బిల్‌గేట్స్ అంతటివాడే చలించాడు


Sat,March 23, 2019 10:25 PM

ఆయనో ప్రపంచ కుబేరుడు. తాను తలచుకుంటే ఏదైనా చెయ్యగలడు. ఎంత సుఖంగానైనా బతకగలడు. కానీ.. ఆయన ఆలోచన మొత్తం సామాన్యుల గురించే. భవిష్యత్ తరాల బాగు గురించే. మనిషి మనుగడ గురించే. ఎందుకంటే అభివృద్ధి పేరుతో జరుగుతున్న వనరుల ధ్వంసంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే బిల్‌గేట్స్ అంతటివాడే.. పర్యావరణ పాఠాలు బోధిస్తున్నాడు.

అభివృద్ధి మాటున ఎంత అనర్థం జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. సమాజ అభివృద్ధికి వనరులు అవసరమే. ప్రకృతి ప్రసాదించిన వనరులను విచ్చలవిడిగా కాకుండా.. క్రమబద్ధంగా వినియోగిస్తేనే మనుగడ సాధ్యమవుతుంది. అందుకే ప్రపంచ దేశాలు ఆలోచనలో పడ్డాయి. అభివృద్ధికి కావాల్సిన ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాయి. కారణం పర్యావరణంలో పెను మార్పులు చోటుచేసుకోవడమే. అందుకే బిల్‌గేట్స్ అంతటి వాడే మనిషి మనుగడ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. చైతన్యం నింపుతున్నాడు. ఇదివరకటి నుంచే హాలీవుడ్ నటులు లియోనార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్, అకాన్, ఎలోన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వారు పర్యావరణ పాఠాలు బోధించారు.

పర్యావరణంపై వీడియో!


పర్యావరణంలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం, మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బిల్‌గేట్స్ ప్రత్యేకంగా ఓ వీడియో రూపొందించారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ధ్వంసంతో భూతల్లి ఎంతలా బాధపడుతుందో చక్కగా వివరించారు. ప్రత్యేక బొమ్మలతో సమస్యను వివరిస్తూ.. టెక్ బిలియనీర్ రూపొందించిన ఆ వీడియో ఎంతోమందిని ఆలోచింపజేస్తున్నది.
Bill-Gates

దృష్టిసారించాల్సిన రంగాలు


ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న ఐదు రంగాల గురించి వివరించారు బిల్‌గేట్స్. వాటిల్లో వ్యవసాయం, విద్యుత్, తయారీ, రవాణా, భవన నిర్మాణ రంగాలున్నాయి. ఎందుకంటే ఈ రంగాల్లోనే ఉత్పాదకత ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ రంగాల్లో కూడా పర్యావరణహితమైన మార్పులు తీసుకొస్తే.. వాతావరణంలో ఏర్పడే ఎన్నో సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చనేది బిల్‌గేట్స్ ప్రతిపాదన. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని.. ఉత్పాదక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని బిల్‌గేట్స్ చెబుతున్నారు.

ప్రత్యామ్నాయాలపై దృష్టి


విద్యుత్ తయారు చేసేందుకు నీరు, బొగ్గు, ఇతర ముడి సరకు అవసరమవుతుంది. తద్వారా కార్బన్ ఉద్ఘారాలు గాలిలో కలిసి కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోతుంది. దీనికి పరిష్కారంగా సోలార్ విద్యుత్, పవన విద్యుత్‌పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కోరుతున్నారు బిల్‌గేట్స్. సోలార్, పవన విద్యుత్‌ను వాడడం వల్ల కాలుష్యం తగ్గుతుందని చెబుతున్నారు గేట్స్. ఈ విద్యుత్ రంగంతోపాటు రవాణా రంగంలో కూడా మార్పులను ఆయన సూచిస్తున్నారు. కార్బన్‌ను తక్కువగా విడుదల చేసే ఇంధనాలు వాడాల్సిన అవసరం ఉందంటున్నారు. పెరిగిన జనాభా రీత్యా భవనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని గేట్స్ అభిప్రాయం. తద్వారా భూమికి బరువు పెరిగి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాడు. గేట్స్ అంచనా ప్రకారం.. 2060 నాటికి భూమిపై భవనాల భారం రెండింతలు పడుతుందని.. ప్రతీ నెలా ఒక కొత్త న్యూయార్క్ నగరం నిర్మించాల్సి రావొచ్చని అంటున్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చుతూనే.. క్రమబద్ధంగా వనరుల వినియోగం ఉండాలని చెబుతున్నారు గేట్స్. సిమెంట్, స్టీల్ తయారీలో కూడా మార్పులు సూచిస్తున్నారు. గ్రీన్‌హౌస్ వాయువులు 24 శాతం వ్యవసాయ రంగం నుంచి విడుదలవుతున్నాయని గేట్స్ చెబుతున్నారు.

అవగాహన అవసరం..


పర్యావరణంలో మార్పులు భారీగా జరుగుతున్నాయన్న విషయం ప్రజలకు తెలియాలి. దీనిపై అంతా అవగాహన పెంచుకోవాలి. పర్యావరణ సవాళ్లను అధిగమించేందుకు అన్ని దేశాలు, ముఖ్యంగా ప్రపంచ మీడియా దృష్టిసారించాలి. శీతోష్ణస్థితిపై కవరేజ్ ఇవ్వాలి. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు మీడియా తోడ్పాటునందించాలి. నా వంతుగా మెలిందా గేట్స్ ఫౌండేషన్ నుంచి ఆర్థికసాయం చేస్తున్నాను.
- బిల్‌గేట్స్

625
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles