5 థింగ్స్


Sun,March 10, 2019 12:51 AM

5-things

ఈ బుడ్డ్డోడు మహాద్భుతం!

ఈ బుడ్డొడి పేరు నోవా వాల్. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి అన్నీ ఇబ్బందులే. కేవలం శరీరం మాత్రమే ఉంది. ఏ భాగమూ అతడి ఆధీనంలో లేదు. కారణం ఇతడి మెదడులో ఆరోగ్యకరమైన భాగం ఉన్నది కేవలం 2 శాతం మాత్రమే. అయినా నోవాను తల్లిదండ్రులు వదులు కోలేదు. పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు నోవాకు ఆరేండ్లు. అయితే అనూహ్యంగా నోవా మాట్లాడుతున్నాడు. అందరిలాగే వింటున్నాడు, తింటున్నాడు, చూస్తున్నాడు, తల్లిదండ్రులకు గుర్తుపడుతున్నాడు. గలగల మాట్లాడుతున్నాడు కూడా. దీంతో నోవాను పరీక్షించిన వైద్యులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ప్రస్తుతం నోవా మెదడు వందశాతం పనిచేస్తున్నది అని తల్లిదండ్రులకు చెప్పారు. ఈ విషయం తెలిసినవారంతా.. ఈ బుడ్డోడు మహాద్భుతం అంటున్నారు.

5-things1

రోజుకు 20 సిగరెట్లు తాగితే..

మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త! మీ కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని రట్గెర్స్ రీసెర్చ్ సంస్థ తన పరిశోధనలో నిర్ధారించింది. రోజుకు 15 సిగరెట్ల్ల కంటే మించి తాగుతున్న వారిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిగరెట్లకు బానిసలైన ఈ చైన్ స్మోకర్లు.. కొన్ని రకాల రంగులను గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారు. వారి వయసు కూడా 25 నుంచి 45ఏండ్ల మధ్యలోనే ఉండడం గమనార్హం. సిగరెట్లలోని న్యూరోటాక్సిక్ కెమికల్స్ కండ్ల్లపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయని తేలింది. ఇవి కంటి చూపును కోల్పోయేలా చెయ్యగలవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్ తాగడం వల్ల రెటీనాలో ఉండే న్యూరాన్లు, రక్త కణాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అంతేకాకుండా మెదడులోని సన్నటి పొరలను దెబ్బతీస్తాయనీఅంటున్నారు.

5-things2
5-things3

నడి సంద్రంలోనే జీవనం

జపాన్, దక్షిణ కొరియా దేశాల మధ్యలో ఉన్న ఈ ద్వీపం పేరు డోక్డో. సముద్రం మధ్యలో ఉంటుంది. అయితే ఈ ద్వీపంలో ఈ ఒక్క వృద్ధురాలు మాత్రమే జీవనం సాగిస్తున్నది. ఈమె పేరు కిమ్ సిన్ యోల్. 81 సంవత్సరాల కిమ్ సిన్ భర్త గత ఏడాదే చనిపోయాడు. వీరిద్దరూ 1991 నుంచి ఈ ద్వీపంలోనే ఉంటున్నారు. కూతురికి పెండ్లి చేసి పంపారు. అయితే భర్త చనిపోయిన దగ్గర్నుంచీ కిమ్‌సిన్ ఒక్కర్తే ఉంటున్నది. ఈ ద్వీపమంటే ఆమెకు చాలా ఇష్టమట. తన భర్త జ్ఞాపకాలతోనే కాలం వెల్లదీస్తున్నది. అయినా తనకు భయం, బాధ ఏమీ లేవని అంటున్నది. అయితే.. తన అల్లుడు వీలైనంత త్వరగా కిమ్‌సిన్‌ను తమ దగ్గరకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ద్వీపం కోసం 300 యేండ్ల నుంచి జపాన్, దక్షిణ కొరియా దేశాలు వాదులాడుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అతని భయం.

5-things4

వేసవిలో మృదువైన చర్మం

3 ఉడకబెట్టిన గుమ్మడి ముక్కలు, 2 ముక్కల బొప్పాయి, చిటికెడు దాల్చినచెక్క పొడి, 6 వేప ఆకులు, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, స్పూన్ ముల్తాన్ మట్టి తీసుకొని.. అన్నింటిని గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే.. జిడ్డు కనిపించదు. ఒక నేరేడు పండు, 4 ఉడికించిన పుట్టగొడుగులు, రెండు టేబుల్‌స్పూన్ అలోవేరా జ్యూస్, అరస్పూన్ అవోకాడో, ఒక స్పూన్ తేనే, ఓట్స్ పొడిని గ్రైండ్ చేసి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేస్తే.. కాంతివంతంగా మెరుస్తుంది. 4 ఉడకబెట్టిన గుమ్మడి ముక్కలు, అరముక్క తురిమిన దోసకాయ, ఒక టేబుల్ స్పూన్ ఆలుగడ్డ, పాలపొడి, ఓట్‌పొడిని మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగితే.. సున్నితమైన చర్మం మీ సొంతం. టేబుల్ స్పూన్ ఓట్ పౌడర్, తగినంత కుంకుమపొడి, 5 బాదాం కాయలను గ్రైండ్ చేయాలి. అందులో అర టేబుల్ స్పూన్ పసుపు, 3 చుక్కల నిమ్మరసం, స్పూన్ పెరుగు, క్యారెట్ జ్యూస్ కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

5-things5

రక్తం రుచిమరిగిన పక్షి..

ఈ పక్షి చూడ్డానికి గోరింకలా ఉంటుంది. అందమైన ముక్కు, ఆకారంతో ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే మనం నీళ్లు తాగినట్లుగా.. ఇది రక్తం తాగుతుంది. ఈ జాతి పక్షులన్నీ ఇంతే. దాహమేస్తే నీళ్లు తాగుతాయో లేదో కానీ.. కచ్చితంగా రక్తం తాగుతాయి. ఇవి పసిఫిక్ మహా సముద్ర తీరంలోని గలపగోస్ ద్వీపంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఆ ద్వీపంలో ఏవైనా పక్షులు, జంతువులు గాయపడితే వీటికి పండగే. ఈ పుండు నుంచి రక్తం పీల్చుతూనే ఉంటాయి. గాయపడ్డ జీవాలు లేకపోతే పెద్ద జంతువులపై వాలి.. ముక్కుతో పొడుస్తూ రక్తాన్ని జుర్రుకుంటాయి. స్థానికులంతా వీటిని పిశాచ పక్షులు అంటుంటారు.

- డప్పు రవి

288
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles