నెట్టిల్లు


Sun,February 10, 2019 03:17 AM

యూట్యూబ్.. వీడియోలు చూసేవారికి ఇదొక సోషల్ మీడియా. కానీ.. కొత్తగా ఆలోచించేవారికి ఇదొక అవకాశాలు కల్పించే వేదిక. అవును.. తమలోని టాలెంట్‌ను నిరూపించుకునే క్రమంలో ఎందరో యూట్యూబ్ వేదికగా సక్సెస్ అవుతున్నారు. అలాంటి ప్రయత్నంలో తీసిన కొన్ని షార్ట్‌ఫిలింస్ ఈ వారం నెట్టిల్లులో..

ప్రాణం విలువ

Total views 146,418+ (ఫిబ్రవరి 2 నాటికి)
Published on Jan 28, 2019
దర్శకత్వం: జేడీవీ ప్రసాద్
నటీనటులు : జేడీవీ ప్రసాద్, ధీరజ్, లక్ష్మీ కాకర్ల, సాయినాథ్ గరిమెళ్ల, ఎం. సాయిబాబు, సూర్య
ఉద్యోగమిస్తా అన్నవాడు హ్యాండిచ్చాడు. అప్పు తీసుకున్న ఫ్రెండ్ ఆ డబ్బులు తిరిగి ఇవ్వడు. ఉద్యోగం రాలేదని తండ్రి కొడతాడు. ఇన్ని సమస్యల మీద గెలిచే ధైర్యం లేక, జీవితంతో పోరాడే మనోధైర్యం లేక చచ్చిపోదామనుకుంటాడు ఓ యువకుడు. షాపుకెళ్లి విషం కొనుక్కొని బయటకొస్తుంటాడు. ఇంతలో ఓ కుర్రాడు క్యాన్సర్ బాధితుల కోసం విరాళాలు సేకరిస్తూ ఎదురుపడతాడు. ఆ యువకుడు ఇలాంటి చందాలే.. రేపటి కుంభకోణాలు అంటూ కామెంట్ చేస్తాడు. దానికా కుర్రాడు నేను ఎలాగూ బతకను. నాలాంటి వారికి సాయపడతాయి కదా అన్నా అంటాడు. ఆ తర్వాత నడిరోడ్డు మీద ఓ కొడుకు తల్లిని వదిలేసి వెళ్లిపోతాడు. రెండురోజులుగా ఆ తల్లిని గమనిస్తున్న ఆ యువకుడు ఆమెను వివరాలడిగి తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేరుస్తాడు. ఈ రెండు ఘటనలు ఆ యువకుడి మనసును కదిలిస్తాయి. ఇంతలో ఇంకో కుర్రాడు ఆత్మహత్య చేసుకోవడానికి విషం సీసాతో పార్కుకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరూ కలిసి చనిపోతారా? ఆత్మహత్య ఆలోచనను మార్చుకొని ఇంకేమైనా చేస్తారా? యూట్యూబ్‌లో చూడండి.

చివరి క్షణం

Total views 78,099+ (ఫిబ్రవరి 2 నాటికి)
Published on Jan 26, 2019
దర్శకత్వం: మధు
నటీనటులు: చీరాల హేమంత్ రెడ్డి, భానుశ్రీ, హరీష్ కల్, మేఘన, గీతాంజలి, మహిదీప్ కల్యాణ్, రాకేష్ లెంకలపల్లి, ప్రకాష్, పవన్ శ్రీరామ్, సత్యసాయి యరగోగు, సాయిగోపి మద్దిశెట్టి, వికాస్, కాంచన్, గణేష్ గనే, సిదగం రోహిత్, యుగేష్, బాలు బోడపాటి
ఆ అబ్బాయి మూడేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పడానికి ధైర్యం చాలక అనువైన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ మూడేళ్లలో ఆ అబ్బాయి చాలామందితో గొడవలు పెట్టకుంటాడు. ఒకరోజు ధైర్యం చేసి ఆ అమ్మాయికి తన మనసులో మాట చెప్తాడు. కానీ ఆ అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోవడానికి ఒక కండీషన్ పెడుతుంది. దానికి నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా. నువ్వు సంతోషంగా ఉంటానంటే ఏమైనా చేస్తా అంటాడు. అప్పటి నుంచి రెండు నెలలు ఆ అబ్బాయి ఆ అమ్మాయికి కనిపించడు. కనీసం ఫోన్‌లో కూడా టచ్‌లోకి రాడు. ఈ విషయమంతా ఆ అమ్మాయి తన అన్నయ్యతో చెప్తుంది. ఇంతకీ ఆ అబ్బాయి ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? ఆ అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఊరొదిలి వెళ్లిపోయాడా? అనేది షార్ట్‌ఫిలింలో చూడండి.

Total views 64,335+ (ఫిబ్రవరి 2 నాటికి)
Published on Jan 30, 2019
దర్శకత్వం: చెన్ను సీహెచ్
నటినటులు : నాగ్, హారిక స్మైలీ, బొంగు సత్తి, లీలా వెంకటేష్ కొమ్మూరి, హరీష్ రోషన్, విజయ్ మహదాసు, అముఖేస్ సిల్కో, మాధవి ప్రియ, వెంకీస్ అబ్బూ
అక్కి ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె పేరు అవికా. ఇద్దరి పేరులోని మొదటి అక్షరం ఏ కావడంతో ఒకరినొకరు ఏ అని పిలుచుకుంటారు. కానీ ఆ ఫ్రెండ్స్ లిస్టులో సత్తి అనే ఫ్రెండ్ ఉంటాడు. వాడు ప్రతీ ఒక్కరితో విభేదిస్తూ, లేనిపోని మాటలు చెప్తూ ఉంటాడు. అలా ఒకరోజు అక్కిని రెచ్చగొడతాడు. ఇప్పటి వరకు నువ్ ఆ అమ్మాయిని ముట్టుకోలేదంటే.. నీకు మగతనం లేదా? లేక నిన్ను అది దగ్గరికి రానీయలేదా? అంటాడు. దీంతో అక్కి మరుసటి రోజు అవికా దగ్గరికి వెళ్లి నా మీద నమ్మకం లేదా? అంటాడు. దీంతో అక్కి మాటలు నమ్మి అవికా శారీరకంగా లొంగిపోతుంది. అదే రోజు రాత్రి సత్తి అక్కికి లేనిపోని మాటలు చెప్తాడు. దీంతో అక్కి మనసు చెదిరిపోయి అవికా క్యారెక్టర్‌ని శంకిస్తాడు. నోటికొచ్చినట్టు తిడుతాడు. అవికా బాధతో ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన అక్కి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అక్కిని వదిలేస్తారు. అసలు అవికా ఎందుకు చనిపోయిందో అక్కికి తెలుస్తుంది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న సమయంలో సత్తి అక్కి దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? షార్ట్‌ఫిలింలో చూడండి.

గిఫ్ట్

Total views 41,484+ (ఫిబ్రవరి 2 నాటికి)
Published on Jan 26, 2019
దర్శకత్వం: సాయికుమార్ తోట
నటీనటులు: రిషి పుల్ల, సమీర్, జీవీ సందీప్, ప్రత్యూష, లహరి, ఫణి కుమార్
రాహుల్‌కి ఫోన్ చేసి కాఫీషాప్‌కి పిలుస్తుంది ప్రియాంక. రాహుల్ కోసం పెండ్లిసంబంధం చూస్తుంది. ఆ విషయం చెప్పడానికే వారిని అక్కడికి పిలుస్తుంది. అక్కడికి రాహుల్‌తో పాటు వెళ్లిన ఫ్రెండ్ కాఫీషాప్‌లో కూర్చొని యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఉంటాడు. రూమ్‌కి వచ్చిన తర్వాత యూట్యూబ్ చానల్ పెడుదాం అంటూ తన ఆలోచనను రాహుల్‌తో పంచుకుంటాడు. అప్పటికే వారిద్దరూ మీడియాలో పనిచేసి బయటకు వచ్చేశారు. కొత్తగా ఏదైనా చేయాలన్న ఆలోచనతో మీడియా నుంచి బయటకు వచ్చేశారు. ఇదే విషయాన్ని రాహుల్ ఫ్రెండ్ గుర్తుచేస్తాడు. యూట్యూబ్ చానల్ పెడుదామని ఇద్దరూ ఫిక్సైపోతారు. ఈ సమయంలోనే రాహుల్ ఫ్రెండ్ ఓ అమ్మాయిని చూస్తాడు. వెళ్లి ఈ విషయం ఫ్రెండ్‌కి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్లు యూట్యూబ్ చానల్ లాంచ్ చేశారా? ఆ అమ్మాయిని లైన్‌లో పెట్టడానికే టైమ్ అయిపోయిందా? అనేదే మిగిలిన కథ.

- ప్రవీణ్‌కుమార్ సుంకరి
సెల్: 9701557412

901
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles