వాస్తు


Sun,March 10, 2019 01:39 AM

vasthu

పడమర షాపు పెట్టి తూర్పు వైపు ఇల్లు కట్టుకోవచ్చా?

ఎస్.వి. నీలకంఠం, యాదగిరి గుట్ట
తప్పకుండా కట్టుకోవచ్చు. ఇల్లు, షాపు కలిసి వ్యాపారం చేయడం మన దేశంలో అనేక చోట్ల ఉంది. అయితే ఏ దిశ వీధి ఉందో దానిని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ ఇంటికి పశ్చిమ వాయవ్యంలో షాపు వేసుకొని దానిలో నుంచే ఇంటిలోకి నడక సాగించవచ్చు. కానీ పశ్చిమ నైరుతిలో షాపు చేయవద్దు. పడమర మధ్యలో షాపు వేసుకున్నా ఇబ్బంది లేదు కానీ, ఆ షాపులో నుంచి ఇంటి లోపలికి దారి పెట్టుకోవద్దు. అలా పడమర మధ్య షాపు ఉంటే.. బయటి నుంచి షాపును వాడాలి. అప్పుడు కుటుంబ జీవనం బాగా నడుస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ప్లాను చేసుకొని కట్టుకోండి.

మా ఇంటి దక్షణంలో మున్సిపల్ రోడ్డు కాదుకానీ. తాత్కాలిక రోడ్డుపోటు వస్తుంది. అది బాధిస్తుందా?

వై. లక్ష్మణ్, పోచమ్మ మైదానం, వరంగల్
పల్లెటూర్లో పక్క స్థలం ఖాళీగా ఉంటే దగ్గరగా ఉంటుందని తాత్కాలిక దారులు చేసుకొని నడుస్తుంటారు. అవి స్థిరంగా ఉండేవి కాకపోయినా వీధులుగా అందరితో ఉపయోగించబడతాయి. అయితే ఇవి యేండ్లుగా వాడబడుతూ ఉంటాయి కాబట్టి.. వాటికి తప్పకుండా ఫలితాలు ఉంటాయి. సర్కారు రోడ్డు కాకపోయినా అది అందరూ వాడుతున్నారు కాబట్టి దానిని తొలగించే మార్గం చూడాలి. ఎలాగూ అది పర్మినెంట్ రోడ్డు కాదు కాబట్టి ఆ స్థలానికి రాళ్లు అడ్డంగా నాటగలిగితే.. లేదా ఫెన్సింగ్ వేయగలిగితే నడక ఆగుతుంది. తర్వాత దాని చెడు ఫలితం తొలిగిపోవచ్చు. అశ్రద్ధ చేయకండి.

మేము దక్షిణం ముఖంగా షాపు కట్టాలంటే ఏ నియమాలు పాటించాలి? అసలు దక్షిణం షాపు పెట్టొచ్చా?

మారెడ్డి కిషన్‌రెడ్డి, దిల్‌సుఖ్‌నగర్
దేశంలో దక్షిణ ముఖంగా వ్యాపార సంబంధమైన అధికార సంబంధమైన గృహ సంబంధ నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. అది గొప్పగా సాగుతూ ఉన్నాయి. అది దిశను బట్టి కాదు వాటి నిర్మాణ విధానాన్ని బట్టి. నిర్మాణం బాగలేకపోతే ఏ దిశకైనా సాగవు. మీరు నిరభ్యంతరంగా దక్షిణ ముఖం షాపు కట్టుకోండి. ఆ షాపు రోడ్డు ఫేస్‌ను బట్టి దాని కొలతలో సగభాగం గ్లాస్‌తో మూయండి. ఆ షాపునకు దక్షిణ ఆగ్నేయంలో రాకపోకల ద్వారం విశాలంగా పెట్టండి. దక్షిణ నైరుతిలో తూర్పు ముఖంగా కూర్చునే విధంగా అరుగు వేసుకొని గానీ, కుర్చీ వేసుకొనిగానీ వ్యాపారం చేయండి. మీ కుడిచేతి వైపు గల్లాపెట్టె ఉండే విధంగా అమర్చుకోండి. దక్షిణం షాపులో వాయవ్యం, ఈశాన్యం ఆగ్నేయాలలో కూర్చొని వ్యాపారం చేయవద్దు.

వేయి దీపాలుంటే వాస్తు ఉండదంటారు. నిజమా?

అష్టలక్ష్మి బాయి, భూపాలపల్లి
మన పెద్దల మాటల్లో వాస్తవం ఉంటుంది. కానీ దానిని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. అనేక గృహాలు నిర్మించినచోట అందరూ వాస్తు పాటించే ఉంటారు కాబట్టి ఆ ప్రదేశంలో వాస్తుకు ఉండే స్థలాలు ఉంటాయనే ఉద్దేశం ఉంటుంది. ఇదంతా ఒకనాటి సమిష్టి సంప్రదాయ నిర్మాణ పద్ధతి పాటించేకాలం నాటి మాట. నేడు అనేకులు అనేక రకాల గృహాలు తీరొక్క విధంగా కడుతున్నారు. అంతేకాదు, భూములు అస్తవ్యస్తంగా ఉన్నా అనేక ఇండ్లు నిర్మాణమవుతున్నాయి. ఇంటి నిర్మాణం ఇవాళ వ్యక్తిగతం. తినే వంటకు ఎన్ని రుచులో కట్టే ఇంటికి అన్ని రూపాలు. వాస్తు పాటించడం, పాటించకపోవడం అన్నది చట్టం కాదు కదా. ఎవరికో నష్టమని కాదు. ఎందరికో ఇష్టమని కాదు.. ఎక్కే వాహనం ఏదైనా అది కండీషన్‌గా ఉండాలి అనేది ముఖ్యం. ఎవరి డ్రైవింగ్‌ను బట్టి వారివారి జీవితాలు లక్ష్యాన్ని చేరుతాయి.

vasthu1
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

195
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles