మీ ముంగిట..ప్రపంచ రికార్డు!


Sat,March 23, 2019 11:14 PM

మీరు ఏదైనా సాధించాలనుకుంటున్నారా? ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాలనుకుంటున్నారా? రికార్డులు తిరగరాసి ప్రపంచ రికార్డులు సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే.. ఏం చెయ్యాలో.. ఎలా చెయ్యాలో తెలియడం లేదా? ఇలా తపన పడే ఔత్సాహికులకు శుభవార్త. మన హైదరాబాద్‌లో తొలిసారిగా ఓ సలహా కేంద్రం ఏర్పాటైంది. ప్రపంచ రికార్డులు సాధించాలనుకునే వారికి ఇదే సదావకాశం.

ఎవ్వరూ చేయని పని, సాహసాన్ని చెయ్యడమే రికార్డు. అలాంటిది ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేకపోతే.. అదే ప్రపంచ రికార్డు. చాలామందికి ఏది ప్రపంచ రికార్డు అవుతుందో తెలియదు. కొందరు తాము చేస్తున్న పనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందనే ఆలోచనే చెయ్యరు. మరికొంతమందికేమో.. రికార్డు సాధించాలంటే ఏం చెయ్యాలో తెలియదు. అలాంటి వారి కోసమే హైదరాబాద్‌లో తొలి అంతర్జాతీయ సలహా కేంద్రం ఏర్పాటైంది. మీ లక్ష్యాన్ని చెబితే.. వారే దిశా నిర్దేశం చేసి.. మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు. ప్రపంచ రికార్డూ కట్టబెడతారు.

ప్రపంచంలోనే తొలి సలహా కేంద్రం


ప్రతీ యేటా రికార్డుల పరిశీలనకు వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. వాటిల్లో కేవలం 10 శాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. మిగతా 90 శాతం దరఖాస్తులు అనర్హమైనవిగా మిగిలిపోతున్నాయి. కారణం.. దరఖాస్తులు పంపేవారికి ఏది రికార్డు? ఏది కాదు? ఎలా చేయాలి? ఎవరిని కలవాలి? అనే విషయాలు తెలియదు. అంతేకాకుండా ఎక్కడో విదేశాల్లో ఉండే రికార్డు సంస్థలను ఎలా సంప్రదించాలో తెలియదు. ఇన్నాళ్లూ అది ఒక బ్రహ్మ పదార్థంగా ఉండేది. పైగా.. రికార్డ్స్ చేయాలనుకునే వారికోసం ప్రపంచంలో ఇప్పటివరకు ఎలాంటి సలహా, సహాయ కేంద్రమూ లేదు. అందుకోసమే ప్రపంచంలోనే తొలిసారిగా భారత దేశంలో.. అందులోనూ మన తెలంగాణ గడ్డపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 1లో ఓ హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. ఈ బాధ్యతలను డాక్టర్ కొండవీటి మురళీ చూసుకుంటున్నారు.

హెల్ప్ డెస్క్‌లో ఏం చేస్తారంటే?


హెల్ప్ డెస్క్‌లో కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (ఫ్రాన్స్), విన్నర్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (యూకే), ఫార్చ్యూన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (యూఎస్) సంస్థలకు భారత ప్రతినిధిగా కొండవీటి మురళీ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా, ఎప్పుడైనా ప్రపంచ రికార్డులకు సంబంధించి ఉచితంగా సలహాలు తీసుకోవచ్చు. రికార్డు చేయాలనుకునే వారు.. ఏ రకమైన, ఎలాంటి రికార్డు చేయాలనుకుంటున్నారో తెలియజేస్తే.. ఆయా రంగాల్లో అప్పటికే ఉన్న రికార్డులను పరిశీలించి, రికార్డు చేయడానికి అవకాశం ఉంటే.. దానిని ఎలా చేయాలి? దాని విధి విధానాలను తెలియజేస్తారు. గతంలో చేసిన వాటిని వరుస క్రమంలో పరిశీలించి రికార్డుకు అర్హమైనదా? కాదా? అని వివరిస్తారు. ఇక వందలు, వేలమందితో ప్రజల మధ్య చేసే రికార్డులకు ఆయా రంగంలో నిష్ణాతులైన జడ్జిలను నియమించి రికార్డులు అందజేస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అప్పటికప్పుడే రికార్డును ధ్రువపరిచి సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. గూగుల్, ఫేస్‌బుక్ వంటి డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కూడా కల్పిస్తారు. మీ పేరుకు ముందు వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ అన్న ట్యాగ్ ఇప్పిస్తారు.
Murali

చెయ్యాలని ఉంటే.. ఏదైనా రికార్డే!


చెయ్యాలనే పట్టుదల.. లక్ష్యాన్ని సాధించాలనే తపన.. వాటికితోడు అంకితభావం, కృషి ఉంటే కచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు చేసే నిస్వార్థమైన పనే.. మీకు ప్రపంచ గుర్తింపును తీసుకొస్తుంది. రికార్డులు సాధించడానికి వయసుతో సంబంధం లేదు. కొంతమంది పుడుతూనే రికార్డులు సాధిస్తే.. మరికొందరు చనిపోయే వయసులోనూ రికార్డులు సాధిస్తుంటారు. ఉదాహరణకు.. అత్యంత పొట్టి, అత్యంత పొడుగు (మనిషి/జంతువు/ఇతరాలు), అత్యంత పొడుగు మీసాలు, అత్యంత పొడుగు లేదా పొట్టి చేతులు, అత్యధిక పాలు ఇచ్చే జంతువు, ఒకే కాన్పులో అత్యధిక సంతానం, సుదీర్ఘ కచేరీ, సుదీర్ఘ ప్రసంగం, ఇలా వివిధ రంగాల్లో వింతలు -విశేషాలు తొలి ప్రపంచ రికార్డులుగా చరిత్రకెక్కుతాయి. ఇలా మీకు తెలిసి ఎవరైనా ఉంటే.. వారి గురించి రికార్డు సంస్థల ప్రతినిధులకు తెలియజేయవచ్చు. ఇవే కాకుండా.. ప్రపంచ రికార్డు సాధించడానికి ఏం చెయ్యాలో వీరిని సంప్రదిస్తే.. పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతారు.

రికార్డుల్లో మనోళ్లవే ఎక్కువుండాలి..


ప్రపంచంలోనే తొలి రికార్డ్స్ పుస్తకం.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్ఫూర్తితో ఇప్పుడు పలు దేశాల్లో, పలు రికార్డు పుస్తకాల సంస్థలు బహుముఖంగా విస్తరించాయి. వీటిల్లో కంట్రీ బుక్ ఆఫ్ రికార్డ్స్, విన్నర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫార్చ్యూన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. వీటిని కంట్రీ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వరల్డ్ సిటిజన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్, వరల్డ్ ఫోరమ్ ఫర్ మీడియా జర్నలిస్ట్స్, విన్నర్స్ అకాడమీ ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి నేను ఇండియా నుంచి ప్రతినిధిగా ఉన్నా. నా ఆశయం ఒక్కటే.. అన్ని రికార్డు బుక్కుల్లో మనవాళ్ల పేజీలు ఉండాలి. అందుకే హైదరాబాద్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశాం. నేను 24 వరల్డ్ రికార్డ్స్ సాధించాను. వందకుపైగా పుస్తకాలు రాశా. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచన మేరకు భారత రాష్ట్రపతులు, ప్రధానులపై ఓ పుస్తకం రాస్తున్నా.
-డాక్టర్ కొండవీటి మురళి, రికార్డు సంస్థల భారత ప్రతినిధి

ఎలా సంప్రదించాలంటే?


ఏదైనా రికార్డు సాధించాలనుకునే వారు 9393167575 నంబర్‌కు వాట్సాప్, మెసేజ్ ద్వారా సంప్రదించాలి. మీ సందేహాలపై ఆ సంస్థల ప్రతినిధులే స్వయంగా సలహాలు, సూచనలు అందిస్తారు. అలాగే www.countrybook ofrecords.com, www.countrybookof worldrecords.com వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు. editormurali@gmail.com, editor@countrybookofrecords.com లకు మెయిల్ చెయ్యవచ్చు.

223
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles