Telangana Intermediate 1st & 2nd Year Results 2019

దొంగలకి దొంగ


Sat,March 23, 2019 10:18 PM

అర్ధరాత్రి ఆ రైలు ఫీనిక్స్ వైపు వెళుతున్నది. ఆఖరి కోచ్‌లోని కండక్టర్ ఓ కేబిన్ తలుపు తట్టాడు. కమిన్ లోపలి వ్యక్తి గట్టిగా చెప్పాడు. తలుపు తెరచుకుని లోపలకి వచ్చిన యూనిఫాంలోని కోచ్ కండక్టర్ అడిగాడు. మీరు డాక్టరా? అవును. దయచేసి మీరు నాతో వస్తారా? ఓ రోగిని చూడాలి. అలాగే, ఏమిటి సమస్య? అతను అడిగాడు.అది మీరే చెప్పాలి. పక్క కేబిన్లోని ఒకామె తన భర్త అకస్మాత్తుగా బాధతో మూలుగుతున్నాడని, రైల్లో ఎవరైనా డాక్టర్ ఉంటే చూడమని కోరింది కండక్టర్ చెప్పాడు. డాక్టర్ తన చేతిలోని వైద్య పుస్తకాన్ని పక్కన ఉంచి, కోటు తొడుక్కొని కండక్టర్‌ని అనుసరించాడు. లోపల నించి మూలుగులు వినిపించే కేబిన్‌లోకి వెళ్ళాడు. అతని భార్య బయటకి వచ్చింది. కొద్దిసేపటికి డాక్టర్ కేబిన్లోంచి బయటకి వచ్చాడు. బయట వేచి ఉన్న ఆ రోగి భార్య అడిగింది.మా వారికి ఎలా ఉంది? ఫర్వాలేదు. నేను వెళ్ళి చూడొచ్చా? అలాగే. వెళ్ళి అతని దగ్గర ఉండండి. ఆమె లోపలకి వెళ్ళాక కండక్టర్ డాక్టర్ మొహంలోని హావభావాలని చూసి అడిగాడు. సీరియస్సా? అవును. ఏమిటి సమస్య? అది ప్రమాదకరమైన జబ్బు. అతన్ని వెంటనే హాస్పిటల్‌కి తరలించాలి. ఈ రైలు తర్వాత ఎక్కడ అగుతుంది? ఫీనిక్స్‌లో. నాలుగుకి.అంటే మూడున్నర గంటలు! అప్పటికి ఆలస్యమైపోవచ్చు. మనం విన్‌స్టన్ మీంచే వెళ్తాం కదా? డాక్టర్ చేతి గడియారం వంక చూసుకొని అడిగాడు.అవును. ఇంకో గంటలో మనం విన్‌స్టన్ దాటుతాం. కానీ రైలు అక్కడ ఆగదు.ఇవాళ ఆగుతుంది. అక్కడో చిన్న హాస్పిటల్ ఉంది. రైలు డ్రైవర్‌ని అక్కడ ఆపమని చెప్పండి. ఆ రైల్వేస్టేషన్ మాస్టర్‌కి అంబులెన్స్‌ని సిద్ధం చేయమని మెసేజ్ పంపండి. ఈ కోచ్‌లోకి ఎవరూ రాకుండా కాపలా పెట్టండి. వీళ్ళు దిగాక ఈ కేబిన్ తలుపు తాళం పెట్టండి.

అది అంటువ్యాధా?
అవును. ఈ రైలు డబ్బా మొత్తం క్వారన్ టైన్లో నలభై రోజులు ఉంచాలి. ఎవరూ ఇందులోకి రాకూడదు. ఎవరూ ఇందులోకి రాకుండా, బయటకి వెళ్ళకుండా కాపలా పెట్టండి. ఈ డబ్బాలోని ప్రయాణీకులు అందరికీ టీకాలు వేయాలి.అలాగే కండక్టర్ భయంగా చెప్పాడు.అన్నట్లు నా లగేజ్ కంపార్ట్‌మెంట్లో ఉంది. దాన్ని తీసుకుంటాను. లోపల మందుల పెట్టె ఉంది. ఆ ఏర్పాటు చేయగలరా? డాక్టర్ కోరాడు.తర్వాత ఆయన కండక్టర్ని అనుసరించాడు. కండక్టర్ లగేజ్ కంపార్ట్‌మెంట్ తలుపు మీద కొట్టాడు. దానికున్న చిన్న కిటికీ తలుపు తెరుచుకుంది. లోపలి వ్యక్తి కండక్టర్ని చూసి అడిగాడు.ఏమిటి సంగతి? కండక్టర్ ఏం కావాలో చెప్పాక అతను తలుపు తెరిచాడు. మీరు వెళ్ళి డ్రైవర్‌కి ఎక్కడ ఆపాలో వెంటనే చెప్పండి. తర్వాత ఎవరూ రాకుండా కాపలా ఉండండి. డాక్టర్ కోరాడు. డాక్టర్ తలుపులోంచి లగేజ్ కం సార్టింగ్ పెట్టెలోకి వచ్చాక అతను అడిగాడు. మీ లగేజ్ రసీదు చూపిస్తారా? ఉత్తరాలని సార్టింగ్ చేసే పనిలోని ఇద్దరు ఉద్యోగస్తులు వాళ్ళ వంక ఆసక్తిగా చూశారు. తర్వాత తమ పనిలో మునిగిపోయారు.డాక్టర్ ఇచ్చిన రసీదుని చూసి అతను ఆయన నల్లటి పెట్టెని వెతికి తీసి చూపించి అడిగాడు.

ఇదేనా?
అవును. జాగ్రత్త! పగిలే గాజు సామాను ఉంది. డాక్టర్ హెచ్చరించాడు.డాక్టర్ ఆ పెట్టె మూతని తెరచి అందులోంచి ఓ మందుల పెట్టెని బయటకి తీశాడు. తర్వాత ఓ రివాల్వర్‌ని కూడా తీసి వాళ్ళకి గురి పెట్టి చెప్పాడు.సరే. అంతా చేతులు ఎత్తి అక్కడ బోర్లా పడుకోండి. ఆయన చేతిలోని రివాల్వర్‌ని చూసి అంతా నిర్ఘాంతపోయారు. మిమ్మల్నే. దీంట్లో ఆరుగుళ్ళున్నాయి. మీరు ముగ్గురే. గట్టిగా ఆజ్ఞాపించాడు. ఏమిటిది? ఒకరు ధైర్యం చేసి అడిగారు. దొంగతనం జరుగబోతున్నది.కొత్త వాళ్ళని లోపలకి రానీకూడదన్న నియమాన్ని ఉల్లంఘించావు? ఒకడు తలుపు తెరచిన వ్యక్తి వంక కోపంగా చూస్తూ అడిగాడు.మెడికల్ ఎమర్జెన్సీ అని ఇతను కండక్టర్ని నమ్మించాడు. ముగ్గురూ నేల మీద బోర్లా పడుకున్నారు. చేతులు వెనక వీపు మీద ఉంచుకోండి. డాక్టర్ ఆజ్ఞాపించాడు.వాళ్ళా పని చేసాక కోటు జేబులోంచి ఎడం చేత్తో ఓ చిన్న పెట్టెని తెరచి అందులోంచి మత్తుమందు నింపిన మూడు ఇంజెక్షన్ సిరంజీలని తీశాడు. నోటితో సూది మీది మూతని తీసేసి ముగ్గురి దగ్గరకి వెళ్ళి వాళ్ళ జబ్బలో ఒక్కోటి గుచ్చాడు. నిమిషంలో వాళ్ళకి స్పృహ తప్పారు.తర్వాత అతను పెట్టెని తెరచి అందులోంచి పేలుడు సామాను, ఓ దళసరి దుప్పటి తీశాడు. ఓ పక్కన ఉన్న పోస్టల్ శాఖ వారి ఐరన్ సేఫ్ దగ్గరకి వెళ్ళి దాని తలుపుని పరీక్షించాక దాని మడతబందుల దగ్గర డైనమైట్‌ని, వైర్‌ని అమర్చి, అది పేలినప్పుడు చప్పుడు కాకుండా పైన దళసరి బట్టని చుట్టాడు.

తర్వాత చేతి గడియారం వంక చూసుకొని వేచి ఉన్నాడు. కొద్ది నిమిషాలకి ఇంకో రైలు దాని పక్కనించి వెళ్ళేప్పుడు ప్లేంజర్ని నొక్కి డైనమైట్‌ని పేల్చాడు. ఆ పేలుడు శబ్దం పక్కన వెళ్ళే రైలు కూత శబ్దంతో కలిసిపోయింది. బట్ట పడిపోయి బయటకి పొగ వచ్చింది. అది తగ్గాక అతను దాని తలుపుని తేలిగ్గా తెరవగలిగాడు. అందులోంచి ఓ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ నించి తమ బ్రాంచ్‌కి వెళ్ళే డబ్బుల సంచీలని తీసి తన సూట్‌కేస్‌లో నింపుకొన్నాడు.రైలు విన్‌స్టన్ స్టేషన్లో ఆగాక డాక్టర్, స్ట్రెచర్ మీద ఆ రోగి, వెనకే అతని భార్య దిగారు. సిద్ధంగా ఉన్న అంబులెన్స్ లో ఎక్కాక అది బయలుదేరింది. రైలు కూడా.

రైలు ఫీనిక్స్‌కి నాలుగింటికి చేరే దాకా ఏం జరిగిందో నాకు తెలీదు. వాళ్ళు స్పృహ తప్పి ఉండడం చూశాను. కండక్టర్ చెప్పాడు.ఎంత పోయింది? ఫీనిక్స్‌లో వెంటనే రంగంలోకి దిగిన లెఫ్టినెంట్ నార్మన్ అడిగాడు. ఐదు లక్షల డాలర్లు.లెఫ్టినెంట్ నార్మన్ వెంటనే నేరం ఎలా జరిగిందో విచారించాడు. స్పృహలోకి వచ్చిన లగేజ్ కంపార్ట్‌మెంట్ లోని ముగ్గురూ లోపల జరిగింది చెప్పారు. లెఫ్టినెంట్ అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి చేరుకున్న ఆ దంపతుల్ని ప్రశ్నించమని, వారు ముగ్గురూ తోడుదొంగలై ఉండొచ్చనీ విన్‌స్టన్‌లోని పోలీసులని కోరాడు. గంటన్నర తర్వాత, విన్‌స్టన్ రైల్వే స్టేషన్ బయట అంబులెన్స్‌లో వేచి ఉండి పేకాడుకునే డైవర్ని, పేరామెడిక్‌ని ఎవరో రివాల్వర్‌తో బెదిరించి రైలు రావడానికి పావుగంట ముందు వారికి స్పృహ పోయే ఇంజెక్షన్‌ని ఇచ్చారని, వాళ్ళు ఇంకా స్పృహలోకి రాలేదని, వారి స్థానంలో మరో ఇద్దరు సిబ్బందిగా నటిస్తూ రైలు పెట్టె దగ్గరకి వచ్చి రోగిని స్ట్రెచర్లో తీసుకెళ్ళారని, అంబులెన్స్ ఎక్కిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళలేదని ఏమయ్యారో తెలీదని, దాన్ని కనిపెట్టమని అన్ని పెట్రోల్ కార్లని ఆదేశించామని జవాబు వచ్చింది. మరి కాసేపటికి ఆ అంబులెన్స్ మాత్రం ఓ హెలిప్యాడ్ పార్కింగ్ లాట్‌లో ఓ పోలీస్ పెట్రోల్ కార్‌లోని ఓ సార్జెంటికి కనపడిందని, బహుశ వాళ్ళు అద్దె హెలికాప్టర్లో ఎక్కడికో పారిపోయి ఉంటారని, ఆ హెలిపేడ్ ఎవరిదో విచారిస్తున్నామని, ఏ హెలిప్యాడ్లో అక్కడ నించి బయలుదేరిన విమానం ఎక్కడ దిగిందో కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామని పరిశోధన చేసి కనుక్కున్న విన్‌స్టన్ పోలీసుల నించి కొత్త సమాచారం వచ్చింది.

విన్‌స్టన్ పోలీసులు ఆ హెలిప్యాడ్ నించి బయలుదేరిన హెలికాప్టర్‌ని అద్దెకి ఇచ్చిన కంపెనీ మనిషిని ఉదయం ఎనిమిదిన్నరకి కలుసుకో గలిగారు. స్మిత్ అనే వ్యక్తి దాన్ని అమెరికా-మెక్సికో సరిహద్దులోని ఓ చిన్న ఊరికి వెళ్ళడానికి అద్దెకి తీసుకున్నాడని, దాని రిజిస్ట్రేషన్ నంబర్‌ని లెఫ్టినెంట్ నార్మన్‌కి పంపాడు. వెంటనే నార్మన్ ఆ ఊళ్ళోని పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇచ్చి, ఆ హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళు ఏమయ్యారో కనుక్కోమని కోరాడు. అది గొప్ప పథకం ప్రకారం జరిగిన నేరమని, దాన్ని ఎక్కడ ఆపాలో, ఆ రైలుకి ఎదురుగా ఎప్పుడు ఇంకో రైలు వస్తుందో, ఎప్పుడు డైనమైట్ పేల్చాలో ముందే పథకం వేసుకుని ఆ ప్రకారం నేరం చేశారని కూడా అతను గుర్తించాడు.ఉదయం పదకొండుకి అక్కడ నించి సమాచారం వచ్చింది. హెలిప్యాడ్ బయట వచ్చే ఆ ముగ్గురు ప్రయాణీకుల కోసం వేచి ఉన్న కారు రంగు, మేక్ మొదలైన వివరాలని నార్మన్‌కి వాళ్ళు పంపారు. వాళ్ళు మెక్సికోకి కార్లో సరిహద్దు దాటి పారిపోయి ఉంటారని లెఫ్టినెంట్ నార్మన్ కొంత దాకా సరిగ్గానే ఊహించాడు.
Crime--Man

హెలికాప్టర్లోంచి దిగి బయట సిద్ధంగా ఉన్న కార్లో బయలుదేరిన ఆ ముగ్గురూ ముందే బుక్ చేసుకున్న మోటెల్లో బస చేశారు. ఆ తెల్లవారుఝామునే వాళ్ళు డబ్బుని ముందు అనుకున్న విధంగా పంచుకున్నారు. డాక్టర్ ఓ కొత్త షాంపేన్ బాటిల్‌ని సెలబ్రేట్ చేసుకోడానికి తెరిచాడు.
మర్నాడు సాయంత్రానికి కాని డాక్టర్ తోడుదొంగలకి మెలకువ రాలేదు. వచ్చాక చూస్తే డాక్టర్ లేడు. తమ డబ్బూ లేదు. తాము మోసపోయామని, రాత్రి తాగిన మందులో అతను ఏదో కలిపాడని గ్రహించారు.ఆ రోజు ఆ ఊళ్ళోని పోలీస్ స్టేషన్‌కి ఆ ఇద్దరిలోని మహిళ ఫోన్ చేసి చెప్పింది.విన్‌స్టన్ ద్వారా వెళ్ళే రైల్లో దొంగతనం చేసిన పెద్దమనిషి పేరు రాబిన్సన్. అతని వయసు ముప్పై ఎనిమిది. అతనిది చికాగో. అడ్రస్...కాని ఆ సరికే రాబిన్సన్ మెక్సికోలో ఉన్నాడు. డిక్కీలోని ఆ సూట్ కేస్‌ని రెండు వైపుల కస్టమ్స్ శాఖ వాళ్ళూ తనిఖీ చేయలేదు. ముందస్తు సమాచారం ఉంటే తప్ప సాధారణంగా వాళ్ళు తనిఖీ చేయరు.అతని కారు మెక్సికో సిటీ దారి పట్టింది. రాబిన్సన్ మెక్సికో సిటీలో ఓ హోటల్లో బస చేశాడు.

మర్నాడు ఉదయం తలుపు చప్పుడవడంతో రాబిన్సన్ లేచి తలుపు తెరిచాడు. గుడ్ మార్నింగ్ సర్. బయట నిలబడ్డ యూనిఫాంలోని హోటల్ బాయ్ నవ్వుతూ విష్ చేశాడు.బ్రేక్‌ఫాస్ట్ ట్రే ఉంచిన చిన్న తోపుడు బండిని లోపలకి తోసుకు వచ్చాడు. దాని మీది దినపత్రికని అందించి బేకన్, ఎగ్స్, బ్రెడ్, మార్కర్లేడ్ సర్ అని చెప్పి బయటకి వెళ్ళిపోయాడు.వెంటనే రాబిన్సన్ ఆసక్తిగా దినపత్రికని తెరచి చూశాడు. అందులో మొదటి పేజీలోనే రైలు దొంగతనం వార్త గురించి ఉంది. అది చదివాక పోలీసులు పరిశోధనని వేగవంతం చేశారని గుర్తించాడు. తన పథకం మొత్తం వాళ్ళు ఛేదించగలగడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను ఆ రోజు బయటకి వెళ్ళి అపార్ట్ మెంట్ ని అద్దెకి తీసుకోదలచుకున్నాడు. బ్రేక్‌ఫాస్ట్ తిని, చాక్లెట్ మిల్క్ని తాగాడు. కుర్చీలో చేరగిలబడి నిద్రపోయిన రాబిన్సన్ కి మెలకువ రాగానే బద్ధకంగా లేచి చుట్టూ చూశాడు. తను ఎక్కడ ఉన్నాడో క్షణకాలం గుర్తుకు రాలేదు. ఇహలోకంలోకి రాగానే లేచి బద్దకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. సెల్ ఫోన్ అందుకొని చూస్తే టైం నాలుగుం పావు! కిటికీ లోంచి బయటకి చూశాడు. సూర్యుడ్ని బట్టి సాయంత్రం అయిందని గ్రహించగానే అతనికి ఆశ్చర్యం వేసింది. పొద్దున్న నిద్ర లేచిన తను ఇంత గాఢంగా ఎలా మళ్ళీ నిద్ర పోగలిగాడు?అనుమానం వచ్చి వెళ్ళి తన సూట్‌కేస్‌ని తెరచి చూశాడు. ఖాళీ! ఐదు లక్షల డాలర్లు మాయమయ్యాయి! ఎలా జరిగింది?వెంటనే దినపత్రికని అందుకొని చదివాడు. అందులో తన వర్ణన స్పష్టంగా ఉంది. సరిహద్దు దాటిన తన కారు వర్ణన కూడా. దాన్ని తన కన్నా ముందు ఎవరు చదివారో అర్ధమవగానే రిసీవర్ అందుకొని ఉదయం తన గదికి వచ్చిన రూం బాయ్ పేరు, ఇంటి చిరునామాని అడిగి తీసుకున్నాడు.రాబిన్సన్ అక్కడికి చేరుకున్నాక అతను ఊహించినట్లే జరిగింది. అతను గది ఖాళీ చేసి తన ఊరుకి వెళ్ళిపోయాడు. అతడిది ఎక్కడో, అతను ఎవరో అనేది ఎవరూ చెప్పలేకపోయారు.తను ఎంతో కష్టపడి, పథక రచన చేసి సంపాదించిన సొమ్ముని వాడు ఎంతో తేలిగ్గా కొట్టేయగలగడం, అలాంటి వాడు తన నించి దొంగతనం చేయడం రాబిన్సన్‌ని అధికంగా బాధించింది.(రాబర్ట్ ఏంగస్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

607
Tags

More News

VIRAL NEWS