లాలన నుంచి పాలన దాకా..


Sun,February 10, 2019 05:20 AM

BATHUKAMMA
సహనానికి మారు పేరు ఆమె. తెగువకు పర్యాయ పదం ఆమె. ఆమె ఆకాశంలో సగం. అవును.. అందుకే అన్ని రంగాల్లో దూసుకుపోతూ తన సగం నిరూపించుకుంటున్నది నారీలోకం.ఇప్పుడు తాజాగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగానికి పైగా స్థానాలను కైవసం చేసుకున్నది. ఈ సందర్భంగా ఈ వారం బతుకమ్మ కథనం.. తాజా మహిళా సర్పంచులకు అంకితం.
BATHUKAMMA1
పాలిచ్చి పెంచిన ఆమెకు పాలించడం పెద్ద కష్టమేం కాదు. ఇంట్లో తినాల్సిన వారు నలుగురు ఉంటే, ముగ్గురికి మాత్రమే సరిపడే తిండి ఉంటే నాకు ఆకలిగా లేదు.. మీరు తినేయండి అని నీళ్లు తాగి ఆ ముగ్గురి కడుపు నింపుతుంది అమ్మ. అదీ.. స్త్రీ గొప్పతనం. అవును.. ఒక్కోసారి ఇంటికి పెద్దదిక్కయి పిల్లల ఆలనాపాలనా చూస్తుంది. ఇప్పుడు మనల్ని పాలించడానికి పంచాయితీ అధికారాన్ని చేజిక్కించుకొని సర్పంచ్ అవతారం ఎత్తింది. తెలంగాణలో 6378 పంచాయతీలను మహిళకు కేటాయించగా అంతకు మించి 6795 పంచాయతీలను చేజిక్కించుకున్నది నారీలోకం.
BATHUKAMMA2
రాజ్యాంగ సూచన కంటే ఎక్కువే: ఈ సారి ఎన్నికల్లో తండాలు, గూడెంలను పంచాయతీలుగా మార్చడంతో పంచాయతీల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో మహిళా ప్రాతినిధ్యం కూడా భారీగానే పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్లు పదేళ్లు కొనసాగుతాయి. స్థానిక సంస్థల్లో ఒకటింట మూడు వంతుల స్థానాలు మహిళలకే కేటాయించాలని రాజ్యాంగంలో ఆర్టికల్ 243డి లో పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ సహా 19 రాష్ర్టాలు ఈ ఆర్టికల్‌ను తూ.చ తప్పకుండా పాటిస్తున్నాయి. అందులో తెలంగాణ రాజ్యాంగంలో కేటాయించిన సంఖ్య కంటే 17శాతం ఎక్కువగా మహిళలకు కేటాయించింది. రాష్ట్రంలోని మొత్తం పంచాయతీలు 12,751 కాగా, అందులో 6378 స్థానాలు మహిళలకే చెందాయి. మిగిలిన వాటిల్లో కూడా చాలావరకు మహిళలే పోటీలో ఉండడం గమనార్హం.

మహిళా సాధికారత దిశగా: ఈ రిజర్వేషన్లు పదేండ్లు అమలులో ఉంటాయి. దీంతో వచ్చేసారి కూడా మహిళలకే ఎక్కువ రిజర్వేషన్లు అమలవుతాయి. గతంలో అయితే ఐదేండ్లు మాత్రమే మహిళలు సర్పంచ్ పదవిలో కొనసాగేవారు. మెల్లమెల్లగా పాలన మీద పట్టు సాధించే సమయానికి పదవీకాలం ముగిసేది. దీనికి తోడు మహిళా సర్పంచ్ కంటే ఎక్కువ ఆమె కుటుంబానికి చెందిన పురుషులే పెత్తనం చెలాయించేవారు. ప్రస్తుత ప్రభుత్వం రెండు విడతల రిజర్వేషన్ విధానాన్ని కొత్త చట్టం రూపంలో అమలు చేస్తున్నందున ఒక విడత బాగా పనిచేస్తే మరోసారి అదే మహిళకు సర్పంచ్ అభ్యర్థిగా పనిచేసే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు స్థానిక సంస్థల పరిపాలనలో అగ్రభాగంలో నిలిచి తద్వారా పాలన, రాజకీయాల మీద పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నది మహిళాలోకం. ఎన్నో ఏండ్లుగా కలగంటున్న మహిళా సాధికారత కల నెరవేరే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తున్నది.

ఆమెదే పైచేయి: తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాల వారీగా మహిళలే అధికంగా సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లాలో ఉన్న 61 గ్రామ పంచాయితీల్లో 31 మంది మహిళలే సర్పంచ్‌లుగా పదవికెక్కారు. రంగారెడ్డి జిల్లాలో 560 పంచాయతీలుండగా 280 పంచాయతీలు మహిళలకు కేటాయించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 401 పంచాయతీలకు గానూ.. 237 మంది మహిళా సర్పంచులే. ఖమ్మం జిల్లాలోని 584 గ్రామ పంచాయతీల్లో 292 పంచాయతీల్లో మహిళలు జయకేతనం ఎగురవేశారు. కొత్తగూడెంలో 477 మందికి గానూ.. 258 మహిళలే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌లో 313 స్థానాలకు గానూ 163 స్థానాలు మహిళలకే కేటాయించారు. జగిత్యాలలో 380 స్థానాల్లో 191 స్థానాలు మహిళలే పోటీ చేసి విజయం సాధించారు. పెద్దపల్లిలో 262 పంచాయతీల్లో 132 పంచాయతీలు మహిళా సర్పంచ్‌ల ఆధీనంలోకి వచ్చాయి. సిరిసిల్లలో 253 పంచాయతీలకు 133 పంచాయతీలు మహిళలకు రిజర్వ్ చేశారు. మంచిర్యాలలలో 308 స్థానాల్లో 170 స్థానాలు మహిళలే సొంతం చేసుకున్నారు. ఆసిఫాబాద్‌లో 334 గ్రామ పంచాయతీల్లో 167 పంచాయితీల మీద మహిళలు విజయ కేతనం ఎగురవేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 719 స్థానాల్లో 380 స్థానాలు, నాగర్‌కర్నూల్‌లో 448 స్థానాల్లో 234, వనపర్తి జిల్లాలో 255 పంచాయతీలకు గానూ 132, జోగుళాంబ గద్వాలలో 255కి 126 స్థానాలు మహిళలకే కేటాయింపులు జరిగాయి.

నల్లగొండ జిల్లాలో 837 గ్రామ పంచాయతీలు ఉంటే వాటిలో 438 స్థానాల్లో మహిళలు గెలిచారు. రిజర్వేషన్ ప్రకారం నల్లగొండలో 419 పంచాయతీలు మహిళలకు కేటాయించగా అదనంగా 19 స్థానాల్లో కూడా మహిళలే గెలుపు బావుటా ఎగురవేశారు. కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో మొత్తం 475 పంచాయతీ స్థానాలుంటే వాటిలో 238 పంచాయతీలు మహిళలకు కేటాయించారు. కేటాయించినవే కాకుండా అదనంగా మరో 26 పంచాయతీల్లో మహిళలు విజయ ఢంకా మోగించారు. దీంతో సూర్యాపేటలో మొత్తం 264 పంచాయతీలు మహిళలే కైవసం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామపంచాయతీలుండగా ందులో 528 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 283 మంది మహిళలే సర్పంచ్‌లుగా గెలిచారు. నిర్మల్‌లో 396 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే 198 స్థానాలు మహిళలకు కేటాయించారు. రిజర్వ్ చేసిన స్థానాల కంటే అదనంగా 29 స్థానాల్లో మహిళా అభ్యర్థులు గెలిచారు. దీంతో నిర్మల్‌లో మొత్తం 228 మంది మహిళా సర్పంచ్‌గా పదవిలోకెక్కారు. కామారెడ్డిలో 526 సర్పంచ్ స్థానాల్లో 265 పంచాయతీలు మహిళలే కైవసం చేసుకున్నారు. ఆదిలాబాద్‌లో 464లో 232 కేటాయించారు. 17 పంచాయతీల్లో అదనంగా కలిపి మొత్తం జిల్లాలో 249 మంది మహిళలు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 130 గ్రామ పంచాయతీలకు 66 స్థానాలు మహిళలకు కేటాయించారు. 3 స్థానాలు అదనంగా మొత్తం 69 పంచాయతీలు మహిళలే గెలుచుకున్నారు.
BATHUKAMMA4
వరంగల్ రూరల్ జిల్లాలో 401 గ్రామ పంచాయతీలకు 199 స్థానాలు మహిళలకు కేటాయించారు. మహబూబాబాద్‌లో మొత్తం 460 పంచాయతీలుండగా 458 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 230 స్థానాలు మహిళలకు కేటాయిస్తే 26 స్థానాలు అదనంగా మొత్తం 256 స్థానాల్లో మహిళలు విజయ కేతనం ఎగురవేశారు. జనగామ జిల్లాలోని 301 పంచాయతీ స్థానాల్లో మహిళలకు 151 స్థానాలు కేటాయిస్తే.. 158 పంచాయతీలను మహిళలు గెలుచుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 389 స్థానాలకు గానూ 209 స్థానాలు మహిళలకు కేటాయించారు. సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయితీల్లో 344 స్థానాలు మహిళలకే చెందాయి. సిద్దిపేటలో 499 పంచాయితీల్లో 263 పంచాయితీల్లో మహిళా అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేశారు. మెదక్‌లోని 469 స్థానాల్లో 244 పంచాయితీలు మహిళలు చేజిక్కించుకున్నారు. మొత్తం కలిపి తెలంగాణలో 6795 గ్రామ పంచాయితీల పాలనా బాధ్యతలు మహిళల చేతికి వచ్చాయి.
BATHUKAMMA5

అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాను

మా ఊరి ప్రజలు నన్ను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ సహకారంతో మా గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాను. అభివృద్ధిలో బూరెడ్డిపల్లి గ్రామం అగ్రగామిగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాను. అధికారులతో సమన్వయంతో గ్రామంలో విద్య, వైద్య వ్యవస్థలు ప్రతి ఒక్కరికీ అందేలా కార్యక్రమాలు చేపడుతాను.
-బండ్ల జ్యోతి, సర్పంచ్, బూరెడ్డిపల్లి జోగుళాంబ గద్వాల

ప్రజల అవసరాలు తీర్చాలి

ప్రజలకు మౌలిక సదుపాయాలు కలిగించాలి. ప్రజల అవసరాలను గుర్తించాలి అప్పుడే సమాజంలో సర్పంచ్‌కు గుర్తింపు, గౌరవం. అది తెలుసుకుని పని చేయాలి. చిన్న పంచాయతీలు కాబట్టి నిధులును సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది.
- అనూష, సర్పంచ్, చాతకొండ, కొత్తగూడెం జిల్లా

రాష్ట్రప్రభుత్వం మనోధైర్యాన్నిచ్చింది

ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి. కానీ మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో విఫలమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అందించిన మనోబలంతో అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధిలో ముందుకు సాగుతా. గ్రామంలో వందశాతం అక్షరాస్యతకు కృషి చేస్తా.
- నాగుల సంగీత, సర్పంచ్, వెదిరె, కరీంనగర్

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా

ఎంటెక్ చదివి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నప్పటికీ ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. నాపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చైతన్యం కల్పిస్తా.
- రజినీత, సర్పంచ్, వెంకమ్మగూడ, రంగారెడ్డి

BATHUKAMMA3

ఐదో స్థానంలో తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయించిన రాష్ర్టాల్లో తెలంగాణ మొన్నటి వరకు 8వ స్థానంలో ఉండేది. ఈ దఫా ఎన్నికల్లో భారీగా మహిళలకు పెద్దపీట వేస్తూ.. ఎక్కువ రిజర్వేషన్లు వారికే కేటాయించింది. గతంలో 4,602 స్థానాలు మహిళలకు కేటాయించగా, ఈసారి 6,378 స్థానాలు మహిళలకు కేటాయించి ఎనిమిదో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. దీనికి తోడు లక్షా పదమూడు వేల వార్డుల్లో 56, 690 వార్డు స్థానాలు కూడా మహిళలకే కేటాయించారు. 19,992 స్థానాలు మహిళలకు కేటాయించి ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది.

మా గూడెం.. మా పాలన..

ఇన్నిరోజులు గూడెంలా ఉన్న మా ఊరు వేరే ఊరికి హామ్లెట్ గ్రామంగా ఉండేది. కేసీఆర్ సార్ తండాలను, గూడేలను పంచాయతీలుగా మార్చడంతో మా ఊరిని మేమే పాలించుకునే అవకాశం వచ్చింది. పంచాయితీగా ఏర్పడిన మా ఊరికి నేను తొలి సర్పంచ్ కావడం సంతోషంగా ఉంది. గ్రామ ప్రజలు, యువకులు, అధికారుల సహకారంతో మా ఊరిని మోడల్ గ్రామంగా మారుస్తా.
ఆడెపు విజయస్వామి, సర్పంచ్, ముత్తిరెడ్డిగూడెం, మేడ్చల్ జిల్లా

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

గ్రామాన్ని ఆదర్శంగా మార్చి ప్రజల రుణం తీర్చుకుంటా. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే దిశగా పనిచేస్తా. పేదపిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషి చేస్తా.
ఘనపారపు సరిత, సర్పంచ్, ఇంటికన్నే, మహబూబాబాద్

కల నెరవేరుతున్నది..

ఎన్నో ఏండ్ల నుంచి మహిళలు సాధికారత కోసం పోరాడుతున్నారు. ఇప్పటికి ఆ కల నెరవేరుతున్నది. తెలంగాణలో మెజారిటీ పంచాయతీలు మహిళలే పాలించే అవకాశం రావడం గొప్ప విషయం. నిత్యం ప్రజలతో ఉంటూ, వారి అవసరాలు తీర్చడం, సమస్యలు పరిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం.
- అనిత, సర్పంచ్, లోయపల్లి

- ప్రవీణ్‌కుమార్ సుంకరి,
సెల్: 9701557412

2111
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles