అతడు ఏడుసార్లు చావును జయించాడు!


Sat,March 23, 2019 10:28 PM

మరణం ఆహ్వానించినప్పుడు ఎంతటి ఘనాపాఠి అయినా.. తలవంచి వెళ్లిపోవాల్సిందే. మనం కావాలనుకుంటే అది రాదు.. అది వచ్చినప్పుడు మనం ఆపలేం. కానీ.. ఒక వ్యక్తి మరణాన్ని ఏడుసార్లు జయించాడు.

ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా ఏడుసార్లు ఆయన చావును జయించాడు. అతని కోసం మాటు వేసి కాపు కాసినా.. మృత్యువు కోరలకు చిక్కకుండా ఏడుసార్లు భారీ ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడు. ఆయన పేరే.. ఫ్రానే సెలాక్. ఈయన ఎంత అదృష్టవంతుడంటే.. అతడిని చుట్టుముట్టిన ఏడు ప్రాణగండాల నుంచి ప్రతిసారీ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈయనతో పాటు ఉన్నవారు మాత్రం మరణం ముందు తలవంచారు. క్రొయేషియా దేశానికి చెందిన ఫ్రానే సెలాక్ 1929లో ఓ పేద కుటుంబంలో పుట్టాడు. గత జన్మలో చేసిన పాపాల వల్లే పేద కుటుంబంలో, దురదృష్టవంతుడిగా పుట్టానని సెలాక్ ఎప్పుడూ బాధపడుతుండేవాడు. కానీ, మూడు పదుల వయసు దాటిన తర్వాత తాను ఎంతటి అదృష్టవంతుడో సెలాక్‌కి తొలిసారి తెలిసివచ్చింది. 1962లో సెలాక్ ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పింది. పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. నీళ్లలో పడి, ఊపిరాడక చాలామంది చనిపోయారు. కానీ, సెలాక్ మాత్రం చేతికి చిన్నపాటి గాయంతో బతికి బయటపడ్డాడు. ప్రాణాలతో ఉన్న సెలాక్‌ని చూసి చాలామంది నువ్వు చాలా అదృష్టవంతుడివి అంటుంటే ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత మరుసటి సంవత్సరమే.. అంటే 1963లో మరో ఘోర ప్రమాదం జరిగింది. సెలాక్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 20 మంది వరకు చనిపోయారు. అదృష్టవశాత్తు విమానం పల్టీలు కొడుతున్న సమయంలో వెనుకడోరు ఊడిపోయింది. ఆ డోరులోంచి సెలాక్ ఎగిరి, కిందకు పడ్డాడు. స్పృహ తప్పాడు. కొద్దిసేపటికి తేరుకొని చూస్తే తాను ఓ గడ్డివాము మీద పడ్డాడు. ఒంటికి గాయాలేం లేవు. టీవీలో చూస్తే.. విమానం కూలి 20 మంది మరణం, ఒకరు గల్లంతు అని వార్త. క్షేమంగా ఇంటికెళ్లిన సెలాక్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
selak

ఇలా రెండోసారి ప్రాణాపాయం నుంచి బయటపడిన సెలాక్‌కి 1966లో మరో ప్రమాదం ఎదురైంది. సెలాక్ ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ ఘటనలో నలుగురు చనిపోయారు. చాలామందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కానీ సెలాక్ మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఇది జరిగిన మరో నాలుగేండ్లకు సెలాక్ కారు మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో సెలాక్ కూడా అందులోనే ఉన్నాడు. అప్రమత్తమైన సెలాక్ వెంటనే కారులోంచి బయటకు వచ్చాడు. కొద్ది క్షణాల్లోనే కారు భారీ విస్ఫోటనంతో పేలి, బూడిదయింది. ఇలా రెండుసార్లు సెలాక్ కారు ప్రమాదంలో తప్పించుకున్నాడు. మరోసారి రోడ్డు దాటుతున్న సెలాక్‌ను బస్సు ఢీకొట్టింది. అప్పుడు కూడా విచిత్రంగా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. రెండుసార్లు కారు కాలిపోయిన తర్వాత సెలాక్ మరో కారు కొన్నాడు. ఆ కారులో ప్రయాణిస్తుండగా అది కాస్త అదుపు తప్పి 300 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఆ ప్రమాదాన్ని ఊహించిన సెలాక్ కారులోంచి దూకి చెట్టు కొమ్మ పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ గండాలన్నీ దాటిన తర్వాత సెలాక్ 2003లో పది మిలియన్ డాలర్ల లాటరీ గెలుచుకున్నాడు. ఆ డబ్బుతో కారు, బంగ్లా కొనుక్కొని ముచ్చటగా ఐదో పెండ్లి చేసుకున్నాడు. తనకు అవసరమైన డబ్బు ఉంచుకొని మిగతావి బంధువులకు, స్నేహితులకు పంచేశాడు. ఏదేమైనా ఏడుసార్లు చావును జయించి ప్రాణాలతో నిలబడ్డ సెలాక్ మృత్యుంజయుడుగా నిలిచాడు. తన దగ్గర ఉన్న సంపదను స్నేహితులు, బంధువులకు పంచి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు.

639
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles