భక్తుల పాలిట కొంగు బంగారం కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి


Sun,March 10, 2019 12:27 AM

Temple
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు శ్రీమహావిష్ణువు ఆయా యుగాలలో దశావతారాలు ఎత్తాడు. వాటిలో మత్స్యావతారం ఒకటి. బ్రహ్మదేవుని వేదాలను అపహరించిన రాక్షసుని నుండి వాటిని రక్షించడానికి విష్ణువు మత్స్యావతారిగా మారి రాక్షసున్ని సంహరించి దుష్టశిక్షణ గావిస్తాడు. అలాంటి అవతారంతో స్వామి స్వయంభూవుగా వెలసిందే శ్రీమత్స్యగిరీంద్రస్వామి ఆలయం. ఏకశిలా కొండపై వెలసిన ఈ ఎంతో అరుదైంది.

ఎక్కడ ఉంది? : ఈ ఆలయం కరీంనగర్ నుండి 30, హన్మకొండ నుండి 40 కి.మీ.ల దూరంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో ప్రదాన రహదారికి ఆనుకొని కొండపై ఉంది.
Temple3
ఎలా వెళ్లాలి? : కరీంనగర్ చేరుకుని అక్కడి నుండి వరంగల్ హన్మకొండ వెళ్లే బస్సు కొత్తగట్టులో దిగొచ్చు. కాజీపేటలో ట్రైన్‌లో చేరుకుంటే వయా హుజురాబాద్‌మీదుగా కరీంనగర్ లేదా నిజామాబాద్ వెళ్లే బస్సులో
Temple2

ఆలయ చరిత్ర

పూర్వం సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున గల కొత్తగట్టు కొండపై ఉన్న కోనేటిలో దాయగా, చతురాణనుడు (బ్రహ్మదేవుడు) ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుని శరణు వేడగా, ఆయన కొలనులోని సొరంగంలో వేదాధ్యయనం చేస్తున్న సోమకాసురున్ని మత్స్యావతారంలో వెళ్లి సంహరించి వేదాలను సురక్షితంగా బ్రహ్మ దేవుడికి అందించాడని, తిరిగి బ్రహ్మ సజావుగా పాలన సాగించాడని ఒక పురాణ ప్రతీతి. అక్కడి నుండి 13వ శతాబ్దానికి వస్తే కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు, రుద్రమదేవితో కొత్తగట్టు గుండా వెళుతూ చీకటి పడడంతో ఇక్కడి కొండపై విశ్రమించగా, స్వామి కలలోకి వచ్చి ఇక్కడ తాను వెలిశానని, తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించాడని, దీంతో రుద్రమదేవి గణపతిదేవున్ని వెంటనే ఆలయం నిర్మించాలని కోరగా గణపతిదేవుడు ఆలయ నిర్మించాడని కొండపై ఉన్న ఒక శిలాశాసనం వల్ల అవగతమవుతున్నది. అయితే ఆలయ నిర్మాణం పూర్తిగాక ముందే కాకతీయుల సామ్రాజ్యం అంతరించగా, ఇక్కడ యజ్ఞయాగాదులు నిర్వహించే మహర్షులు స్వామి ఆలయాన్ని పూర్తి చేసినట్లు చెబుతారు. ఇక్కడి ఆలయ నిర్మాణంలో కాకతీయుల కాలం నాటి శిల్పకళా రీతులు గోచరిస్తాయి. అప్పటి నుండి ఇక్కడ శ్రీమన్నారాయణుడు దక్షిణ భారతంలోనే ఏకైక స్వయంభూ మత్స్యావతార రూపంలో భక్తులతో పూజలందుకొంటున్నట్లు పండితులు చెబుతారు. ఇక్కడి స్వామిని దర్శించుకొంటే కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. భక్తితో కొలిస్తే కష్టాలను తీర్చే స్వామిగా పేరుంది. జ్ఞానాన్ని అందించి, చపల చిత్తాన్ని తొలగించి, సంతానం కలిగిస్తాడని పూజాధికాలు నిర్వహిస్తున్న అర్చకులు వివరిస్తారు.

దర్పణంలో మత్స్యావతార దర్శనం

శ్రీమహా విష్ణువు దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారాన్ని భక్తులు ఇక్కడ నేరుగా చూడలేరు. ఆలయం లోపల కుడివైపున ఉన్న ఒక గుహలో వెలసిన చేప ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. ముందుభాగంలో స్వామితో పాటు శ్రీనీల, భూనీల విగ్రహాలు ఇరుపక్కల నయనానందకరంగా దర్శనం ఇస్తాయి. ఈ ఆలయం రాతి శిలలతో నిర్మితమైంది. స్వామి వారికి కుడివైపు ఉన్న మరో గుహలో భారీ ఆకారంలో ఉన్న ఉగ్ర నరసింహస్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. ఈయనే ఈ కొండకు క్షేత్ర పాలకుడు. ఈ ఆలయానికి ఉత్తర దిశలో శివాలయం, ఆ పక్కనే వీరాంజనేయస్వామి ఆలయం, కాళీమాతతో పాటు నవగ్రహాలు కలిగిన ఉపాలయాలు కూడా ఉన్నాయి. మరోపక్క చక్కని కళ్యాణ మంటపం కూడా కొండపై ఉంది. ఆలయం నిత్యం భక్తుల సందడితో అలరారుతుంటుంది. పండితులు ప్రతీ ధనుర్మాసంలో విశేష పూజలు నిర్వహిస్తారు.
Temple4

కోనేటి స్నానంతో వ్యాధులు మాయం

గుట్టపై ఆలయానికి తూర్పు భాగంలో నిత్యం నీటితో ఉండే ఈ కోనేరులో శ్రీమన్నారాయణుడు సూక్ష్మ రూపంలో ఉంటాడని భక్తుల నమ్మకం. ఇందులో స్నానం చేస్తే చర్మ వాధులతోపాటు పలు రుగ్మతలూ పోతాయని భక్తుల విశ్వాసం.

బ్రహ్మోత్సవాలు

మత్స్యగిరీంద్రునికి ప్రతి ఏడాది పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రథసప్తమి నుండి అధ్యయనోత్సవాలు, స్వామివారి కళ్యాణం, పౌర్ణమి జాతర, నాకబలి నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలలో భాగంగా నిత్యం సుప్రభాతం, మేలుకొలుపు, నిత్యారాధన, బాలభోగములు, ద్రావిడ ప్రబందం, విష్ణు సహస్రనామ పారాయణం, తీర్థప్రసాద వితరణ క్రతువులు నిర్వహిస్తారు. మత్స్యగిరీంద్రస్వామి వారికి భూదేవి, నీలాదేవితో జరిగే కళ్యాణ మహోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. ఎదుర్కోళ్లలో భాగంగా ధ్వజస్తంభం వద్ద వేద పండితులు విసిరే గరుడ ముద్దలను భక్తులు పోటీ పడతారు.

- గోపు శ్రీనివాసరెడ్డి
నమస్తే తెలంగాణ, శంకరపట్నం

951
Tags

More News

VIRAL NEWS