స్నేహం-ద్రోహం


Sun,March 10, 2019 12:34 AM

Kaki-and-pitta
స్నేహం, ప్రేమ నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి నమ్మకం కలిగిందంటే ప్రాణం పెట్టేంత సాహసానికి ఆస్కారం ఉంటుంది. నమ్మకమనేది స్నేహమనే బంధానికి జీవితాలను అంకితం చేస్తుంది. జీవితం చాలా విలువైంది. స్నేహం దాని విలువనూ, మాధుర్యాన్నీ పెంచేదై ఉండాలి గానీ జీవితమంతా బాధనీ,మోసం ద్వారా తగిలిన గాయాన్నీ భరించేదికాదు. కానీ లోకంలో గొర్రె కసాయి వాడినే నమ్ముతుందనీ, వాడి స్నేహ స్పర్శను నిజమనుకొని జీవితాన్నే బలిచేస్తుందని అనుభవం చెబుతూనే ఉన్నా స్నేహం మనిషిని కాదు మనసును విశ్వసిస్తుంది. కానీ ఆ మనసే లేని మనుషులను నమ్మకద్రోహంలోకి నెట్టేస్తుంది. స్నేహాన్ని అవిశ్వసనీయతకు రూపంగా మార్చడమంటే జీవితాలను అగాధంలోకి నెట్టివేయడమే. విశ్వాస పాత్రత లేని స్నేహాలను దూరంగా ఉంచడమనే జాగరూకత ఈ కథలో వ్యక్తమవుతుంది.

కాకి ఆ అడవి నుంచి మరో అడవికి వెళ్ళి పోయిందని, తన కుటుంబంతో సంతోషంగా బతుకుతుందని తెలుసుకున్న పిచ్చుక తన స్నేహితుడు బాగున్నందుకు సంతోషించింది.

ఒక అందమైన అడవి. అక్కడ ఎన్నో దట్టమైన చెట్లు. వాట్లిపై చాలా రకాల పక్షి జాతులు తమ జీవనం సాగిస్తున్నాయి. ఒక రోజు అడవి ప్రక్కనే ఉన్న గ్రామం నుంచి జీవితం విలువ తెలుసుకుందామని, లోకరీతి నేర్చుకుందామని ఇక చిన్న పిచ్చుక తన తల్లిదండ్రులనూ, తోబుట్టువులనూ వదిలి అడవికి వచ్చింది. పిచ్చుకకు అభిమానం, తెలివి, మంచితనం, అమాయకత్వం.... అన్నీ ఉన్నాయి. అడవి పరిస్థితులనూ, పరిసరా లనూ, సంపదనూ చాలా తొందరగానే అర్థం చేసుకుంది. ప్రపంచాన్నే అర్థం చేసుకునేంత తెలివున్న పిచ్చుకకు సాటి జీవితాలను అర్థం చేసుకోలేనంత అమాయకత్వం లేదు. కానీ నమ్మకాన్ని స్నేహంగా మలుచుకోవద్దననేది మాత్రం తెలియదు పాపం. అలా మనసులో కల్మషం లేని పిచ్చుకుకు ఒకరోజు కాకుల గుంపు ఒకటి పరిచయం అయింది. ఆ కాకుల గుంపులోని ఒక కాకిలోని చలాకీతనం, మాటకారితనం పిచ్చుకను ఆకర్షించాయి. పిచ్చుక కాకి స్నేహానికి అంకితమైపోయింది.

అడవిలోని మిగతా పక్షులు ఆ కాకి మంచిది కాదని, అవసరానికి స్నేహాన్ని ఎరవేసి ఎందరినో మోసం చేసిందని చెప్పినా, పిచ్చుక, నా స్నేహం పట్ల నాకు విశ్వాసముందని చెప్పేది. కాకే లోకంగా బతుకుతూ వచ్చింది పిచ్చుక. ప్రతి రోజూ పొద్దున లేచింది మొదలు, రాత్రి నిద్రపోయేదాకా కాకితో మాట్లాడందే, కాకి ధ్యాస లేనిదే గడిచేది కాదు పిచ్చుకకు. కొంతకాలం గడిచిన తర్వాత తల్లిదండ్రులను కలిసి వద్దామని వెళ్లిన పిచ్చుకకు అడవిలోని కాకి ధ్యాసే తప్ప తనూ, తనవారూ అనే పట్టింపే లేకుండా పోయింది. అడవికి తిరిగి వచ్చాక కూడా తన స్నేహితుడైన కాకి కోసం ఏం చేయాలా అనే ఆలోచనతో కాకికి ఇష్టమైన పండ్లూ, కాకికి అవసరమైన పుల్లలూ ఇలా ప్రతీదీ ఎంతో ఇష్టంగా చేసేది పిచ్చుక. తన స్వార్థం మానుకొని కాకి స్నేహానికి ఒకరకంగా బానిసై పోయింది పిచ్చుక. తిండీ, నిద్ర మాని కాకి ధ్యాసే తనకు. పిచ్చుక స్నేహం కాకికి దొరకడం చాలా అదృష్టం అని అడవిలోని పక్షులు అనుకుంటుంటే, కాకి స్నేహితుడిగా తనకు లభించడం అదృష్టమనుకొంది పిచ్చుక. ఒకరోజు కాకుల గుంపు ఎక్కడికో వెళుతున్నట్లు అడవి అడవంతా చెప్పుకో సాగింది. పిచ్చుక స్నేహితుడైన కాకి వచ్చి పిచ్చుకతో నువ్వూ మాతో రా! అనే సరికి ఎక్కడికీ, ఎందుకూ అని అడగకుండానే బయలుదేరి వెళ్ళింది పిచ్చుక.

కాకుల గుంపు అడవి పక్కనే ఉన్న ఊర్లోని ఒక పొలంపైన వాలి పంటను ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక ఏం చేయాలో తెలియక అటూ, ఇటూ తిరుగుతూ, ఎగురుతూ ఉంది. ఇంతలో ఆ పొలానికి చెందిన రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి తాడుతో కాకులను తరమడం మొదలు పెట్టారు. వందల సంఖ్యలో ఉన్న ఆ కాకుల గుంపుకు అదేమీ కొత్తకాదు. కాబట్టి రైతులు వినియోగించిన తాడునుంచి తప్పించుకొని కాకులన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. పిచ్చుక కాలికి ఆ తాడు ముడిపడడంతో రైతుకు దొరికిపోయింది. నా తప్పేమీ లేదు. ఈ గుంపుతో నాకు సంబంధం లేదు. అందులో ఒక కాకి నా స్నేహితుడు. పాపం తను నాకోసం వస్తాడని ఎగిరిపోకుండా ఇక్కడే ఉండిపోయాను. దయచేసి నన్ను క్షమించండని రైతులను అర్థిస్తుంది పిచ్చుక. రైతులు పంట పాడైపోయిందనే కోపంతో పిచ్చుక కాలికున్న తాడును విప్పి,దానిని నేలకేసి కొట్టి వెళ్ళిపోయారు. పిచ్చుక శరీరానికి తగిలిన గాయాలు కొంతకాలానికి మానిపోయాయి. కానీ తన స్నేహితుడైన కాకి తాను బతికి ఉన్నానా? లేదా? అని తెలుసుకోవడానికైనా రాలేదనే బాధ. తాను పెంచుకున్న నమ్మకం వమ్మైందనే ఆలోచన పిచ్చుక మనసును చాలా గాయపరిచింది. కాకి ఆ అడవి నుంచి మరో అడవికి వెళ్ళి పోయిందని, తన కుటుంబంతో సంతోషంగా బ్రతుకుతుందని తెలుసుకున్న పిచ్చుక తన స్నేహితుడు బాగున్నందుకు సంతోషించింది. కానీ తన మనసును మాత్రం గాయపరిచి, తన నమ్మకాన్ని స్నేహం పేరుతో బలి చేసిన కాకి జ్ఞాపకాలతో నింపేసి నిర్లిప్తతతో అనాసక్తితో ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. కాకి మారిపోయినా, మోసం చేసినా తనుచేసిన స్నేహం మరపు రానిదని నిశ్చయించుకొని నిబ్బరంగా బతుకుతుంది పిచ్చుక.

- ఇట్టేడు అర్కనందనా దేవి

246
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles