ఒక పులి శాశ్వత నిష్క్రమణ


Sun,February 3, 2019 02:40 AM

Bal-Thakre
2012..ముంబై నగరంప్రతి ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసం వస్తుందంటే మరాఠీలకు ఏదో తెలియని ఉత్సాహం, ఉద్వేగం, కళ్లల్లో మెరుపు, గుండెల్లో వేగం కదలాడుతాయి. కారణం ఆ నెలలో వచ్చే దసరా ఉత్సవాలు. ఆ ఉత్సవాల సందర్భంగా శివసేన నిర్వహించే ర్యాలీ. ప్రతి ఏడాది ఆ ర్యాలీలో వేలాది మంది శివసైనికులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత బాల్‌థాకరే చేసే ప్రసంగం. కానీ..

బాంద్రాలోని సగృహం మాతోశ్రీ నుంచి పూలతో అమర్చిన వాహనంలో బాల్‌థాకరే భౌతికకాయం అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో మొత్తం 10 లక్షలకు పైగా జనం పాల్గొన్నట్టు భావిస్తున్నారు. మాతోశ్రీ నుంచి శివాజీ పార్కు వరకు పది కిలోమీటర్లు థాకరే అంతిమయాత్ర సాగడానికి 8 గంటల సమయం పట్టింది.బాలా సాహెబ్ అమర్ రహే, తిరిగిరా..తిరిగి రా బాలాసాహెబ్ తిరిగి రా అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.

అక్టోబర్ 24, 2012

దసరా పండుగ
ముంబై నగరంలోని శివాజీపార్కు నుండి మొదలయ్యే ర్యాలీలో వేలాదిమంది శివసైనికులు తమ అగ్రనేత ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు. తమ నేత వేదిక మీదకు వస్తాడని ఎన్నో కండ్లు రెప్పలు మూయకుండా వేచి ఉన్నాయి. కానీ అక్కడి వేదిక మీద ఏర్పాటు చేస్తున్న వీడియో స్క్రీన్స్ వారిలో ఏదో అనుమానాలను రేకెత్తించింది. కొంతసేపటికి కొంత అలజడి మొదలైంది. జనమంతా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. వేదిక వైపు ఒక కాన్వాయి వస్తుండడంతో అందరూ బాల్‌థాకరే వస్తున్నారన్న ఆనందంతో బాల్‌థాకరే జిందాబాద్, అప్నానేత బాల్‌థాకరే అంటూ నినదిస్తున్నారు. కాన్వాయి ఆగింది కానీ అందులో నుండి బాల్‌థాకరేకు బదులు ఆయన కుమారుడు ఉద్ధవ్‌థాకరే దిగారు. ఆయన అక్కడున్న అశేష జనానికి అభివాదం చేసి వెళ్లి కూర్చున్నారు. ఇంతలో తెరమీద ముంబై బెబ్బులి బాల్‌థాకరే ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారిగా హర్షాతిరేకాలు మిన్నంటాయి. అందరికీ నమస్కరించిన బాల్‌థాకరే ఆ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి వీడియో ద్వారా ప్రసంగించారు. తాను ప్రజా జీవితం నుంచి వైదొలుగుతున్నట్లు తన కుమారుడు ఉద్ధవ్ థాకరే, పెద్ద మనవడు ఆదిత్యా థాకరేకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. భౌతికంగా దెబ్బతిన్నాను. నేను నడవలేను. చాలా టయడ్‌గా ఉన్నానంటూ థాకరే పేర్కొన్నారు. శివసైనికులు కన్నీటి పర్యంతమయ్యారు.

సాయంత్రం 4 గంటలు
బంద్రా, మాతోశ్రీ బాల్‌థాకరే నివాసం

కాన్వాయ్ బయటకు వచ్చింది. అది నేరుగా ముంబైలోని లీలావతీ ఆసుపత్రికి చేరుకుంది. నడవలేని స్థితిలో ఉన్న బాల్‌థాకరేను స్ట్రెచర్ మీద ఆసుపత్రిలోకి తీసుకువెళ్లారు. అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించాక ఇంటికి పంపించారు. ఇంటికెళ్లాక తిరిగి థాకరే ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆసుపత్రికి తరలించారు. అప్పట్నుంచీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్న దాఖలాలు కనిపించనేలేదు. నిజానికి ఆయన ఆరోగ్యం చాలా కాలంగా క్షీణిస్తూ వస్తున్నది. లీలావతి ఆసుపత్రిలో కొద్దిరోజుల చికిత్స అనంతరం ఆయనను తిరిగి మాతోశ్రీ నివాసానికి తరలించారు. అక్కడే ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ జలీల్ పార్కర్ వైద్య సేవలు అందిస్తున్నారు.
నిజానికి బాల్ థాకరే అంటే కరుడుగట్టిన హిందూత్వవాది. హిందూ మత పరిరక్షణ కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి. కానీ బా సాహెబ్ వ్యక్తిగత వైద్యుడైన జలీల్ ఓ ముస్లిం. చాలా సంవత్సరాలుగా తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న డాక్టర్ జలీల్ పార్కర్ అంటే థాకరేకు ఎనలేని అభిమానం. నమ్మకం. ఛాతి వైద్య నిపుణుడైన జలీల్ పార్కర్ థాకరే నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయలేదు. 2009లో థాకరే తీవ్ర శ్వాస సంబంధ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమెరికాలో వైద్యవిద్యను అభ్యసించిన జలీల్ థాకరేకు చికిత్స చేసి ఉపశమనం కలిగించారు. అప్పటినుంచి థాక్రే స్వగృహం మాతోశ్రీకి ఆయన నిత్య సందర్శకుడు అయ్యారు. ఇప్పుడు కూడా థాకరే నివాసంలోనే థాకరేకు దగ్గరుండి చికిత్స అందిస్తున్నారు.
Bal-Thakre1
బాల్‌థాకరే మాటంటే మరాఠీలకు వేదం. బాబా సాహెబ్ నివాసం మాతోశ్రీ మరాఠీలకు ఓ దేవాలయం. దేశంలో బాల్‌థాకరే అంత చరిష్మా ఉన్న రాజకీయ నేత మరొకరు లేరన్న విషయాన్ని మరాఠీలు చాలా సగర్వంగా చెప్పుకుంటారు. మరాఠీ ఏతరులు ముంబై విడిచివెళ్లిపోవాలంటూ తొలిరోజుల్లో బాల్‌థాకరే చేపట్టిన చిన్న చిన్న ఉద్యమాల ప్రభావం ఇప్పటికీ మరాఠీలందరిమీదా చాలా బలంగా పనిచేస్తున్నది. తొలినాళ్లలో కార్టూనిస్ట్‌గా పనిచేస్తూ తన జాతి వీరత్వాన్ని ప్రదర్శిస్తూ చిన్న చిన్న పోరాటాలతో ముందుకు సాగిన బాల్‌థాకరే తర్వాత్తర్వాత ఒక్క ముంబై ని మాత్రమే కాక, మొత్తం మహారాష్ట్రనే శాసించ గలిగే స్థాయికి చేరుకున్నారు. ఇండియా లాంటి దేశాన్ని పాలించాలంటే హిట్లర్ లాంటి లీడర్ కావాలంటూ థాకరే చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. థాకరే ఓ శక్తిగా ఎదగడానికి ముందు ముంబైలో సామాన్యుల మనుగడ ప్రశ్నార్ధకంగా ఉండేది. అరాచకశక్తుల పదఘట్టనలకింద నలిగిపోతున్న హిందువులను పైకి లేపి మాఫియాని కాలికింద తొక్కిపట్టిన ఘనతని థాకరే దక్కించుకున్నారు. ముంబైని ఏలుతున్న స్మగ్లర్లను తొక్కిపట్టడానికి అదే మార్గంలో వెళ్లి తన వాళ్లని ఆ మార్గంలో పాతుకుపోయేలా చేసినవాడు. నమ్మిన దానికోసం, నమ్ముకున్నవాళ్లకోసం వెనకడుగు వేయని పోరాట యోధుడు బాల్‌థాకరే.

86 సంవత్సరాల వయసున్న శివసేన సేనాని కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆ మధ్య కాలంలో బాగా క్షీణించింది. లీలావతీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్సని అందించినప్పటికీ ఆయన పెద్దగా కోలుకోలేకపోయారు. ఆఖరు ఘడియల్లో తనకి బాగా ఇష్టమైన తన నివాసంలోనే వైద్యులు ఆయనకు సపర్యలు చేస్తూ వైద్యమందించారు. ఇదిలా ఉండగా, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే పార్టీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై చర్చించేందుకు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ఈ సమావేశంలో బాల్‌థాకరే ఆరోగ్యంపై కూడా చర్చించారు. అనారోగ్యం బారిన పడిన తన బాబాయ్ బాల్‌థాక్రేను ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌థాకరే పరామర్శించారు. అలాగే, మహారాష్ట్ర మంత్రి, ఎన్.సి.పి నేత ఛగన్ భుజబల్ ఇతర నేతలు కూడా పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ముంబై లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు సెలవులు రద్దు చేశారు. థాకరే నివాస ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం 48వేల మంది పోలీసులతో ముంబై ఖాకీ వనంగా మారింది. థాకరే చికిత్స పొందుతున్న లీలావతి ఆస్పత్రి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. శివసేన కార్యకర్తలను నియంత్రిస్తున్నారు. పలు ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు. ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభిమానులు అక్కడికి తరలివస్తున్నారు. నవంబర్ 16న తిరిగి ఆయనను నివాసానికి తరలించారు.

శివసేన అధినేత బాల్‌థాకరే ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన స్వస్థలంలోనే వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఆయన శరీరం వైద్య చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నదని, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉద్దవ్ థాకరే వెల్లడించారు. దీంతో ముంబైతో పాటు.. మహారాష్ట్రలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది.

మరునాడు ఆయన ఆరోగ్యం బాగా విషమించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల ఎస్పీలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ సహాయంతో శ్వాస అందిస్తున్నట్లు థాక్రే సన్నిహిత వర్గాల సమాచారం. శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాకరే.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉన్నపళంగా పార్టీనేతలు సమావేశం కావడంపై ముంబైవాసుల్లో అనుమానం పెరిగింది. బాబా గురించి ఎప్పుడు ఏ వార్త వినాల్సొస్తుందోనని ఆందోళన అభిమానుల్లో ఎక్కువైపోయింది. శివసేన అధినేత బాల్‌థాకరే పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. బాల్ థాకరే ఊపిరితిత్తులు, క్లోమ గ్రంథి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బాంద్రాలోని థాకరే ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. బాల్‌థాకరే ఆరోగ్యం బాగుపడాలంటూ ఆయన

మేనల్లుడు రాజ్ థాక్రేకు చెందిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కార్యకర్తలు పలు దేవాలయాల్లో పూజలు జరిపారు.

నవంబర్ 17, శనివారం
కొద్దికొద్దిగా స్పందిస్తూ అంతలోనే దిగజారుతూ వచ్చినా థాకరే ఆరోగ్యం నిలకడగా నిలబడలేకపోయింది అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితిని గమనించిన మృత్యువు.. జీవితమంతా పులిలా బతుకుతూ అలుపెరగని పోరాటం చేసిన యోధుడికి వీరమరణమనే శరణ్యమని భావించింది. బాబా సాహెబ్ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆయన మరణించినట్లు వ్యక్తిగత వైద్యుడు జలీల్ పార్కరే ధృవీకరించారు.బాలా సాహెబ్ థాకరే శకం ముగిసింది. ముంబైనగరం మూగబోయింది. మహారాష్ట్రం చిన్నబోయింది. బాబా సాహెబ్ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న కోట్లాదిమంది మరాఠీలు అనాథలైపోయారు. మాతోశ్రీ దగ్గరికి లక్షలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. తమ అభిమాన నేత ఇక లేరన్న విషయాన్ని తెలుసుకుని గుండెలవిసేలా విలపిస్తున్నారు.బాల్‌థాకరే.. మడమ తిప్పడం ఎరగని మరాఠా యోధుడు.. తనని తాను అభినవ శివాజీగా ప్రకటించుకున్న సాహసం ఈ ముంబై వాసికి మాత్రమే సొంతం.

Bal-Thakre2
తొలినాళ్లలో కార్టూనిస్ట్‌గా పనిచేస్తూ తన జాతి వీరత్వాన్ని ప్రదర్శిస్తూ చిన్న చిన్న పోరాటాలతో ముందుకు సాగిన బాల్‌థాకరే తర్వాత్తర్వాత ఒక్క ముంబై ని మాత్రమే కాక, మొత్తం మహారాష్ట్రనే శాసించ గలిగే స్థాయికి చేరుకున్నారు. ఇండియా లాంటి దేశాన్ని పాలించాలంటే హిట్లర్ లాంటి లీడర్ కావాలంటూ థాకరే చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి.

మరునాడు బాంద్రాలోని సగృహం మాతోశ్రీ నుంచి పూలతో అమర్చిన వాహనంలో బాల్‌థాకరే భౌతికకాయం అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో మొత్తం 10 లక్షలకు పైగా జనం పాల్గొన్నట్టు భావిస్తున్నారు. మాతోశ్రీ నుంచి శివాజీ పార్కు వరకు పది కిలోమీటర్లు థాకరే అంతిమయాత్ర సాగడానికి 8 గంటల సమయం పట్టింది.బాలా సాహెబ్ అమర్ రహే, తిరిగిరా.. తిరిగి రా బాలాసాహెబ్ తిరిగి రా అన్న నినాదాలతో మార్మోగిపోయింది. దక్షిణ ముంబైలోని చారిత్రక శివాజీ పార్కులో బాల్‌థాకరే అంత్యక్షికియలు శివాజీ పార్కులో బహిరంగంగా జరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన తొలి బహిరంగ అంత్యక్రియలివి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంతవరకు నగరంలో ఇలా బహిరంగంగా దహన సంస్కారాలు జరగలేదు. 1920లో స్వాతంత్య్రసమరయోధుడు బాల గంగాధర్ తిలక్ అంత్యకియలను నగరంలో బహిరంగంగా నిర్వహించారు.

- మధుకర్ వైద్యుల
సెల్ : 91827 77409

3299
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles