పాకిస్తాన్‌లో తొలి హిందూ మహిళా జడ్జిగా సుమన్‌కుమారి


Sun,February 10, 2019 04:25 AM

Pak-Judge-Suman
సింద్ ప్రాంతంలో వెనుకబడిన చాలామందికి న్యాయసేవలు అందడం లేదని, వారి కి న్యాయసేవలు అందించడానికే తాను ఈ వృత్తిలోకి వచ్చానని సుమన్‌కుమారి తెలిపారు. తాను ఈ స్థాయికి రావడానికి తన తండ్రి డాక్టర్ పవన్‌కుమార్ బోధన్ తో పాటు ఇతర కుటుంబ సభ్యుల మద్దతు ఇతోధికంగా ఉన్నదన్నారు. ఆమె తండ్రి పవన్‌కుమార్ స్పందిస్తూ పేదలు, ప్రత్యేకించి హిందువులకు అవసరమైన న్యాయ సాయం అందించేందుకు వీలుగా ఆమెకు స్వేచ్ఛనిచ్చినట్లు తెలిపారు. పేదల కు ఉచిత న్యాయ సేవలందించడమంటే కుమారికి ఎంతో ఇష్టమని ఆయన వెల్లడించారు. అందుకోసమే తన కూతురు చాలెంజింగ్ ప్రొఫెషన్‌ను ఎంచుకుందని తెలిపారు.సుమన్ ఎంచుకున్న ఉద్యోగం కష్టమైనదే అయినప్పటికీ ఆమె కష్టపడేతత్వం, నిజాయితే ఆమెకు రక్షణగా నిలుస్తాయని పవన్ కుమార్ అన్నారు.

ముస్లింల ఆధిక్యం గల పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రం కంబర్ షహ్‌దత్‌కోట్ జిల్లాకు చెందిన సుమన్ కుమారి అదే జిల్లా కోర్టుకు న్యాయమూర్తిగా సేవలందించనున్నారు. సుమన్ కుమారి తన ఎల్‌ఎల్ బీ కోర్సును పాక్‌లోని హైదరాబాద్‌లో పూర్తిచేశారు. తర్వాత కరాచీలోని జబిస్త్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ చేశారు. అనంతరం ఒక సంస్థలో న్యాయవాదిగా కొంతకాలం పనిచేశారు.

లతా అంటే ఇష్టం

ఉన్నత విద్యావంతులైన సుమన్‌కుమారి కుటుంబంలో ఆమె ఒక్కరే న్యాయవాది గా ఉన్నారు. సివిల్ జడ్జి/జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నియామకాలకు జరిగిన పరీక్షలో కుమారి 54వ స్థానంలో నిలిచారు. తండ్రి పవన్‌కుమార్ బోదన్ ఆప్తమాలజిస్ట్ కాగా ఆమె పెద్దక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, మరో సోదరి చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఇక కుమారికి భారత గాయకులు లతా మంగేష్కర్, అతిఫ్ అస్లాంల పాటలంటే ఎంతో ఇష్టమని తెలిపింది. సుమన్ గతంలో న్యాయవాదిగా పనిచేసిన సమయంలో తమ కేసులు వాదించేందుకు లాయర్లు ఎక్కువ ఫీజులు తీసుకుంటుండటంతో అంత ఫీజులు చెల్లించలేక పోతున్న పేదలకు ఉచితంగా కేసులు వాదించేది.
Pak-Judge-Suman1

హిందువులు 2 శాతమే

పాకిస్తాన్ జనాభాలో 2శాతం మాత్రమే హిందూ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. అంతేకాదు ఇస్లాం మతం తర్వాత పాకిస్తాన్‌లో అత్యధికంగా హిం దూ మతమే ఉంది. నాడు దేశ విభజన సమయంలో చాలామంది భారత్‌ను వీడి పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. ముఖ్యంగా మహమ్మద్ జిన్నా అడుగుజాడల్లో నడిచినవారు చాలామంది పాకిస్తాన్‌కు వెళ్లి సెటిల్ అయ్యారు. అందులో ఎక్కువగా ముస్లిం సామాజికవర్గం వారే ఉన్నారు. ఇక దేశవిభజనకు ముందు నుంచి అక్కడే ఉన్న హిందువులు దేశ విభజన సమయంలో వారి ఆస్తులను వదులుకొని భారత్‌లోకి వచ్చేందుకు ఇష్టపడకపోవడంతో వారు అక్కడే ఉండిపోయారు.

రెండవ హిందూ

అయితే జడ్జిగా ఒక హిందువు నియమితులవ్వడం ఇదే తొలిసారి కాదు. పాకిస్తాన్‌లో తొలి హిందూ పురుష న్యాయమూర్తి రాణా భగవాన్ దాస్. 2005- 2007 మధ్య కాలంలో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అది కూడా ఆయన తాత్కాలిక న్యాయమూర్తిగా మాత్రమే సేవలందించారు. అయితే హిం దూ మహిళా న్యాయమూర్తిగా నియమితులవ్వడం మాత్రం ఇదే తొలిసారి.

నిజాయితీగా పనిచేస్తా..

న్యాయవాద వృత్తిలో కొనసాగడానికి నా తండ్రి, కుటుంబం ఎంతో ప్రోత్సహించింది. సవాళ్ళతో కూడిన వృత్తి అంటే నాకు చాలా ఇష్టం. అదే సమయంలో కఠోర శ్రమతో, నిజాయితీగా నా విధులను నిర్వర్తించగలనని నమ్ముతున్నాను. నా వల్ల నలుగురు పేదవారికి సత్వరన్యాయం అందినా అదే విజయంగా భావిస్తా. సింధ్ ప్రాంతంలోని పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా వారు ఆశించిన దానికంటే పదిరేట్లు కష్టపడి పనిచేయడానికి నా శాయశక్తుల కృషి చేస్తా.
- సుమన్‌కుమారి

- మధుకర్ వైద్యుల

747
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles