సల్లూభాయ్.. సబ్బుల ప్రేమికుడు!


Sun,February 10, 2019 04:29 AM

salman
సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ నటుడు, కండల వీరుడు, జింకల కేసులో శిక్ష అనుభవించిన హీరో అని మాత్రమే మీకు తెలుసు. కానీ సల్లూభాయ్ గురించి ప్రపంచానికి తెలియనివి చాలా విషయాలున్నాయి. ఆ విశేషాలన్నీ ఈ వారం మరోకోణంలో..

సల్మాన్ ఖాన్‌కి బైకులు, కార్లంటే చాలా ఇష్టం. సల్లూభాయ్ దగ్గర ఆడి ఆర్8, లాండ్‌రోవర్, రేంజ్ రోవర్ వోగ్యూ, ఆడి క్యూ7, ఎలక్ట్రిక్ బ్లూ సుజుకి ఇంట్రూడర్ ఎం1800 ఆర్‌జెడ్ లిమిటెడ్ ఎడిషన్ మోటర్‌బైక్, సుజుకి హయబూస, బీఎండబ్ల్యూ ఎక్స్6, టయోట లాండ్ క్రూసర్, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ క్లాస్ వంటి కార్లు ఆయన ఎంతో ఇష్టంతో కొనుక్కున్నాడు. ఇన్నిరోజులు బాలీవుడ్ హీరోగా మాత్రమే తెలిసిన సల్మాన్ ఖాన్‌లో ఓ ఆర్టిస్టు, గాయకుడు, గజ ఈతగాడు, కోపిష్టి, మంచి మానవత్వం ఉన్న మనిషి, సబ్బుల ప్రేమికుడు అనే మరో కోణం కూడా ఉంది.

సల్మాన్ భాయ్ అసలు పేరేంటో తెలుసా? అబ్దుల్ రషిద్ సలీమ్ సల్మాన్ ఖాన్. యుక్త వయసులో సల్లూ భాయ్ ట్రిగ్మినల్ న్యూరాల్జియా అనే వ్యాధితో బాధపడ్డాడు. ఈ వ్యాధి తీవ్రత వల్ల ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకునేందకు కూడా ప్రయత్నించేవాడు. ఆ తర్వాత దీర్ఘకాలిక కౌన్సిలింగ్‌తో మళ్లీ మామూలు మనిషయ్యాడు. మీకో విషయం తెలుసా? సల్మాన్ ఖాన్‌కి సబ్బులంటే చాలా ఇష్టం. ఆయన బాత్రూమ్‌లో చాలా సబ్బులుంటాయి. అవన్నీ పండ్లు, కూరగాయలతో చేసినవే. సల్మాన్ ఎవరితోనైనా మాట్లాడాలంటే నేరుగా లేదా ఫోన్‌లో మాట్లాడుతాడు. ఆయనకు ఇ-మెయిల్ ఐడీ లేదు. సల్మాన్ ఖాన్ మంచి పెయింటర్. జయహో పోస్టర్ సల్లూ భాయ్ వేసిందే. అంతేకాదు.. అమీర్‌ఖాన్ ఇంట్లో గోడల మీద సల్మాన్ ఖాన్ వేసిన పెయింటింగ్స్‌తో డెకరేట్ చేసుకున్నాడు. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా స్వయంగా పెయింటింగ్స్ వేసి సెలబ్రిటీలకు గిఫ్ట్‌గా ఇస్తాడు.

సల్లూభాయ్‌ని సినిమా ఇండస్ట్రీలో లాంచ్ పాడ్ అంటారు. కొత్తవారికి అవకాశాలివ్వడంలో సల్లూభాయ్ తర్వాతే ఎవరైనా. నగ్మ, భూమిక, స్నేహా ఉల్లాల్, కత్రినా కైఫ్, జరీన్‌ఖాన్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోయిన్లను, ఎంతోమంది డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లను పరిచయం చేసింది సల్మాన్ ఖానే. కండల వీరుడిగా మారడానికి సల్లూభాయ్‌కి హృతిక్ రోషన్, అర్జున్ కపూర్‌లను ఆదర్శంగా తీసుకున్నాడు. ఫ్యాన్సంటే సల్మాన్ ఖాన్‌కి ఎంత ఇష్టమో చాలా సందర్భాల్లో బయటపడింది. ముంబైలో సల్లూభాయ్‌కి భాయ్‌జాన్ అనే రెస్టారెంట్ పెట్టి దాన్ని ఫ్యాన్స్‌కి అంకితం చేశాడు. చిన్నప్పటి నుంచి సల్మాన్‌ఖాన్ మంచి ఈతగాడు. స్కూల్లో చదువుకునేటప్పుడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. ఇప్పటికీ ప్రత్యేకంగా తన కోసం ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకున్నాడు. ఫామ్‌హౌజ్‌కి వెళ్తే ఎక్కువ సమయం స్విమ్మింగ్ పూల్‌లోనే గడుపుతాడు. భజరంగీ భాయ్‌జాన్ సినిమాలో సెల్ఫీ లే లే రే పాట తెలుసుగా. ఆ పాటలో సెల్ఫీకి అంతలా ఫోజిచ్చిన సల్లూభాయ్‌కి సెల్ఫీ అంటే అర్థమే తెలియదట.

ఈ కండల వీరుడు అప్పుడప్పుడు గరిటె కూడా తిప్పుతాడు. ఖాళీగా ఉన్న సమయంలో కెమెరా పట్టుకొని ఫొటోలు తీస్తాడు. ఐశ్వర్యరాయ్ అంటే సల్లూభాయ్‌కి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అయితే.. ఆయన ఇప్పటికీ ఐష్ బర్త్‌డేకి ఎస్సెమ్మెస్ రూపంలో శుభాకాంక్షలు పంపుతుంటాడు. భాయ్.. బేకరీ ఫుడ్‌కి చాలా దూరంగా ఉంటాడు. ఈ బాలీవుడ్ కండల వీరుడికి విమానంలో ఎడమవైపు కూర్చోవాలంటే చాలా భయం. అందుకే విమానంలో ఎక్కడికి వెళ్లినా కుడివైపునే కూర్చుంటాడు. 2007 నుంచి బీయింగ్ హ్యూమన్ పేరుతో ఒక సంస్థను స్థాపించి పేదవారికి సమాజ సేవ చేస్తున్నాడు. సల్లూ భాయ్ మంచి మనసున్న మనిషి. అందుకే 500 మంది పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. అంతేకాదు.. ఎంతోమందికి గుండె ఆపరేషన్లు, కంటి చికిత్స, అవయవదానం వంటి కార్యక్రమాలతో కొత్త జీవితాన్నిచ్చాడు. ప్రతి శుక్రవారం వీధి బాలలకు బీయింగ్ హ్యూమన్ టీషర్టులు పంచుతాడు. భజరంగీ భాయ్‌జాన్ సినిమా మీద వచ్చిన లాభమంతా సల్లూభాయ్ పేదలకు పంచేశాడు. ఎవరైనా పుట్టినరోజు నాడు ఇంట్లో ఉండడానికే ప్రయత్నిస్తారు.

కానీ సల్మాన్ ఖాన్ మాత్రం అస్సలు ముంబైలో ఉండడు. సల్లూభాయ్‌కి చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముంబైలోని చైనా గార్డెన్ అనే రెస్టారెంట్‌లో దొరికే చైనీస్ ఫుడ్ అంటే సల్మాన్‌కి చాలా ఇష్టం. నటుడిగా, నిర్మాతగా మాత్రమే కాదు.. చంద్రముఖి, వీర్ అనే రెండు సినిమాలకు కథలు కూడా రాశాడు. తోటి నటులకు ఎప్పటికప్పుడు విలువైన కార్లు బహుమతిగా ఇస్తుంటాడు. సల్లూ భాయ్ మంచి పాటగాడు కూడా. బర్త్ డే పార్టీలు, స్నేహితులతో కలిసినప్పుడు సరదాగా పాటలు పాడుతాడు. సల్మాన్ చేతికి ఎప్పుడూ టర్కిష్ స్టోన్‌తో చేసిన బ్రాస్‌లెట్ ఉంటుంది. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ చేతికి కూడా అలాంటి బ్రాస్‌లెట్ ఉంటుంది. అది ఎప్పుడు చేతికి ఉండడం అదృష్టంగా భావిస్తాడు సల్లూభాయ్. సినిమాల్లోకి రాకముందు సల్లూభాయ్ మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. ఆపిల్స్, ద్రాక్ష అంటే సల్మాన్‌ఖాన్‌కి చాలా ఇష్టం. కానీ డాక్టర్ సలహా మేరకు ద్రాక్షపండ్లకు దూరంగా ఉంటాడు.

- ప్రవీణ్‌కుమార్ సుంకరి
9701557412

1878
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles