మేకులు తీస్తూ.. చెట్లను రక్షిస్తూ


Sun,March 3, 2019 03:20 AM

చెట్లను నాటే ఉద్యమం..చెట్లను కాపాడే ఉద్యమం..ఇలా చెట్ల కోసం, పర్యావరణం కోసం ఎన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.
ఇది కొత్త ఉద్యమం.అదే మేకులు పీకే ఉద్యమం.. మేకుల రహిత చెట్ల ఉద్యమం.

Tree
ఏమవుతావని ఆకాశం నీకు గొడుగై నీడనిస్తుంది. ఏమవుతావని భూతల్లి యదపై నిన్ను మోస్తుంది. ఏమవుతావని నీరు.. నిప్పు.. గాలి.. నీతో బంధం ఏర్పరుచుకున్నాయి. ఏమవుతావని సృష్టి మన మనుగడను కాపాడుతుంది? వనరులివ్వడం ప్రకృతి ధర్మం. దాన్ని కాపాడడం మన బాధ్యత. ఏమి ఆశించుకుండా మనకు ఇంత చేస్తున్న ప్రకృతి కోసం మనమేం చేస్తున్నాం? మంచి చెయ్యకపోయినా ఫర్వాలేదు. చెడు మాత్రం చెయ్యకండి అంటున్నాడు పుణెకు చెందిన మాధవ్. తన కూతురి స్ఫూర్తితో ఉద్యమాన్ని ప్రారంభించి దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. మేకులను తీస్తూ.. చెట్లను రక్షిస్తున్న మాధవ్ ఆలోచన సారాంశమే ఈ కథనం..
చెట్లు నీడనిస్తున్నాయి. వర్షాలనిస్తున్నాయి. పండ్లనిస్తున్నాయి. కలపనిస్తున్నాయి. అవి మనకు అంకితమయ్యాయి. వాటిని ఎలా వాడుకోవాలో మన చేతిలోనే ఉన్నది. ఇన్ని చేస్తున్న చెట్లు హరిగోస పెడుతున్నాయి. మనిషి నైపుణ్యంతో ప్రకృతిని నాశనం చేస్తున్నాడు కానీ అభివృద్ధి చేయడం లేదు. నాలుగు సంవత్సరాల క్రితం తన కూతురు పెంచిన మొక్కను కాపాడలేకపోయాడు మాధవ్. ఇప్పుడు కొన్ని వేల మొక్కలను రక్షించడానికి అడుగు ముందుకేశాడు. అందుకు గర్వపడుతున్నాడు.

ఒక్కడితో ప్రారంభం..

ఈ ఉద్యమం ప్రారంభించడానికి కారణం మాధవ్ కూతురు. ఆరేళ్ల ఆపాప వల్ల తండ్రి స్ఫూర్తిని పొంది మొదలుపెట్టాడు. తన చుట్టూ ఉన్న చెట్లను గమనిస్తున్నాడు. ప్రకటనల కోసం చాలా మంది చెట్లకు ప్లెక్సీలు, బోర్డులు వంటివి మేకులతో కొట్టడం చూశాడు. వాటిని చూసిన ప్రతిసారి కూతురు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మహారాష్ట్రలోని ఇరవై జిల్లాల్లో వీళ్ల సేవలు విస్తరించాయి. వీరు చేస్తున్న మంచి పని గురించి తెలిసి చాలామంది వలంటీర్లుగా పనిచేయడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం 500 మంది వలంటీర్లు ఉన్నారు. మహారాష్ట్రతో పాటు బిహార్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లో చెట్లను పరిరక్షిస్తున్నారు. మొదట్లో చెట్ల దగ్గర నిల్చుని మేకులు తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు బాటసారులు అనుమానంగా చూసేవారు. కొంతమంది మందలించేవారు. మరికొంతమంది ఫిర్యాదు చేసేవాళ్లు. కొత్తలో కొంత ఇబ్బంది పడ్డా మాధవ్ చేస్తున్న పని గురించి తెలిసి ప్రశంసించడం మొదలుపెట్టారు. చెట్లకు కొట్టిన మేకులను తీయడానికి రాళ్లతో కొట్టి కాండాన్ని కొంత నరికి తీయడం వల్ల చెట్లకు మరింత నష్టం వాటిల్లుతుందని తెలుసుకున్నాడు. కటింగ్ ప్లేయర్ ద్వారా మేకులు తీయడం నేర్చుకొని ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నాడు. తన స్నేహితులు నడుపుతున్న ఆంగోలిచీగోలిగ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలను మరింత విస్తరించాలనుకుంటున్నాడు. కరువు పరిస్థితులు పెరుగుతుండటంతో నీటి ఆదా చేసే పద్ధతుల గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు.

మేకుల మ్యూజియం

మేకుల రహిత చెట్ల కోసం వారంలో ఒకరోజు రెండు గంటలపాటు సభ్యులందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఏయే ప్రాంతాల్లో ఎక్కువ చెట్లు ఉన్నాయి? అనే అంశాలను చర్చించి బయలుదేరుతారు. చుట్టు పక్కల ఉన్న కాలనీల్లో, బస్తీల్లో చెట్లకు ఉన్న మేకులను తొలగిస్తారు. ఒక్కసారి ఈ విషయాన్ని అక్కడి లోకల్ మీడియా కవర్ చేసింది. దానికి మంచి స్పందన లభించింది. వివిధ రాష్ట్రాల నుంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కాల్స్ చేసి మెచ్చుకున్నారు. తాము కూడా ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సంఘీభావాన్ని తెలిపారు. భారతదేశంలోనే మొదటిసారి మేకుల రహిత వృక్షాలను తీర్చిదిద్దారు. ఆ చెట్లను చూడడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా ఆహ్వానించారు. మరింతమంది వలంటీర్లను తీసుకొని సేవలను దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నాడు మాధవ్. ప్రజల్లో అవగాహన తీసుకువచ్చి అందరూ పాల్గొనేలా చేయాలనుకుంటున్నాడు. అందుకోసం పాఠశాలలు, కళాశాలలు, ఐటీ సంస్థలకు వెళ్లి వాళ్లకు వివరంగా చెప్పాలనుకుంటున్నాడు. చెట్ల నుంచి తీసిన మేకులను అమ్మకుండా ప్రతిమేకును మాధవ్ తనవద్ద దాచుతున్నాడు. భవిష్యత్తులో జరుగబోయే కార్యక్రమాల్లో ఈ మేకులను చూపించి మ్యూజియం పెట్టాలనుకుంటున్నాడు.

మొదట్లో చెట్ల దగ్గర నిల్చుని మేకులు తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు బాటసారులు అనుమానంగా చూసేవారు. కొంతమంది మందలించేవారు. మరికొంతమంది ఫిర్యాదు చేసేవాళ్లు. కొత్తలో కొంత ఇబ్బంది పడ్డా మాధవ్ చేస్తున్న పని గురించి తెలిసి ప్రశంసించడం మొదలుపెట్టారు.
-అజహర్ షేక్

1104
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles