అర్ధరాత్రి తోటమాలులు


Sun,March 10, 2019 12:38 AM

Ardharatri-Thotamali
పాపం వాల్టర్ అనుకుంది. ఆ పోటీకి అతనా కథని పంపి ఉంటే తప్పకుండా గెలిచి ఉండేవాడు అని బహుమతి పొందిన కథలని చదివాక అనుకుంది. అతను ఆ కథలో రచించిన హత్యాపథకం భయంకరమైంది, తెలివైందే ఐనా, చాలా సింపుల్ కూడా. దాన్ని గురించి తను ఎవరికీ చెప్పలేనందుకు ఆమెకి కొద్దిగా బాధగా ఉంది. భవిష్యత్‌లో దాన్ని మరో సారి ఉపయోగించే అవసరం రావచ్చనుకుని ఆ భాగం మాత్రం దాచుకుంది.

ఇది ఈ వారంలో మూడో అర్ధరాత్రి తోటమాలి. ప్రింటవుట్ ప్రతిని అవుట్ ట్రేలో పడేస్తూ వాల్టర్ చెప్పాడు.
అతని సెక్రటరీ ఎడా సన్నగా నవ్వింది. అతని మాటలు అమెకి అర్థం కాలేదు కాని ఆ డిటెక్టివ్ కథల పత్రిక ఎడిటర్, రచయితలు పంపే కథల్లోని పాత్రలని ఉద్దేశించి ఆ మాట అన్నాడని మాత్రం ఆమెకి అర్థమైంది. అనేక సార్లు ఆయన అర్ధరాత్రి తోటమాలి అనే మాటని ఉపయోగించడం ఆమె విన్నది.
నాకేమైనా అపాయింట్‌మెంట్స్ ఉన్నాయా? ఏ రచయితైనా వస్తానని ఫోన్ చేసాడా? అతను ఆమెని అడిగాడు. ఆమె అపాయింట్‌మెంట్స్ పుస్తకాన్ని తెరచి చూసి తల అడ్డంగా ఊపింది. ఐతే మనం ఆఫీస్ మూసేసి హాయిగా కాలం గడుపుదాం. కొత్తగా తెరిచిన ఓ బిస్ట్రో నాకు తెలుసు. వాల్టర్ సూచించాడు.
బల్ల మీది ఫోన్ మోగింది. ఎడ్నా రిసీవర్ అందుకొని మాట్లాడాక, బయటకి మాటలు వినపడకుండా పెదాలు స్పష్టంగా కదుపుతూ చెప్పింది.
మీ భార్య.
అతను రిసీవర్ అందుకుని చెప్పాడు.
హలో డియర్... అవును. బిజీగా ఉన్నాను... లేదు. ఇంటికి ఎప్పుడు వస్తానో చెప్పలేను. బహుశ ఆలస్యం కావచ్చు. వాల్టర్ రిసీవర్ పెట్టేసి ఎడ్నా వంక చూసి కన్ను కొట్టాడు.
ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్లో లంచ్ చేసాక టేక్సీలో ఆమె అపార్ట్‌మెంట్ కి వెళ్ళాలని ప్రతిపాదించాడు. ఎప్పటిలా ఆమె దాన్ని నిరాకరించలేదు.

మర్నాడు వాల్టర్‌ని క్లబ్‌లో అతని లాయర్ మిత్రుడు రెగ్గీ నవ్వుతూ అడిగాడు. వృత్తిపరమైన నీ అభిప్రాయం ఒకటి కావాలి.
దేని గురించి?
హత్య విషయంలో మోడప్ ఆపరెండీ గురించి. డిటెక్టివ్ కథల పత్రిక ఎడిటర్‌గా నీకు దాని గురించి బాగా తెలిసి ఉంటుంది. లాయర్ నవ్వుతూ అడిగాడు.
ఓ లాయర్ కన్నానా? అసలా ప్రశ్న దేనికి? వాల్టర్ అడిగాడు.
చాలామంది భార్యా హంతకులు నిజ జీవితంలో సాధు స్వభావులు. ఆట్టే ప్రాముఖ్యం లేని మనుషులు. వాళ్ళు బేంక్ క్లర్క్లు, ప్రభుత్వంలోనో ప్రైవేట్ సంస్థల్లోనో చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, వెయిటర్లు... ఇలాంటి వాళ్ళే. వాళ్ళు చాలా సంవత్సరాలు నిశ్శబ్దంగా భార్యతో బాధింపబడ్డాక ఓ రోజు వాళ్ళల్లో ఏదో జరుగుతుంది. దాంతో వాళ్ళు తమ భార్యని చంపి కేబేజీ మడిలో పాతిపెడతారు. సాధారణంగా అదీ అర్ధరాత్రిళ్ళు. అందుకే వాళ్ళని నేను అర్ధరాత్రి తోటమాలులు అంటూంటాను. పోలీసులు వాళ్ళని పది క్షణాల్లో పట్టుకుంటారు.

వాల్టర్ గ్లాస్లోని విస్కీ తాగుతూ మిత్రుడు చెప్పేది వింటున్నాడు. ఇతర మిత్రులు కూడా.
కాని నీ పత్రికల్లో వచ్చే కథల్లో హంతకులు ఇలాంటి వాళ్ళు కారు. వాళ్ళు అతి మేధావులు. ఎన్నో వింత పథకాలు వేసి, చంపి దాదాపు చివరి దాకా తప్పించుకుంటారు. చివర్లో తెలివైన ప్రైవేట్ డిటెక్టివో లేదా పోలీస్ ఆఫీసరో జరిగింది గ్రహించే దాకా. మీ డిటెక్టివ్ సాహిత్యంలో తప్పించుకునే హంతకుడు అనే వాడే ఉండడు. ప్రతీ నేరస్థుడూ పట్టుబడే వాడే. కాని నిజ జీవితంలో అంత తెలివిగా చంపగలిగితే వాడు ఎన్నటికీ పట్టుపడడు.
రెగ్గీ చెప్పింది వాల్టర్ కొద్ది సేపు ఆలోచించాడు. తర్వాత అడిగాడు. సాహిత్యం వినోదం కోసమని నీకు తెలీదా? కాసేపాగి రెగ్గీ చెప్పాడు..
ఏయ్ మిత్రమా! నాకో ఆలోచన వచ్చింది. సరైన హత్య అనే కథల పోటీని నిర్వహించు. నియమాలు సింపుల్. సైకో హంతకులు ఉండకూడదు. భావోద్వేగాలతో అప్పటికప్పుడు పొడిచి కాని, ఆత్మ రక్షణకి కాని చంపకూడదు. ముందుగా పథకం వేసుకుని హత్య చేయాలి. హత్యకి కారణం హేతుబద్ధమైందై ఉండాలి. పోలీసులు కూడా ఛేదించలేని విధంగా ఆ హత్యాపథకం ఉండాలి. వాళ్ళు దాన్ని ఋజువు చేయలేనిదై ఉండాలి.
బావుంది. కాని హత్యకి కారణం హేతుబద్ధమై ఉండాలి అన్నావు. అది నాకు అర్ధం కాలేదు. వివరించు. వాల్టర్ కోరాడు. చిన్నప్పుడు మా అమ్మ నన్ను నిర్లక్ష్యం చేసిందని ఆమె వయసు, ఆ పేరు గల వాళ్ళని చంపడం కూడదు. లేదా ఓ డాలర్ కోసం చంపడం లాంటిది కూడా. రెగ్గీ వివరించాడు.

వాల్టర్ భార్య జేన్ తన భర్తతో చెప్పింది. మీరు విశ్రాంతి తీసుకుంటూండాలి. ఈ మధ్య ఇంటికి కూడా పనిని తెచ్చి రాత్రి ఎక్కువ సేపు మేలుకుని పని చేస్తున్నారు.
వాల్టర్ చిన్నగా మూలిగాడు. కథల పోటీని ప్రకటించాక చాలా కథలు వస్తున్నాయి కాని అంతదాకా అతను చదివిన ఏ కథలో కూడా పోటీలో ప్రధానాంశంగా సూచించిన సరైన, హంతకుడు పట్టుబడని హత్యాపథకం లేదు. అధిక స్లీపింగ్ పిల్స్, బాత్ టబ్లో ఎలక్ట్రిక్ షాక్, విషం... ఇలాంటివే.
ఆ సంగతి తన భార్య జేన్‌కి చెప్పాడు. ఐస్‌తో చేసిన కత్తితో పొడిచి చంపితే తర్వాత అది నీరై కారిపోయి హత్యాయుధం దొరకదు. ఆమె సూచించింది. ఇది చాలా పాత ట్రిక్కే జేన్‌కి డిటెక్టివ్ కథల మీద అభిరుచి లేదు. డాక్టర్, నర్సుల మధ్య జరిగే ప్రణయ కథలనే చదువుతూంటుంది. మీరే అలాంటిది ఒకటి ఎందుకు రాయకూడదూ? అకస్మాత్తుగా అడిగింది. నేనా? అతను కొద్దిగా తెల్లబోతూ అడిగాడు.
అవును. మీరే. మీకు అన్ని రకాల హత్యాపథకాలు తెలుసు. ఆ పాండిత్యంతో ఆలోచిస్తే మీరే ఓ కొత్త పథకాన్ని కనిపెట్టగలరని అనుకుంటున్నాను. ఐదు వేల డాలర్లు మీరే గెలుచుకోవచ్చు.
కాని నేను ఆ పోటీలో పాల్గొనకూడదు. నా పేరుతో రాయండి. కలం పేర్లని అనుమతిస్తారు కదా? మా కంపెనీ ఉద్యోగస్థులు కాని, వారి సమీప బంధువులు కాని అందులో పాల్గొనకూడదనే నియమం ఉంది. అప్పుడు నా చెల్లెలు పేరు మీద పంపండి. జేన్ సూచించింది. అది అనైతికం. వాల్టర్ నిరసించాడు.

మంచి కథని రాసి మీ పాఠకులకి అందించడం అనైతికమా? ముఖ్యంగా మీ రచయితలు అలాంటి కథని అందించలేనప్పుడు.
దాని గురించి ఆలోచించే కొద్దీ వాల్టర్‌కి ఆ ఆలోచన నచ్చసాగింది. అతనికి హత్యలు జరిగే అన్ని విధానాలు, వాటి పథకాలు తెలుసు. సౌత్ అమెరికా, ఆఫ్రికాల్లోని పిగ్మీలు తయారు చేసే విరుగుడు లేని విషాల నించి టైం బాంబులని ఎలా అమర్చాలి? కారుకు బ్రేకులు పడకుండా ఏ స్క్రూలని వదులు చేయాలి? వంట గదిలోని భద్రమైన దినుసులని అధికంగా వాడి ఎలా విషంలా పని చేయించచ్చు. లాంటి ఎంతో సమాచారం తెలుసు. తనే ఓ కథ రాయడం బహుశ అనైతికం కాదు అనిపించసాగింది. అది పాఠకులకి ఉపకారం, సేవ చేయడమే అవుతుంది. రెగ్గీని జడ్జీల పేనల్లో ఉంచితే తన కథకో ఓటు పడేలా కోరచ్చు అనుకున్నాడు. అతను ఆ కథలోని పథకం గురించి తనకి తెలిసిన సమాచారమంతా క్రోడీకరించి తీవ్రంగా ఆలోచించాడు.
ఆ రాత్రి అతను చాలాసేపు నిద్ర పోలేదు. కంప్యూటర్ ముందు కూర్చుని, సమయం పట్టించుకోకుండా కథని టైప్ చేయసాగాడు. తెల్లారుఝామున మూడుం పావుకి ది ఎండ్ టైప్ చేసాక దాన్ని ఓసారి చదివి, అందులోని తప్పులన్నింటినీ దిద్దాక తన భార్య చెల్లెలి పేరు, ఓ కలం పేరుని టైప్ చేసి ఈమెయిల్ చేయడానికి సిద్ధం చేసాడు. మర్నాడు మరోసారి చదువుకుని పంపాలని అనుకున్నాడు.

క్లబ్‌లోని వాల్టర్ మిత్రులు అతని గురించి మాట్లాడుకోసాగారు. వాల్టర్‌కి ఏమైంది? ఆరోగ్యంగా ఉన్నాడు. నాలుగు నెలల క్రితం ఏన్యువల్ చెకప్‌లో అతని ఆరోగ్యం సరిగ్గా ఉందని డాక్టర్ నిర్ధారించాడు. మరి?
అతని భార్య జేన్ ఆ ఉదయం అతను టీ తాగడానికి లేవకపోవడంతో వెళ్ళి లేపింది. అతను పక్కలోంచి లేవకపోవడంతో డాక్టర్‌కి ఫోన్ చేసింది. తను నమ్మలేకపోయినా అది హార్ట్ ఎటాక్ అని, అరుదుగా ఇలా ఆరోగ్యవంతులకి కూడా హార్ట్ ఎటాక్ వస్తుందని డాక్టర్ చెప్పాడు.
అవును. పోయాడని డాక్టర్ చెప్పే దాకా ఆమెకి కూడా తెలీదు. వాల్టర్! హార్ట్ ఎటాక్ వస్తుందని మనలో ఎవరైనా ఊహించామా?
అంతా అనుకోవడం హార్ట్ ఎటాక్ అని. కాని అతను ఏ కారణంగా మరణించాడన్నది మాత్రం గోప్యంగానే ఉండిపోతుంది. కాని పోస్ట్ మార్టం చేసిన పోలీస్ డాక్టర్ అది సహజ మరణమనే చెప్పాడు కదా?
అతని భార్య చెప్పిందిగా, ఆ రాత్రి అతను తెల్లారుఝాము దాకా మేలుకుని కంప్యూటర్లో ఏదో పని చేసుకుంటున్నాడని, తను బాత్‌రూంకి వెళ్ళడానికి లేచినప్పుడు చూసానని. అధిక పని కూడా విషంలా గుండె మీద పని చేస్తుంది. అది ఆమెకి గొప్ప షాక్. రెగ్గీ బాధగా చెప్పాడు.

జేన్ సన్ డెక్ మీది ఓ ఈజీ చైయిర్లో చేతిలో కాక్‌టైల్ గ్లాస్‌తో ఎండలో సన్ బేతింగ్ చేస్తూ బికినీలో పడుకుని ఉంది.
భర్త మరణించిన చోటి నించి కొన్ని వారాలు దూరంగా వెళ్ళమని అప్పుడే డిప్రెషన్ తగ్గుతుందని ఆమెకి డాక్టర్ సలహా ఇచ్చాడు. దాంతో ఆమె మెడిటరేనియన్ క్రూజ్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నది.
వాల్టర్ ధనవంతుడు కాదు. డిటెక్టివ్ కథల మాసపత్రిక ఎడిటర్‌గా పెద్దగా సంపాదించే ఉద్యోగం కాదు. కాని అతని లైఫ్ ఇన్సూరెన్స్, వంశపారంపర్యంగా వచ్చిన ఆ ఇంటి అమ్మకం వల్ల జేన్‌కి చాలా డబ్బొచ్చింది.
తన భర్త సెక్రటరీ ఎడ్నా గురించి తెలుసుకున్న కొత్తల్లో జేన్ చాలా బాధ పడింది. కాని రాజీ పడటం నేర్చుకుంది. యువకుడైన ఇటాలియన్ స్టివార్డ్ జిన్ ఆమె దగ్గరకి వచ్చి అడిగాడు. ఇంకో కాక్‌టైల్ మేడం?
అతను కొద్ది రోజులుగా క్రూజ్ మొత్తానికీ ఒంటరిగా వచ్చిన జేన్‌తో సరసాలాడుతున్నాడు. ఓ మగాడు తనని స్త్రీగా గుర్తించడం అంటే ఎలా ఉంటుందో ఆమె ఎప్పుడో మర్చిపోయింది.
జినో.. నా కేబిన్‌కి ఓ షాంపేన్ బాటిల్‌ని తీసుకురా. కోరింది. అలాగే మేడం. రెండు షాంపేన్ గ్లాసులు కూడా తీసుకురా. వెంటనే తెస్తాను సైనోరా. అతను ఆనందంగా నవ్వుతూ చెప్పాడు.
ఆమె హేండ్ బేగ్‌లోంచి వాల్టర్ రాసిన ఏకైక కథ ప్రింటౌట్‌ని తీసింది. దాన్ని ముక్కలుగా చింపి లేచి డెక్ మీంచి ఆ ముక్కలని సముద్రంలోకి పడేసింది.
పాపం వాల్టర్ అనుకుంది. ఆ పోటీకి అతనా కథని పంపి ఉంటే తప్పకుండా గెలిచి ఉండేవాడు అని బహుమతి పొందిన కథలని చదివాక అనుకుంది. అతను ఆ కథలో రచించిన హత్యాపథకం భయంకరమైంది, తెలివైందే ఐనా, చాలా సింపుల్ కూడా. దాన్ని గురించి తను ఎవరికీ చెప్పలేనందుకు ఆమెకి కొద్దిగా బాధగా ఉంది. భవిష్యత్‌లో దాన్ని మరో సారి ఉపయోగించే అవసరం రావచ్చనుకుని ఆ భాగం మాత్రం దాచుకుంది.
(టోనీ విల్ మాంట్ కథకి స్వేచ్ఛానువాదం)

- మల్లాది వెంకట కృష్ణమూర్తి

812
Tags

More News

VIRAL NEWS