ప్రేమ పక్షులు


Sun,February 10, 2019 04:38 AM

lovebrids
అందమైన పొదరింట్లో జతకట్టిన రెండు గోరువంకలను చూస్తే మనకు గుర్తుకొచ్చేది స్వచ్ఛమైన ప్రేమ.ఎందుకంటే ప్రేమకు చిహ్నంగా ఉండే వాటిలో ప్రేమ పక్షులు ఒకటి. మరి ఆ పక్షులు ఎందుకు ఇంత ప్రత్యేకతను సంతరించుకున్నాయి? ప్రేమకు చిహ్నంగా ఎందుకు మారాయి? అంటే ఈ అందమైన పక్షులు జీవితాంతం ఒకే భాగస్వామిని కలిగి ఉంటాయి. ఇవి ప్రేమను, విధేయతను తెలియజేస్తాయి. అందుకే ఈ లవ్ బర్డ్స్‌ని ప్రేమికుల రోజు బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటారు. మరి ఈ పక్షుల గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందామా...

అత్యంత ప్రాచుర్యం పొందిన చిలుకల జాతుల్లో లవ్ బర్డ్స్ ఒకటి. ఈ జాతికి చెందిన పక్షులు ఆఫ్రికా దేశానికి చెందినవి. మడగాస్కర్, ఆఫ్రికాలోని సవన్నా ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. సుమారు 1.9 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచే ఈ జాతి పక్షులు మనుగడలో ఉన్నట్టు శిలాజాలు బయటపడ్డాయి.

లవ్ బర్డ్స్‌లో చాలా రకాల పక్షులు ఉన్నాయి. కానీ 9 రకాల జాతులు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. వాటిలో మాస్క్ , బ్లాక్ చీక్ , ఫిషర్,నైసా, స్వీడన్, అభిసినియన్, రెడ్‌ఫేస్, మడగాస్కర్ లవ్‌బర్డ్స్ ఎక్కువ పాపులర్ అయ్యాయి. ఈ పక్షులు వేటికవే తమ ప్రత్యేకతలను, లక్షణాలను కలిగి ఉన్నాయి.

అన్ని చిలకల వలే ఈ లవ్‌బర్డ్స్ కూడా చాలా ఆక్టివ్‌గా ఉంటాయి. తెలివైనవి కూడా. యజమానులు వీటిని వ్యాయామానికి దూరంగా ఉంచుతారు. కానీ ఈ పక్షులకు వ్యాయామం అవసరం. పంజరం నుంచి కాసేపు బయటకు వదిలితే వాటి కండరాలకు కావాల్సిన శక్తి వస్తుంది. ఈ తెలివైన పక్షులకు అలాంటి స్వేచ్ఛ, ప్రేరణ అవసరం.

చాలా వరకు చిలకలు మాట్లాడతాయి అని మనకు తెలుసు. అయితే లవ్‌బర్డ్స్ మాత్రం మాట్లాడవు. ఇతర చిలకలలాగా మిమిక్రీ చేయడానికి ఇష్టపడవు. అయితే కొన్ని మాత్రం చిన్న చిన్న శబ్దాలను పలకడానికి ఇష్టపడతాయి. అందులో డోర్‌బెల్స్, మైక్రోవేవ్ సౌండ్, హారన్ లను పసిగట్టి మిమిక్రీ చేస్తాయి.

లవ్‌బర్డ్స్ అంటేనే ఒక జంట. ఇవి పది నెలల వయస్సులోనే తమ భాగస్వామిని ఎంచుకుంటాయి. అవి జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటాయి. చాలామంది వీటిని పెంచే క్రమంలో ఒంటరిగా ఉంచుతారు. ఈ ఒంటరితనం వల్ల లవ్‌బర్డ్స్ ఒత్తిడికి గురై చనిపోయే ప్రమాదం ఉంది. చిలక జాతుల్లో ఇవే చిన్న సైజ్ పక్షులు. ఆరు నుంచి ఏడు అంగుళాల పొడవు మాత్రమే పెరుగుతాయి.

- వినోద్ మామిడాల

1944
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles