కార్తవీర్యార్జునుడు


Sun,March 10, 2019 12:31 AM

namavachakam
జీవితం మనిషికి అన్నీ ఇస్తుంది. ఇచ్చిన దాంతో తృప్తి పడే గుణం, ఉన్న దాంట్లో నలుగురికీ ఇవ్వగల విశాలతత్వం మనిషి అలవర్చుకోవాలేగానీ, అందరికన్నా నేనే గొప్పగా బతకాలనే కాంక్ష, అన్నీ నాకే కావాలనే ఆశ మనిషిలో నాటుకుపోతే మాత్రం జీవితం అల్లకల్లోలం అవ్వక తప్పదు. అటువంటి ఆలోచనలకు ఒక్కోసారి జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి వస్తుంది. మనిషిలోని బలం బలహీనతకు ఊతమివ్వాలి. మనిషికున్న హోదా ప్రపంచానికి సాయం అవ్వాలి. అంతేకానీ అహంకారానికి తావివ్వకూడదు. అహంకారం మనిషిలోని వివేకాన్ని, విజ్ఞతనూ, మొత్తంగా జీవితాన్ని నశింపచేస్తుంది. చరిత్ర గుణపాఠంగా చెప్పిన చాలామంది జీవితచరిత్రలు ఇందుకు భిన్నం కాదు. అందులో ఒక జీవితగాథే కార్తవీర్యార్జునుడిది. కార్తవీర్యుని జీవితం చాలా మంది జీవితాలను అస్తవ్యస్తం చేసింది. బలం-భయం ఈ రెండింటి మధ్య నలిగిన చరిత్ర కార్తవీర్యార్జునుడిది.

హైహయ వంశానికి చెందిన రాజు కార్తవీర్యార్జునుడు. ఇతను కృతవీర్యుని వారసుడు. వదాన్యుడు, విద్యా పారంగతుడు, ప్రజాదరణ పొందిన ఆరుగురు గొప్ప చక్రవర్తుల్లో ఒకడూ అయిన కార్తవీర్యార్జునుని భార్య మనోరమ. ఇతని రాజ్యం మహీష్మతీపురం. ప్రతి యుద్ధంలో గెలుపునూ, యుద్ధాలనుగెలిచేందుకు వేయి భాహువులనూ వరంగా పొంది, పద్దెనిమిది దీవులను జయించిన ఏకఛత్రాధిపత్యం కార్తవీర్యుని ఘనతగా చరిత్రలో నిలిచిపోయింది.

కార్తవీర్యుడు ఒకనాడు సకుటుంబంతో, మంత్రిగణంతో, మహా సైన్యంతో అడవికి వేటకని వెళతాడు. సాయంకాలం దాకా వేటాడి అడవిలో సరదాగా గడిపి తిరిగి వస్తుండగా హోరుగాలి, కుండపోత వర్షం ఒక్కసారిగా మొదలవుతుంది. ఆ రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కార్తవీర్యుని పరివారమంతా ఎలాగోలా గడిపారు. తెల్లవారుతూనే వాన బీభత్సం తగ్గింది. దాంతో పట్టణానికి ప్రయాణమవుతుంటే జమదగ్ని ఆశ్రమం మార్గమధ్యంలో కనిపించడంతో అందరూ చాలా సంతోషించారు. కానీ కార్తవీర్యుడు జమదగ్నితో తనకు ఆ కామధేనువు కావాలని అడుగుతాడు. మహాచక్రవర్తులైన మీరు మాలాంటి వారికి ఇచ్చేవారు కావాలిగానీ, మా దగ్గరున్నది అడగడం భావ్యం కాదంటాడు జమదగ్ని.

కార్తవీర్యార్జునుడు తన భుజ బలం పట్ల ఉన్న గర్వంతో జమదగ్నితో యుద్ధానికి తలపడి తప్పు చేస్తాడు. జమదగ్ని తన కామధేనువు సహాయంతో కార్తవీర్యుని మహా సైన్యాన్ని మూర్ఛపోయేట్లు చేస్తాడు. కార్తవీర్యునికి జమదగ్ని ఎన్నో విధాలుగా సర్ధిచెప్పాడు. ఎందరు చెప్పినా వినక జమదగ్నిపై ఇరవై సార్లు యుద్ధం ప్రకటిస్తాడు. ఇరవై ఒకటోసారి జమదగ్ని శిరస్సును ఖండించి తన పగను చల్లార్చుకుంటాడు.
జమదగ్ని చనిపోగానే కామధేనువు ఇంద్రుని దగ్గరకి వెళ్ళిపోయింది. తనకి కావాలనుకున్నది ఇంత శ్రమపడిన తర్వాత కూడా దక్కలేదని రగిలిపోయాడు కార్తవీర్యార్జునుడు.
అగ్ని ఒకసారి తనకు ఆహారం కావాలని కార్తవీర్యుని దగ్గరకు వచ్చినప్పుడు గిరినగరారణ్యం తినేయమని అంటాడు. అగ్ని భక్షణ అంటే కార్చిచ్చే కాబట్టి అడవంతా మాడిమసై పోయింది. ఆ అడవిలో ఉన్న మైత్రావరుణుని ఆశ్రమం కూడా కాలిపోయింది. దాంతో పరశురాముడు రాబోయే కాలంలో నీ వెయ్యు బాహువులనూ నరుకుతాడని శపిస్తాడు కార్తవీర్యార్జునుని మైత్రావరుణుడు. పరశురాముడు మైత్రవరుణుని శాపం వల్లనో గానీ కార్తవీర్యుని ఇరవై ఒక్కసార్లు యుద్ధానికి పిలిచి, చివరికి హతమార్చాడు. కార్తవీర్యుని ఆశకు అతని కుటుంబమంతా బలైంది. అతని కారణంగా పరశురాముడు భూమిపై ఇరవై ఒక్కసార్లూ దండెత్తినందు వల్ల ఎంతో మంది క్షత్రియ రాజులూ మరణించారు.

పరశురాముని చేతిలో చావు తప్పదని తెలిసిన తర్వాత, తను దేనికోసం అయితే ఇంతదాకా తెచ్చుకున్నాడో ఆ కామధేనువూ దక్కలేదు. పైగా ఇప్పుడు పరశురాముని క్షమించమని అడిగి అభిమానాన్ని చంపుకోలేనని నిశ్చయించుకొని యుద్ధమే మేలని నమ్మి జీవితాన్ని ముగించిన కార్తవీర్యుని మూర్ఖత్వంతో కూడిన ఒక చిన్న సంఘటన జీవితాలను తలక్రిందులు చేస్తుందనే విషయానికి నిదర్శనం. కార్తవీర్యుని మొండిపట్టుకు దీనిని పరాకాష్టగా చెప్పాలి.

పరశురాముని చేతిలో చావు తప్పదని తెలిసిన తర్వాత, తను దేనికోసం అయితే ఇంతదాకా తెచ్చుకున్నాడో ఆ కామధేనువూ దక్కలేదు. పైగా ఇప్పుడు పరశురాముని క్షమించమని అడిగి అభిమానాన్ని చంపుకోలేనని నిశ్చయించుకొని యుద్ధమే మేలని నమ్మి జీవితాన్ని ముగించిన కార్తవీర్యుని మూర్ఖత్వం ఒక చిన్న సంఘటన జీవితాలను తలక్రిందులు చేస్తుందనే విషయానికి నిదర్శనం. కార్తవీర్యుని మొండి పట్టుకు దీనిని పరాకాష్టగా చెప్పాలి.

- ప్రమద్వర

317
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles