ఉత్తరాభిముఖ త్రికూటాలయం.. ఏకైక హరిహర క్షేత్రం..


Sun,February 10, 2019 03:23 AM

వాల్గొండ రామలింగేశ్వర దేవాలయం

Temple
అదంతా ఒకప్పుడు దండకారణ్య ప్రాంతం. ఆలయాల పరంపర ఎక్కువున్న చోటు. త్రేతాయుగ కాలంలో అక్కడ నిర్మించిన ఈ ఆలయం నేడు భక్తులకు కొంగుబంగారమై విరాజిల్లుతున్నది. భారతదేశంలో గోదావరి నదీ తీరానికి అతి సమీపంలో ఉన్న ఆలయాల్లో ఇది మొదటిది. శివుడు, రాముడు కొలువై భక్తుల పూజలు అందుకుంటున్న పుణ్య క్షేత్రంగానూ, మరోవైపు ప్రకృతి రమణీయతకు కేంద్రంగానూ విశిష్ఠ ఆదరణ పొందుతున్నది. ఇలాంటి మరెన్నో ప్రత్యేకతలు కలిగిందే వాల్గొండ రామలింగేశ్వర స్వామి ఆలయం...

ఎక్కడ ఉంది?: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలో గోదావరి తీరాన ఉంది.

ఎలా వెళ్లాలి?: రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రోడ్డు, రైలు మార్గంలో వాల్గొండకు చేరుకోవచ్చు. కాచిగూడ నుంచి మెట్‌పల్లికి రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి 30 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా వాల్గొండకు చేరుకోవచ్చు. జగిత్యాల నుంచి మల్లాపూర్, పాతదాంరాజ్‌పల్లి మీదుగా రోడ్డు మార్గంలో వాల్గొండ చేరుకోవచ్చు.
స్థల పురాణం: త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాన్వేషణ కోసం గోదావరి తీర ప్రాంతంలో తిరిగాడు. వశిష్ఠుని పరంపరలో వాలకీయ మహర్షి ఆశ్రమంగా ఉంది నేటి వాల్గొండ. ఈ నేపథ్యంలో శ్రీరాముడు వాల్గొండలో కొన్నాళ్లు ఉన్నాడని ప్రతీతి. ఈ ఆశ్రమంలో సేద తీరుతున్న రాముడు శివున్ని ఆరాధించాడు. పక్కనే ఉన్న గోదావరి నది తీరం లో సైకత శివ లింగాన్ని ఏర్పాటు చేశాడు. రాముల వారు తిరుగు ప్రయాణమైన తర్వాత శివలింగ సంరక్షణను అక్కడున్న మహర్షులు తీసుకున్నారు. ఇలా శివునికి పూజాధికాలు జరిగాయి. ఆ మహర్షుల జీవసమాధులు నేటికి వాల్గొండలో కనిపిస్తాయి. కొన్నాండ్లకు ఈ ప్రాంతాన్ని అక్క డి రాజులు గుర్తించారు. శివలింగం ఉండటంతో పాటు రాముడు నడయాడిన నేలయని శివలింగాన్ని యథాతథంగా ఉంచి, రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అటు తర్వాత కాకతీయులు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. కాకతీయుల రాజచిహ్నాలైన పద్మాలు, హంసలు, సింహాల గుర్తులు అడుగడుగునా దర్శనమిస్తాయి. నిర్మాణ శైలి కొంత ఉత్తర భారతదేశపు శైలిగానూ ఉండి పూర్వకాలపు ఔన్నత్యాన్ని, కాకతీయుల శిల్పకళావైభవాన్ని కండ్లకు కట్టినట్టు చూపుతుంది. నేటికీ చెక్కుచెదరని ఆలయ నిర్మాణాలను చూస్తే ఒకింత ఆశ్చర్యం కలుగక మానదు.

సీతారామ, శివపార్వతుల కల్యాణం, శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. భద్రాద్రి తరహాలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. స్వామివారి విగ్రహాలను గోదావరీ నదిలో తెప్పమీద ఊరేగించి, నదీస్నానాల తర్వాత ఆలయంలోకి తెస్తారు. వేదమంత్రాల నడుమ కల్యాణం కన్నులపండువగా సాగుతుంది. ఈ ఆదర్శదంపతుల కల్యాణాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాలనుంచి, ఇతర జిల్లాల నుంచి సుమారు 30 నుంచి 50 వేల మంది భక్తులు తరలివస్తారు. హనుమాన్ దీక్షలో ఉన్న స్వాములతో ఆలయ ప్రాంగణాలన్నీ రామనామ కీర్తనలతో మార్మోగుతాయి. ఆలయ పరిధిలో ఎక్కడ చూసి నా జనసందోహం, రాములోరి కల్యా ణం, అన్నదాన కార్యక్రమం, హనుమాన్ దీక్షా స్వాముల కీర్తనలు చూడటం అదృష్టంగా భావిస్తారు వచ్చిన భక్తులు. దీంతో పాటు కార్తీక మాసంలో లక్షదీపారాధన అత్యంత వైభంగా జరుగుతుంది. అట్లనే... ఆలయంలో నిత్యపూజలు, అభిషేకం, నిత్యారాధన జరుగుతాయి.

దర్శనీయ ప్రాంతాలు: ఆలయ శివారులో మఠంగుడి (వాలకీయ మహర్షి ఆశ్రమం) ని దర్శించవచ్చు. మహర్శుల జీవసమాధులు చూడవచ్చు. హనుమత్‌పీఠానికి మూలకేంద్రంగానూ ఉంది. ఏటా రెండు మూడు వేల హనుమాన్ భక్తులు ఇక్కడ దీక్షలు తీసుకుంటారు. ఆలయం గోదావరి నదితీరంలోనే ఉండటంతో పుణ్యస్నానాలు చేసుకోవచ్చు. దీంతోపాటు వాల్గొండకు రెండు కిలో మీటర్ల దూరం లో పాతదాంరాజ్‌పల్లి లక్ష్మీనర్సింహ స్వామి గుట్ట దర్శించదగ్గ ప్రదేశం. కొత్తదాంరాజ్‌పల్లి కనకసోమేశ్వర ఆలయం కూడా దర్శించుకోవచ్చు.

ఆలయ విశిష్టత:

ఈ ఆలయ విశిష్ఠతల్లో ప్రత్యేకంగా చెప్పుకొనేది ముక్కోటి ఏకాదశిన ఒక్క రోజు మాత్రమే సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడతాయి. సూర్యోదయం అయిన ఒక్క గడియ తర్వాత ఈ అద్భుత ఘట్టం చోటుచేసుకుంటుంది. ఆనాటి కాలం నుంచి నేటికీ ఇది పునరావృతం కావడానికి కారణం గుడి నిర్మాణ చాతుర్యమేనని తెలుస్తున్నది. ఇటువంటి నిర్మాణ శైలి ఉన్న ఆలయాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరెక్కడా కనబడవు. గోదావరి నదీ తీర, ఉత్తారాభిముఖ, త్రికూటాలయాల్లో ప్రప్రథమ ఆలయంగా ఇది ఖ్యాతిగాంచింది.

- వినోద్ మామిడాల
సెల్: 7660066469

774
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles