మూడేండ్లయినా పాడవ్వని ఇడ్లీ


Sat,March 23, 2019 09:44 PM

ఇంట్లో ఇడ్లీ చేస్తే.. ఎన్ని రోజులుంటది? దోశలు పోసినం.. ఎప్పటిదాకా పాడవకుండా ఉంటాయి? అన్నం, కూర వండినం.. ఎప్పటికీ ఖరాబ్ కాకుండా ఉంటాయా? ఇవన్నీ మహా అయితే ఒకట్రెండు రోజుల వరకు ఉంటాయేమో! అది కూడా ఫ్రిజ్‌లో పెడితేనే. అప్పటికి వాటిని సద్దికూడు అనేస్తం. పక్కకు నెట్టేస్తం. మరి, మూడేండ్ల వరకు ఫుడ్డు పాడు కాకుండా ఉంటే..!!అవును.. నిజంగానే మూడేండ్ల వరకూ టిఫెన్ పాడవ్వకుండా ఉండే ప్రయోగాలు విజయవంతమయ్యాయి. అదికూడా మన ఇండియాలోనే. ముంబై యూనివర్సిటీకి చెందిన వైశాలి బంబోలే అనే ఈ ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆ అద్భుతానికి శ్రీకారం చుట్టారు. ఈ అధునాతన సాంకేతికతతో ఇడ్లీని ఒకటి రెండు రోజులు, వారాలు కాదు.. ఏకంగా మూడేండ్ల పాటు ఇడ్లీని ఫ్రెష్‌గా ఉంచొచ్చు. కేవలం ఇడ్లీలే కాదు, ఉప్మా, ఢోక్లాతోపాటు ఆవిరితో ఉడికించే ఏ ఆహారమైనా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ పద్ధతిలో నిల్వ ఉంచే ఆహారం మూడేండ్ల తర్వాత కూడా రుచి, వాసన, పోషకాలు, మృదుత్వం కోల్పోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి.

రసాయనాలు లేని ఫుడ్!


ఎలక్ట్రాన్ బీమ్ ఇర్రాడియేషన్ (ఈబీఐ) అనే పద్ధతి ద్వారా ఆహారాన్ని మూడేండ్ల పాటు నిల్వ చేయవచ్చు. తొలిసారి ఈ టెక్నిక్‌ను వాడి సక్సెస్ అయ్యారు వైశాలి. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు కూడా. ఈ కొత్త విధానంపై 15 యేండ్లుగా పరిశోధనలు చేశారు. ఈ టెక్నాలజీ వల్ల ఆహారం ఎటువంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. దీనివల్ల ఆహారం మరిన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇందుకు ఎలాంటి రసాయనాలు ఉపయోగించక్కర్లేదు. ఇది చాలా పరిశుభ్రమైన ప్రక్రియ. ఇందుకు అవసరమైన బయో-నానో ల్యాబ్ ఏర్పాటు కోసం అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన స్వతంత్ర సంస్థ బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోపె టెక్నాలజీ (BRIT) రూ.45 లక్షలు సమకూర్చింది. ఈ ల్యాబ్ ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలో ఉంది.
Idly

ఆహార వృథాకు స్వస్తి


టిఫెన్ మూడేండ్ల వరకూ పడవ్వని విధానంతో ఆహార వృథాకు స్వస్తి చెప్పవచ్చు. ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండే సైనికులకు, విపత్తుల సమయంలో బాధితులకు, రోదసిలోకి వెళ్లే వ్యోమగాములకు ఈ తరహా విధానం ఎక్కువ లాభిస్తుంది. దీంతోపాటుగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీకి ఇది బాగా ఉపయోగపడే అంశం. ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అందిస్తున్న ఫుడ్ ప్యాకెట్లు కేవలం 90 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఆ తర్వాత అవి తినేందుకు పనికిరావు. దీనివల్ల ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆహారాన్ని తయారు చేయాల్సి వస్తున్నది. ప్రొఫెసర్ వైశాలీ రూపొందించిన ఈ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వస్తే.. ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లే.

15 యేండ్ల నుంచి ప్రయోగాలు..


ఈ సరికొత్త విధానంపై దాదాపు 15 యేండ్లుగా పనిచేస్తున్నా. కెమికల్ పాలిమరైజేషన్‌కు ఇది ఉత్ప్రేరకంలా ఉపయోగపడుతుంది. ఆహారానికి బ్యాక్టీరియా సోకకుండా అది కాపాడుతుంది. తద్వారా ఆహారం నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. 2013 నుంచి ఈ టెక్నిక్‌పై మరింత తీవ్రంగా పనిచేస్తున్నాం. బీఆర్‌ఐటీకి మా ప్రయోగ థీసెస్‌ను పంపాం. మా ఆలోచన నచ్చి ముంబై యూనివర్సిటీలో పరిశోధన, బయో నానో ల్యాబ్ కోసం రూ.45 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించింది. నా కృషికి తగిన ఫలితం దక్కింది. ఈ టెక్నాలజీని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకోస్తే.. చాలా సమస్యలకు పరిష్కారం చూపొచ్చు.
- ప్రొఫెసర్ వైశాలి బంబోలే

753
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles