ఇందుమతి


Sat,March 23, 2019 09:41 PM

లోకరీతినీ, ధర్మాన్నీ, విధినీ తెలియచెప్పేందుకే ఎంతోమంది తమతమ జీవితాలను ఉదహరించి చూపారు. ఆదర్శ భావాలకూ, ఆలోచనాత్మక దృక్పథాలకూ తామే రూపంగా మారిన ఎందరో గొప్పవారి జీవనపథం తరతరాలుగా మార్గదర్శకం అవుతూనే ఉంది. జీవనం ఎంతకాలం అన్నట్లుగాకాక, ఎంత విలువగా బతకగలిగిందన్నదే ఆదర్శం. జీవితావలోకనం వేరు. గంభీరమైన జీవితాన్ని అర్థం చేసుకోవడం వేరు. మనం చూసే దృష్టిని బట్టి ఎదుటివారి జీవితాలను అంచనా వేస్తామే గాని, వారి జీవితం స్థానంలో నిలబడి ఆలోచించగలిగితే అద్భుతమైన విషయాలు, జీవన ధర్మాలు జీవితమంటే ఏంటో చెబుతాయి. ధర్మార్థకామ మోక్షాల్లో ప్రతీది సరైన రీతిలో జీవితానికి ఆపాదించబడాలనీ, మనిషి మనిషిపై పెంచుకున్న ప్రేమ అజరామరమనీ తెలియజెప్పేందుకే తన కొద్దిపాటి జీవితంలోనే అనంతాన్నీ, ఆ ధర్మాన్నీ చూపించింది
ఇందుమతి. జీవితం సాధారణ ధర్మాన్ని తనద్వారా లోకానికి చాటింది ఇందుమతి.

-ప్రమద్వర

విదర్భ రాజకుమారి, భోజుని తనయ అయిన ఇందుమతి అజుని పెళ్ళి చేసుకొని ఇక్షాకు వంశానికి కోడలైంది. రాముడంతటి వాడిని కన్న దశరథునికి జన్మనిచ్చిన ఇందుమతి సూర్యవంశప్రతిష్ఠకు మరింత వన్నె తెచ్చింది. అసలు ఇందుమతి దివ్యాంగన శాపం కారణంగానైనా అందమైన స్త్రీగా భోజుని ఇంట పుట్టి ఒక గొప్ప వంశానికి తనవంతుగా బాధ్యతలను నిర్వర్తించింది. ప్రేమ విలువను ప్రపంచానికి తెలిపేందుకే అజున్ని వరించింది.ఇందుమతి స్వయంవర ఘట్టం చాలా అద్భుతమైంది. అపూర్వ లావణ్యం, అద్భుతమైన అందం, ఎంతటి వారినైనా ఆశ్చర్యపరిచే తెలివితేటలు, సకల విద్యా ప్రావీణ్యత, అణకువ, ఉన్నతమైన ఆలోచన ఇందుమతి రూపంలో విదర్భ రాజ్యం ఏర్పాటు చేసిన స్వయంవర సభలో నడుస్తూ ఉంటే గొప్పగొప్ప రాజులంతా తను తమనే వరించాలని కోరుకున్నారట. కానీ అందరిలోనూ అజున్ని స్వీకరించింది ఇందుమతి. అజునికి ఇందుమతి దక్కడంతో విముఖులైన రాజులంతా దండయాత్రకు దిగితే ఇందుమతిని పక్కనే ఉంచుకొని యుద్ధం గెలిచాడు అజుడు.ఇందుమతి ఒక ప్రత్యేకమైన స్త్రీ. ఆమెలోని అందమే కాదు, ఆమె మంచి గుణం, ప్రేమ, ఉదాత్తమైన ఆలోచన ఇందుమతిని తన సర్వస్వంగా భావించేలా చేసింది అజున్ని.
Indumathi

అతనది ప్రేమ మాత్రమే కాదు, ఆరాధన. అంటే ఎంతటి అర్హత ఇందుమతిలో ఉందనే భావార్థం. అజుని భార్యగా, స్నేహితురాలిగా, శ్రేయోభిలాషిగా, జీవితంగా బతికింది ఇందుమతి. పుట్టినింటిపై మమకారాన్నీ, మెట్టినింటి శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకొని సాధారణ జీవితమంటేనే ఇష్టపడింది ఇందుమతి. అజుని అజరామర ప్రేమ, ఇందుమతిలోని జీవత్వానికి ప్రతీకలా భావించిన ఇందుమతి జీవితం అనూహ్యంగా మారిపోయింది.రఘువు రాజ్యభారం అజునికి అప్పజెప్పగా ఇందుమతి సహకారంతో సుపరిపాలన చేస్తున్నాడు అజుడు. ఒకరోజు ఇందుమతీ అజులు ఉద్యానవనంలో తిరుగుతుండగా ఆకాశం నుంచి ఒక పూలమాల ఇందుమతి మెడలో పడుతుంది.

అంతే ఇందుమతి ప్రాణం పోతుంది. అది విధిరాత. ఇందుమతికి పూర్వశాపం. అలా ముగిసిపోయిన ఇందుమతి జీవితం అజుని ప్రేమగా చిరకాలం వర్థిల్లింది.ఇందుమతి జీవితాన్ని ఉదహరిస్తూ, అజుని హృదయ వేదనను ఊరడిస్తూ ఇక్షాకు వంశ గురువు వసిష్ఠుడు మరణం సహజమైన స్వభావం అనీ, జీవించడమనేదే అస్వాభావికమనీ, ఎంతవరకు జీవిస్తే అంతవరకే లాభం అనుకోవాలనీ ఇందుమతి తన జీవితం ద్వారా జీవిత సందేశం ఇచ్చిందని అంటాడు. ఇందుమతి జీవితం చాలా చిన్నది. ఇందుమతి పుత్రుడిగా జన్మించిన దశరథునికి ఏడాది వయస్సు నిండకముందే ఇందుమతి మరణించింది. కానీ తల్లిలోని ప్రేమగుణాన్ని దశరథుడు ఆపాదించుకున్నాడంటే లోకంలో ప్రేమ ఎంత గొప్పదో ఇందుమతి తెలియజెప్పింది. ధర్మం కోసం జీవించినవారున్నారు. అర్థం కోసం జీవించే వారున్నారు. మోక్షానికి ప్రతీ ఒక్కరూ పరితపిస్తారు. కానీ కామం అనే పురుషార్థానికి ప్రతీకగా, విశ్వప్రేమకు నిదర్శనంగా జీవిత సందేశానికి ఆలంబనగా జీవించిన ఇందుమతి స్త్రీగానే కాదు, మనిషి జీవిత దృక్పథానికి ప్రేమతో భాష్యం చెప్పి జీవిత సందేశంగా చరిత్రలో నిలిచిపోయింది.

243
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles