దుబాయ్‌లో 60 గంటలు ఉత్కంఠరేపిన అతిలోక సుందరి మరణం


Sun,February 10, 2019 05:04 AM

Sridevi
ఫిబ్రవరి 24, 2018 శనివారం
దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ హోటల్
రూం నంబర్ 2261
సాయంత్రం 5.30 గంటలు

ఒక వ్యక్తి సరాసరి ఆ రూం వద్దకు వెళ్లి కాలింగ్‌బెల్ నొక్కాడు. రెండుసార్లు బెల్ నొక్కగానే డోర్ తెరుచుకున్నది. లోపలి నుండి డోర్ తీసుకుని బయటకు చూసిన సినీనటి శ్రీదేవి ఆశ్చర్యపోయింది. ఎదురుగా ఉన్నది తన భర్త బోనీకపూర్ కావడమే ఆ ఆశ్చర్యానికి కారణం. ఎప్పుడొచ్చారు అదే ఆశ్చర్యంతో ప్రశ్నించింది. ఇద్దరూ లోనికి వెళ్లి బెడ్‌పై కూర్చుని 15 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. సమయం ఆరు కావస్తుండడంతో ఇద్దరూ కలిసి డిన్నర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. స్నానం చేసి వస్తానని చెప్పి శ్రీదేవి బాత్రూంలోకి వెళ్లారు. దాదాపు పావుగంటైనా ఆమె బాత్‌రూం నుంచి బయటకు రాలేదు. దాంతో అనుమానం వచ్చిన బోనీ కపూర్ తలుపుతట్టారు. లోపల నుంచి మాట వినిపించలేదు. అలికిడి లేదు... స్నానం చేస్తున్న శబ్దం లేదు. దాంతో హోటల్ సిబ్బంది సాయంతో బోనీ కపూర్ తలుపు పగులకొట్టి చూశారు. బాత్ టబ్‌లో శ్రీదేవి అచేతనంగా పడి ఉండటం కనిపించింది. హోటల్ సిబ్బంది సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించేప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధృవీకరించారు. బాత్ టబ్‌లో ఉండగానే ఆమెకు గుండెపోటు రావడంతో ఆమె మరణించిందని వైద్యులు చెప్పారని మీడియా కథనం.

నిజానికి తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం శ్రీదేవి భోనీకపూర్‌లు వారి చిన్న కూతురు ఖుషీతో కలిసి వారం క్రితమే దుబాయ్ వెళ్లారు. వారంతా జుమైరా ఎమిరేట్స్ హోటల్లో బసచేశారు. అయితే పెళ్లి అయిపోగానే బోనీకపూర్ తన కూతురును తీసుకుని వ్యక్తిగత పనుల మీద ఇండియాకు వచ్చాడు. అదే సమయంలో తన భార్య శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో శనివారం మధ్యాహ్నం బోనీకపూర్ ఒక్కడే తిరిగి దుబాయ్ వెళ్లాడని చెబుతున్నారు.

ఒకవేళ ఆమె గుండెపోటుతో మరణించి ఉంటే దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయని మీడియా పలు కథనాలు ప్రసారం చేసింది. ముఖ్యంగా శ్రీదేవి గత ఆరు నెలలుగా ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయానికి తరచూ వస్తున్నారని, ఆ సమయంలో ఆమె చాలా బాధతో కనిపించేదని అంటున్నారు. ఒకవేళ అదే నిజమయితే శ్రీదేవికి ఏమైనా బాధలున్నాయా? దేవాలయానికి వచ్చి ఆమె మౌనంగా ఎందుకు రోధించినట్లు, కొంతకాలంగా శ్రీదేవి ఇంట్లోపరిస్థితి ఏమిటి? అని అనేక ప్రశ్నలు. అంతే కాకుండా మోహిత్ మోర్వా వివాహంలో బోనీ మొదటిభార్య బంధువులనుండి ఆమెకు అవమానం ఎదురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, బోనీ తన మొదటి భార్య సంతానంపై చూపే శ్రద్ధ తన సంతానంపై ప్రదర్శించక పోవటం కూడా శ్రీదేవి మనస్తాపానికి కారణమని కూడా పలు మీడియా చానల్స్ ప్రసారం చేశాయి. ఇపుడు బోనీ అర్జున్ వైపు చూస్తుండడంతో ఆమెకు కొత్త సమస్య మొదలయ్యింది. ఒక పక్క జాహ్నవిని మంచి నటిగా నిలబెట్టాలని తాను తాపత్రయ పడుతుంటే బోనీ మాత్రం తన పుత్రరత్నం వైపు మనసు పెట్టడం ఆమెలో కల్లోలాన్ని రేపిందన్నది ప్రధాన కథనం.

అయితే వీటన్నింటినీ పక్కన పెడుతూ ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి జరిగిన సంఘటనలకు సంబంధించిన కొన్ని వివరాలను శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన స్నేహితుడు కోమల్ నాహ్తాతో పంచుకున్నారు. బోనీ తనకు వివరించిన విషయాలను.. వాణిజ్య విశ్లేషకుడైన కోమల్ నాహ్తా తన బ్లాగ్‌లో ప్రచురించి ట్విటర్లో షేర్ చేశారు.

విదేశాలకు తమ భార్యాభర్తలిద్దరం కలిసి వెళ్లకపోవటం 24 ఏళ్లలో రెండుసార్లు మాత్రమే జరిగిందని నాహ్తాతో బోనీకపూర్ చెప్పారు. శ్రీదేవి సినిమాలకు సంబంధించిన పనిమీద ఒకసారి న్యూజెర్సీకి, మరొకసారి వాంకోవర్‌కు వెళ్లారు. ఆ రెండు పర్యటనలప్పుడూ నేను ఆమె వెంట లేను. కానీ, నా స్నేహితుడి భార్య ఆమెకు తోడుగా ఉండేలా చూసుకున్నాను. శ్రీదేవి రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 22, 23 తేదీలు) ఓ విదేశంలో ఒంటరిగా ఉన్నది దుబాయ్‌లో మాత్రమే అని బోనీ తన స్నేహితుడితో చెప్పారు. బోనీ, శ్రీదేవి, వారి కుమార్తె ఖుషీ.. ముగ్గురూ తమ బంధువు వివాహ వేడుకలో పాల్గొనటానికి దుబాయ్ వెళ్లారు. అక్కడికి సమీపంలోని రాస్-అల్-ఖైమాలో ఆ పెళ్లి వేడుక ఫిబ్రవరి 20వ తేదీన ముగిసింది. బోనీ తనకు 22వ తేదీన లక్నోలో ఒక ముఖ్యమైన సమావేశం ఉండటంతో ఇండియాకు తిరిగి వచ్చారు. శ్రీదేవి తమ మరో కుమార్తె జాహ్నవి కోసం షాపింగ్ చేయటానికి దుబాయ్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారని కోమల్‌తో బోనీ పేర్కొన్నారు.

జాహ్నవి షాపింగ్ లిస్ట్ శ్రీదేవి ఫోన్‌లో ఉంది. ఆమె ఫిబ్రవరి 21వ తేదీనే షాపింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ తన ఫోనును రాస్-అల్-ఖైమాలో మరచిపోవటం వల్ల ఆ రోజు షాపింగ్ చేయలేకపోయారు. దీంతో శ్రీదేవి ఆ రోజంతా హోటల్ గదిలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన కూడా ఆమె తన ఫ్రెండ్‌తో ముచ్చటిస్తూ హోటల్ గదిలోనే విశ్రాంతి తీసుకుంటూ గడిపారు అని బోనీ వివరించారు. దీంతో ఆమె ఇండియాకు తిరిగి రావాల్సిన ప్రయాణం షెడ్యూలును మార్చాల్సి వచ్చిందన్నారు. ఫిబ్రవరి 23వ తేదీన కూడా శ్రీదేవి బద్దకంగా గడపటంతో ఆమె ఇండియా ప్రయా ణం టికెటును ఆమె భర్త బోనీ మార్చాల్సి వచ్చినట్లు చెప్పారని కోమల్ రాశారు.

24వ తేదీ ఉదయం నేను ఆమెతో మాట్లాడాను. ఐ యామ్ మిసింగ్ యు అని ఆమె నాతో అన్నది. నేను కూ డా ఆమెను చాలా మిస్ అవుతున్నానని చెప్పాను. కానీ ఆ రోజు సాయంత్రం దుబాయ్‌లో ఆమె దగ్గరకు రాబోతున్నానని నేను చెప్పలేదు. ఎప్పుడూ ఒంటరిగా ఉండని శ్రీదేవి ఇప్పుడు ఒంటరిగా ఉందని, ఆమె తన పాస్‌పోర్టునో, ముఖ్యమైన పేపర్లనో పోగొట్టుకుంటుందేమోనని జాహ్నవి ఆందోళన చెందుతున్నది. దీంతో నేను దుబాయ్ వెళ్లే ఆలోచనకి ఆమె సపోర్ట్ చేసింది అంటూ బోనీ భావోద్వేగంతో గుర్తుచేసుకున్నట్లు కోమల్ పేర్కొన్నారు.

జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో రూముకు వెళ్లి శ్రీదేవిని సర్‌ఫ్రైజ్ చేయాలని బోనీ అనుకున్నారని కోమల్ రాశారు. బోనీ 24వ తేదీ సాయంత్రం 6:20 గంటలకు (దుబాయ్ సమయం) ఆయన హోటల్ వద్దకు చేరుకున్నారు. హోటల్లో శ్రీదేవి గదికి డూప్లికేట్ తాళం తీసుకోవటానికి కావలసిన లాంఛనాలు పూర్తిచేసిన బోనీ.. శ్రీదేవిని పూర్తిగా సర్‌ఫ్రైజ్ చేయాలని తాను కోరుకుంటున్నాడు కాబట్టి తన లగేజీని గదికి కొంత ఆలస్యంగా తీసుకురావాలని రూమ్ బాయికి చెప్పారు అని కోమల్ పేర్కొన్నారు. బోనీ తన దగ్గరున్న డూప్లికేట్ తాళంతో రూమ్ తలుపు తెరిచిన తర్వాత వారిద్దరూ టీనేజీ ప్రేమికుల్లాగా ఆలింగనం చేసుకున్నారు. ముద్దులు పెట్టుకున్నారు. కానీ.. తనను తీసుకెళ్లటానికి నేను దుబాయ్ వస్తానని తనకు తెలుసని ఆమె నాతో చెప్పింది అని బోనీ కన్నీళ్లతో చెప్పినట్లు కోమల్ పేర్కొన్నారు. తామిద్దరం అలా దాదాపు అరగంట సేపు ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపామని ఆయన తెలిపినట్లు రాశారు.

ఆ తర్వాత బోనీ లేచి ఫ్రెష్ అయ్యారు. ఆయన బాత్రూ మ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తామిద్దరం కలిసి రొమాంటిక్ డిన్నర్‌కి వెళ్దామని శ్రీదేవితో చెప్పారు. షాపింగును మరుసటి రోజుకు (ఆదివారం) వాయిదా వేయాలని ఆమెను కోరారు. ఫిబ్రవరి 25వ తేదీ రాత్రికి ఇండియా వెళ్లాలని వీరిద్దరూ నిర్ణయం తీసుకోవటంతో తిరుగు ప్రయాణం టికెట్లను మరోసారి మార్చాల్సి వచ్చింది. షాపింగ్ చేయటానికి 25వ తేదీ రోజంతా సమయం ఉంటుందని వారు భావించారు.

అప్పటికి ఇంకా విశ్రాంతి మూడ్లోనే ఉన్న శ్రీదేవి స్నానం చేసి, రొమాంటిక్ డిన్నర్‌కి రెడీ కావటానికి వెళ్లింది. బోనీ లివింగ్ రూమ్‌కు వెళ్లాడు బోనీ లివింగ్ రూమ్‌లో దక్షిణాఫ్రికా - ఇండియా క్రికెట్ మ్యాచ్ చూడటానికి టీవీ చానళ్లు తిప్పుతూ గడిపారు. నాలుగైదు నిమిషాల తర్వాత పాకిస్తాన్ సూపర్‌లీగ్ క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ చూపిస్తున్న ఒక చానల్ దగ్గర ఆగారు. దాదాపు 15-20 నిమిషాల పాటు ఆ మ్యాచ్ చూస్తూ గడిపారు. అయితే శనివారం కావటం వల్ల రెస్టారెంట్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందని తనకు తెలుసునని, అప్పటికే దాదాపు 8:00 గంటలు అవుతోందని తనకు తొందర మొదలైందని కోమల్‌తోబోనీ చెప్పారు. బోనీ అసహనంగా లివింగ్ రూమ్ నుంచే శ్రీదేవిని కేకవేసి పిలిచారు. అలా రెండుసార్లు పిలిచిన తర్వాత టీవీ సౌండ్ తగ్గించారు. అప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఆయన బెడ్రూమ్‌కి వెళ్లి బాత్రూమ్ తలుపు తడుతూ ఆమెను పిలిచారు. లోపలి నుంచి ట్యాప్ నీటి శబ్దం వినిపిస్తుంటే జాన్.. జాన్ అని ఇంకొంచెం పెద్దగా పిలిచారు. అయినా సమాధానం లేకపోవటంతో కంగారు పడి.. లోపలి నుంచి గడియ పెట్టిలేని బాత్రూమ్ తలుపు తెరిచారు. అక్కడ పూర్తిగా నీటితో నిండివున్న టబ్‌లో శ్రీదేవి తల నుంచి బొటనవేలి వరకూ పూర్తిగా మునిగిపోయి ఉంది. హతాశయుడైన బోనీ ఆమె దగ్గరకు వెళ్లి చూశాడు. కానీ ఆమె చలనం లేకుండా పడివుంది. జరగరానిది జరిగిపోయింది.
రకరకాల సందేహాల నేపథ్యంలో మూడు రోజులు గడిచిన శ్రీదేవి పార్దివదేహం ఇంకా దుబాయ్ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ మార్చురీలోనే ఉన్నది. శ్రీదేవి మృతి కేసు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేతికి వెళ్లింది.దుబాయ్ ప్రాసిక్యూటర్ కేసును ఏజీకి అందజేసింది. ప్రాసిక్యూటర్ నుంచి క్లియరెన్స్ వస్తేనే .. శ్రీదేవి మృతదేహానికి ఎంబాల్మింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అనుమతి లభిస్తుంది.

27 ఫిబ్రవరి మంగళవారం సాయంత్రం 6 గంటలు
నటి శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు క్లోజ్ చేశారు. ఆమె ప్రమాదవశాత్తు బాత్‌డబ్‌లో పడి మరణించినట్టు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు దుబాయ్ మీడియా ఆఫీసుకు సమాచారం చేరవేశారు. ఈ కేసు దాదాపు 60 గంటల పాటు ఎన్నో మలుపుల మధ్య ఎంతో ఉత్కంఠ రేపింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణ మొత్తం పూర్తయినట్లు పోలీసులు స్పష్టంచేశారు. ఈ మేరకు ఈ ప్రమాదవశాత్తు మృతి కేసును మూసేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు దుబాయ్ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్ విమానంలో మంగళవారం రాత్రి ఎట్టకేలకు స్వదేశానికి తరలించారు.


జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో రూముకు వెళ్లి శ్రీదేవిని సర్‌ఫ్రైజ్ చేయాలని బోనీ అనుకున్నారు. బోనీ 24వ తేదీ సాయంత్రం 6:20 గంటలకు (దుబాయ్ సమయం) ఆయన హోటల్ వద్దకు చేరుకున్నారు. హోటల్లో శ్రీదేవి గదికి డూప్లికేట్ తాళం తీసుకోవటానికి కావలసిన లాంఛనాలు పూర్తిచేసిన బోనీ.. శ్రీదేవిని పూర్తిగా సర్‌ఫ్రైజ్ చేయాలని తాను కోరుకుంటున్నాడు కాబట్టి తన లగేజీని గదికి కొంత ఆలస్యంగా తీసుకురావాలని రూమ్ బాయికి చెప్పారు. బోనీ తన దగ్గరున్న డూప్లికేట్ తాళంతో రూమ్ తలుపు తెరిచిన తర్వాత వారిద్దరూ టీనేజీ ప్రేమికుల్లాగా ఆలింగనం చేసుకున్నారు. ముద్దులు పెట్టుకున్నారు.

28 ఫిబ్రవరి బుధవారం ఉదయం 9:00 గంటలకు గ్రీన్ ఎకర్స్ నుంచి కంట్రీక్లబుకు భౌతికకాయాన్ని తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో పార్థివదేహాన్ని ఉంచారు.అనంతరం మధ్యాహ్నం12.30 గంటల నుంచి 1:00 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 2:00 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లే సేవా సమాజ్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.అశేషమైన అభిమాన జనసందోహం వెంట నడువగా అంతిమయాత్ర చిరస్మరణీయంగా జరిగింది. శ్రీదేవికి బంగా రం అన్నా, పట్టు చీరలు అన్నా చాలా ఇష్టం. అందుకే బంగారు రంగు పట్టు చీరను, ఏడువారాల నగలను ఆమె భౌతిక కాయంపై ఉంచారు. అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

- మధుకర్ వైద్యుల, సెల్ : 91827 77409

2479
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles