ప్రకృతి ధర్మం


Sun,February 10, 2019 03:49 AM

Prakruthi-Darmam
ప్రకృతి ధర్మం చావు పుట్టుకలను నిర్దేశించింది. ప్రపంచంలో పుట్టిన ప్రతీ ఒక్కరూ పుడుతూనే చావును వెంట తీసుకునే వస్తారు. ఎంతకాలం భూమ్మీద నూకలుంటే అంతకాలం బతికే తీరతారు. కాలం చెల్లగానే బంధాలన్నీ తెంచుకొని వెళ్ళిపోతారు. ఎవరెవరి కర్మఫలితం వారివారి జీవితకాలాన్ని సూచిస్తుందనేది విధి నిర్ణయం. సరే! దీనిని కాదని మనిషి ప్రపంచానికి చూపిస్తున్న మూర్ఖావేశం ఎంతవరకు సమజంసం. ఆవేశంతో, ఆక్రోషంతో సాగే సంస్కరణలు వ్యర్థమవుతాయని అనాదిగా ప్రపంచ చరిత్ర చెబుతూనే ఉంది. కానీ మనిషిలో మార్పులేదు. ఆలోచన మారదు. క్రూరమైన మనసుతో మనిషి తన వారినీ, తన సామాజిక వర్గాన్నీ, తన ప్రపంచాన్నీ దూరం చేసుకోవడానికి అర్థం లేని ఆవేశాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఆవేశంతో రగిలిపోతూ ప్రపంచం తనకి అన్యాయం చేసిందని ప్రపంచాన్నే కాలరాయాలనే మూర్ఖత్వంలో ప్రపంచంలో భాగమైన తననూ చేజేతులా నాశనం చేసుకుంటున్న మనిషికి అవసరమైన ఆవేశం వదిలి తనదైన జీవితాన్ని హాయిగా బతకమని చెబుతుందీ కథ.

- ఇట్టేడు అర్కనందనా దేవి

ప్రకృతి ధర్మం ఎలా నడిపిస్తే మన జీవితాలు అలా నడిచితీరాలి. నా కొడుకు దూరమైన నా దుఃఖంలో నీవిచ్చే సానుభూతి చాలు, మనకంటే ప్రపంచం మిగిలే ఉందనే భరోసా నివ్వడానికని గౌతమి చెప్పిన మాటలు నిత్యసత్యాలు, జీవితాల చరిత్రకు నిలువెత్తు రూపాలు.

పూర్వం గౌతమి అనే స్త్రీ ఉండేది. అడవికి ఆనుకొని ఉన్న చిన్న గ్రామంలో తనూ, తన భర్త, తన కొడుకుతో నివసించేది. గౌతమి చాలా మంచిది. మృదుస్వభావి. కోపతాపాలకు తావివ్వని మనస్తత్వం ఆమెది. ప్రకృతి ధర్మం తెలిసిన గాంభీర్యం, లౌకికత ఎరిగిన మానవత్వం గౌతమి వ్యక్తిత్వంగా ఎదిగాయి.
ఒకరోజు గౌతమి తన భర్త దేశాంతరం వెళ్ళగా, ఇంట్లోకి కట్టెలు అవసరమై తన కొడుకును వెంటబెట్టుకొని పక్కనే ఉన్న అడవికి వెళ్ళింది. అక్కడ గౌతమి కొడుకును పాము కాటేయగా ఆ పిల్లాడు చనిపోతాడు. చిన్న వయసులోనే తనకు దూరమైన తన కొడుకును పట్టుకొని విలపిస్తున్న గౌతమిని చూసి మనసు చలించిన అర్జునకుడనే వేటగాడు పిల్లాడి ప్రాణాలు తీసిన పామును పట్టితెస్తాడు. పాము నోటిని తాడుతో కట్టి గౌతమి ముందుంచి కోపంతో అమ్మా! ఈ పాము చాలా భయంకరమైంది. నీ కొడుకు ప్రాణాలను తీసిన దీనిని చంపితే గాని నా కోపం చల్లారదు. దీన్ని ఎలా చంపాలో నీవే చెప్పు తల్లీ! అంటాడు వేటగాడు. అతని మాటలు విని గౌతమి తన దుఃఖాన్ని ఆపుకొని అన్నా! దాన్ని ఏమీ చేయకు. దాని ప్రాణం తీయక దాన్ని వదిలేయమని అంటుంది. అందుకా వేటగాడు.. నీ కొడుకు ప్రాణం తీసిన ఈ పామును చంపకుండా వదిలేయమంటావా? ఇదెక్కడి న్యాయమని అడుగుతాడు వేటగాడు.

గౌతమి అతనితో ఈ పామును చంపినంత మాత్రాన నా కొడుకు బతికొస్తాడా! అలాగైతే మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని ఎన్నోసార్లు చంపేసారు. ఎంతమందినని మూర్ఖావేశంతో చంపుతూ వెళతాం. దానికి వేటగాడు అమ్మా! నీవు మరీ అమాయకంగా మాట్లాడుతున్నావు. నీవెన్ని చెప్పినా నీ కొడుకు ప్రాణాన్ని నా కళ్ళెదుటే తీసేసిన ఈ పామును వదలనంటే వదలనని అంటాడు. గౌతమి అర్జునకునితో అన్నా! లోకంలోని మనుషులందరూ నీటిపై నావలా సంసార సాగరాన్ని దాటుతున్నారు. ఎవరికెంత రాసిపెట్టుంటే అంతే ప్రాప్తమనుకొని సరిపెట్టుకోవాలే గాని, దుష్టులను చంపి మనం వారి పాపాన్ని ఎందుకు మోయాలని అంటుంది.
వేటగాడు గౌతమితో నీవెన్ని చెప్పినా నాకు నచ్చడం లేదు. నేను పామును చంపే తీరుతానని అంటాడు. గౌతమీ అర్జునకుల మాటలు విన్న పాము వారితో నేను ఆ పిల్లాడి మీద కోపంతోనో, చంపాలనే కోరికతోనో కాటు వేయలేదు. మృత్యుదేవత ఆజ్ఞ విధిరూపంలో నాతో ఈ పని చేయించిందని అంటుంది. గౌతమి వేటగాడిని సముదాయిస్తూ శత్రువైనా సరే, మన చేతికి చిక్కినప్పుడు వదిలేయాలని పెద్దలు చెప్పారు అంటుంది. పాము వేటగాడితో యాగం చేసినప్పుడు యాగఫలం యజమానికి దక్కుతుంది గానీ పురోహితులకు కాదు కదా! అలానే యముడు మృత్యుదేవతనూ, తను నన్నూ పంపితేనే ఇలా జరిగింది. అప్పుడు యముడే బాధ్యుడు గాని తాను కాదని అంటుంది.

గౌతమి, పాము ఎంత చెప్పినా వేటగాడు పామును చంపే తీరుతానని పట్టుబట్టగా యముడే దిగివచ్చి కర్మనుబట్టే జనన మరణాలు ఉంటాయని, పాము మృత్యుదేవతను వదిలేయమని అంటాడు వేటగాడితో గౌతమి. పాము, మృత్యుదేవత, యముడు వీరినెవరిని శిక్షించినా నా పిల్లాడు బతికిరాడు. నువ్వు మనుషుల బాధలను అర్థం చేసుకోగల మంచి మనసున్న వాడివి. కర్మను బట్టి వచ్చిన వాటిని తప్పించడం మన తరం కాదు. కోపం, శోకం వదిలి, బాధ్యులను మూర్ఖావేశంతో చంపేకన్నా వారి మానాన వారిని వదిలి మనఃశ్శాంతిగా బతకడం అలవర్చుకో. మనిషికి మనిషి మానసిక శాంతిని ఇవ్వగలగాలి గాని పగనూ ప్రతీకారాన్నీ పెంచే ఆవేశాన్ని కాదు. ప్రకృతి ధర్మం ఎలా నడిపిస్తే మన జీవితాలు అలా నడిచితీరాలి. నా కొడుకు దూరమైన నా దుఃఖంలో నీవిచ్చే సానుభూతి చాలు, మనకంటే ప్రపంచం మిగిలే ఉందనే భరోసా నివ్వడానికని గౌతమి చెప్పిన మాటలు నిత్యసత్యాలు, జీవితాల చరిత్రకు నిలువెత్తు రూపాలు.

862
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles