5 థింగ్స్


Sun,February 10, 2019 03:43 AM

Rabin-Stene

కౌగిలింతే ఉద్యోగం!

బాధ, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరినైనా గట్టిగా హత్తుకోవాలని ఉంటుంది. అలా మనసు భారాన్ని దించేసుకోవాలనే ఆశ చాలామందిలో కలుగుతుంది. అయితే, అది అందరికీ సాధ్యం కాదు. దీంతో చాలమంది ఒంటరిగానే కుంగిపోతారు. అలాంటి వారికి నేనున్నాను అంటూ చేతులు చాపుతుంది అమెరికాకు చెందిన రాబిన్‌స్టినె. అయితే ఉత్తగానే కాదండోయ్ కొంచె డబ్బులు చెల్లించాలి మరి. కన్సార్ ప్రాంతానికి చెందినరాబిన్ స్టినె కౌగిలించుకోవడాన్ని ఉపాధిగా ఎంచుకుంది. అబ్బాయిలు, అమ్మాయిలనే తేడా లేకుండా ఎవరైనా సరే ఆమెను హత్తుకుని హాయిగా నిద్రపోవచ్చు. కేవలం కౌగిలింతలే కాదు, ఆమె తన శరీరమంతటినీ (సెక్స్ తప్ప) కస్టమర్లకు అప్పగిస్తానని అంటున్నది రాబిన్ స్టినె. ఇది కేవలం థెరపీ మాత్రమేనని చెబుతున్నది. ఆమె కౌగిట్లో సేద తీరాలంటే.. గంటకు రూ.5630 చెల్లించాలి. ఇలా ఆమె ఏడాదికి రూ.28 లక్షల వరకు సంపాదిస్తున్నది.

Coffie-Oil-Buss

కాఫీతో నడిచే బస్సులు

ఇదేంటి..? బస్సులు నడవాలంటే డీజిల్, పెట్రోల్ కదా అవసరం.. కాఫీ అంటున్నారేంటి అని కంగారు పడకండి. మీరు విన్నది నిజమే. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇలాంటి ప్రయోగాలు తప్పడం లేదు మరి. లండన్‌లో కాఫీ వ్యర్థాలతో నడిచే బస్సులు అందుబాటులోకి రానున్నాయి. బయోబీన్ అనే సంస్థ ఈ బస్సులను రూపొందిస్తున్నది. ఇదే దారిలో ప్రపంచ దేశాల్లో కొన్ని పయనించడానికి సిద్ధంగా ఉన్నాయి. పర్యావరణానికి మేలు చేసే ఇంధనాల కోసం జరిగిన పరిశోధనల్లో కాఫీ వ్యర్థాలే ఉత్తమమని పరిశోధించారు. అందుకే కాఫీ వ్యర్థాల నుంచి తయారయ్యే ఇంధనంతో నడిచేలా ఓ బస్సును కూడా రూపొందించారు. బయోబీన్ సంస్థ కోస్టా కంపెనీ, ప్రముఖ కాఫీ దుకాణాల నుంచి వాడేసిన కాఫీ గింజలను సేకరిస్తుంది. వాటి నుంచి 15 నుంచి 20 శాతం ఇంధనం తీస్తున్నారు. మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే.. మీరూ పర్యావరణానికి మేలు చేసినట్టే.

Donkey-Milk-Soap

మీ సబ్బులో గాడిద పాలున్నాయా?

మీ పేస్టులో ఉప్పుందా? తరహాలో.. ఇకనుంచి మీ సబ్బులో గాడిద పాలు ఉన్నాయా? మాటలు మీకు వినపడవచ్చు. ఎందుకంటే గాడిద పాలతో సబ్బులు వచ్చేస్తున్నాయి మరి. గాడిద పాలు సబ్బుతో యవ్వనం గ్యారంటీ అని ఉత్పత్తిదారులు ప్రకటిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఆర్గానికో సంస్థ ఈ సబ్బులను విక్రయిస్తుంది. ఈ సబ్బు ధర అంత తక్కువేమీ కాదు. 100 గ్రాముల సబ్బును రూ.499లకు అమ్ముతున్నారు. అయినా ఈ సబ్బును జనాలు ఎగబడి మరీ కొంటున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో తయారయ్యే ఈ సబ్బులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయట. పెరిగే వయస్సు, చర్మంపై ముడతలను నియంత్రించే గుణాలు ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు. లీటరు గాడిద పాలు రూ.2000. అందుకే రేటు పెంచాల్సి వచ్చిందట. అంతేకాదు.. త్వరలోనే గాడిద పాల ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్ క్రీమ్‌లు అందుబాటులోకి తెస్తామని తయారీదారులు చెబుతున్నారు.

Peasara-Pindi

సౌందర్యానికి పెసర పిండి

నిత్యం అందుబాటులో ఉండే పెసరపిండితో చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కొంచెం పెసరపిండిలో చిటికెడు పసుపు వేసి, పాలు కలపాలి. ముఖానికి అలీవ్ ఆయిల్/నువ్వుల నూనె పట్టించి రెండు నిమిషాలు మర్దన చేయాలి. తర్వాత పాలు, పెసరపిండి మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. ఇలా రోజూ చేస్తే ముఖం మెరిసిపోతుంది. మూడు చెంచాల పెసరపిండికి రెండు చెంచాల పెరుగు, చెంచా కీరదోస రసం, రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి పూతలా రాయాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. మూడు చెంచాల పెసరపిండిలో మూడు టేబుల్ స్పూన్‌ల ఆపిల్ గుజ్జు, చెంచా తేనె, అరచెక్క నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా రోజూ ఉదయం చేస్తే.. ముఖం కాంతివంతంగా మారుతుంది.

Big-Library

సుందరమైన లైబ్రెరీ

ఇది ప్రపంచంలోని అత్యంత సుందరమైన పుస్తకాల దుకాణం. పేరు ఎల్ అటెనో. అర్జెంటినా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో రద్దీగా ఉండే వాణిజ్య కూడలి రెకొలెటాలో ఉంది. 1919లో ఈ భవనంలో ఓ థియేటర్ ప్రారంభించారు. ఒకప్పుడు ఇది థియేటర్. ఇప్పుడు లైబ్రెరీగా మార్చారే తప్ప ఆ రాజసం, దర్పం అణుమాత్రమైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంచారు. ఎక్కడ చూసినా కళాఖండాలు, తలెత్తి చూస్తే అబ్బురపరిచే పెయింటెడ్ సీలింగ్, బాల్కనీలు, అందంగా అలంకరించిన శిల్పాలు చూపరులను అబ్బురపరుస్తాయి. దీనిని 2000లలో ప్రారంభించారు. ఇక్కడ వేలాదిగా పుస్తకాలు, సీడీలు, డీవీడీలు, ఇంకా ఎన్నెన్నో లభిస్తాయి. నచ్చిన పుస్తకాన్ని తీరిగ్గా చదువుకొని కొనుగోలు చెయ్యొచ్చు. దీనిని ఏటా 10 లక్షల మందికి పైగా సందర్శిస్తుంటారు.

- డప్పు రవి

651
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles