ప్రయాణం


Sun,February 10, 2019 03:59 AM

Prayanam
జోస్లిన్ తన విమానాన్ని మిస్సయ్యాడు. మిగిలిన విమానాలన్నీ నిండిపోయాయి. తనకో సీట్ దొరకదేమో నని భయపడ్డాడు. కాని బహుశ ప్రయాణంలో దేవుడ్ని అధికంగా ప్రార్ధించడం వల్లేమో రిజర్వేషన్ కౌంటర్లోని క్లర్క్ ఒకే సీట్ ఉందని, దాన్ని రిజర్వ్ చేసుకున్న వాళ్ళు అంతదాకా రాలేదని, రాకపోతే ఇస్తానని, వేచి ఉండమనీ కోరాడు.

జోస్లిన్ రైల్వే ప్లాట్‌ఫాం మీద నిలబడ్డాడు. మూతలు తెరచి ఉన్న డ్రైనేజ్ మేన్‌హోల్ నించి దుర్గంధం వస్తున్నది. పదేళ్ళుగా అతనికి ఇవన్నీ అనుభవాలే. భరించలేనన్ని ఈగలు ఉన్నాయి. వేడిగా ఉంది.

జోస్లిన్ క్రిస్టియన్ మిషనరీ. అతను పెషావర్లో పదేళ్ళుగా పని చేస్తూ, హిందూ, ముస్లిమ్‌లని తన మతంలోకి మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. దూరం నించి రేగిన దుమ్ముని చూసి రైలు వస్తున్నదని గ్రహించాడు. అతను రైలు ఎక్కడానికి మిగిలిన ప్రయాణీకులతో పోటీ పడటానికి సిద్ధంగా నిలబడ్డాడు. స్వభావరీత్యా పిరికివాడైన జోస్లిన్ ధైర్యాన్ని ప్రదర్శించేది రైలెక్కేప్పుడే. రైలు ఆగీ ఆగగానే చేతిలోని సూట్‌కేస్‌తో ఓ కంపార్ట్‌మెంట్ వైపు పరిగెత్తాడు. ఇతర పోటీదారులు అతన్ని తోసేసి లోపలకి ఎక్కారు. కాని అతను వెనకాల వాళ్ళకి అడ్డంగా ఉండటంతో ముందుకి తోయబడ్డాడు. అలా అతను కంపార్ట్‌మెంట్ తలుపు దగ్గరికి చేరుకుని లోపలికి ఎక్కాడు.
గుమ్మం దగ్గర నిలబడ్డ ఇద్దరు యువకులు జోస్లిన్‌ని చూసి నవ్వుతూ, లోపల చాలా ఖాళీ ఉన్నా అతన్ని అడ్డగించే ప్రయత్నం చేసారు. వాళ్లను కొండ ప్రాంతానికి చెందిన అనాగరిక జాతి వాళ్ళుగా గుర్తించాడు. అలాంటి వాళ్ళని కొందర్ని అతను క్రిస్టియన్ మతంలోకి విజయవంతంగా చేర్చాడు.

జోస్లిన్ సూట్‌కేస్‌ని తన ముందుంచి, వాళ్ళని పక్కకి నెట్టి లోపలకి వెళ్ళాడు. అప్పటికే అతనికి చెమట పట్టి రొప్పసాగాడు. ఓ ఖాళీ సీట్లో కూర్చున్నాక ఆనందం కలిగింది. ఎవరైనా తను ఆ రైలెక్కే పద్ధతిని సినిమా తీసి లండన్‌లో చూపిస్తే వాళ్ళు తనని రౌడీ మిషనరీగా భావిస్తారని అనుకున్నాడు. క్రమశిక్షణతో ప్రవర్తించే తన దేశస్థులకి బలవంతుడిదే రాజ్యం అన్న ఇక్కడి సిద్ధాంతం తెలీదు. అతను సెలవ మీద ఇంటికి వెళ్తున్నాడు. రైలు కదలగానే అతని సెలవు ఆరంభమౌతుంది.
అతను జేబులోంచి రుమాలు తీసి మొహం తుడుచుకున్నాడు. రైలు బయలుదేరింది. ఇందాక రద్దీగా ఉన్న ప్లాట్‌ఫాం నిర్మానుశ్యమవడం జోస్లిన్ కిటికీ లోంచి గమనించాడు. పెట్టెలోపల అరుపులు, కేకలు. దానర్థం కొందరు రైలు పెట్టె మీదకి ఎక్కి ఉంటారని, లేదా వేలాడుతూండి ఉండచ్చని అనుకున్నాడు. తను ఎన్నడూ రైలు కింద పడి మరణించినవారి గురించిన వార్తని పత్రికల్లో చదవలేదు. వీళ్ళు ఇంత చాకచక్యంగా ఎలా ప్రయాణించగలరు అనుకున్నాడు.

ఇందాక అతన్ని అడ్డగించిన ఇద్దరూ జోస్లిన్‌కి కొద్ది దూరంలో కూర్చున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడే స్థానిక భాషని జోస్లిన్ అర్ధం చేసుకోగలడు. వాళ్ళు తన దుస్తులు, రంగు గురించి విమర్శలు చెయ్యడం విన్నాడు. వారి విమర్శలకి తను ఎలా స్పందిస్తున్నాడా అని వాళ్ళు అప్పుడప్పుడూ తన వంక దొంగతనంగా చూడటం గమనించాడు. బదులుగా జోస్లిన్ డైలీ టెలిగ్రాఫ్ దినపత్రికని తెరచి కందగడ్డగా మారిన మొహాన్ని అందులో దాచాడు. వారిని మందలించి తనకి వారి భాష అర్థమవుతుందని చెప్పడానికి అతను ఇష్టపడలేదు. రంగు, జాతితో సంబంధం లేకుండా జోస్లిన్ మనుషలు అందర్నీ సమానంగా ప్రేమిస్తాడు. కనీసం ద్వేషించడు. అందుకే వాళ్ళతో వాదనకి దిగదలచుకోలేదు.

అతను దినపత్రికలోంచి అప్పుడప్పుడూ ఆ ఇద్దరి వంకా చూసీ చూడనట్లుగా చూడసాగాడు. ఆ కొండ జాతి వాళ్ళు అహంభావులు. వేటాడే మనస్తత్వం. వారి ఎముకల నిర్మాణం బలిష్టమైనవి. వారి మొహాలు చాలా ఉత్సాహంగా ఉండి కళ్ళు మెరుస్తుంటాయి. వారి చర్మం నల్లగా మెరుస్తున్నది. సాంప్రదాయ దుస్తుల్లోని వారి నెత్తి మీద తలపాగాలు. రైలు అటు, ఇటు ఊగుతూ ముందుకి పోతున్నది. సమయం గడిచే కొద్దీ జోస్లిన్‌కి చెమటలు అధికమయ్యాయి.
మధ్యాహ్నం అవుతూండటంతో వేడి పెరిగి ఆ కంపార్ట్‌మెంట్ నిప్పుల కొలిమిలా అనిపిస్తున్నది. ఇంగ్లండ్‌లోలా సీట్ల మీద తోలు కాక మరేదో ప్రత్యామ్నాయమైంది కుట్టడంతో లోపల నించి వేడి తాకుతున్నది.

ఆ ఇద్దరూ తమలో తాము తమ వృత్తి గురించి మాట్లాడుకుంటున్నారు. అతను చెవులు రిక్కించి వింటే వారి వృత్తి హత్యలు చేయడమని అర్థమైంది. ఆ ఇద్దరూ ఆ రైల్లో తరచూ ప్రయాణిస్తూంటారని, బాధితుడు దొరికితే చంపి అతని సామానుతో మాయమవుతారని జోస్లిన్‌కి అర్థమైంది. తను వారితో ఒంటరిగా కాక రద్దీగా ఉన్న కంపార్ట్‌మెంట్లో ఉన్నందుకు జోస్లిన్ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేసాడు. తను లాహోర్ చేరుకునే దాకా ఆ పెట్టె రద్దీగా ఉండాలనే ప్రార్థించాడు.
స్టీల్ కళ్ళజోడు ధరించాడంటే ఇతను ధనవంతుడు అబ్దుల్. ఇతని దగ్గర చాలా డబ్బు ఉండి ఉంటుంది.
వెంటనే జోస్లిన్‌కి వాళ్ళు మాట్లాడేది తన గురించని అర్థమైంది. తనని ఎలా చంపుతారన్నది అతనికి అంతు పట్టలేదు. అలాగే ఎప్పటిలా జోస్లిన్ వెంటనే దేవుడ్ని ప్రార్థించి దినపత్రిక పేజీని తిప్పాడు. అది తన దగ్గర ఉన్నందుకు సంతోషించాడు. లేదా తన మొహంలోని భయాన్ని వాళ్ళు పసి కట్టేవారు.
కత్తి ఆ ఇద్దరిలోని ఒకరు చెప్పారు.
కాని చాలా రక్తం కారుతుంది. అతని జేబులోంచి నోట్లు కూడా తడిసిపోవచ్చు. క్రితం సారి అలాగే అయిందిగా రెండో వాడు దానికి అభ్యంతరం చెప్పాడు.
మొదటివాడు పకపకా నవ్వుతూ గొంతు పిసకడం గురించి చెప్పాడు. జోస్లిన్ తలెత్తి అలారం చెయిన్ ఎక్కడ ఉందో గుర్తు పెట్టుకున్నాడు. కాని అది తనకి చాలా దూరంలో ఉంది.

కత్తే త్వరగా చంపుతుంది. కోడి మెడలా గొంతు కోయచ్చు. అతనిది పొడుగైన మెడ కూడా. మొదటివాడు చెప్పాడు.
జోస్లిన్ చేతిలోని పేపర్‌కి, అతని మొహానికి మధ్య ఓ దోమ ఎగరసాగింది. అతను చేతి రుమాలు తీసి దాన్ని తోలాడు. అది ఎగిరిపోయింది. జోస్లిన్ తను ఆ ఆపద నించి ఎలా తప్పించుకోవచ్చో ఆలోచించాడు. ఒకటి రైల్లోంచి దూకాలి. కాని తలుపు హేండిల్ తెరచుకోకుండా తాళం వేసి ఉంటే? రెండు. నిప్పు అంటించాలి. పొగ చూస్తే అంతా తనని గమనిస్తారు. దేన్ని అంటించాలి? కాని ఆ ఇద్దరూ వెంటనే నిప్పుని ఆర్పేస్తారు. మూడు. తర్వాతి స్టేషన్‌లో దిగిపోవాలి. కాని వాళ్ళకి తనే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. నిర్మానుశ్యమైన ప్లాట్‌ఫాం మీద వాళ్ళు తనని చంపచ్చు. తర్వాతి స్టేషన్‌లోగా తనని వాళ్ళు ఇక్కడే చంపకపోతే. తన సెలవులోని ఓ రోజు వృధా అవచ్చు కూడా. తర్వాతి రైలు ఎప్పుడు ఉందో?

వాళ్ళని భయపెట్టాలి. కాని ఎలా? వాళ్ళు అన్ని రకాల భయాలకి అతీతులు. జోస్లిన్ ఆ ఇద్దరి వంకా ఓ రకంటితో చూసాడు. వాళ్ళిద్దరూ మొహంలో మొహం పెట్టి ఏవో గుసగుసలాడుకుంటున్నారు. తను ఎలా భయపెట్టగలడా అని ఆలోచించాడు. ఓ ఆలోచన వచ్చినా బ్రిటీష్ వాడైన జోస్లిన్‌కి అది నచ్చలేదు.
అకస్మాత్తుగా పెద్దగా అరుస్తూ లేచి దుస్తులన్నీ విప్పేయాలి. తను ప్రమాదకరమైన పిచ్చి వాడని వాళ్ళు భావించచ్చు. చెవులు రిక్కిస్తే వాళ్ళ మాటలు వినిపించాయి.
లేదు. లేదు. అతన్ని సీట్ కింద దాద్దాం. అది తేలిక.
కాని రక్తం మాటేమిటి?

అతని చర్మం నిండా ముడతలు. అంత రక్తం అతనిలో ఉండదు.
జోస్లిన్‌కి మరో ఆలోచన వచ్చింది. వారిద్దర్నీ ఓ పిన్నుతో పొడిచి దాని చివర విషం ఉందని, దానికి విరుగుడు రైలు తర్వాతి స్టేషన్‌కి చేరాక ఇస్తానని చెప్తే? వాళ్ళు హత్య గురించి ఆలోచిస్తూంటే జోస్లిన్ విషం గురించి ఆలోచించసాగాడు. అకస్మాత్తుగా తన దగ్గర పిన్ను లేదని స్ఫురించింది.
కిటికీ లోంచి ఎండ సూటిగా జోస్లిన్ మీద పడుతున్నది. రైలు దిశ మార్చుకునే దాకా తనా వేడిని భరించాలి. వాళ్ళిద్దరూ మాట్లాడటం ఆపి అతని వంకే దీక్షగా చూస్తున్నారు. అకస్మాత్తుగా రైలు కూత పెట్టింది. వెంటనే లోపలంతా చీకటి. రైలు ఓ సొరంగంలోకి ప్రవేశించింది. కంపార్ట్‌మెంట్ నిండా ఆవిరి.
జోస్లిన్ దగ్గుతూ కిటికీ తలుపులు తెరిచే ప్రయత్నం చేసాడు. అది జామ్ అవడంతో తెరచుకోలేదు. సొరంగం లోంచి రైలు బయటకి వచ్చాక అటు, ఇటు పెద్ద రాతి గోడలా కొండ కనిపించింది. చాలా కింద చెట్ల పైభాగాలు ఆశ్చర్యార్థకాల్లా కనిపించాయి. తనని కిందకి తోస్తే బహుశ తన అస్థిపంజరాన్నే ఎవరైనా, ఎప్పుడైనా చూడచ్చు. చేతి రుమాలుతో కనుబొమలని తుడుచుకున్నాడు. వాళ్ళిద్దరికీ ఈ సొరంగం చిన్నదని తెలుసు. పెద్ద సొరంగం కోసం వేచి ఉన్నట్లుగా, తనని చంపే సరైన సమయం ఏదో వాళ్ళకి తెలుసని జోస్లిన్‌కి అనిపించింది. కాని ఎప్పుడు? తర్వాతి స్టేషన్ దాటాకా? లేక ఇంకా ముందేనా? అందువల్ల వాళ్ళు ప్లాట్‌ఫాం మీది రద్దీలో కలిసి పారిపోవచ్చు.
జోస్లిన్ అంతదాకా ఆగదలచుకోలేదు. అతని ప్రయత్నం చూసి పక్క వ్యక్తి కిటికీ తలుపులు తెరవడంలో సహాయం చేసాడు. తన సూట్‌కేస్‌ని బయటకి విసిరేస్తే? ఇక దోచుకోడానికి ఏమీ ఉండదు. అప్పుడు తన మీద ఆసక్తి పోతుంది. లేదా తన జేబులో డబ్బు ఉండచ్చని అనుకుంటారా? దాని కోసం చంపచ్చా? అలాంటప్పుడు సూట్‌కేస్‌ని బయటకి విసిరేయడం వృధా పని. జోస్లిన్ అయోమయంలో పడ్డాడు. తన ఆలోచనల్లో స్పష్టత లేదని కూడా అనుకున్నాడు. సరే అబ్దుల్. కత్తే వాడు ఒప్పుకున్నాడు.

అబ్దుల్ వెంటనే లేచి నిలబడ్డాడు. జోస్లిన్ వెంటనే తన సూట్‌కేస్‌ని అందుకున్నాడు. అబ్దుల్ ఒళ్ళు విరుచుకుని మళ్ళీ కూర్చున్నాడు. జోస్లిన్ తన సూట్‌కేస్‌ని తెరచి అందులో ఏదో వెతుకుతున్నట్లుగా నటిస్తూ ఓర కంట చూసాడు. తన మిషనరీ దుస్తులని, చొక్కాలని తీసి అబ్దుల్ మోకాళ్ళ మీద, పేంట్లు, టైలు తీసి రెండో వ్యక్తి మోకాళ్ళ మీదా ఉంచాడు. సూట్‌కేస్‌ని దులిపి తను వెదికేది లేదన్నట్లుగా తలాడించి, మళ్ళీ వాటిని సూట్‌కేస్‌లో సర్దాడు. వాటిని అమ్మితే చాలా తక్కువ వస్తుంది. తర్వాత దాన్ని మూసి యథాస్థానంలో ఉంచాడు. వాళ్ళ మొహంలో ఇప్పుడు సంశయాన్ని జోస్లిన్ గమనించాడు. వాళ్ళ మనసుల్లో తనని చంపే ఆలోచన మారిందో, లేదో జోస్లిన్‌కి అర్థం కాలేదు. ఐనా వాళ్ళు కిరాతకులై ఉండచ్చని, ఖరీదైన ఇంగ్లండ్ సూట్‌కేస్ కోసం చంపవచ్చని భావించాడు. అబ్దుల్ జోస్లిన్ సూట్‌కేస్ మూత తెరచి, ఆయన ముందు సీసాని బయటికి తీసి దాన్ని చూసాడు. చెవి దగ్గర ఆడించి ఆ శబ్దం విన్నాడు. రెండో వాడు దాన్ని అందుకుని బయటకి విసిరేసాడు. వాళ్ళిద్దరి మొహాలు ఏదో ఆట ఆడుతున్నట్లుగా కనిపించాయి. తర్వాత ఓ పేంట్‌ని కూడా తీసి బయటికి విసిరేసారు. వారిస్తే వారు తన మీద దాడి చేయచ్చని జోస్లిన్ మౌనంగా ఉన్నాడు.

జోస్లిన్ తన కూతురి కోసం కొన్న గౌనుని కూడా బయటకి విసిరేయబోయి ఆగి అబ్దుల్ దాన్ని తన జేబులో కుక్కుకున్నాడు. జోస్లిన్ షేవింగ్ కిట్‌ని తెరచి, అందులోంచి కత్తిని బయటికి తీసి దాని పదునుని పరీక్షించాడు. అకస్మాత్తుగా రైలు తర్వాతి స్టేషన్‌లో ఆగింది. జోస్లిన్ తక్షణం తన సూట్‌కేస్‌ని మూసి లేచి తలుపు వైపు నడిచాడు. వాళ్ళిద్దరిలో ఎవరు అడ్డు పెట్టారో తెలీదు కాని ఒకరి కాలు తగలడంతో బోర్లా పడ్డాడు. వాళ్ళిద్దరూ పకపకా నవ్వారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా.
జోస్లిన్ లేచి తలుపు వైపు నడుస్తూంటే అతనికి ప్లాట్‌ఫాం మీంచి ఇంగ్లీష్‌లో ఓ కంఠం వినిపించింది. మాట్లాడిన వ్యక్తి బ్రిటీష్ వాడని ఇట్టే గ్రహించాడు.
వీళ్ళందర్నీ గుర్రాన్ని తోలే కొరడాతో కొట్టాలి. అసహ్యమైన మనుషులు.

కిందకి దిగే జోస్లిన్‌ని ఆర్మీ యూనిఫాంలోని అతను పక్కకి తోసాడు. మిగిలిన వాళ్ళని కూడా తోసుకుంటూ అతను లోపలకి ఎక్కాడు. జోస్లిన్‌ని ఆర్మీ ఆఫీసర్ భుజాలు పట్టుకుని ప్లాట్‌ఫాం మీద దింపుతూ అరిచాడు. ఈ దేశాన్ని పాలించడం మనకే అవమానం.
జోస్లిన్ వెనక్కి తిరిగి చూసేసరికి రైలు కదిలి వెళ్ళిపోతున్నది. ఆ ఇద్దరూ తలుపు దగ్గర నిలబడి నవ్వుతూ చేతులు ఊపుతున్నారు.
వాళ్ళు తనని ఏడిపించడానికే అలా నాటకం ఆడారని, తన మీద క్రూరమైన ప్రాక్టికల్ జోక్ వేసారని జోస్లిన్‌కి అకస్మాత్తుగా అర్థమైంది. బహుశ ఆర్మీ ఆఫీసర్ కూడా వాళ్ళు చెప్పింది విని ఇప్పుడు తనని తలచుకుని ఎగతాళిగా నవ్వుతూండి ఉండచ్చు. ఏ ఆర్మీ ఆఫీసర్కీ పిరికితనమంటే ఇష్టం ఉండదు. అతనికి వాళ్ళ భాష అర్థం కాకూడదని దేవుడ్ని ప్రార్థించాడు.

ఆ రోజు లాహోర్‌కి ఇంకో రైలు లేదు. దాంతో తనకి జరిగిన అవమానానికి బాధ పడేందుకు అతనికి చాలా తీరిక దొరికింది. మర్నాడు రైల్లో కూడా తీవ్ర అసౌకర్యంతో రద్దీగా ఉన్న పెట్టెలో ప్రయాణించాడు. జోస్లిన్ తన విమానాన్ని మిస్సయ్యాడు. మిగిలిన విమానాలన్నీ నిండిపోయాయి. తనకో సీట్ దొరకదేమోనని భయపడ్డాడు. కాని బహుశ ప్రయాణంలో దేవుడ్ని అధికంగా ప్రార్థించడం వల్లేమో రిజర్వేషన్ కౌంటర్లోని క్లర్క్ ఒకే సీట్ ఉందని, దాన్ని రిజర్వ్ చేసుకున్న వాళ్ళు అంతదాకా రాలేదని, రాకపోతే ఇస్తానని, వేచి ఉండమనీ కోరాడు. అతను రాకపోవడంతో క్లర్క్ క్రితం రోజు రైలెక్కిన మేజర్ కరోట్రస్ పేరుని కొట్టేసి జోస్లిన్ పేరుని రాసిచ్చి చెప్పాడు.
శుభయాత్ర. ఆ ఆర్మీ ఆఫీసర్ శవం రైలు పట్టాల పక్కన దొరికిందని దినపత్రికలో వచ్చిన వార్తని జోస్లిన్ చదవలేదు.
(మేరీ హాకిన్స్ కథకి స్వేచ్ఛానువాదం)

- మల్లాది వెంకట కృష్ణమూర్తి

749
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles