సింగపూర్ వదిలి.. వ్యవసాయం కోసం ముంబైకి..


Sat,March 23, 2019 09:49 PM

వ్యవసాయం చేయడానికి రైతు కావాలని ప్రకటనలు ఇచ్చే రోజులు వచ్చాయి.. దేశానికి వెన్నెముక రైతు అంటారు. కానీ ఆ రైతుకు గిట్టుబాటు ధర లేదు. పెట్టిన పెట్టుబడి రాదు. ఆరుగాలం కష్టపడితే మిగిలేది అప్పు.. అందరూ పల్లెను వదిలి పట్నానికి బాటపడితే ఇతను మాత్రం భిన్నం. సింగపూర్‌ను వదిలి ముంబైకి కదిలాడు. తక్కువ మట్టితో వ్యవసాయం చేస్తున్నాడు. ఎవరతను?

ఈ ప్రపంచ జనాభా ఆకలి తీరాలంటే రైతు కావాలి. పంటపండాలంటే రైతు కావాలి. అందరూ బాగుండాలంటే రైతు ఉండాలి. కానీ, ఆ రైతే బాగుండడు. కాలం కాక కొందరు, ఇతర కారణాల వల్ల ఇంకొందరు వ్యవసాయానికి దూరం అవుతున్నారు. వ్యవసాయం చేయడానికి రైతులు కావాలని ప్రకటనలు ఇచ్చుకునే రోజులు వచ్చాయంటే భవిష్యత్తులో ఎన్ని అనర్థాలు వస్తాయో ఊహించవచ్చు. ముంబైకి చెందిన విజయ్ యెల్‌మల్లె సింగపూర్‌లో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగాన్ని వదిలి ముంబైకి తిరిగి వచ్చి కరగ్‌పూర్‌లో అతి తక్కువ మట్టితో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. సంవత్సరానికి పదిహేను లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.
Vijay

శిక్షణనిస్తూ.. పంటలు పండిస్తూ


విజయ్‌కి ఎనిమిదేండ్లున్నప్పుడు తల్లిదండ్రులు కర్ణాటక మహారాష్ట్ర బార్డర్‌లో ఉన్న వ్యవసాయ భూమిని అమ్మేశారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో అలా జరిగింది. భవిష్యత్తులో తను మంచి స్థాయిలో స్థిరపడ్డప్పుడు ఈ భూమిని తిరిగి కొంటానని విజయ్ అప్పుడే చాలెంజ్ చేశాడు. 42 యేండ్ల వయసున్న విజయ్ ఇప్పుడు భిన్నమైన వ్యవసాయం చేస్తూ నేటితరం రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2013 సంవత్సరం వరకు సింగపూర్‌లోని కెమికల్ కంపెనీలో పద్నాలుగు సంవత్సరాలపాటు పనిచేశాడు. ఉద్యోగాన్ని వదిలి ఇండియా బాటపట్టాడు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులు అమ్మిన స్థలం కొనలేకపోయినా పదిహేను ఎకరాల స్థలం కొని ప్రత్యామ్నాయ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. హైడ్రోనిక్స్ వంటి హైటెక్ వ్యవసాయ పద్ధతులతో నూతన అధ్యయనానికి తెరతీశాడు.
భారతదేశంలో, ముఖ్యంగా మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యల గురించి చదివి చలించిపోయాడు. ఆత్మహత్యలకు గల కారణాలు, అధిక పెట్టుబడి, లాభాలు రాకపోవడం వంటి ఎన్నో అంశాల మీద అధ్యయనం చేశాడు. ఆ తర్వాత చిన్న స్థాయిలో తను వ్యవసాయాన్ని మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎదగాలని నిర్ణయించుకున్నాడు. మిద్దెపై 100 గజాల స్థలంలో పంట పండించడం మొదలుపెట్టి ఇప్పుడు రాయ్‌గఢ్‌లో పదిహేను ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆల్టర్‌నేటివ్ ఫార్మింగ్ టెక్నాలజీస్(సీఆర్‌ఏఎఫ్‌టీ) సంస్థను స్థాపించి రెండు వేల మంది యువ రైతులకు పాఠాలు బోధించాడు. ప్రస్తుతానికి ప్రతినెలా 30 మంది రైతులకి శిక్షణనిస్తున్నాడు. అందుకోసం కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి 1.2 టన్నుల ఆకుకూరలు పండిస్తున్నాడు. చైన్ సిస్టమ్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నాడు. స్థానికంగా ఉండే దుకాణాల్లో, బంధువులకు, రెస్టారెంట్లకు అందజేస్తున్నాడు.

హైడ్రోపానిక్స్ అంటే..


తక్కువ మట్టి వాడి పీవీసీ పైపులలో మొక్కలను నాటి అతి తక్కువ ప్రదేశంలో చేయడమే ఈ హైడ్రోపానిక్స్ పద్ధతి అంటే. ఇతర పంటలతో పోలిస్తే ఈ విధానంలో 90 శాతం నీటి వాడకం తక్కువ ఉంటుంది. పంట 50 శాతం వేగంగా పెరుగుతుంది. కానీ ఈ ప్రక్రియ శాస్త్రీయంగా చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం పోషకాలు అందజేయాల్ని ఉంటుంది. పంట పెట్టుబడి, ఖర్చులు కూడా చాలా తక్కువ అవుతుంది. చిన్న, సన్నకారు రైతులు ఈ వ్యవసాయాన్ని చేయొచ్చు. పంటను బట్టి పెట్టుబడి లాభం కూడా బాగా వస్తుంది. రాయ్‌గఢ్‌లో ఉన్న తన 300 గజాలు స్థలంలో రెండు ఆక్వాపోనిక్ యూనిట్లను స్థాపించాడు. ఒక్కోదాని విలువ ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుంది. దీని ద్వారా ప్రతీ ఏడాది నాలుగు టన్నుల చేపలు, పది టన్నుల సేంద్రియ ఆకుకూరలను ఉత్పత్తి చేస్తున్నాడు. సీఆర్‌ఏఎఫ్‌టీ ద్వారా దేశ స్థాయి స్టార్టప్ కంపెనీలకు చాలెంజ్ విసిరాడు. స్టార్టప్ కంపెనీలకు పోటీలు పెట్టి భిన్న తరహా వ్యవసాయ ఆలోచనలతో వస్తే పెట్టుబడి పెడతామని ప్రకటించాడు. నేల ఆధారిత పంటలతో పోలిస్తే ఈ తరహా పంటలకు తక్కువ మంది కూలీలు అవసరం ఉంటారు. హనికరమైన కీటకాలు కూడా దరిచేరవు. పంట వ్యాధులు కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉండదంటాడు విజయ్.

417
Tags

More News

VIRAL NEWS