శిక్ష కాదు..శిక్షణ..!!


Sun,March 31, 2019 01:44 AM

కరుడుగట్టిన నేరస్థుడినైనా కనువిప్పు కల్గిస్తారు. పాశవిక హృదయాలకు సైతం మానసిక చికిత్స చేస్తారు. నేరం చేసి జైలుకు వెళ్లిన ఖైదీని తిరిగి సమాజానికి ఉపయోగపడే సుశిక్షితుడైన పౌరులుగా తీద్దుతారు. వినూత్న సంస్కరణలతో దేశంలోని ఇతర జైళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది తెలంగాణ జైళ్లశాఖ. ఇతర రాష్ర్టాలతోపాటు ఇతర దేశాల ప్రతినిధులకు అధ్యయన కేంద్రంగా మారిన తెలంగాణ జైళ్లశాఖ సంస్కరణలపై ప్రత్యేక కథనం..

-నాగోజు సత్యనారాయణ, క్రైం రిపోర్టర్, స్టేట్ బ్యూరో

శిక్ష పూర్తయి భయంభయంగా సమాజంలోకి అడుగుపెట్టే ఖైదీలకు స్వయంగా ఉపాధి చూపే బాధ్యతను భుజానికెత్తుకుంది తెలంగాణ జైళ్లశాఖ. ఆర్థికంగా వారికి ఒక దారి చూపి సన్మార్గంలో నడిచే పౌరులుగా తీర్చిదిద్దుతోంది. జైళ్లశాఖ నిర్వహించే పెట్రోల్‌బంక్‌లు మై నేషన్ ఔట్‌లెట్లలో ఉపాధి కల్పించడంతోపాటు, జాబ్‌మేళాలు నిర్వహించి వారికి ఉపాధి మార్గాలు చూపుతోంది.

మానసిక పరివర్తన తెచ్చేలా...

నేరం చేసి జైలుకు వచ్చే ఖైదీలో మానసిక పరివర్తన తేవడమే లక్ష్యంగా తెలంగాణ జైళ్లశాఖ వినూత్న సంస్కరణలు తీసుకువచ్చింది. నేరస్థులను మానసిక రోగుల్లానే చూస్తాం. వారికి మానవత్వంతో కూడిన హృదయంతో చికిత్స ఇవ్వాలి అప్పుడే వారిలో పరివర్తన తీసుకురాగల్గుతాం.. ఇది తెలంగాణ జైళ్లశాఖ ఉన్నతాధికారుల విజన్. ఖైదీల హెల్త్ రిపోర్టులు పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు హెల్త్‌చెకప్‌లు చేస్తున్నారు.

దీంతో శిక్షాకాలంలో మరణాలు చాలావరకు తగ్గాయి. 2014లో 56 మంది ఖైదీలు మృతిచెందగా, 2018లో తెలంగాణ జైళ్లలో ఎనిమిది మంది ఖైదీలు మరణించారు. ప్రతి ఖైదీకి ఉదయాన్నే యోగా, వ్యాయామం తప్పనిసరి చేశారు. అనుభవజ్ఞులైన సైకాలజిస్టులు, మానసిక పరివర్తన వచ్చిన ఖైదీలతో నేరుగా మాట్లాడిస్తుండడంతో ఖైదీల ప్రవర్తనలో ఎంతో మార్పు వస్తోంది. అదేవిధంగా విద్యాదాన్ కార్యక్రమం ద్వారా జైళ్లలోని నిరక్షరాస్యులైన ఖైదీలను అక్షరాస్యులుగా మారుస్తున్నారు. ఈ ఐదేండ్లలో లక్షా 32వేల మంది ఖైదీలను అక్షరాస్యులుగా మార్చారు.
Jail

నిరంతర వాచ్ కోసం ఆఫ్టర్ కేర్ టీంలు

జైలు నుంచి విడుదలైన ఖైదీలు ఎలా జీవిస్తున్నారు?తిరిగి నేరాలకు పాల్పడుతున్నారా?సమాజంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? వాటిని ఎదుర్కొనేందుకు వారు ఏం చేస్తున్నారు? తిరిగి నేరాలకు పాల్పడేవిధంగా వారి ప్రవర్తన ఉందా? అనే అంశాలను పరిశీలిస్తూ మాజీ ఖైదీలపై నజర్ వేసి ఉంచుతున్నాయి ఆఫ్టర్ కేర్ టీంలు. జిల్లాలోని డిప్యూటీ జైలర్ స్థాయి అధికారి నేతృత్వంలోని ఆఫ్టర్‌కేర్ టీంలు ఆయా గ్రామాల్లోకి వెళ్లి జైళ్ల నుంచి విడుదలైన వారి వివరాలను సేకరిస్తుంటారు. జైలు నుంచి విడుదలైన ఖైదీల్లో మానసిక ధైర్యాన్ని నింపడంతోపాటు ఉపాధి చూపడంలో ఈ బృందాలు సహాయపడుతుంటాయి.

ఆనందాశ్రమాలతో ఆశ్రయం.

రాష్ట్రంలో ఆనందాశ్రమాల ఏర్పాటు జైళ్లశాఖ తీసుకున్న మరో సంస్కరణ. నిలువ నీడలేక, పూటకు భోజనం లేక బిక్షాటన చేస్తూ జీవనం గడిపే వారికి ఆనందాశ్రమాల్లో జైళ్లశాఖ ఆశ్రయం కల్పిస్తోంది. స్త్రీ, పురుషులిద్దరికీ వేర్వేరు ప్రాంతాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. మగవారిని చంచల్‌గూడ సెంట్రల్ జైలులో, ఆడవారిని చర్లపల్లి సెంట్రల్‌జైలులో ప్రత్యేకంగా ఆశ్రయం కల్పిస్తున్నారు. మూడు పూటల భోజనంతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడకగదులు, రోజంతా ఉత్సాహంగా గడిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు, అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 12వేల మంది బిక్షగాళ్లను జంట నగరాల నుంచి ఆనందాశ్రమాలకు తరలించింది తెలంగాణ జైళ్లశాఖ. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం కోసం దాదాపు రెండున్నర కోట్ల రూపాలయను ఖర్చు చేశారు. ఆనందాశ్రమాలకు వచ్చేవారి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు డాటాబేస్‌లో నమోదు చేస్తున్నారు. వారి బంధువుల జాడ తెలిసిన వెంటనే వారికి సమాచారం ఇచ్చి, వారు తగిన ఆధారాలు చూపితే వారి వెంట పంపుతున్నారు.

జాబ్‌మేళాలతో ఉపాధి అవకాశాలు

ఇప్పటి వరకు హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లోని కారాగారాల్లో ఖైదీల కోసం ప్రత్యేకంగా జాబ్‌మేళాలను ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది వరకు ఉపాధి కల్పించారు. అవికాకుండా జైలు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంకుల్లో 190 మంది మాజీ ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నారు. వీరితోపాటు జైళ్లశాఖ మైనేషన్ ఔట్‌లెట్లు, హోటల్లలో మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. జైలుకు వచ్చిన వాళ్లకు తిరిగి బయటికి వెళ్లిన తర్వాత ఏదో ఒక ఉపాధి మార్గాన్ని మనం చూపగల్గితే వాళ్లు మళ్లీ నేరాలవైపు వెళ్లరు. దీంతో శాంతిభద్రతలు కూడా అదుపులో ఉంటాయి. జైలుశాఖ ఆధ్వర్యంలో ఉపాధి కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 500 మంది వరకు ఖైదీలకు ఉపాధి చూపించాం. జాబ్‌మేళాలో మరో 400మందికి ఉపాధి కల్పించాం. ఇతర రాష్ర్టాలు, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చి మన జైళ్లను పరిశీలించి వెళుతున్నారు అని తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ చెప్తున్నారు.

325
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles