నారీ భారతం


Sun,March 3, 2019 03:45 AM

ఆమె.. సృష్టికే ఓ కానుక..ఆమె శక్తి.. అపారం..ఆమె యుక్తి.. అమూల్యం..ఆమె.. ఓ ప్రేరణ.. ఆమె.. ఓ లాలన..ఆకాశమంత ఓపికకు ఆమె నిండు నిదర్శనం.. ఆమె లేకుంటే.. ఈ సృష్టి లేదు.. గమ్యం లేదు.. గమనం లేదు.. జీవం లేదు.. జీవితమే లేదు..ఆమె లేకుంటే.. అంతా శూన్యం.. అందుకే ఆమెకు శతకోటి వందనాలు..మార్చి8న మహిళా దినోత్సవం సందర్భంగా.. శుభాకాంక్షలతో..
COVER
చెమట చిందించే శ్రమజీవిగా, ఇల్లు చక్కదిద్దే గృహిణిగా, అప్పజెప్పిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేసే ఉద్యోగిగా, ప్రజల ఆలనాపాలనా చూసుకుంటూ వారిని కంటికి రెప్పలా, కన్నబిడ్డలా కాపాడుకునే ప్రజా ప్రతినిధిగా ఆమె అడుగుపెట్టిన ప్రతీ రంగంలో ఓ చరిత్ర సృష్టించింది. అవకాశాలు రాకపోయినా.. అవమానాలు ఎదురైనా ఏనాడూ ఆమె తన ప్రయాణాన్ని ఆపలేదు. ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురుచూడలేదు. మానసికంగా, శారీరకంగా పురుషుడి కంటే ఎక్కువ కష్టపడేది మహిళ మాత్రమే అనే సత్యం ఈ ప్రపంచానికి తెలుసు. ఈ సృష్టికి మూలం స్త్రీ. పడతి లేకపోతే ఈ ప్రపంచమే లేదు. అవకాశం వచ్చినా రాకపోయినా.. చరిత్ర పుస్తకంలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకొని, ముద్రించుకునే తెగువ, తెలివి, శక్తి ఉన్న ధీశాలి మహిళ. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా చరిత్రలో నిలిచిపోయిన కొందరు అసాధారణ మహిళల పరిచయంతో ఈ వారం బతుకమ్మ ముఖచిత్ర కథనం..

పసితనం నుంచే పోరాటం మొదలుపెట్టి వివక్షత అనే నదిలో హక్కుల కోసం ఈదుతూ గర్జించే శక్తిశాలి మహిళ. ఆకాశంలో సగం అనే మాట ఏదో పేరుకే కాదు.. దాన్ని నిజం చేసి చూపిస్తామన్న తెగువ, చూపించగల సత్తా ఉంది వారికి. అందుకే.. తమకు నచ్చిన రంగంలో తమదైన శైలిలో విజయ దుందుభి మోగించారు. వంటగదికే అంకితం చేద్దామని చూస్తే.. అంతరిక్షంలో అడుగు పెట్టారు. వాకిలి దాటొద్దని అంక్షలు పెడితే.. వాగ్ధాటితో రాజకీయ ప్రకంపనం సృష్టించారు. ఆర్థిక ఇబ్బందులు అడుగడుగునా వేధిస్తుంటే.. వాటిని కాళ్లకింద తొక్కి పట్టి ఆర్థిక స్వావలంబన సాధించారు. ప్రపంచాన్నే నడుపగల శక్తితో సైనిక శిబిరాల్లో శత్రుమూకలను చెండాడుతున్నారు. తమ శక్తి సామర్థ్యాలతో సకల రంగాల్లో విజయఢంకా మోగిస్తున్నారు.

snehaparthibaraja

స్నేహ పార్థిబరాజ

కులం లేదు.. మతం లేదు..
తొమ్మిదేండ్లు కులమతాలతో సంబంధం లేకుండా ఒక సర్టిఫికెట్ కోసం పోరాడి విజయం సాధించింది తమిళనాడుకు చెందిన స్నేహ పార్థిబరాజ. న్యాయవాదిగా పనిచేస్తున్న స్నేహకు కులం, మతం అంటే పట్టింపు లేదు. చిన్నప్పటి నుంచి కూడా ఏ దరఖాస్తు ఫారంలో కుల ప్రస్తావన కాలం నింపలేదు. పైగా 2010 నుంచి ఏ కులం, మతం లేని ధృవపత్రం కోసం పోరాటం మొదలుపెట్టింది. ప్రభుత్వమే స్వయంగా ఆ పత్రం జారీ చేయాలని పోరాడింది. తొమ్మిదేండ్లలో ప్రతీ ఏడాది ప్రభుత్వ అధికారులకు దరఖాస్తులు పెట్టుకుంది. కానీ ఏ అధికారి కూడా కులం, మతం లేని ధృవపత్రం ఇవ్వలేదు. రెండేండ్ల క్రితం మరోసారి అధికారులకు దరఖాస్తు పెట్టుకుంది. ఫిబ్రవరి 5న అధికారులు ఆమె దరఖాస్తును పరిశీలించి నో క్యాస్ట్, నో రిలీజియన్ ధృవపత్రాన్ని జారీ చేశారు. ఇలాంటి ధృవపత్రాన్ని పొందిన తొలి భారత మహిళగా స్నేహ చరిత్రలోకెక్కారు.

chahvi-rajwathh

చాహ్వి రాజ్‌వత్

ఎంబీఏ.. సర్పంచ్‌
రాజస్థాన్‌లోని జైపూర్‌కు అరవై కిలోమీటర్ల దూరంలో గల సోడ అనే ఊరికి చాహ్వి రాజ్‌వత్ సర్పంచ్. ఎంబీఏ చదివి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచిన తొలి భారత మహిళ ఈమె. ఉన్నత చదువులు చదివి, మంచి జీతం ఉన్న ఉద్యోగం వదిలి సర్పంచ్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న వారిని ఎంతోమందిని మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ.. చాహ్వి దేశంలోనే ఉన్నత చదువులు చదివి, కార్పొరేట్ ఉద్యోగం వదిలి సర్పంచ్‌గా బరిలోకి దిగి గెలిచి నిలిచిన తొలి మహిళ. ఎన్నో స్థానిక పథకాలు రచించి గ్రామ పంచాయితీ పాలన ఎంత ఆదర్శంగా ఉండాలో చూపించింది. నీటి పొదుపు, మరుగుదొడ్లు, రోడ్లు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, మొక్కల పెంపకం ఇలా ఎన్నో అంశాల్లో చాహ్వి చేసిన పనులు చరిత్రలో నిలిచిపోయాయి. గ్రామ అభివృద్ధి కోసం స్వయంగా ఎన్నో ప్రాజెక్టులు రూపొందించి సోడా గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దింది. చాహ్వి సేవకు అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు లభించింది.యంగ్ ఇండియన్ లీడర్ అవార్డు కూడా ఆమెకు దక్కింది.

himadas

హిమదాస్

చాంపిమన్‌
రైతు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో అసమాన ప్రతిభ ప్రదర్శించి ఇటు పుట్టినగడ్డకు, అటు తల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చిన యువతి హిమదాస్. 18 సంవత్సరాల వయసులో ఐఏఏఎఫ్ అండర్ 20 చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. 400 మీటర్ల ఫెడరేషన్ కప్పు గెలిచి కామన్‌వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. ఇంత ప్రతిభ ఉన్న హిమదాస్ ఏండ్లకేండ్లు కఠోర సాధన చేసిందా? అంటే అదేం లేదు. పోటీల్లో పాల్గొనే కంటే సంవత్సరం ముందు మాత్రమే ప్రాక్టీస్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది. అండర్ 20 వరల్డ్ రన్నింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది హిమదాస్.

shanti-tigga

శాంతి టిగ్గా

పురుషులకు ధీటుగా
ఈమె సాధారణ మహిళ కాదు. తొలి మహిళా జవాన్‌గా చరిత్రలోకెక్కిన వీరవనిత శాంతి టిగ్గా. 35 సంవత్సరాల వయసులో ఇద్దరు పిల్లలను వదిలి సైన్యంలో చేరింది. సైన్యం ఎంపికలో జరిగే అర్హత పరీక్షల్లో పురుషుల కంటే ధీటుగా పాల్గొన్నది. యాభై మీటర్ల పరుగుపందెంలో కేవలం 12 సెకన్లలోనే పూర్తి చేసింది. ఒకటిన్నర పరుగుపందెం కూడా పురుషుల కంటే ముందే పూర్తి చేసింది. తుపాకీ పట్టడంలో శాంతి సిద్ధహస్తురాలు. శిక్షణలో బెస్ట్ ట్రైనీ అవార్డు అందుకుంది. అసలు తన కంటే ముందు ఈ రంగాలలో మహిళలు ఉన్నట్టు ఆమెకు తెలియనే తెలియదు.

Sita-Sahu

సీతా సాహు

పేదింటి రత్నం
పదిహేనేండ్ల వయసులోనే ఈ దేశపు కీర్తిని ప్రపంచ యవనిక మీద ఎలుగెత్తి చాటింది సీతా సాహు. 2011 ఏథెన్స్ స్పెషల్ ఒలింపిక్స్‌లో 200 మీటర్లు, 400 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకం సాధించింది. పేదింటిలో పుట్టిన సీత ప్రతిభ చూసిన ప్రభుత్వం ఆమెకు లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించింది. కానీ.. ఇప్పటికీ అందలేదు. అయినా.. సీత తన పరుగు ఆపలేదు. కుటుంబం గడువడానికి కష్టంగా ఉన్నా పగలంతా పానీపూరి అమ్మి, ఉదయం, సాయంత్రం పరుగు ప్రాక్టీస్ చేస్తున్నది. 2013లో ఎన్టీపీసీ సీత కటుంబానికి ఆరు లక్షల విలువ చేసే బహుమతి ఇచ్చింది.

harshini-kenkar

హర్షిణి కన్హేకర్

ఫైర్ ఫైటర్‌
దేశపు తొలి ఫైర్‌ఫైటర్‌గా హర్షిణి చరిత్ర సృష్టించింది. ఇదే పేరుతో ఆమెకు ఫైటర్ అవార్డు కూడా దక్కింది. 2006లో గుజరాత్‌లోని మెహ్‌సనా ఫైర్ స్టేషన్‌లో ఫైరింజన్ డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరింది. నేషనల్ ఫైర్ సర్వీస్‌లో తొలి మహిళగా హర్షిని రికార్డు సృష్టించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో కేవలం 30 సీట్లు మాత్రమే ఉండే పరీక్షలో అర్హత సాధించింది.

BONOBOS
gita-gopinath

గీతా గోపినాథ్

-దేశం నుంచి రెండో వ్యక్తి..
హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గీతా గోపీనాథ్ ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితురాలైంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులను అంచనా వేసే ప్రముఖమైన ఐఎంఎఫ్‌కి సారథ్యం వహించడం అనేది మామూలు విషయం కాదు. ప్రపంచ ఆర్థికవేత్తల జాబితాలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న గీతా గోపినాథ్ కలకత్తాలో పుట్టింది. ఐఎంఎఫ్‌కి చీఫ్ ఎకనామిస్టుగా చేసిన వ్యక్తుల్లో ఈమె రెండోవ్యక్తి. గీత కంటే ముందు ఆ స్థానాన్ని మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అలంకరించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో శాశ్వత ఆర్థికవేత్తగా సభ్యత్వం కలిగిన వారిలో మూడో మహిళ, రెండో ఇండియన్‌గా గీతా గోపినాథ్ చరిత్ర సృష్టించారు. ఆమె కేరళ ముఖ్యమంత్రికి అధికారిక ఆర్థిక సలహాదారుగా, న్యూయార్క్ ఫెడరల్ రిజర్వు బ్యాంకు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. దేశ ఆర్థిక స్థితిగతుల మీద గీత ఎన్నో వ్యాసాలు కూడా రాశారు.

priya-semwal

ప్రియా సెమ్వాల్

-ఇదే నా భర్తకు నేనిచ్చే గౌరవం
సైన్యంలో ప్రాణాలు కోల్పోయిన భర్త ఆశయాన్ని కొనసాగించడానికి సైన్యంలో చేరింది ప్రియా సెమ్వాల్. భర్త నాయక్ అమిత్‌శర్మ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో దేశానికి సేవలందిస్తున్న సైనికుడు. ఆయన పదో తరగతి వరకే చదువుకున్నాడు. ప్రియా డిగ్రీలో ఉన్నప్పుడు వీరి వివాహం అయింది. పెండ్లి తర్వాత కూడా ప్రియాను చదివించాడు. భర్త ప్రోత్సాహంతో ప్రియా ఎంఎస్సీ పూర్తి చేసింది. వారి ప్రేమకు గుర్తుగా ఓ పాప పుట్టింది. ఆమె పెరుగుతుండగానే అమిత్ శర్మ ఓ పోరాటంలో ప్రాణాలు విడిచాడు. ఆయన లేని లోటును, చాలారోజులు మౌనంగా, ఒంటరిగా భరించింది ప్రియ. ఆ తర్వాత సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంది. తన నిర్ణయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. అందరికీ అర్థమయ్యేలా వివరించింది. ఇప్పుడు ఆర్మీలో ఆమె భర్త విధులు నిర్వహించిన లెఫ్టినెంట్ హోదాలో ఉన్నదామె. విధి నిర్వహణే నేను నా భర్తకు ఇచ్చే గౌరవం, ప్రేమ, ప్రతిఫలం అంటున్నది ప్రియా సెమ్వాల్.

Shila-Dawre

షీలా దౌరే

-మగవారే నడపాలా?
దేశంలో మొట్టమొదటిసారిగా ఆటో నడిపిన తొలి మహిళ ఈమె. ఆటోడ్రైవర్ అంటే దాదాపు మగవారే ఉంటారు. ఆటో డ్రైవర్ పేరు చెబితే జనాల్లో ఒకరకమైన అభిప్రాయం ఉన్న రోజుల్లో ఆటో స్టీరింగ్ పట్టింది షీలా దౌరే. కుటుంబ ఆర్థిక పరిస్థితులను గట్టెక్కించడానికి ఆటో డ్రైవర్‌గా మారింది. 1988 కాలంలో పూణేలో ఆటో నడిపి కుటుంబాన్ని పోషించింది. ఆ తరువాత కాలంలో ఓ అకాడమీ స్థాపించి ఆటో నడుపాలనుకుంటున్న మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నది. ఆటోలు కేవలం మగవారే నడపాలా? ఆడవారు నడపొద్దా? మేం కూడా అన్నీ పనులు చేయగలం అంటున్నది షీలా దౌరే.

roshini

రోషిణి శర్మ

-ఒంటరిగా తిరగడం కష్టమా?
పదహారు సంవత్సరాల వయసులోనే బైక్ హ్యాండిల్ చేపట్టి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చుట్టేసింది. ఇష్టంతో నేర్చుకున్న బైక్ డ్రైవింగ్ ఒక దశలో ఆమెకు ఫ్యాషన్‌గా మారింది. దేశాన్ని మొత్తం బైక్ మీద చుట్టేయాలన్న ఆలోచన మిగతా వారికంటే ఆమెను భిన్నంగా నిలబెట్టింది. బెంగళూరులో స్థిరపడ్డ ఇండియాలో మహిళ ఒంటరిగా తిరుగడం కష్టం అనే మాటను అబద్ధంగా తేలుస్తూ.. బైక్ మీద దేశమంతా ఒంటరి ప్రయాణం చేసింది. ఆయా ఊర్లకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు, వసతి, అన్నీ ఆ గ్రామస్తుల సహకారంతోనే తెలుసుకొని యాత్ర చేసింది.bhakthi-sharma

భక్తి శర్మ

-ఐదు సముద్రాలుఈదింది
అంటార్కిటిక్‌ని ఈదిన తొలి ఆసియా మహిళ భక్తి శర్మ. రెండున్నర కిలోమీటర్లు కేవలం 41 నిమిషాల 14 సెకన్లలో ఈది రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఈ భూమ్మీద గల ఐదు మహాసముద్రాలు ఈదిన ఘనత భక్తిశర్మకే దక్కుతుంది. రాజస్థాన్‌కి చెందిన భక్తిశర్మ రెండేండ్ల వయసు నుంచే ఈతలో సాధన చేసింది. 14 సంవత్సరాల వయసులో 16 కిలోమీటర్లు సముద్రాన్ని ఈది ఔరా అనిపించింది. భక్తి ప్రతిభకు ఎన్నో బహుమతులు ఆమె పాదాక్రాంతం అయ్యాయి. ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రతలో గడ్డకట్టిన అంటార్కిటికా నది ఈది ప్రపంచ రికార్డు సృష్టించింది.

pu

ఈ ఏడాది ప్రత్యేకం..

ప్రతీ ఏడాది నిర్ణయించినట్టే ఈ ఏడాది కూడా వుమెన్స్ డే కోసం ఓ థీమ్‌ని రూపొందించింది ఇంటర్నేషనల్ వుమెన్స్ డే అనేసంస్థ. బెటర్ ద బ్యాలెన్స్.. బెటర్ ద వరల్డ్.. బ్యాలెన్స్ ఫర్ బెటర్ అనే థీమ్ ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం నిర్ణయించారు. అందరం కలిసి మంచిని బ్యాలెన్స్ చేద్దాం.. మంచి ప్రపంచానికి స్వాగతం పలుకుదాం అనే థీమ్‌తో ఈ మహిళా దినోత్సవం నాడు సందేశమివ్వనున్నారు. లింగవివక్ష లేని సమానత్వ ప్రపంచాన్ని చూద్దాం అంటూ నినదించనున్నారు.

మాతృస్వామ్య వ్యవస్థలో మానవ జీవితాలు ఎలా ఉన్నాయో గమనిస్తే స్త్రీ శక్తి, సామర్థ్యం ఏంటో అర్థమవుతాయి. క్రమంగా ఆ సమాజంలోంచి పక్కకు జరిగి పితృస్వామ్య వ్యవస్థలోకి వచ్చాం. దాని ఫలితంగా మహిళ అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నది. అవకాశాలు కోల్పోయింది. రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల్లో ఆమె ప్రమేయాన్ని కోల్పోయింది. ఇప్పుడు కాలం మారింది.. ఎవరో అవకాశాలు ఇస్తారని స్త్రీ ఎదురుచూడడం లేదు. అవకాశాలు సృష్టించుకుంటూ ముందుకు సాగిపోతున్నది. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేలా తమ ప్రతిభను సాన పడుతున్నది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కేవలం మహిళకే సొంతం. ఆ నిర్ణయాత్మక శక్తిని ఇప్పుడు తన కోసం వాడుకుంటున్నది. వ్యక్తిగతంగా, సామూహికంగా తన నైపుణ్య సామర్థ్యాలను పెంచుకొని ప్రపంచపు అవతలి తీరాల వైపు పరుగులు తీస్తున్నది.మహిళ ఒక చైతన్య దీప్తి

ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది..పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతుంది.. ఓ సావిత్రిబాయి ఫూలేలా.ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు, అత్యాచారాలు ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయింది.. ఓ నిర్భయలా.స్త్రీ ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కానీ తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగగలదు..ఎందరికో స్ఫూర్తినివ్వగలదు.. సునితా విలియమ్స్‌లా.అడది అబల కాదు.. సబల అని నిరూపించింది..తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది..మన మువ్వన్నెల జెండాను ముజ్జగాలు చూసేలా ఎగురవేసింది.. పీవీ సింధూలా.స్త్రీ నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికీ స్ఫూర్తిదాయకమూర్తిలా నిలుస్తుంది..దేశద్రోహాన్ని, దాడులను ఖండిస్తుంది.. ఓ మలాలాలా.ఆడదంటే అమ్మతనం మాత్రమే కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకొనే గొప్పతనం.ఆ గొప్పతనాన్ని ఆచరణలో చూపించి.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్ థెరిస్సాలా.స్త్రీని పూచించే చోట..స్త్రీని గౌరవించే చోట..
స్త్రీ రక్షించబడిన చోట.. ప్రతిరోజూ మహిళా దినోత్సవమే.
- సరిత, నిర్మల్shutterstock
-ప్రవీణ్‌కుమార్ సుంకరి,
సెల్: 9701557412

1115
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles