గీతాంజలి చూసి పడిపోయా


Sun,February 10, 2019 03:55 AM

Anjali
అందరూ కలలు కంటారు. కానీ వాటిని సాకారం చేసుకోవటం కొందరికే సాధ్యమవుతుంది. ఉన్నతంగా చదివి ఏదో ఒక రంగంలో స్థిరపడే వారున్నట్టే ఫలానా రంగంలోనే కచ్చితంగా స్థిరపడాలని దానికోసమే చదివే వారూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు నేషనల్ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ గుమ్మడి జయకృష్ణ (జెకె). సినిమా రంగంలోకి రావాలని పదేండ్లప్పుడే కలలుగన్న ఆయన ఇప్పుడు అదే రంగంలో సక్సెస్ బాటలో ఉన్నారు. తెలుగు, హిందీ, మలయాళ సినిమాలకు
సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన పడిపడి లేచె మనసు సినిమాకు ది బెస్ట్ విజువల్ అందించారు. ఈ సందర్భంగా ఆయన తన లైఫ్ జర్నీని బతుకమ్మతో పంచుకున్నారు..

డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి...

తెలుగు సినిమాలకు పని చూస్తూనే అవకాశాలొస్తే మలయాళం, హిందీ, తమిళ్ సినిమాలకూ పని చేయాలి. కథకు తగ్గట్టుగా మంచి విజువల్ అందించాలన్నదే నాడ్రీమ్. ఒక మంచి సినిమా తీసిన బృందంలో నేనూ ఉండాలనుకుంటాను. ప్రస్తుతం విజయదేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్‌లో ఉన్నాను. ఇటీవలే చేసిన మరో ఇంగ్లీష్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు, అందులో తెలుగు నుంచి ఇంకా చేయాలనుకుంటున్నాను..

చిత్ర పరిశ్రమకు రావాలని చిన్న వయసులోనే జెకె కలలు కన్నాడు. కేవలం కలలు మాత్రమే కాదు అప్పటినుంచే ఆ వైపు తన ప్రయత్నం మొదలుపెట్టాడు కూడా. అయితే ఆ ప్రయత్నాలేంటి, ఏం చేశాడు? ఆయన మాటల్లోనే..

సినిమాలను సినిమాల్లా కాకుండా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేవాన్ని. ఆ షాట్‌ను అలానే ఎందుకు తీశారూ? ఇంకా ఎలా తీయొచ్చు అనే అంశాలను అలోచించే వాడిని. మా మావయ్యతో వాటిని చర్చించే వాడిని. ఏ యాంగిల్‌లో షాట్ ఎలా వస్తుందో, ఏ సీన్‌కు ఏ యాంగిల్ వాడుతున్నారో బాగా గుర్తుంచుకునే వాడిని. అంటూ సినిమాపై తన ఆసక్తి ఎలా మొదలైందో చెప్పారు.

నాన్న ప్రోత్సాహంతో ఫైన్ ఆర్ట్స్: నా ఆసక్తిని గుర్తించిన మా నాన్న నన్ను ప్రోత్సహిచారు.ఒక రంగోలో ఎదగాలని ముందే అనుకున్నప్పుడు అలాంటి విద్యాభ్యాసం ఉండాలంటారు.. ఆయన గైడెన్స్‌తోనే పాఠశాల విద్య తర్వాత జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్‌లో చేరాను. దాని తర్వాత పుణేలోని ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాను. ఎఫ్‌టీఐఐలో ఉన్నప్పుడే మొదటి సారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. నా దగ్గరి ఫ్రెండ్ ఒకతను నా పేరును ప్రొడ్యూసర్ పూర్ణచందర్‌రావుకు రికమెండ్ చేశారు. ఇలా ఆయన సొంత బ్యానర్‌లోనే మొదటిసారి మిస్టర్ అండ్ మిసెస్ శైలజా క్రిష్ణ మూర్తికి షూట్ చేశాను. దీనికి మంచి అవుట్‌పుట్ వచ్చింది. అప్పటినుంచి కెరీర్ మొదలైంది. తర్వాత హిందీ, ఇంగ్లీష్, మళయాళం సినిమాలు చేశాను.. తెలుగులో రామ్, ఒక్కడున్నాడు, అందరి బంధువయాతో పాటు మరిన్ని సినిమాలు చేశాను. హిందీలో పిజ్జా, ఫోబియా వంటి సినిమాలు క్రేజ్ పెంచాయి. ఇటీవల పడిపడి లేచె మనసు మంచి సక్సెస్ మూడ్‌ను ఇచ్చింది..

లేకుంటే డైరెక్టర్ అయ్యేవాడిని: మొదటి నుంచీ సినిమాలపైనే ఆసక్తి ఉంది. మొదట్లో డైరెక్టర్ అవుదాం అనుకున్నా. అప్పడు పదేండ్లు. గీతాంజలి సినిమా చూశాను. అదే నా మనసు లాగేసింది. అందులో సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరాం గారి పనితీరుకు ఆశ్చర్యమేసింది. ఏదో మ్యాజిక్ ఉందనుకున్నా. తీస్తే ఇలాంటి అవుట్‌పుట్ ఉండాలనుకున్నా. అప్పుడే నిర్ణయించుకున్నా సినిమాటోగ్రాఫర్ అవుదామని. ఆయనను ఆదర్శంగా తీసుకునే నా లక్ష్యం మీద దృష్టిసారించాను. అవకాశాలను ఉపయోగించుకుని కథకు తగ్గట్టుగా మంచి విజువల్ ఇవ్వాలి. దీంతో పాటు ఎప్పటికైనా సొంత దర్శకత్వంలో సినిమా తీయాలనుంది

షార్ట్ ఫిలిమ్స్‌తోనూ సంబంధం: ఫైన్ ఆర్ట్స్‌లో ఉన్నప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడిని. ఇండస్ట్రీకి వచ్చాక కూడా షార్ట్ ఫిలిమ్స్ తీయడం మానలేదు. వాటితోనూ మంచి గుర్తింపు వచ్చింది. అయామ్ ఫేమస్ అనే షార్ట్‌ఫిలిమ్ సినిమాటోగ్రఫీకి 2006 ఇండియా ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నా. ఇప్పుడు బయటకూడా షార్ట్ ఫిలిమ్స్ ట్రెండ్ నడుస్తున్నది. వెబ్ సిరీస్, షార్ట్‌ఫిలిమ్స్‌తో వారి ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అవకాశాలు ఎప్పుడైనా రావొచ్చు. నిజానికి 2006లో తీసిన షార్ట్‌ఫిలిమ్ చూసే హను రాఘవపూడి నాకు అవకామిచ్చారని చెప్పవచ్చు.

పెయింటర్ అయ్యేవాడినేమో...

సినిమా అంటే ఎంత ఇష్టమో పెయింటింగ్ అన్నా అంతే ఇష్టం. ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా క్యాన్వస్ తీసుకోవటం, పెయింటింగ్ వేయడమే పని. సినిమా ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే బహుశా నేను పెయింటర్ అయ్యేవాడినేమో.

- వినోద్ మామిడాల

908
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles