వైశాలి


Sun,March 3, 2019 01:30 AM

సమాజంలో స్త్రీకి గౌరవం, ఆదరణ, విలువ ఉన్నకాలం చరిత్రలో ఉంది. అసలు ఆదరణకే నోచుకోని అవమాన, అనుమాన భరితకాలం కూడా చరిత్రలో ఉంది. స్త్రీకి స్వేచ్ఛనివ్వక ఆమెను నీచదశలోకి నెట్టేస్తే జాతి ఎన్నటికీ బాగుపడదని శాసిస్తుంది వేదం. స్త్రీ వల్లనే కీర్తి గడించిన ఎన్నో కుటుంబాలు, ఎన్నో సమాజాలు, ఎన్నో దేశాలు.. ఆమెను విస్మరించినంత మాత్రాన మరుగున పడిపోయేంత ఆత్మన్యూనత కాదు స్త్రీది. ఆదిపరా శక్తిలా లోకాల్నే ఏలగల ఆత్మవిశ్వాసం, ఆత్మసమామనం స్త్రీ. ప్రేమలు, అభిమానాలు, ఆత్మీయతలు, ఆదర్శాలు, అనురాగాలు, అనుబంధాలు సమాజానికి పరిచయం చేసిందే స్త్రీ. అందుకని ఆడపిల్లనూ, ఆడపిల్లల భావాలనూ తల్లిదండ్రులు ఆమోదించి గౌరవిస్తే, సమాజం దానికి తగ్గట్టుగా మారిపోకతప్పదు.స్త్రీ ఆలోచనలకు ప్రోత్సాహమందిస్తే తాననుకున్నది సాధించ తీరుతుందని నిరూపించింది వైశాలి. చరిత్ర గుర్తించని ఎందరో ఆదర్శ వనితల్లో తానూ ఒకతై తన చరిత్రకు భాష్యం రాసుకుంది వైశాలి.

VAISHALI
విదిశాపురి చక్రవర్తి విశాలరాజు తనయ వైశాలి. ఆత్మవిశ్వాసం, పట్టుదల, అన్ని విద్యల్లోనూ రాణింపు, చెరగని చిరునవ్వు, చమత్కారం, చాతుర్యం, వివేకం, అందం కలగలిసిన పరిపూర్ణ వ్యక్తిత్వం వైశాలిది. రాచరికంలో పెరిగినా జీవితం విలువ తెలిసిన వనితగా, ధైర్యమే ఆలంబనగా బతుకు చిత్రాన్ని గీసుకుందామె. రాజ్యపాలనలో తండ్రికి తగిన సూచనలు, ఇంటి బాధ్యతల్లో తల్లికి చేదోడు అవుతూనే సమాజంతో మమేకమై పెరిగిపెద్దదైంది వైశాలి.

విశాలరాజు వైశాలికి యుక్త వయస్సు రాగానే ఆమె అంగీకారం మేరకు స్వయంవరం ప్రకటిస్తాడు. వివిధ దేశాలకు చెందినవారంతా స్వయం వరానికి వస్తారు. బలాశ్వుడి కొడుకైన అవీక్షిత్తు కూడా వస్తాడు. ఇదివరకే అవీక్షిత్తు గురించి వినిఉండడం, అతని ఆలోచనలూ, బలపరాక్రమాల గురించి తెలిసి ఉండడం, అవీక్షిత్తును చూడగానే తన మనసులో భర్తగా నిశ్చయించుకోవడంతో స్వయం వరం ప్రారంభం కాకముందే, వైశాలి అవీక్షిత్తునే పెళ్ళి చేసుకుంటానని ప్రకటిస్తుంది. అంతమందిలో నిర్భయంగా తనపేరును ప్రకటించే సరికి అవీక్షిత్తు వైశాలిని సభనుంచి తీసుకొచ్చి తన రథంలో కూర్చోబెట్టుకొని తనవిడిది భవనానికి తీసుకెళ్తాడు. విశాలుడు కూడా తన కూతురి ఇష్టాన్ని సమ్మతించి సభలోని మిగతావారందరినీ సముదాయించే ప్రయత్నం చేస్తాడు. కానీ వారంతా తమకు అన్యాయం జరిగిందని భావించి అందరూ ఏకమై ఒక్కసారిగా అవీక్షిత్తుపై యుద్ధం ప్రకటిస్తారు. ఊహించని పరిణామాన్ని అర్థం చేసుకునే లోపే అవీక్షిత్తును ఓడించి, అతన్నీ వైశాలిని సభకు తీసుకొచ్చి విశాలరాజు ముందు నిలబెట్టి స్వయం వరం తిరిగి జరపాలని అంటారు.

వైశాలి మాత్రం అందరితోనూ మీరెవ్వరూ అవీక్షిత్తుకు సాటిరాలేరు. నేను అవీక్షిత్తునే వరిస్తానని అంటుంది. రాజకుమారులంతా తలలు దించుకుంటారు. బలాశ్వుడు తనకొడుకు బందీగా ఉన్నాడని తెలుసుకొని మందీమార్బలంతో వచ్చి అవీక్షిత్తును విడిపిస్తాడు. విశాలరాజు క్షమించమని కోరి తన తనయ వైశాలిని అవీక్షిత్తుకిచ్చి వివాహం చేయాలని కోరతాడు. కానీ అవీక్షిత్తు అధర్మ యుద్ధమైనా సరే. ఒక స్త్రీ ముందు నేను ఓడిపోయాను గనుక ఇది నా అనర్హతేనంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

వైశాలి తల్లిదండ్రుల బాధ్యతనూ, ప్రజల పాలననూ మంత్రులకప్పగించి అడవులకు తపస్సుకై వెళుతుంది. అటు అవీక్షిత్తూ విరాగుడై అడవులకు వెళతాడు. వైశాలి చాలా కఠినమైన తపస్సు చేసి చాలా మనోనిబ్బరాన్ని సంతరించుకుంటుంది. నాగేంద్రుడు వైశాలిని నాగలోకానికి తీసుకెళ్ళి భవిష్యత్తులో నీ కొడుకు వల్ల నాగులకు హాని ఉందని దాని నుంచి కాపాడే బాధ్యత నీదేననీ అడిగితే పెళ్ళే కాని నాకు కొడుకా అని ఒకింత ఆశ్చర్యపోయినా, సహాయం కోరినందువల్ల కాదనరాదనే ధర్మంతో ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే తప్పక రక్షిస్తానని మాటిస్తుంది.

నాగలోకం నుంచి అడవికి తిరిగొచ్చాక దృఢకేశుడనే రాక్షసుడు వైశాలిని పట్టుకొని బాధిస్తుంటే అదే సమయంలో అవీక్షిత్తు అటుగా రావడం గమనించి తాను స్వయంగా పోరాడగలిగినా అవీక్షిత్తు భార్యనూ, బలాశ్వుని కోడలినీ వైశాలినీ అయిన నన్ను రక్షించేవారే లేరా? అంటూ అరుస్తుంది. అవీక్షిత్తు వచ్చి రక్షించడం, వైశాలి తనకోసం వేచిచూస్తుందని తెలుసుకోవడం వారిద్దరూ వివాహం చేసుకోవడం జరుగుతుంది. వైశాలి స్వయంవరంలో తనను ఓడినా, నేడు నీ వీరత్వంతోనే నన్ను గెలిచావని అవీక్షిత్తుతో చెప్పి అతను ఆత్మన్యూనతతో గాక గౌరవంతో బతకాలని కోరుతుంది. ఎదుటివారిని అర్థం చేసుకునే గొప్పగుణం వైశాలిలో ఉంది.
వైశాలి అవీక్షిత్తులకు మరుత్తనే పుత్రుడు కలిగి అతను పెరిగి పెద్దవాడై అన్ని లోకాలపైనా ఆధిపత్యం కోసం ప్రయత్నించే క్రమంలో నాగులను బంధించి వారిని చంపబోతే నాడు వారికిచ్చిన మాటప్రకారం వైశాలి నాగులను చంపొద్దని కొడుకును వారిస్తుంది. యువరాణిగా, పట్టుదల గల స్త్రీగా, రాణిగా, భార్యగా, తల్లిగా, బాధ్యత గల పురస్త్రీగా, శక్తిగా జీవించిన వైశాలి నిండైన వ్యక్తిత్వంతో, మానవత్వంతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంది. పరిస్థితుల ప్రాభవానికి వెరవని వైశాలి చరితం నేటి సమాజానికి ఆదర్శం కావాలి.

వైశాలి అవీక్షిత్తులకు మరుత్తనే పుత్రుడు కలిగి అతను పెరిగి పెద్దవాడై అన్ని లోకాలపైనా ఆధిపత్యం కోసం ప్రయత్నించే క్రమంలో నాగులను బంధించి వారిని చంపబోతే నాడు వారికిచ్చిన మాటప్రకారం వైశాలి నాగులను చంపొద్దని కొడుకును వారిస్తుంది. యువరాణిగా, పట్టుదల గల స్త్రీగా, రాణిగా, భార్యగా, తల్లిగా, బాధ్యత గల పురస్త్రీగా, శక్తిగా జీవించిన వైశాలి నిండైన వ్యక్తిత్వంతో, మానవత్వంతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంది. పరిస్థితుల ప్రాభవానికి వెరవని వైశాలి చరితం నేటి సమాజానికి ఆదర్శం కావాలి.
-ప్రమద్వర

299
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles