చెరవాణి!?


Sun,February 3, 2019 02:59 AM

Smart-Phones
మీరు మొబైల్ ఎక్కువగా వాడుతారా ?
అయితే మీకు క్యాన్సర్ రావొచ్చు.
మీరు మెసేజ్‌లు ఎక్కువగా టైప్ చేస్తారా ?
అయితే మీ మణికట్టు పనిచేయకపోవచ్చు.
చేతిలో మొబైల్ లేనిదే మీకు ఏమీ తోచదా ?
మీకు సంతానప్రాప్తి కలగకపోవచ్చు.
ఇది మేం చెప్తున్నది కాదు, ప్రపంచ ఆరోగ్య
సంస్థ నివేదిక. మొబైల్ వాడకం పెరిగితే
భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి
వస్తుందని హెచ్చరించింది. అసలు
సెల్‌ఫోన్ హెల్‌ఫోన్‌గా మారుతున్నదా?
చరవాణి మనల్ని చెరబడుతూ
చెరవాణిగా మారుతున్నదా?
ఆ వివరణ ఈ వారం ముఖచిత్ర కథనం..

Smart-Phones1

Smart-Phones2

ఓ వాస్తవం..

మొన్నీమధ్య ప్రముఖ గాయని ఆశాభోంస్లేని కలువడానికి బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఆమె నివాసానికి వెళ్లారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఆశా భోంస్లే బగ్‌డోగ్రా నుంచి కోల్‌కతా వరకు నన్ను చూడడానికి వచ్చారు. కానీ నాతో మాట్లాడేవారే ఎవరూ లేరు. అందరూ ఫోన్‌లో మునిగిపోయారు. ఇందుకుగానూ టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహంబెల్‌కి ధన్యవాదాలు అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంత పెద్ద సింగర్‌ని ఎదురుగా పెట్టుకొని, ఆమెతో మాట్లాడుదామని వచ్చినవాళ్లు ఆ పని పక్కనబెట్టి ఫోన్‌లో మునిగిపోయారట. ఆశాభోంస్లే ఈ ట్వీట్‌ను చూసి పలువురు వారి మీద చలోక్తులు విసిరారు. అలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. చేతిలో మొబైల్ ఉంటే ఎదురుగా ఎవరున్నారన్న విషయం మీద కూడా ధ్యాస ఉండదు.

ఓ అధ్యయనం..

స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ల వాడకం పెరిగాక పక్కపై కూడా వాటిని వదిలి ఉండడం లేదు జనాలు. పొద్దున లేవగానే అన్నింటికంటే ముందు మొబైలే చెక్ చేసుకుంటారు. పడుకునేటప్పుడు కూడా మొబైల్ పక్కనే ఉంచుకోవడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాదు నిద్రకు సంబంధించిన మెలాటనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి మీద కూడా ప్రభావం చూపిస్తుందట. మొబైల్ స్క్రీన్ ఉత్పత్తి చేసే వెలుగు నేరుగా కంటి శుక్లాల మీద అక్కడి నరాల ద్వారా మెదడు మీద ప్రభావం చూపుతుంది. మొబైల్ స్క్రీన్ లైట్ కంటి శుక్లాల మీద పడితే కంటిచూపు కూడా మందగించే ప్రమాదం ఉందట. ఇప్పటి వరకు ఎన్నో పరిశోధనలు, స్టడీలు మొబైల్ వినియోగం గురించి వచ్చాయి. లండన్‌కి చెందిన ఎవిలీనా చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో పనిచేసే ప్రొఫెసర్ పాల్ గ్రింగాస్ అనే వ్యక్తి మొబైల్ స్క్రీన్‌లైట్ వల్ల మెదడు, నరాల వ్యవస్థ దెబ్బ తింటుందంటూ ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్‌కి తన స్వీయ అనుభవాన్ని ఆర్టికల్ రూపంలో రాసి పంపాడు. మొబైల్ వల్ల ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే సదరు మొబైల్ మ్యానుఫక్చరింగ్ కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలని కూడా అందులో రాశాడు.

ఓ నివేదిక

స్పెయిన్‌లో ఓ ప్రైవేటు మల్టీస్పెషాలిటీ హాస్పిటల్.. 34 సంవత్సరాల మహిళను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించడానికి తీసుకొచ్చారు. టెస్టులన్నీ అయిపోయాక ఆమెకు వాట్సపిటీస్ అనే వింత రోగం ఉందని తేలింది. ఇంతకీ అదెందుకు వచ్చిందంటే ఆమె రోజులో ఆరు గంటలు కంటిన్యూగా వాట్సప్‌లో తన కుటుంబసభ్యులకు మెసేజ్‌లు పంపేంది. ఫలితంగా ఆమె రెండు చేతుల మణికట్టు ఎముకలు దెబ్బ తిని ఆమెకు ఆ వ్యాధి వచ్చింది. ఈ వార్త స్పెయిన్‌కు చెందిన మెడికల్ జర్నల్ ద లాన్సెట్‌లో ప్రచురితమైంది. మనుషులు మొబైల్‌కి, మొబైల్ యాప్స్‌కి ఎంతలా అడిక్ట్ అవుతున్నారో తెలిపే యదార్థ సంఘటన ఇది.

Smart-Phones3
ఒకప్పుడు వాడకట్టుకు ఒక్కరింట్లో ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండేది. ఆ చుట్టుపక్కల ఎవరికైనా చుట్టాల నుంచి, వలసపోయిన కుటుంబసభ్యుల నుంచి ఫోన్ వస్తే అందరూ పరుగెత్తికెళ్లి ఓ పది నిమిషాలు ఫోన్ మాట్లాడేవారు. వారితో మాట్లాడడానికి క్యూ కట్టేవారు. అప్పటి ప్రేమాభిమానాల గొప్పదనం అది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్. అప్పుడే మాట్లాడాలన్న రూలేం లేదు. ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు కాల్ చేస్తున్నారు. అన్నతోటి మాట్లాడుతవారా..? అంటే నేను పొద్దున్నే ఫేస్‌బుక్‌లో గుడ్‌మార్నింగ్ అని మెసేజ్ పెట్టిన అంటున్నారు. ఒక విధంగా నిత్యం మొబైల్ ద్వారా ఎఫ్బీలో, వాట్సప్‌లో టచ్‌లో ఉండడం వల్ల ఎదురుగా ఆ వ్యక్తి ఉన్నా పట్టించుకోనట్లుగా తయారయ్యాయి ప్రస్తుత మానవ సంబంధాలు. ఒక రకంగా దూరంగా ఉన్నవారితో ఎటాచ్‌మెంట్ పెంచి, దగ్గరగా ఉన్నవారితో డిటాచ్‌మెంట్ చేస్తుంది. మనిషి పుట్టగానే గాలి కోసం, పెరుగుతుంటే స్వేచ్ఛ కోసం, కాస్త తెలివొచ్చాక మొబైల్ కోసం వెంపర్లాడుతున్నాడు.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉన్న సోషల్ మీడియా భావ ప్రకటనకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఒక బిడ్డ తల్లికి చెప్పాలనుకున్న విషయం, ఒక కుర్రాడు తను ప్రేమించే అమ్మాయికి వ్యక్తం చేయాలనుకున్న ప్రేమ, ఒక సామాజిక కార్యకర్త సమాజంలో జరుగుతున్న పరిమాణాలపై స్పందన అన్నింటికీ సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాడు. ఈ స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియాల వల్ల కొంతమందికి దగ్గరైనా ఎంతోమందికి దూరమవుతున్నారు. మొబైల్ ఫోన్ వచ్చాక మనిషికి విపరీతమైన స్వేచ్ఛ దొరికింది. ఎక్కడ కావాలంటే అక్కడ, దేని గురించైనా ఇష్టమొచ్చినంత సేపు మాట్లాడుతున్నాడు. మనసులోని భావాల్ని నిరభ్యంతరంగా వ్యక్తపరుస్తున్నాడు. ఇప్పుడు మొబైల్ లేకపోవడం అంటే నామర్దా. చిన్న సమస్యను కూడా ఫోన్ ద్వారా పరిష్కరించుకునే రేంజ్‌లో మొబైల్ వాడకం పెరిగిపోయింది. ఎదుటి వ్యక్తితో గట్టిగా పదినిమిషాలు కూడా మాట్లాడలేడు కానీ.. ఫోన్‌లో అయితే అవతలి వ్యక్తిని గంటలు గంటలు ఎంటర్‌టైన్ చేయగలడు. ఇది మనిషి చేస్తున్న తప్పిదమో, పొరపాటో కాదు, ఒక రకమైన అడిక్షన్.
Smart-Phones6

ఏ దేశంలో ఎంత?

- పాకిస్తాన్‌లో 77శాతంమంది స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు.
- టెక్నాలజీలో ముందుండే
- జపాన్‌లో 95 శాతం మంది స్మార్ట్‌ఫోన్ల కలిగి ఉన్నారు.
- రష్యాలో అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. 155 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు.
- యుఎస్‌ఏలో 32 కోట్ల ఫోన్లు వాడుతున్నారు.
- చైనాలో ప్రతీ వంద ఫోన్లలో 97 ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది.
- అదే మన ఇండియాలో ప్రతీ వందమందిలో 77మంది వాడే
- ఫోన్లకు ఇంటర్నెట్ సౌకర్యం అనుభవిస్తున్నారు.
- ఇండియాలో 96 కోట్ల మంది మొబైల్స్ వాడుతున్నారు.
- చైనాలో 127 కోట్ల మొబైల్స్ ఉన్నాయి.
- నైజీరియాలో 94 శాతం స్మార్ట్‌ఫోన్లున్నాయి.
- బ్రెజిల్ అయితే 141 శాతం ఇంటర్నెట్ వినియోగం జరుగుతున్నది.
- ఇండినేషియాలో 100 ఫోన్లలో 99 ఫోన్లకు ఇంటర్నెట్ సదుపాయం ఉంది.
- అమెరికాలో అయితే వందమందిలో ప్రతీ ఒక్కరికీ ఇంటర్నెట్ సదుపాయం ఉంది. ఒక్కొక్కరి దగ్గర ఒకటికి మించి మొబైల్స్ ఉన్నాయి.
- బంగ్లాదేశ్‌లో 80.5 శాతం ఇంటర్నెట్ సదుపాయం ఉన్న మొబైల్స్ వాడుతున్నారు.

Smart5-Phones

ఆరోగ్యానికి హానికరం..

క్యాన్సర్ కారకం: మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎఫెక్ట్ మానవ శరీరంపై చాలా ప్రభావం చూపిస్తుంది. మొబైల్ నుండి విడుదలయ్యే ఎమిట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఫీల్డ్స్ అనే రేడియో తరంగాలు బేస్ స్టేషన్ నుంచి విడుదలైన రేడియో తరంగాల కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటాయి. ఇవి నిత్యం మొబైల్ ఆపరేట్ చేసే వారి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. ఇలా అధికమొత్తంలో విడుదలయ్యే రేడియో ఫ్రీక్వెన్సీలు క్యాన్సర్‌కు దారితీస్తాయి. మానవుల్లో ఉండే వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి రోజురోజుకూ శక్తి తగ్గిపోయేలా రేడియో తరంగాలు మానవ శరీరంపై ప్రభావం చూపుతాయని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధక సంస్థ ప్రకటించింది కూడా.

నిద్రను మింగేస్తుంది: నిద్రను మింగేసే స్థానంలో ఒకప్పుడు టీవీ, కంప్యూటర్‌లుండేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని మొబైల్స్ ఆక్రమించాయి. రోజంతా మొబైల్‌లో మెసేజ్‌లు, కాల్స్, సోషల్ మీడియాను ఫాలో అవుతున్నా, రాత్రిళ్లు కూడా మొబైల్‌లో వాటిని కొనసాగించడంతో నిద్రలేమికి గురవుతున్నారు. మంచి నిద్రలో ఉన్నప్పుడు సడెన్‌గా కాల్ లేదా మెసేజ్ వస్తే ఉలిక్కిపడి లేచి అటెండ్ చేయడం, రిైప్లె ఇవ్వడం చేస్తున్నారు. అలా ఉలిక్కిపడి లేవడం వల్ల మెదడులో రెస్ట్‌మోడ్‌లో ఉన్న నరాలు ఉత్తేజితమై మళ్లీ రెస్ట్‌మోడ్‌కి వెళ్లడానికి టైం తీసుకుంటాయి. ఆ లోపు తెల్లవారుతుంది. ఇలా చాలామంది నిద్రలేమితో మరిన్ని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని సారా థోమ్ ఎటల్ బృందం చేసిన పరిశోధనలో వెల్లడైంది.

సంతానలేమికి కారణం: మగాళ్లు మొబైల్ విపరీతంగా వాడడం వల్ల వారిలో సెక్స్‌సామర్థ్యం తగ్గిపోతుందని వడోవైక్ అనే ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. దీనికోసం కొన్ని మగ ఎలుకలను ఒక బోనులో బంధించి ఆ బోనుకు దగ్గరలో మొబైల్స్ ఉంచి వాటికి నిత్యం కాల్స్, మెసేజ్‌లు చేశారు. కొన్నిరోజుల తర్వాత వాటిని పరీక్షిస్తే ఆ ఎలుకల్లో వీర్యవృద్ధి గణనీయంగా పడిపోయింది. మహిళలు కూడా దీనికి అతీతమేం కాదు. అతిగా మొబైల్ వాడితే వారి శరీరం, మెదడుపై ప్రభావం చూపి సంతానప్రాప్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.

యాక్సిడెంట్లకు కారణం: ప్రతిరోజూ జరిగే రోడ్డుప్రమాదాల్లో నాలిగింట మూడో వంతు మొబైల్ ఆపరేట్ చేస్తూ డ్రైవింగ్ చేయడం వల్లే అని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ఐఫోన్, ఫ్లిప్ ఫోన్, బ్లాక్‌బెర్రీ లాంటి విలువైన టచ్‌ఫోన్ల వల్ల రోజురోజుకూ ప్రమాదాల సంఖ్య పెరుగుతుందట. చాలా సెన్సిటీవ్‌గా, స్మూత్‌గా ఆ మొబైల్స్ ఆపరేట్ చేసే క్రమంలో ముందు, వెనుక వచ్చే వాహనాలను పట్టించుకోక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రపంచ రోడ్డు ప్రమాద నివారణా అవగాహనా సంస్థ తేల్చింది.

వాడకం : ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం వేగంగా పెరుగుతున్నదని సిస్కో (సిస్కో విజువల్ నెట్‌వర్కింగ్ ఇండెక్స్) అధ్యయనంలో తేలింది. 2022 నాటికి 83 కోట్లకు ఈ సంఖ్య చేరుకోనుందట. ప్రస్తుతం మనదేశ జనాభాలో 60 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అందులో 40 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌లోనే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.

Smart-Phones4

నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు ఫోన్ వాడడం ఆపేయండి. చీకట్లో మొబైల్ చూడడం వల్ల ఆ వెలుతురు ప్రభావం పడి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది.
Smart-Phones7
1 సగటున ఒక మనిషి 200 సార్లు మొబైల్ చెక్ చేసుకుంటున్నాడని ఓ సర్వేలో తేలింది.

2 బ్రిటిషర్లలో 73 శాతం మంది రోజులో కనీసం ఒక్కసారైనా మొబైల్ చెక్ చేసుకోకుండా ఉండలేకపోతున్నారట.

3 నలుగురిలో ఒకరు నిద్రపోయే సమయం కంటే మొబైల్‌లో చాటింగ్, బ్రౌజింగ్ చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

4 16 నుంచి 24 ఏండ్ల వయసు వారు 70 శాతం ఫోన్‌లో మాట్లాడడంతో పాటు వ్యక్తులతో నేరుగా మాట్లాడడం కంటే చాటింగ్‌కే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారట.

5 సగటున ఒక్క టీనేజర్ బెడ్ మీద నుంచి నెలలో 3400 మొబైల్ మెసేజ్‌లు పంపిస్తున్నాడంటే మొబైల్ వాడకానికి ఏ స్థాయిలో అలవాటుపడ్డారో అర్థం చేసుకోవచ్చు.

6 సక్రమంగా నిద్రపట్టాలంటే మెలటోనిన్ తప్పనిసరి. కాబట్టి నిద్రను హరించే మొబైల్‌ను పడుకునే ముందు వాడకపోవడమే మంచిది.

- అవసరం లేనప్పుడు డాటా ఆఫ్‌లో పెట్టేయండి. మొబైల్ చూడడం కొంతైనా తగ్గుతుంది.

7 వీలైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. రోజులో ఫలానా టైమ్ మాత్రమే సోషల్ మీడియాకు అని కేటాయించుకోండి.

- మొబైల్ చాటింగ్‌ని పక్కకు పెట్టి వ్యక్తులతో నేరుగా మాట్లాడండి. మనసు కుదుటపడుతుంది. ఆలోచనలు ఫ్రెష్‌గా ఉంటాయి.

- ప్రవీణ్‌కుమార్ సుంకరి,
సెల్: 9701557412

2414
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles