కందూరు చోడుల ముఖ్య శాసనాలు


Sun,February 10, 2019 04:45 AM

(కందూరు చోడుల ఆలయాలు, శాసనాలు పార్ట్ 3)
charitra
కందూరు చోడ వంశీయులకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు నలభై శాసనాలు వివిధ ప్రాంతాల్లో వెలుగు చూశాయి. వీటి ఆధారంగానే వారి చరిత్ర మనకు కొంత అందుబాటులోకి వచ్చింది. ఆ శాసనాల్లో ఎక్కువ వాటిని ప్రముఖ చరిత్రకారుడు బీఎన్ శాస్త్రి సేకరించి పురావస్తు శాఖ గ్రంథాల్లో ప్రకటించారు. వాటిలో కొన్ని ముఖ్యమైన శాసనాలు ఇవి.

తొండరస చోళ మహారాజు కొలనుపాక శాసనం కొలనుపాకలో కందూరు చోడులకు సంబంధించిన ఆరు శాసనాలు ఇప్పటి వరకు వెలుగు చూశాయి. ఇందులో తొండరస చోళ మహారాజు వేయించిన శాసనం చాలా ముఖ్యమైంది. నల్లసరపు రాతిపై నాలుగు వైపులా ఈ శాసనం చెక్కి ఉంది. కన్నడ భాషలో చెక్కిన ఈ శాసనంలో కళ్యాణీ చాళుక్య త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుని ప్రస్తావన ఉంది. ఇతని అనుగ్రహంతో తొండరస చోళ మహారాజు కొలనుపాక (ఏడు వేల గ్రామాల)ను పాలిస్తున్నట్లు ఈ శాసనం చెబుతున్నది. కాలాముఖాన్వయ కులతికుడైన రామేశ్వర పండితునికి, ఉత్తరేశ్వరాలయానికి సంక్రాంతి రోజున (క్రీ.శ. 1088) దానమిచ్చిన సందర్భంగా ఈ శాసనాన్ని వేయించారు.

ఒల్లాల శాసనం

నల్లగొండ జిల్లా శాలీగౌరారం మండలం వల్లాల (ఒల్లాల) గ్రామంలో ఈ శాసనం లభించింది. కందూరు మల్లిఖార్జున చోడమహారాజుకు సంబంధించిన శాసనం ఇది. శాసనం శిలపై మూడువైపుల చెక్కి ఉంది. రెండు వైపుల సంస్కృతంలో, మూడో వైపు తెలుగులో రాసి ఉంది. కందూరు రెండో భీమచోళుని పట్టమహిషి గంగాదేవి. ఈ దంపతులకు నలుగురు కొడుకులు. వీరిలో నాలుగోవాడు మల్లిఖార్జున చోళుడు ఈ శాసనాన్ని వేయించాడు. ఒల్లాల శాసనం సంస్కృత భాగంలో మల్లిఖార్జున చోడుని మంత్రి అయిన గుండన వంశ వర్ణన ఉన్నది. వేంగీ మండలంలో అంతర్గతమైన అగ్రహారాన్ని త్రిణయన పల్లవుని నుంచి ఒక బ్రాహ్మణ వంశం పొందింది. ఈ వంశీకులు ఆత్రేయ గోత్రోద్భవులు. వీరి వంశంలో గుండన ప్రసిద్ధుడు. ఇతడు మల్లిఖార్జున చోడుని మంత్రి, మహా మేధావి. ఇతనికి క్రిష్ణ, అప్పన, మేడ అని ముగ్గురు కొడుకులు. వీరిలో అప్పన్న మంత్రి, రాజనీతిలో చాణిక్యుడంతటి వాడు. ఇతని భార్య అంబ. కొడుకు గుండ, కుమార్తె నాగి. ఈ గుండ కూడా మల్లిఖార్జున చోడుని మంత్రి. ఇతని సామర్థ్యాలను మెచ్చుకుంటూ మహారాజు ఒల్లాల గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. ఇతని అన్న అప్పన కేశవ దేవరను ప్రతిష్ఠించిన సందర్భంగా కూడా మహారాజు దేవాలయానికి భూములను దానమిచ్చినట్లు ఈ శాసనం (క్రీ.శ.1098) చెబుతున్నది.

మార్కండేశ్వరాలయ శాసనం

నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో తిప్పర్తి మార్గంలో మార్కండేశ్వర ఆలయం ఉన్నది. దీని పక్కనే రామలింగాల గూడెం అనే గ్రామం ఉన్నది. ఈ గ్రామానికి, ఆలయానికి మధ్యలో ఉన్న పొలాల్లో ఒక శాసనం వెలుగు చూసింది. ఇది కందూరు భీమన చోడ మహారాజు వేయించిన శాసనం (క్రీ.శ. 1105). ఇది తెలుగు భాషలో ఉన్నది. ఈ శాసనం కందూరు రెండో తొండరస చోళమహారాజు రెండో కొడుకు భీమనచోడ మహారాజు వేయించాడు. తిప్పర్తి ప్రభుత్వాన్ని అష్టభోగంగా చేసి పాలిస్తున్న కావలి బ్రహ్మదేవయ్యకు కాళ్లు కడిగి దానమిచ్చినట్లు ఈ శాసనం చెబుతున్నది. ఈ శాసనంలో త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుని ప్రశంస ఉన్నది. తాటికంటి ఊరి చెరువు కింది కొంత భూమిని బ్రాహ్మణులకు రాజు దానమిచ్చినట్లు ఈ శాసనం రెండో వైపు చెబుతున్నది.

మార్కండేశ్వరాలయాన్ని పూర్వకాలంలో రామలింగేశ్వరాలయం అని పిలిచేవారు. ఈ ఆలయం పేరు మీదనే గ్రామం ఏర్పడింది. విష్ణుకుండి వంశీయులు రామలింగేశ్వరస్వామి భక్తులు. వీరి కాలంలో ప్రతిష్టించిన ముఖ్యమైన శివాలయాలన్నీ రామలింగేశ్వరాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిల్లో కీసర రామలింగేశ్వరాలయం, చెర్వుగట్టుపై వెలిసిన జడల రామలింగేశ్వరస్వామి, షాద్‌నగర్‌లోని ఉత్తర రాజరామలింగేశ్వరాలయాలు ముఖ్యమైనవి.
రామలింగాల గూడెంలో చిన్న కొండపై శివాలయ చిహ్నాలు ఉన్నాయి. ఈ ఆలయం ముందు భాగంలో మహిషాసురమర్దిని విగ్రహం ఉంది. దగ్గరలో రెండు నాగకన్యల శిల్పాలున్నాయి. కొండకు దగ్గరలో ఓ శిలపై పార్వతీపరమేశ్వరుల విగ్రహాలున్నాయి. ఈ శిల కింది భాగంలో నందీశ్వరుడున్నాడు. పానగల్ ఉదయ సముద్రం అలుగు వాగుగా ప్రవహించి, పెద్దదేవుల పల్లి చెరువును నింపి, కృష్ణానదిలో కలుస్తుంది. ఈ వాగు మార్కండేశ్వరాలయం పక్కనుంచే వెళ్తున్నది.

ఆగా మోత్కూర్ శాసనం

నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో ఆగామోత్కూర్ గ్రామంలో ఒక శివాలయం ఉన్నది. ఆలయంలో కందూరు రామనాథదేవ చోడ మహారాజు వేయించిన శాసనం ఉన్నది. నునుపుగా ఉన్న శిలాస్తంభంపై నాలుగు వైపులా ఈ శాసనం తెలుగులో చెక్కి ఉన్నది. మొదటి పక్క గణపతి విగ్రహం, రెండో పక్క పానవట్టంతో కూడిన శివలింగం, మూడో పక్క ఆవు-లేగ దూడ, నాలుగో పక్క సూర్యచంద్రుల ప్రతిబింబాలున్నాయి. శాసనారంభంలో కాకతీయ రుద్రమదేవి ప్రశంస ఉన్నది. రామనాథదేవచోడ మహారాజు తన తండ్రి వీరమల్నాధ దేవరను ప్రతిష్ఠించిన సందర్భంగా ఈ శాసనం (క్రీ.శ. 1282) వేయించాడు. కందూరు చోడులకు సంబంధించి ఇప్పటివరకు లభించిన శాసనాల్లో ఇదే చివరిది. ఒల్లాల శాసనం సంస్కృత భాగంలో మల్లిఖార్జున చోడుని మంత్రి అయిన గుండన వంశ వర్ణన ఉన్నది. వేంగీ మండలంలో అంతర్గతమైన అగ్రహారాన్ని త్రిణయన పల్లవుని నుంచి ఒక బ్రాహ్మణ వంశం పొందింది. ఈ వంశీకులు ఆత్రేయ గోత్రోద్భవులు. వీరి వంశంలో గుండన ప్రసిద్ధుడు. ఇతడు మల్లిఖార్జున చోడుని మంత్రి, మహా మేధావి.

నగేష్ బీరెడ్డి
ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ
సెల్ : 80966 77 177

1929
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles