్టిబొమ్మలుగా పొలాల్లో పక్షుల నుంచి పంటను రక్షించుకునేందుకు ఉంచుతున్నారు రైతులు. ఈ దిష్టిబొమ్మను చూసిన పక్షులు భయపడి పంట జోలికి రావు. ఈజిఫ్షియన్లు నైలు నది పక్కనున్న గోధుమ తోటల్ని కాపాడుకునేందుకు మొదటిసారి దిష్టిబొమ్మల్ని తయారు చేశారు. కాలక్రమంలో స్కేర్ క్రోస్ బదులు.. పక్షుల్ని తరిమేందుకు విండ్ మిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కొందరు చెట్లకు బాటిళ్లు, టిన్స్ వంటివి వేలాడ దీస్తున్నారు. ఇంకొందరు ధ్వని వచ్చే గన్స్‌ను బొమ్మలుగా వేలాడ దీస్తున్నారు. మొదట పక్షులు భయపడినా తర్వాత వాటికీ అలవాటు పడిపోతున్నాయి.

దిష్టిబొమ్మలకు పండుగ

బ్రిటన్‌లో నార్త్ యార్క్‌షైర్‌లోని కెట్లేవెల్ అనే గ్రామంలో ఏడాదికోసారి దిష్టిబొమ్మల ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఈ ఈవెంట్‌లో స్థానికులు చురుకుగా పాల్గొంటారు. రకరకాల డిజైన్లలో తయారుచేసిన దిష్టిబొమ్మలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ పండుగ సమయంలో పర్యాటకులు కెట్లేవెల్‌కు తరలివస్తారు. ఈ సమయంలో నిర్వహించే ట్రెజర్ హంట్ అనే కార్యక్రమం ఆకట్టుకుంటుంది. దిష్టిబొమ్మలు పెట్టి పండుగ జరుపుకోవడం విచిత్రంగా ప్రారంభమయింది. 1994లో కెట్లేవెల్‌లోని ప్రాథమిక పాఠశాల తరఫున ఫండ్స్‌ను సేకరించడం కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గార్డెన్లు, మైదానాలు, రూఫ్‌టాప్స్.. ఇలా అనేక చోట్ల వందకు పైగా దిష్టిబొమ్మలను తయారుచేసి పెట్టారు. ఆ ఈవెంట్ బాగా సక్సెస్ అవడంతో.. ఏటా దీనిని ఓ పండుగలా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వేలమంది పర్యాటకులను ఈ ఫెస్టివల్ ఆకర్షిస్తున్నది. ఏటా ఆగస్టులో తొమ్మిది రోజుల పాటు దిష్టిబొమ్మల పండుగను నిర్వహిస్తారు.
Disti-Bomma

మారిన దిష్టిబొమ్మల ట్రెండ్!

కాలానికి తగ్గట్లుగానే దిష్టిబొమ్మల ట్రెండ్ మారుతూ వస్తుంది. కర్రకు వరిగడ్డి చుట్టి, పాత చొక్కాలు తొడిగి.. మసిబూసే దిష్టిబొమ్మలకు రోజులు పోయాయ్. ఈ ట్రెండ్‌కు తగ్గట్లుగా రోబో దిష్టిబొమ్మలూ వచ్చాయి. పక్షుల భారి నుంచి పంటను కాపాడుకునేందుకు హాలెండ్‌లో అగ్రిలేజర్ అనే దిష్టిబొమ్మను కాపలాగా ఉంచారు. ఇది 3వేల ఎకరాల పొలానికి కాపాలా కాస్తుంది. ఈ రోబో ఉన్న పొలమంతా లేజర్ కిరణాలు రంగురంగుల్లో వెదజల్లుతుంటాయి. దీంతో పక్షులు అటువైపు రావడమే మానేశాయి. ఇక మన తెలుగు రాష్ర్టాల్లో పంటకు నరదిష్టి తగలకుండా అనుష్క, తమన్నా, సన్నీలియోన్ వంటి హీరోయిన్లు బొమ్మలను ఫెక్లీలుగా పొలాల్లో కడుతున్నారు రైతులు.

మరికొన్ని ఆసక్తికర విషయాలు!

-గ్రీకు రైతులు ప్రియాపస్ దిష్టిబొమ్మను తయారుచేసేవాళ్లు. ప్రియాపస్ అనే వ్యక్తి చూసేందుకు వికృతాకారంలో కనిపించేవాడు. అందుకే అతని ఆకారంలో దిష్టిబొమ్మలు పెట్టేవారు.
-జపాన్ రైతులు ఒకప్పుడు స్కేర్ క్రోస్‌ని ఏర్పాటు చేసేవాళ్లు. ఇందుకోసం కుళ్లిన మాంసం, చేపల కుళ్లిన ఎముకల్ని వేలాడ దీసేవాళ్లు. ఆ వాసన భరించలేక పక్షులు పారిపోయేవి.
-జర్మనీలో చెక్కలతో దిష్టిబొమ్మల్ని పెట్టేవారు.
-స్కేర్ క్రో పదాన్ని 1719లో తొలిసారి డేనియల్ డిఫో తన నవల రాబిన్సన్ క్రూసోలో వాడారు.
-ప్లేగ్ వ్యాధి రావడంతో చాలామంది చనిపోయారు. దాంతో పక్షుల్ని తరిమేవారికి కొరత ఏర్పడింది. అప్పుడు రైతులు దిష్టిబొమ్మలు ఏర్పాటు చెయ్యడం మొదలుపెట్టారు.
-క్రీ.శ.712లో జపాన్ బుక్‌లో క్యూబికో అనే దిష్టిబొమ్మ దైవంతో సమానంగా భావించేవారని ఉంది.
-ప్రపంచవ్యాప్తంగా దిష్టిబొమ్మలను హాడ్మెడాడ్, హే మేన్, గల్లీ బగ్గెర్, టాట్టీ బోగల్, బ్వాచ్ వంటి పేర్లతో పిలుస్తున్నారు.
-జపాన్‌లోని నాగోరో గ్రామంలో 35 మంది నివసిస్తే అక్కడ 350 దిష్టిబొమ్మలున్నాయి.
-కెనడాలో జాయ్స్ స్కేర్ క్రో గ్రామం ఉంది. ఇక్కడ డజన్ల కొద్దీ దిష్టిబొమ్మలున్నాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు.
-ప్రపంచంలో ఎక్కువ దిష్టిబొమ్మల్ని ఒక చోటకు తెచ్చినది బ్రిటన్‌లోని నేషనల్ ఫారెస్ట్ అడ్వెంచర్ ఫామ్‌లో. మొత్తం 3,812 స్కేర్ క్రోస్. అదో ప్రపంచ రికార్డు.

428
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles