శత్రుఘ్నుడు


Sun,February 10, 2019 03:46 AM

SHATRUGNA
అనుభవజ్ఞులు చెప్పినట్లు ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఎదుటివారిని అర్థం చేసుకోవడం. అర్థం చేసుకునేంత విశాల మనస్తత్వం ఉంటే చాలు. బంధాలు బలంగా కలకాలం నిలుచుంటాయి. బంధాలకుండే విలువలు పదిలంగా ఉంటాయి. బాధ్యత బరువనిపించదు. బహుమతిగా మారి మనిషిని మరింత ప్రోత్సహిస్తుంది. కానీ అర్థం చేసుకునే గుణం అందరికీ ఉండదు. చాలా అరుదుగా కనిపించే వ్యక్తిత్వం అది. అటువంటి వ్యక్తిత్వం ఉన్నచోట కష్టమనేదే ఉండదు. కారుణ్యం నిండిన సహృదయం తప్ప. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా దాటే ధైర్యం, ఆత్మవిశ్వాసం తన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఇచ్చేంత ఉన్నతత్వం అర్థం చేసుకోగల మనస్తత్వం. పారతంత్య్రంలోనూ పరిమళించే అద్భుతం ఆ వ్యక్తిత్వం. ఉన్నత మనస్తత్వం. అద్భుత వ్యక్తిత్వం మూర్తీభవించిన మానవత్వమే రామలక్ష్మణ భరతుల ఆరాధకుడు శత్రుఘ్నుడు, ప్రపంచంలోని దుష్టశక్తులన్నింటినీ తరిమివేసి మంచిని పంచే సార్థక నామధేయుడు శత్రుఘ్నుడు.

శత్రుఘ్నుని జీవనోద్దేశ్యం ప్రేమా, ప్రతిష్ఠ కాదు. రామునికి దాసుడైన భరతుని దాసానుదాసుడిగా బతకడమే శత్రుఘ్నునికి కావాలి. మనకోసం మనం బతకడం కాదు. వీలైతే మన వారికోసం జీవితం అంకితం చేసి చూడగలిగితే అంతకన్నా గొప్ప జీవితం మరొకటుండదనే విషయాన్నీ, స్వాతంత్య్రం అంటే స్వార్థంతో కుంచించుకుపోవడమైతే పారతంత్య్రం మనిషిని విశాలంగా ఎదిగేలా చేస్తుందనే భావననూ శత్రుఘ్నుని చరిత ధ్వనింపజేస్తుంది.

సుమిత్ర దశరథుల పుత్రుడు శత్రుఘ్నుడు అందరిలో చిన్నవాడైనా అందరినీ అర్థంచేసుకోవడంలో ఉన్నతుడు. శ్రుతకీర్తిని భార్యగా, శత్రుగతి సుబాహులను కుమారులుగా పొందిన శత్రుఘ్నుని వ్యక్తిం లోకం దృష్టిలో గుప్తమే అయినా అంతపట్టనిది మాత్రం కాదు.
శత్రు సంహారకుడే శత్రుఘ్నుడు. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నియమాన్ని పాటించి స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, మోహం, లోభం, పంతం వంటి అంతఃశత్రువులను జయించి జీవితంలో గెలిచాడు. కోరికలకు తావివ్వని ఆలోచన శత్రుఘ్నునికే సొంతం. తరచి చూస్తే శత్రుఘ్నుని స్వభావం మానవతకు అర్థం చెబుతుంది.
అందరిలాగే రామున్ని అభిమానించాడు. ఆరాధించాడు, అంతకు మించి అర్థం చేసుకున్నాడు. రాముని వెన్నంటి లక్ష్మణుడు నడిస్తే, భరతుని వీడక జీవితమంతా కనిపెట్టుకొని ఉన్నాడు శత్రుఘ్నుడు. రాముని వనవాస గమనం తర్వాత భరతునితో కలిసి అయోధ్యకు వచ్చిన శత్రుఘ్నుడు మంథరే దీనికంతటికీ కారణమని కైకేయి గృహం నుంచి ఈడ్చుకొచ్చి చంపబోతుంటే శత్రుఘ్నుని అర్థవంతమైన ఆవేశాన్ని శాంతింపజేశాడు భరతుడు. స్త్రీని చంపరాదనే రాముని మాట, భరతుని ఆజ్ఞపై గౌరవం శత్రుఘ్నుని ఆపాయి.

రామపాదులకు పట్టాభిషేకం చేసి భరతుడూ ఆశ్రమ జీవితం గడపాలని నిర్ణయం తీసుకున్నప్పుడు శత్రుఘ్నుడు వారించలేదు. పైగా పద్నాలుగు సంవత్సరాలు శాంతిశ్రేయస్సు, భద్రత గల అయోధ్యను తన పాలనాదక్షతతో కాపాడాడు. అనుక్షణం పదవిని కాంక్షించని పాలకుడై, రక్షకుడై అయోధ్యను కనిపెట్టుకొని ఉన్న శత్రుఘ్నుడు అయోధ్య ప్రజలనే కాదు, ముగ్గురు తల్లుల యోగక్షేమాలనూ, రామలక్ష్మణ భరతులు లేని లోటును తెలియకుండా చూసుకున్నాడు. రామున్నే తలుచుకుంటూ, రాముని రాకకై అన్నీ త్యాగం చేసిన భరతునికి చెడ్డపేరు తీసుకురాకూడదని భరతునికే అంకితుడైన శత్రుఘ్నుడు అహర్నిశలూ మదనపడ్డాడు.
రాముడుగానీ, లక్ష్మణుడు గానీ, భరతుడు గానీ అయోధ్య బాధ్యతను శత్రుఘ్నునికి అప్పగించలేదు. పేరునూ, ప్రతిష్టనూ కోరి స్వతంత్రంగా ఎన్నడూ ప్రవర్తించలేదు శత్రుఘ్నుడు. ఈ అవకాశం రాముడిచ్చిన బహుమతిగా భావించి అయోధ్య బాధ్యతను మోసాడు. పారతంత్య్రంలోనూ ఆనందాన్ని పొందగలిగే వ్యక్తిత్వం శత్రుఘ్నునికే దక్కింది.

అపారమైన తెలివితేటలు, స్వచ్ఛమైన ఆలోచనలు, సామర్థ్యం, పరాక్రమం, మంచితనం, సార్థకత ఉన్న శత్రుఘ్నుడు మధు కుంబినిల పుత్రుడూ, రావణుని అల్లుడూ అయిన లవణాసురుని సంహరించి ప్రజలకు మంచి చేస్తానని రాముని ఆజ్ఞ పొంది లవణాసురున్ని వధిస్తాడు. రాముడు శుత్రుఘ్నుడిని మథురకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. దాదాపు పన్నెండేళ్లపాటు పాలన చేసిన శత్రుఘ్నుడు రామలక్ష్మణ భరతులను వదిలి ఉండలేనని అయోధ్యకు తిరిగి వచ్చేసాడట. రాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు యాగాశ్వాన్ని దిగ్విజయంగా తీసుకొచ్చి శత్రుఘ్నుడు యాగం సుసంపన్నం చేశాడు.

శత్రుఘ్నుడు శంఖం లాంటివాడు. పవిత్రత, స్వచ్ఛత శంఖంలా ధ్వనించగా శత్రుఘ్నుని వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. ఎదుటివారిని అర్థం చేసుకోవడమే కాదు, ఎదుటి వారికోసమే జీవించడంలోని ఆనందం అనిర్వచనీయమనే భావన శత్రుఘ్నునిది. శత్రుఘ్నుని జీవనోద్దేశ్యం ప్రేమా, ప్రతిష్ఠ కాదు. రామునికి దాసుడైన భరతుని దాసానుదాసుడిగా బతకడమే శత్రుఘ్నునికి కావాలి. మనకోసం మనం బతకడం కాదు. వీలైతే మన వారికోసం జీవితం అంకితం చేసి చూడగలిగితే అంతకన్నా గొప్ప జీవితం మరొకటుండదనే విషయాన్నీ, స్వాతంత్య్రం అంటే స్వార్థంతో కుంచించుకుపోవడమైతే పారతంత్య్రం మనిషిని విశాలంగా ఎదిగేలా చేస్తుందనే భావననూ శత్రుఘ్నుని చరిత ధ్వనింపజేస్తుంది.

- ప్రమద్వర

685
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles