మహిళ ఒక చైతన్య దీప్తి


Sun,March 3, 2019 01:53 AM

ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది..పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతుంది.. ఓ సావిత్రిబాయి ఫూలేలా.ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు, అత్యాచారాలు ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయింది.. ఓ నిర్భయలా.స్త్రీ ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కానీ తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగగలదు..ఎందరికో స్ఫూర్తినివ్వగలదు.. సునితా విలియమ్స్‌లా.అడది అబల కాదు.. సబల అని నిరూపించింది..తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది..మన మువ్వన్నెల జెండాను ముజ్జగాలు చూసేలా ఎగురవేసింది.. పీవీ సింధూలా.స్త్రీ నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికీ స్ఫూర్తిదాయకమూర్తిలా నిలుస్తుంది..దేశద్రోహాన్ని, దాడులను ఖండిస్తుంది.. ఓ మలాలాలా.ఆడదంటే అమ్మతనం మాత్రమే కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకొనే గొప్పతనం.ఆ గొప్పతనాన్ని ఆచరణలో చూపించి.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్ థెరిస్సాలా.స్త్రీని పూచించే చోట..స్త్రీని గౌరవించే చోట..
స్త్రీ రక్షించబడిన చోట.. ప్రతిరోజూ మహిళా దినోత్సవమే.

- సరిత, నిర్మల్

BONOBOS

గీతా గోపినాథ్


gita-gopinath
హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గీతా గోపీనాథ్ ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితురాలైంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులను అంచనా వేసే ప్రముఖమైన ఐఎంఎఫ్‌కి సారథ్యం వహించడం అనేది మామూలు విషయం కాదు. ప్రపంచ ఆర్థికవేత్తల జాబితాలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న గీతా గోపినాథ్ కలకత్తాలో పుట్టింది. ఐఎంఎఫ్‌కి చీఫ్ ఎకనామిస్టుగా చేసిన వ్యక్తుల్లో ఈమె రెండోవ్యక్తి. గీత కంటే ముందు ఆ స్థానాన్ని మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అలంకరించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో శాశ్వత ఆర్థికవేత్తగా సభ్యత్వం కలిగిన వారిలో మూడో మహిళ, రెండో ఇండియన్‌గా గీతా గోపినాథ్ చరిత్ర సృష్టించారు. ఆమె కేరళ ముఖ్యమంత్రికి అధికారిక ఆర్థిక సలహాదారుగా, న్యూయార్క్ ఫెడరల్ రిజర్వు బ్యాంకు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. దేశ ఆర్థిక స్థితిగతుల మీద గీత ఎన్నో వ్యాసాలు కూడా రాశారు.
-దేశం నుంచి రెండో వ్యక్తి..

ప్రియా సెమ్వాల్


priya-semwal
సైన్యంలో ప్రాణాలు కోల్పోయిన భర్త ఆశయాన్ని కొనసాగించడానికి సైన్యంలో చేరింది ప్రియా సెమ్వాల్. భర్త నాయక్ అమిత్‌శర్మ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో దేశానికి సేవలందిస్తున్న సైనికుడు. ఆయన పదో తరగతి వరకే చదువుకున్నాడు. ప్రియా డిగ్రీలో ఉన్నప్పుడు వీరి వివాహం అయింది. పెండ్లి తర్వాత కూడా ప్రియాను చదివించాడు. భర్త ప్రోత్సాహంతో ప్రియా ఎంఎస్సీ పూర్తి చేసింది. వారి ప్రేమకు గుర్తుగా ఓ పాప పుట్టింది. ఆమె పెరుగుతుండగానే అమిత్ శర్మ ఓ పోరాటంలో ప్రాణాలు విడిచాడు. ఆయన లేని లోటును, చాలారోజులు మౌనంగా, ఒంటరిగా భరించింది ప్రియ. ఆ తర్వాత సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంది. తన నిర్ణయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. అందరికీ అర్థమయ్యేలా వివరించింది. ఇప్పుడు ఆర్మీలో ఆమె భర్త విధులు నిర్వహించిన లెఫ్టినెంట్ హోదాలో ఉన్నదామె. విధి నిర్వహణే నేను నా భర్తకు ఇచ్చే గౌరవం, ప్రేమ, ప్రతిఫలం అంటున్నది ప్రియా సెమ్వాల్.
-ఇదే నా భర్తకు నేనిచ్చే గౌరవం

షీలా దౌరే


Shila-Dawre
దేశంలో మొట్టమొదటిసారిగా ఆటో నడిపిన తొలి మహిళ ఈమె. ఆటోడ్రైవర్ అంటే దాదాపు మగవారే ఉంటారు. ఆటో డ్రైవర్ పేరు చెబితే జనాల్లో ఒకరకమైన అభిప్రాయం ఉన్న రోజుల్లో ఆటో స్టీరింగ్ పట్టింది షీలా దౌరే. కుటుంబ ఆర్థిక పరిస్థితులను గట్టెక్కించడానికి ఆటో డ్రైవర్‌గా మారింది. 1988 కాలంలో పూణేలో ఆటో నడిపి కుటుంబాన్ని పోషించింది. ఆ తరువాత కాలంలో ఓ అకాడమీ స్థాపించి ఆటో నడుపాలనుకుంటున్న మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నది. ఆటోలు కేవలం మగవారే నడపాలా? ఆడవారు నడపొద్దా? మేం కూడా అన్నీ పనులు చేయగలం అంటున్నది షీలా దౌరే.
-మగవారే నడపాలా?

రోషిణి శర్మ


roshini
పదహారు సంవత్సరాల వయసులోనే బైక్ హ్యాండిల్ చేపట్టి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చుట్టేసింది. ఇష్టంతో నేర్చుకున్న బైక్ డ్రైవింగ్ ఒక దశలో ఆమెకు ఫ్యాషన్‌గా మారింది. దేశాన్ని మొత్తం బైక్ మీద చుట్టేయాలన్న ఆలోచన మిగతా వారికంటే ఆమెను భిన్నంగా నిలబెట్టింది. బెంగళూరులో స్థిరపడ్డ ఇండియాలో మహిళ ఒంటరిగా తిరుగడం కష్టం అనే మాటను అబద్ధంగా తేలుస్తూ.. బైక్ మీద దేశమంతా ఒంటరి ప్రయాణం చేసింది. ఆయా ఊర్లకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు, వసతి, అన్నీ ఆ గ్రామస్తుల సహకారంతోనే తెలుసుకొని యాత్ర చేసింది.
-ఒంటరిగా తిరగడం కష్టమా?

భక్తి శర్మ


bhakthi-sharma
అంటార్కిటిక్‌ని ఈదిన తొలి ఆసియా మహిళ భక్తి శర్మ. రెండున్నర కిలోమీటర్లు కేవలం 41 నిమిషాల 14 సెకన్లలో ఈది రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఈ భూమ్మీద గల ఐదు మహాసముద్రాలు ఈదిన ఘనత భక్తిశర్మకే దక్కుతుంది. రాజస్థాన్‌కి చెందిన భక్తిశర్మ రెండేండ్ల వయసు నుంచే ఈతలో సాధన చేసింది. 14 సంవత్సరాల వయసులో 16 కిలోమీటర్లు సముద్రాన్ని ఈది ఔరా అనిపించింది. భక్తి ప్రతిభకు ఎన్నో బహుమతులు ఆమె పాదాక్రాంతం అయ్యాయి. ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రతలో గడ్డకట్టిన అంటార్కిటికా నది ఈది ప్రపంచ రికార్డు సృష్టించింది.
-ఐదు సముద్రాలుఈదింది

ఈ ఏడాది ప్రత్యేకం..


pu
ప్రతీ ఏడాది నిర్ణయించినట్టే ఈ ఏడాది కూడా వుమెన్స్ డే కోసం ఓ థీమ్‌ని రూపొందించింది ఇంటర్నేషనల్ వుమెన్స్ డే అనేసంస్థ. బెటర్ ద బ్యాలెన్స్.. బెటర్ ద వరల్డ్.. బ్యాలెన్స్ ఫర్ బెటర్ అనే థీమ్ ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం నిర్ణయించారు. అందరం కలిసి మంచిని బ్యాలెన్స్ చేద్దాం.. మంచి ప్రపంచానికి స్వాగతం పలుకుదాం అనే థీమ్‌తో ఈ మహిళా దినోత్సవం నాడు సందేశమివ్వనున్నారు. లింగవివక్ష లేని సమానత్వ ప్రపంచాన్ని చూద్దాం అంటూ నినదించనున్నారు.

మాతృస్వామ్య వ్యవస్థలో మానవ జీవితాలు ఎలా ఉన్నాయో గమనిస్తే స్త్రీ శక్తి, సామర్థ్యం ఏంటో అర్థమవుతాయి. క్రమంగా ఆ సమాజంలోంచి పక్కకు జరిగి పితృస్వామ్య వ్యవస్థలోకి వచ్చాం. దాని ఫలితంగా మహిళ అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నది. అవకాశాలు కోల్పోయింది. రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల్లో ఆమె ప్రమేయాన్ని కోల్పోయింది. ఇప్పుడు కాలం మారింది.. ఎవరో అవకాశాలు ఇస్తారని స్త్రీ ఎదురుచూడడం లేదు. అవకాశాలు సృష్టించుకుంటూ ముందుకు సాగిపోతున్నది. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేలా తమ ప్రతిభను సాన పడుతున్నది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కేవలం మహిళకే సొంతం. ఆ నిర్ణయాత్మక శక్తిని ఇప్పుడు తన కోసం వాడుకుంటున్నది. వ్యక్తిగతంగా, సామూహికంగా తన నైపుణ్య సామర్థ్యాలను పెంచుకొని ప్రపంచపు అవతలి తీరాల వైపు పరుగులు తీస్తున్నది.

350
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles