సేవా సంపన్నుడు


Sun,March 10, 2019 12:43 AM

SEVASAPANUDU
సమాజం నాకేమిచ్చిందనే చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ సమాజంలో భాగమైన మనం సమాజం కోసం ఏం చేస్తున్నామని ఒక్కసారి ఆలోచిస్తే.. శూన్యం. కళ్లముందు ఏం జరిగినా నాకెందుకులే అని పక్కకు తప్పుకుని వెళ్లేవారే తప్ప ఆయ్యో పాపం సాయం చేద్దామని ఆలోచించేవారు అరుదు. కానీ అన్నార్థులు, అనాధలు, ఆపదలో ఉన్నవారే కాదు. దిక్కుమొక్కులేని చచ్చినవారికి కూడా తానున్నానంటున్నాడు నిజామాబాద్‌కు చెందిన మంచాల జ్ఞానేందర్‌గుప్తా. మనిషిలో మంచితనాన్ని పెంపొందించే క్రమంలో అందరికీ భగవద్గీతను అందిస్తూ తనదైన సేవానిరతిని చాటుకుంటున్నాడు.

SEVASAPANUDU1
మంచాల జ్ఞానేంద్రగుప్తాది సిరిసిల్ల జిల్లా కనగర్తి. ఆయన తాత మంచాల రాజేశం స్వాతంత్య్రసమర యోధునిగా, ప్రజాకవిగా పేరుగాంచారు. ఆయన కుమారుడు మం చాల శంకరయ్య కొడుకు జ్ఞానేందర్. పేద కుటుంబం కావడంతో కష్టాలు, కన్నీళ్లు ఆయన వెన్నంటే పెరిగాయి. ప్రాథమిక విద్య గ్రామంలో, లక్సెట్టిపేటలో ఉన్నత చదువులు పూర్తి చేశాడు. ఆ తరువాత బతుకుతెరువు కోసం నిజామాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. వ్యాపారంలో రాణిస్తున్న సమయం లో తనకు ఎదురైన సంఘటనలు ఆయనను సేవా మార్గం పట్టించాయి.
SEVASAPANUDU2

తండ్రిపేరుతో ట్రస్ట్

తన తండ్రి మంచాల శంకరయ్యపేరుమీద మంచాల శంకరయ్యగుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన జ్ఞానేందర్ ఆయన పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. మొదట మెడికల్ షా పులో పనిచేసిన ఆయన తర్వాత స్వంత ంగా మెడికల్ షాపును నిర్వహిస్తూ వచ్చే లాభాలనుండి కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించాడు. అలా పేద విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్, స్కాలర్‌షిప్‌లు అందించడం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, పండ్లు, వస్ర్తాలు, అన్నదానాలు వంటి కార్యక్రమాలెన్నో చేస్తున్నాడు. వేసవికాలంలో నిజామాబాద్ జిల్లా నీటి ఎద్దడిని గుర్తించి ప్రత్యేక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి ఉచితంగా తాగునీరందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాడు. పర్యావరణ హితం కోసం ఇంటింటికీ మట్టి గణపతులను అందిస్తున్నాడు.

అనాధగా పోకూడదని

ఒకసారి బెంగళూరులో తన కళ్లముందే ఒకవ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం, ఆయన అంతిమ సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఆయనను తీవ్రంగా కలచివేసింది. మరొకరికి అలా జరగకూడదన్న ఆలోచనే ఆయనను స్వర్గలోకయాత్ర రథాల ఏర్పాటుకు పురికొల్పింది. తొలుత 20 లక్షల వ్యయం తో అంతిమయాత్ర రథాలు ఏర్పాటు చేసి ఉచితంగా రథాన్ని పంపిస్తున్నారు. మొద ట నిజామాబాద్‌లో మాత్రమే వాహనాలను ఏర్పాటు చేసిన జ్ఞానేందర్ తన సేవలను పుట్టిన జిల్లా సిరిసిల్లాకు అక్కడి నుం చి హైదరాబాద్, బోధన్, బాన్సువాడ తదితర ప్రాంతాలకు విస్తరించాడు. అన్ని ప్రాంతాల్లోనూ అంతిమయాత్ర వాహనాలు 24గంటలు అందుబాటులో ఉంటా యి. అలాగే దూరప్రాంతం నుండి బంధువులు వచ్చేవరకు పార్థివదేహం పాడవకుండా ఉండడానికి గాను ఫ్రీజర్లు, శవపేటికలను కూడా ఆయన అందుబాటులో ఉంచారు. గడచిన ఏడేళ్లలో ఆయన పదివేల శవాలను స్వర్గయాత్ర రథాల ద్వారా తరలించి చరితార్థుడయ్యాడు.

గోసంరక్షణ కోసం..

మనుషులే కాదు గోవులన్నా జ్ఞానేందర్‌కు ఎంతో ఇష్టం. అందుకే హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న గోసంరక్షణ కేంద్రాల్లోని గోవులను దత్తత తీసుకుని వాటికి అవసరమైన వసతులు కల్పిస్తున్నారు.

భగవద్గీత పంచుతూ..

హిందూ ధార్మిక విలువలను పెంపొందిం చాలనే ఉద్దేశంతో ప్రముఖులకు, మిత్రులకు, బంధువులకు ఉచితంగా భగవద్గీత పుస్తకాలను అందిస్తున్నాడు. ఎవరైనా వా రి పుట్టినరోజు, పెళ్లిరోజు అని తెలిస్తే చాలు వారికి భగవద్గీతను పంపించడం ఆయన ఆనవాయితీ. ఇప్పటివరకు ప్రధాని మో దీ, రాందేవ్‌బాబా, తెలంగాణ మంత్రు లు, ఎమ్మెల్యేలు, రాజకీయ, సినీ ప్రముఖులతో కలిపి ఇప్పటివరకు 1300 భగవద్గీతలు పంచిపెట్టారు.

సేవకు గుర్తింపు..

జ్ఞానేందర్ గుప్తా చేసిన సేవలకు గాను వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, జీనియస్, భారత్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు లభించింది. అమెరికాకు చెందిన కాలిఫోర్నియా యునైటెడ్ థియోలాజికల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

SEVASAPANUDU3

ఉచిత క్యాబ్‌లు

దేవుడు నాకిచ్చిన దాంట్లో కొంతమొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాను. హైదరాబాద్‌లో కూడా ట్రస్ట్ సేవలను మరింత విస్తరించాని అనుకుంటున్నాను. దూరప్రాంతాల నుండి లేదా అవసర రీత్యా హైదరాబాద్ వచ్చేవారు. లేదా డబ్బులు చెల్లించుకునే స్థోమత లేని వారి కోసం అసవరమైతే ఉచిత క్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. ఆటోలు, క్యాబ్ యాజమాన్యాలు ప్రజల అవసరాన్ని గుర్తించకుండా పెద్దమొత్తంలో వారి నుండి వసూలు చేస్తున్నారు. అలాంటి వాటి నుండి విముక్తి కోసం నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో క్యాబ్‌లు ఏర్పాటు చేసి అవసరమైనవారికి, ముఖ్యంగా పేద వర్గాలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనే ఆలోచన ఉంది. ఇది కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుంది.
- మంచాల జానేందర్ గుప్తా

- మధుకర్ వైద్యుల, సెల్: 91827 77409

239
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles