విజయాలతో నింగికి - అవమానాలతో నేలకు మైఖేల్ జాక్సన్


Sun,March 3, 2019 03:30 AM

అంతర్జాతీయ పాప్ సంగీత గాయక కిరీటి, పాప్ పాశ్చాత్య మ్యూజిక్ రారాజుగా, ఖండాతరాలను సమ్మోహితపరిచాడు మైఖేల్ జాక్సన్. 50వ ఏట లాస్ ఏంజల్స్‌లో డ్రగ్స్ వ్యసనపరుడైన మైఖేల్ ఊపిరి ఆగిన హృద్రోగ మరణం, ప్రపంచ వ్యాప్తం గా ఉన్న అశేష సంగీత కళాభిమానులకు తీరని విషాద దుర్ఘటన అయింది. జాక్సన్ మరణంపై ఆ దశాబ్దిలో ఎన్నో అనుమా నాలు, ఆరోపణలు, న్యాయ సంబంధిత వివాదాలు ఏర్పడ్డాయి. ఏది ఏమైనా ప్రొపొఫోల్ అనే నిద్రమత్తు డ్రగ్‌కు బానిసై ఆ విశ్వవిఖ్యాత కళాకారుని జీవితం అర్థాంతరంగా ముగిసింది. పాప్‌సంగీతంతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా జీవిత చరమాంకంలో అనేక సమస్యల సుడిగుండంలో చిక్కుకుని కనుమూయడం విషాదమైతే, ఆయన చివరిపేజీ నిండా సంచలనాలే.
michael-jackson1

కాలిఫోర్నియాలోని విలాసవంతమైన మైఖేల్ నివాసం నెవెర్లాండ్ రాంచ్

పాప్ ప్రపంచపు రారాజు మైఖేల్ జాక్సన్ తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ జన్యుపరమైన రుగ్మత ముదిరితే ప్రాణాలకే ప్రమాదమన్నారు వైద్యులు. మైఖేల్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, మాట్లాడే పరిస్థితిలో కూడా లేరని చెప్పారు. ఆయన ఎడమ కన్ను చూపు 95 శాతం పోయిందని తెలిపారు. వెంటనే ఊపిరితిత్తిని మార్చాలి. అయితే ఆపరేషనుకు ఆయన శరీరం సహకరించడం లేదు. చాలా బలహీనంగా ఉన్నారు అని కూడా పేర్కొన్నారు. దీంతోపాటు ఎంఫిసెమా, పేగుల్లో రక్తస్రావంతో బాధపడుతున్నారని చెప్పారు. వీటి వల్ల వ్యాధి మరింత ముదిరింది. పేగుల్లో రక్తస్రావమే అన్నింటికన్నా ప్రమాదకరం. దాన్ని నిరోధించడానికి వైద్యు లు ప్రయత్నిస్తున్నా, పూర్తిస్థాయిలో విజయవంతమవలేకపోతున్నారు.

ఇది జాక్సన్ ప్రా ణాలు తీయవచ్చు అని ఇయాన్ తెలిపారు. ఎంఫిసెమా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. తద్వారా రోగికి శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది. ధూమపానం చేసేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మైఖేల్ సిగరెట్ తాగరు. జాక్సన్ తరహా పరిస్థితి ఐదు వేలమంది అమెరికన్లలో ఒకరికి మాత్రమే ఎదురవుతుంది. దీనికి చికిత్స చేయడం కష్టమైన పని. ఎందుకంటే అనుబంధంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి అని పేర్కొన్నారు. చాన్నాళ్ల నుంచి ఆయన ఈ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. వ్యాధి ముదరకుండా ఉండేందుకు తన వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు గతంలో పలు చికిత్సలను తీసుకున్నారని తెలిపారు. ఇయాన్ ప్రకటనపై వ్యాఖ్యానించడానికి మైఖేల్ జాక్సన్ అధికార ప్రతినిధి నిరాకరించారు. అయితే జాక్సన్ సోదరుడు జెర్మైన్ మాత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలున్న విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. ఆయన పరిస్థితి ఇప్పుడేం బాగోలేదు. ఇది దురదృష్టకరమైన సమయం అని ఫాక్స్ టీవీ న్యూస్‌తో అన్నారు. పరిస్థితి చూస్తే ప్రాణాపాయం నుంచి బయటపడటం కష్టమని వైద్యులు స్పష్టం చేశారు.

2009 మార్చిలాస్ ఏంజెల్స్ లోగల హాంబీహిల్స్‌లోని ఇల్లు

జాక్సన్ సుదీర్ఘకాలం తర్వాత లండన్‌లో ఏకంగా 50 షోలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణం.. అప్పటికే కోర్టు కేసులతో సర్వం కోల్పోయిన స్థితిలో జాక్సన్ అద్దె ఇంటికి మారాల్సి వచ్చింది. అలాగని అదేం చిన్నగదికాదు. అత్యంత ఖరీదైన ఇల్లది. బ్రిటన్‌లోని విలాసవంతమైన ఈ అద్దె ఇంట్లో ఏడు బెడ్రూంలు, 13 బాత్రూంలు ఉన్నాయట. మైఖేల్ జాక్సన్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆయన కుటుంబసభ్యులు, వైద్యు లు, పత్రికలు వెల్లడించాయి. ఆయనకు చికిత్స చేస్తున్న వైద్య బృందం నుంచి క్లీన్ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన త్వరలో లండన్‌లో మళ్లీ లైవ్ ప్రోగ్రాములు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల వాషింగ్టన్‌లోని ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ సానుకూలమైన ఫలితాలు వెల్లడయ్యాయట. దీంతో జాక్సన్ లైవ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేందుకు వైద్యులు అనుమతిచ్చారట. బహుశా ఆ ఏడాది జాక్సన్ సుమారు 30 మిలియన్ డాలర్ల విలువ చేసే 30 షోలల్లో పాల్గొనే అవకాశం ఉందని పత్రికల సమాచారం.

2009 జూన్ మాసంసన్ ఆన్‌లైన్ పత్రిక ఒక కథనాన్ని వెల్లడించింది.

పాప్ ప్రపంచంలో చక్రవర్తిగా వెలగొందుతున్న సూపర్ స్టార్ మైఖేల్ జాక్సన్‌కు కొత్త ఫోబియా పట్టుకుంది. బరువెక్కుతాననే భయం ఆయన్ని వణికిస్తోంది. అందుకే కొద్ది రోజులుగా ఆయన తిండి తినడం కూడా మానేశారు. స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న మైఖేల్ జాక్సన్ ఇంకెంత మాత్రం ఒళ్లు చేయడానికి ఇష్టపడటంలేదు. ఏమాత్రం లావెక్కినా వ్యాధి మరింత తీవ్రమవుతుందని... క్యాన్సర్‌తో పోరాడే శక్తి తగ్గుతుందని ఆయన భయం. దీంతో తిండి తినడం బాగా తగ్గించాడని సమాచారం. ఇవి గమనించిన వారు జాక్సన్ ఓ మానసిక విశ్లేషకుడిని కలవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. ఇక మైఖేల్ ఇలాగే కంటిన్యూ చేస్తే బాగా బరువు తగ్గి మరింత బలహీనపడుతారని ఆ పత్రిక కథనం.

ఒక్కసారి వెనక్కు వెళితే...

థ్రిల్లర్ ఆల్బమ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాపులర్ స్టార్ అవ్వడంతో వ్యాపార ప్రకటనల్లో విపరీతంగా నటించే అవకాశాలొచ్చాయి. అందులో భాగంగా పెప్సీకోలా వాణిజ్య ప్రకటన చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఊహించని బ్లాస్ట్ జరిగి జాక్సన్ తలపై భాగం కాలిపోయింది. దీంతో కొన్ని నెలల పాటు జాక్సన్ నరకం చూశాడు. పాప్ స్టార్ శకం ముగిసిందని అందరూ కలవర పడ్డారు. జరిగిన పరిణామంతో జాక్సన్ మానసికంగా దెబ్బతిన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కూడగట్టుకుని ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే మంచిదని ఫీలయ్యాడు. ప్లాస్టిక్ సర్జరీ వల్ల కొత్త రూపం వచ్చినప్పటికీ పాత జాక్సన్ దాదాపు కనుమరుగయ్యాడు. సర్జరీ తర్వాత సోదరులతో కలిసి విక్టరీ ఆల్బమ్ రూపొందించాడు. స్టేట్ ఆఫ్ షాక్ జాక్సన్‌తో పాటు మిక్ జగ్గర్ కలిసి వేసిన స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. దీంతో జాక్సన్‌కు పూర్వ వైభవం తిరిగొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతిభకి ప్రమాదం దాసోహమైంది. 1991లో డేంజరస్ ఆల్బమ్‌లోని బ్లాక్ ఆర్ వైట్ వీడియో సాంగ్‌ని చిన్న పిల్లలతో తీశారు. ఆ సమయంలోనే ఆయనపై లైంగికపరమైన వివాదం వచ్చింది.

చిన్నపిల్లలపై అత్యాచారం చేసేవారని పలు మార్లు వార్తలొచ్చాయి. చిన్నపిల్లలను లైంగికంగా వాడుకునే వాడని, ఘోరంగా హింసించే వాడనే అంశాలు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ విస్తు పోయేలా చేశాయి. 2002లో ఓ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు నమోదైంది. పోలీసులు బేడీలు వేసి, రోడ్డుపై నడిపించి తీసుకెళ్ళడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. అప్పట్లో దీనిపై లివింగ్ విత్ మైఖేల్ జాక్సన్ అనే డాక్యుమెంటరీని కూడా రూపొందించారు. 2003 సంవత్సరంలో క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న 13 ఏండ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కూడా జాక్సన్ శిక్ష అనుభవించాడు. 2005లో ఆయనపై ఉన్న అభియోగాలన్నీ తొలగిపోయాయి. తర్వాత పలు కేసుల్లో సంపాదనలో సగం కోర్టు ఖర్చులకే పెట్టాడు. అదే టైమ్‌లో రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి. దీంతో మరోమారు జాక్సన్ మానసికంగా కృంగిపోయాడు. మానసికంగా దెబ్బతినటంతో అత్యధికంగా ఆల్కహాల్, మత్తు పదార్థాలు, నిద్రమాత్రలు తీసుకోవడం మొదలు పెట్టాడు.

2009, జూన్ 25 లాస్ ఏంజెల్స్ లోగల హాంబీహిల్స్‌లోని ఇల్లు

మైఖేల్ జాక్సన్ ఇంటిలో వైద్యులు, కుటుంబసభ్యులు చేస్తున్న హడావుడి స్థానికంగా సంచలనం రేకెత్తించింది. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కానీ పరిస్థితి. కొన్ని నెలలుగా ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అనేక శస్త్రచికిత్సలతో చిక్కిశల్యమైన శరీరం. ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాసతీసుకోవడానికి కూడా కష్టపడుతున్న సందర్భం. అద్దె ఇంటి దగ్గర దాదాపు ముప్పావుగంటపాటు ఆయనకు చికిత్స చేసిన వైద్యులు తప్పనిసరి పరిస్థితిలో హుటాహుటిన యుసిఎల్‌ఎ మెడికల్ సెంటరుకు తరలించారు. డాక్టర్లు ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు.

జాక్సన్ ఇంటివద్దే గుండెపోటుకు గురయ్యాడు. కానీ, అటాప్సీ ఫలితం వచ్చే వరకూ ఆయన చావుకు కారణాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాం అని సోదరుడు జెర్మైన్ తెలియజేశారు. ఇంట్లోనే ఆయన మరణించి ఉంటాడనిపిస్తోంది అని విలేకరులకు చెప్పారు. మధ్యాహ్నం దాదాపు ఒకటింబావుకు జాక్సన్‌ను ఆస్పత్రికి తీసుకురాగానే ఎమర్జెన్సీ డాక్టర్లతో సహా వైద్య బృందం, కార్డియాలజిస్టులు ఆయనను బతికించేందుకు గంటకు పైగా శాయశక్తులా ప్రయత్నించారు అని చెప్పారు. లాస్ ఏంజిల్స్ కౌంటీలో మరణాలపై పరీక్షలు జరిపే ఫ్రెడ్ కొర్రాల్ మధ్యాహ్నం 2.14 గంటలకు జాక్సన్ మరణాన్ని ధ్రువీకరించింది.

2009, జూన్ 26 లాస్ ఏంజెల్స్ అనుమానాలు

మైఖేల్ జాక్సన్ మరణించిన ఒక రోజు అనంతరం ఆయన మృతిపై అనుమానాలు తలెత్తాయి. ఇప్పటికీ మీడియాలో వివిధ రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మరణానికి నార్కోటిక్ మందులతో కుట్ర జరిగిందని కూడా ఆరోపణలు వచ్చాయి. రకరకాల పుకార్లు వ్యాపించాయి. పాప్ కింగ్ మైఖెల్ జాక్సన్ చివరి రోజుల్లో తన ఆప్త మిత్రుడు, జర్మన్ వ్యాపారవేత్త జాకబ్ పెర్కిన్‌కు ఏకంగా 13 లేఖలు రాశాడు. ఈ సంగతి జాకబ్ ఓ ఆస్ట్రేలియన్ చానల్ ఇంటర్వ్యూలో బహిర్గతపరిచాడు. తన మరణానికి ముందు మైఖెల్ తనకు ఏకంగా 13 ఉత్తరాలు రాశాడని అందులో లండన్‌కు చెందిన కచేరి సంస్థ ఏఈజీ తనను విపరీతంగా ఒత్తిడికి గురిచేస్తోందని, వారే నన్ను చంపేస్తారని తనకు భయంగా ఉందని జాకబ్‌తో మైఖెల్ చెప్పాడట..

జాక్సన్ కుటుంబ ప్రతినిధి బ్రియాన్ ఆక్స్మాన్ సిఎన్‌ఎన్ టీవీ చానల్‌తో మాట్లాడుతూ మైఖేల్ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబం ఎప్పుడూ ఆందోళన చెందుతూండేదని తెలిపారు. జూలైలో ఆయన లండన్‌లో వరసగా 50 ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంది. దానికోసం రిహార్సల్స్ చేస్తున్నారు. ఆయన అతికష్టంగా రిహార్సల్స్ చేస్తున్నారు. తనకున్న వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా మందులు వాడడం, గతంలో వెన్నెముకకు సంబంధించిన వ్యాధి రావడం, ఒక ప్రదర్శన సమయంలో వేదిక మీది నుంచి కిందపడి కాలు విరగడం కూడా ఆయన మరణానికి దారితీయవచ్చు అని ఆక్స్మాన్ చెప్పారు.

మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత వైద్యుడు డా. కొన్రాడ్‌ముర్రేకు నెలకు 150,000 డాలర్లు ఇచ్చేటట్టు 2009 నెలలో జాక్సన్‌కు ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం మైఖేల్‌కు మానసకి రుగ్మతల నుండి భయటపడడానికి డా.ముర్రే 25 ఎం.జి. ప్రొపొఫోల్ డ్రగ్స్‌ను ఇచ్చినట్టు అంగీకరించాడు. విపరీత నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా మైఖేల్ హృద్రోగ మరణం సంభవించిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. జాక్సన్ మృతదేహంలో ప్రొపొఫోల్, లొరాజిపమ్, డయాజిసమ్, మిడాజొలమ్, లి డో కైన్, ఎఫిడ్రైన్ వంటి డ్రగ్స్ ఉన్నట్టు వైద్య పరీక్షలు నిర్ధారించాయి. కార్డియాలజిస్ట్ అయిన డా. ముర్రే, జాక్సన్ మరణానికి బాధ్యునిగా ఆరువారాలు లాస్ ఏంజెల్స్ కోర్టు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.
michael-jackson
ప్రపంచంలోనే ఉన్నతమైనవిగా భావించే 13 గ్రామీ అవార్డులు మైఖేల్ అందుకుంటే 8 ఒకే రోజు దక్కడం విశేషం. 1984లో గ్రామీ లివింగ్ లెజెండ్ అవార్డు, గ్రామీ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ పురస్కా రం. 86 బిల్‌బోర్డ్ పురస్కారాలు, 26 అమెరికన్ మ్యూజిక్ అవార్డులు. 31 సార్లు గిన్నీస్ బుక్‌లో స్థానం, అత్యధిక కాపీలు అమ్ముడు పోయిన ఆల్బమ్‌గా థ్రిల్లర్ (65 మిలియన్లు) గిన్నీస్ రికార్డు, 85 ఎంటీవీ అవార్డులు, 8 వరల్డ్ మ్యూజిక్ అవార్డులు మైఖేల్ సొంతం.
-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

1183
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles