ప్రేమ కానుక!


Sun,February 10, 2019 04:17 AM

Love
ప్రేమ అంటే ఏమిటి..? కనులు కనులతో కలబడితే కాదు ప్రేమంటే.. కనపడనప్పుడు కలవరపడడమే ప్రేమ!మనసు మనసును దోచుకోవడమే కాదు ప్రేమంటే..
ఒకరికోసం ఒకరి మనసు పరితపించడమే ప్రేమ!అన్నీ నచ్చి.. మెచ్చి ఇచ్చేది కాదు ప్రేమంటే.. కష్టసుఖాల్లోనూ నేనున్నాననే భరోసానే ప్రేమ! కానీ కొన్నిసార్లు ప్రేమను వ్యక్తపరుచకపోతే ఎదుటివారికి తెలియదు.. వారికి తెలియాలంటే చిన్నాచితకా బహుమతులు ఇవ్వాల్సిందే!ఈ ప్రేమికుల దినోత్సవాన అలాంటి
ప్రేమకానుకలే ఇస్తున్నాం.. వాటిని ఇచ్చినప్పుడు వాటి అర్థాలేంటో తెలుసుకొని మరీ ఇవ్వండి..

చాక్లెట్స్

ప్రేమికులు ఎక్కువగా ఇచ్చి పుచ్చుకునే బహుమతుల్లో చాక్లెట్స్‌దే ప్రథమ స్థానం. పైగా వీటిని చాలా విలువైన బహుమతిగా పరిగణిస్తారు. అమ్మాయిల్లాగే.. ఇవి కూడా చాలా దైవికంగా, సున్నితంగా ఉంటాయని అంటారు. పైగా మనసులోని కోరికలను ఉత్తేజపరుచడంలో చాక్లెట్లు ముందుంటాయి. అందువల్ల.. హార్ట్ షేప్‌లో ఉండే ఒక చాక్లెట్ బాక్స్‌లో, అదే షేప్‌లో ఉండే చాక్లెట్లు మీ ప్రియమైన వారికి ఇవ్వడం మాత్రం మరువొద్దు.

మసాజ్

ఒత్తిడిలో ఉన్నప్పుడు మసాజ్ చేస్తుంటే ఆ హాయే వేరు. ఎదుటి వారి బాధలను.. తన బాధలుగా భావించి మసలుకొనే ప్రేమికులుంటే అంతకన్నా ఏం కావాలి. మసాజ్ కోసం మీకు పార్లర్‌లో బుకింగ్ చేస్తే వారికి మీ పట్ల ఎంతో శ్రద్ధ ఉందని లెక్క. పైగా ఆ శ్రమ వారి వల్లే అయితే దానికి గిల్టీ ఫీలింగ్ ఉన్నదని భావించొచ్చు.

గులాబీలు

గులాబీలంటే ప్రేమకు చిహ్నాలు. ఒక్కో గులాబీకి ఒక్కో అర్థం ఉంటుంది. కానీ ఎర్ర గులాబీ మాత్రం సంప్రదాయ ప్రేమికుల దినోత్సవానికి బహుమతిగా ప్రేమికులు ఎప్పుడో ప్రకటించేశారు. ఎరుపు గులాబీ.. మానవ గుండెకి ఏదో సంబంధం ఉందట. అందుకే ప్రేమికులు ఒకరికొకరు ఎర్రగులాబీలు ఇచ్చుకుంటే, ఒకరి గుండె మరొకరికి ఇచ్చినట్టుగా భావిస్తారట.

టెడ్డీబేర్

వెచ్చని కౌగిలి కోరుకునే వాళ్లు ఈ బహుమతి ఇస్తారట. టెడ్డీబేర్ చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది. చూడగానే దాన్ని పట్టుకొని అలాగే ఉండాలనిపిస్తుంది. అలాగే.. ప్రేమికులు ఒకరినొకరు విడిచి ఉండలేం అని చెప్పేందుకు ఈ బహుమతిని ఇచ్చిపుచ్చుకుంటారు. స్పెషల్ ఫీల్ కలుగడానికి ఈ గిఫ్ట్ మంచి ఆప్షన్ అని కూడా అంటున్నారు ప్రేమ పండితులు.

గ్రీటింగ్ కార్డ్స్

మనసులోని భావాలను వ్యక్తపరుచాలంటే అందరికీ అది సాధ్యం కాదు. అలాంటప్పుడు గ్రీటింగ్ కార్డ్‌లు ఇవ్వడం మంచిది. మీకు ఎదుటివారి పట్ల ఎంత ప్రేమ, ఆప్యాయత ఉన్నాయో చెప్పే కార్డ్స్‌ని ఎంచుకోవడం మంచిది. అందుకే ఈ ప్రేమికుల దినోత్సవం రోజున గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకోవడం
ఆనవాయితీగా మారింది.

ప్రేమలేఖలు

మనం ప్రేమతో రాసే ఒక్క పదం.. ఎన్నో భావాలను పలికిస్తుంది. మీరు మంచి కవి అయితే.. మీ ప్రేమికురాలు/ప్రేమికుడి కోసం ఒక కవిత రాయండి. లేదా ఒక ప్రేమ పత్రాన్ని రాసుకోండి. ఇద్దరు గడిపిన క్షణాలకు ఒక అక్షర రూపం ఇవ్వండి. ఇలాంటి ఉత్తరాలు నిజంగా జీవితాంతం తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. అన్నింటిలో మీరు మీ భాగస్వామికి ఇచ్చే మంచి గిఫ్ట్ అవుతుంది.

వాలెంటైన్స్ డే డ్రెస్ కోడ్

ఆల్రెడీ ప్రేమలో ఉన్నారు..
రిప్లయి కోసం వెయిటింగ్..
ఆల్రెడీ బుక్డ్
ప్రపోజల్ ఓకే..
ప్రేమ అప్లికేషన్స్‌కి ఆహ్వానం..
బ్రేకప్..
ప్రపోజల్ రిజెక్టెడ్
ప్రేమను వ్యక్తపరుచడానికి..

హార్ట్ లాకెట్

రెండు హృదయాలు ఒక్కటయితే ఎలా ఉంటుంది? అచ్చు ఈ లాకెట్‌లా ఉంటుందంటారు ప్రేమికులు. ఇలా హార్ట్ షేప్‌లో ఉండే లాకెట్‌లను ఇచ్చుకోవచ్చు. వెండి, బంగారం, ప్లాటినం.. ఇలా రకరకాల మెటీరియల్స్‌తో వీటిని చేయించి ఎదుటి వారిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయొచ్చు. ఇవి కాకుండా వివిధ రకాల జువెలరీలను అంటే.. ఉంగరాలు, చెవి పోగులు ఇలా రకరకాల బహుమతులను ఈ కేటగిరీలోకి వేసేయొచ్చు.

పర్‌ఫ్యూమ్

అమ్మాయిలకు కాస్మొటిక్స్.. అబ్బాయిలకు పర్‌ఫ్యూమ్ అనేవి బహుమతులుగా ఇచ్చుకోవచ్చు. అమ్మాయిలకు కూడా పర్‌ఫ్యూమ్‌ని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఆ వాసన వల్ల ప్రేమోద్దీపనలు కలుగుతాయి. దీనివల్ల ఒకరి పట్ల ఒకరికి ప్రేమ భావనలు మరింత పెరుగుతాయి. డేటింగ్‌కి వెళదామన్న సందేశం కూడా పర్‌ఫ్యూమ్ ఇస్తుందని నమ్ముతారు.

గ్యాడ్జెట్స్

ఎదుటి వారి అవసరాలు తీర్చినప్పుడు.. వారి పట్ల మన కేరింగ్ ఏంటో తెలిసిపోతుంది. అందుకే ఫోన్, ట్యాబ్లెట్స్, ఇతర గ్యాడ్జెట్స్‌లని కూడా ప్రేమికుల దినోత్సవ బహుమతుల్లో చేర్చారు ప్రేమికులు. వాటి లోటును పూడ్చి.. వారి ముఖాల్లో ఆనందాన్ని పెంచడానికి ఇలాంటి బహుమతులు పనికొస్తాయి. డబ్బుల విషయాలను బట్టి కాకుండా.. దీన్ని అవసరాన్ని తీర్చేదిగా భావిస్తే మంచిదని ప్రేమికుల భావం.
- సౌమ్య పలుస

1101
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles