గుండె పగిలిన చప్పుడు వినబడుతుందా?


Sun,February 10, 2019 04:51 AM

prema
నన్ను వదిలేసిందో, వదిలించుకోవాలనుకుందో తెలియదు కానీ మాట్లాడటం మానేసింది. పక్క పక్క ఊర్లే అయినా మా మధ్య కొన్ని కాంతి సంవత్సరాల దూరం పెరిగింది. ఆ దూరం దగ్గరయిందా లేదా? ఈ గుండె పగిలిన చప్పుడు తనకు వినబడిందా లేదా? అనే విషయాలు తెలుసుకునేందుకు నా ప్రేమ ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతున్నాను.

ఇన్నేండ్లలలో కంటిపాపలను దాటకుండా నా కన్నీళ్లెన్ని ఇంకిపోయాయో, తన ఊసులు అశ్రుధారలై నా బుగ్గల మీద ఎన్ని ఆవిరైపోయాయో. ఎవరికీ కనిపించని ఈ కన్నీళ్లకు అడ్రస్‌గా మారుతున్న రాత్రులెన్ని గడుపుతున్నానో ఆమెకు తెలియదు. తను విసిరేసిన ఓ గుండె పగిలిన శబ్దం కూడా తనకు వినిపించటం లేదు.

డిసెంబర్ 23..
సాయంత్రం 3.30 గంటలు..
ఏదో పని మీద వేరే ఊరెళ్తున్నాను. మధ్యలో ఓ ఊర్లోకి చేరింది మా బండి. దూరంగా చూస్తే బస్టాప్‌లో ఓ అమ్మాయి కూర్చునుంది. దగ్గరయ్యే కొద్దీ అర్థమయింది.. అవును ఆమెనే.. మా బైక్ ఎంత మెల్లగా పోతుందో అంతకన్నా వేగమైన ఆలోచనలేవో మెదడులో ఒక్కసారిగా పుట్టుకొచ్చాయి. పదేండ్ల కింద నా మనుసులో పురుడోసుకున్న ప్రేమకు ఈమెనే కదా కారణం.. అప్పటి నుంచి ఎప్పుడూ కనిపించని ఆమె మళ్లీ మొదటిసారి కనబడింది. తను నన్ను చూసిందా? ఏమో తెలీదు...కానీ నాకు ఆమె కనిపించింది. అది చాలు.. ఆ క్షణమొక స్వర్ణయుగంలా అనిపించింది. తన కండ్లలోకి నేరుగా చూడాలనుకున్నా.. కానీ కష్టమనిపించింది. అలా చూసిన మరుక్షణమే ఆమెను నా కన్నీళ్లు పలుకరిస్తాయని తెలిసి చూడలేకపోయాను. బస్టాప్ దాటి వెళ్తున్నాం. వెనక్కి తిరిగి చూశాను. తనెటో చూస్తున్నది. ఒక్కసారి ఇటు తిరిగి చూస్తే బాగుండు అనుకున్నాను. చూడలేదు. అలా గమనిస్తూ ముందుకు సాగాను.. బహుశా తనుకూడా చూడాలనుకున్నా బలవంతంగా ఆపుకొంటుందేమో నాలాగే.

నందిని ఆమె పేరు. పదో తరగతిలో ఒకరికొకరం ఇష్టపడ్డాం. క్లాస్‌లో అందరికన్నా కొంచెం ఎక్కువ అందమైన అమ్మాయి తను. మరీ తెలుపు, మరీ నలుపు కాకుండా చామనఛాయ కన్నా ఒక పాయింట్ తెలుపు ఎక్కువే ఉంటుంది. ఆమె మొహంలో ఒక కళ, ఏదో ఆకర్షణ ఉట్టిపడేది. సాలార్‌జంగ్‌లో కొలువైన రెబెక్కాలాంటి నాజూకుతనం, లామకాన్‌లో మీటుతున్న గిటార్‌లాంటి మెస్మరైజింగ్ మాటలు, పెదాలు అదిమిపట్టి నవ్వే నవ్వులు భళే సొంపుగా ఉండేవి. ఇద్దరమూ ఫస్ట్‌క్లాస్ స్టూడెంట్స్‌మే. అప్పుడు ఇద్దరి మధ్య ఒక బంధం ఏర్పడింది. అదే ప్రేమ అనుకున్నాం. నేను చూడకపోతే ఏడ్చేది, కనబడకపోతే ఉక్కిరిబిక్కిరి అయ్యేది. కళ్లతో పలకరింపులు, ఫ్రెండ్స్‌తో రాయభారాలు, కుదిరితే మాట్లాడుకోవడాలు.. ఇలా చదువుకు ఆటంకం లేకుండా మా రిలేషన్‌షిప్ సాగింది.

ఇప్పటికీ నా లైఫ్‌లో ఏ మూలనో సంతోష ఘడియలున్నాయంటే అది తన వల్ల కలిగిన సంతోషం మాత్రమే. అలా సాగిన మా ఏడాది ప్రేమకు అప్పుడే నూరేండ్లు నిండాయి. దానికి నా హృదయమిప్పటికీ కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తూనే ఉంది. పదో తరగతి అయిపోయాక తను నన్ను వదిలేసిందో, వదిలించుకోవాలనుకుందో తెలియదు కానీ మాట్లాడటం మానేసింది. పక్క పక్క ఊర్లే అయినా మా మధ్య కొన్ని కాంతి సంవత్సరాల దూరం పెరిగింది. మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా కుదురలేదు. పరిస్థితులు మారాయి. తానింక మాట్లాడదని అర్థమయింది. ఏదో ప్రళయం ఒక ఊరికి వస్తే ఊరే కొట్టుకుపోయినట్టు.. అలాంటి ప్రళయమే నా హృదయానికి వచ్చిందనుకున్నాను. ఇంక తప్పదు. తనను మర్చిపోవాలి. కానీ మరిచిపోవటానికి తను జ్ఞాపకం కాదు కదా. నాదే అనుకున్న ప్రాణం. ఆమె మాత్రం ఓ అందమైన అబద్ధమాడి నాకు దూరమైంది. ఆ అబద్ధం నాకు ఇంకా గుర్తుందని తనకు తెలియదు. నా గుండె కొట్టుకునేదీ తన కోసమే అన్న సంగతి కూడా ఆమెకు తెలియదు.

ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తుందనుకున్నాను. ఏదైనా కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చిన ప్రతిసారీ తనేనేమో అనుకుంటాను. కానీ ఏనాడు అవతలి నుంచి ఆ గొంతు వినబడలేదు. అయినా సరే ఏదో ఒకరోజు తప్పకుండా వినబడుతుందనే ఆశ మాత్రం చావలేదు. ఈ పరిస్థితుల్లో చదువుకుంటూనే ఓ పార్ట్ టైం ఉద్యోగం చేశాను. అదే ఇప్పుడు పర్మినెంట్ ఉద్యోగమైంది. అలా పదేండ్లు గడిచిపోయాయి. అయినా ఇంకా ఏదో వెలతి. గుండెను మెలిపెట్టే తన ప్రేమ వెంటాడుతూనే ఉంది. ఇన్నేండ్లలలో కంటిపాపలను దాటకుండా నా కన్నీళ్లెన్ని ఇంకిపోయాయో, తన ఊసులు అశ్రుధారలై నా బుగ్గల మీద ఎన్ని ఆవిరైపోయాయో. ఎవరికీ కనిపించని ఈ కన్నీళ్లకు అడ్రస్‌గా మారుతున్న రాత్రులెన్ని గడుపుతున్నానో ఆమెకు తెలియదు. తను విసిరేసిన ఓ గుండె పగిలిన శబ్దం కూడా తనకు వినిపించటం లేదు.

కిందటి ఏడాది ఆగస్టు 4..
గంట దాటితే నా పుట్టిన రోజు.. కచ్చితంగా నమ్మకం ఉంది తను ఈ పుట్టిన రోజుకు ఫోన్ చేసి విష్ చేస్తుందని. కానీ మొదటి విష్ చేస్తుందా అందరిలా తెల్లారిన తర్వాత కుదిరినప్పుడు విష్ చేస్తుందా తెలియదు కానీ చేస్తుందనే క్లారిటీ మాత్రం ఉంది. అదే క్లారిటీతో నేను తన కాల్ కోసం వెయిట్ చేశాను. గతంలో పుట్టిన రోజు అంటే ఏదో ఫార్మాలిటీగా జరిపి, అందరి విషెస్‌ని క్యాజువల్‌గానే తీసుకునే వాడిని. కానీ ఈ పుట్టిన రోజుకు ఓ స్పెషల్ ఉంది. తను విష్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అదే ఎగ్జయిట్‌మెంట్, ఒక టెన్షన్‌తో ఉన్నాను. అది నిద్రపోవాల్సిన టైం కానీ తన ఫోన్ కోసమే మెళకువతో ఉన్నా అదీ ఆఫీస్‌లో. రూంలో ఇండోర్ సిగ్నల్ వీక్ అందుకే ఆఫీస్‌లోనే ఫోన్ పట్టుకుని కూర్చున్న. సడన్‌గా ఫోన్ మోగింది. గుండెలు అదిరాయి. తానేమో అనుకున్న కాదు. పన్నెండు గంటలకు పదినిమిషాల ముందు పెట్టిన అలారం టోన్ అది. కాసేపటికి తేరుకున్నాను. ఫోన్ రాదేమో అనుకున్నా వెయిట్ చేయటం అవసరమా అనుకున్నా. పది నిమిషాలు గడిచింది. ఏమీ తోచట్లేదు తల తిప్పుతోంది. కండ్లు బైర్లు కమ్ముకున్నాయి. బాడీలో ఏదో జరుగుతోంది. ఏం చేయాలో అర్థం కాలేదు. పన్నెండూ పద్నాలుగు నిమిషాలు.... సడన్‌గా ఫోన్ మోగింది. ఎస్... కచ్చితంగా తనే.. లిఫ్ట్ చేశాను. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత నేనే హలో అన్నాను.

హ్యాపీ బర్త్‌డే అని అటు నుంచి వినిపించింది. జీవితాన్నే గెలిచిన ఆనందం, దాన్ని అదిమిపట్టి చాలా థాంక్స్ అన్నాను. ఆ క్షణంలో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తను ఫోన్ చేసింది చాలు. బర్త్‌డేకు ఫస్ట్ విష్ తనదే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేముంటుంది. ఇంతలోనే సరే ఉంటాను అని అటునుంచి వినిపించింది. ఇంకొంచెం మాట్లాడితే బాగుండు అన్న విషాద గొంతుతోనే సరే అన్నాను. ఇద్దరి మధ్య నిశ్శబ్దం.. కొంతసేపటికి అటు నుంచి బీప్ బీప్ అన్న చప్పుడు. తర్వాత వేదనగా మిగిలిన నా గుండె చప్పుడు. అలా తను నాకు మొదటిసారి బర్త్‌డే విషెస్ చెప్పింది. నిజంగా నాకు ఆరోజే పుట్టినట్టు అనిపించింది. తర్వాత మళ్లీ తన నుంచి ఎలాంటి కాల్ రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు.

చివరి మాట నందిని.. నువ్వు, నేను అనుకోకుండా ఏదో ఒక రోజు ఎదురుపడుతాం. నీకు తెలియదు నా కండ్లలోంచి కన్నీళ్లేవో ఉప్పెనగా వస్తాయి. నేను బలవంతంగా ఆపుకుంటాను. నీ కండ్లలోకి నేను చూడలేను. చూసీ చూడన్నట్టే ఉంటాను. ఆ క్షణం నన్ను జాలి కొద్ది క్షమించు ప్లీజ్. ఒక్కటి గుర్తు పెట్టుకో నందిని. రోజూ కనిపించే చంద్రుడు ఎప్పుడైనా ప్రకాశవంతంగా కనిపిస్తే నువ్వు నా గురించి తలుచకుంటున్నావేమో అని సంబురపడతా. ఆ నిశ్శబ్ద వాతావరణంలో నా ఈ హృదయం నీకేదో చెపుతుంది. అది నువ్వు మాత్రమే వినగలిగే గుండె భాష, నీకు మాత్రమే అర్థమయ్యే మౌన భాష.
నీ కాల్ కోసం వేచిచూస్తూ..
నీ పొట్టి

2184
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles