పచ్చల సోమేశ్వరాలయం


Sun,February 3, 2019 02:32 AM

(కందూరు చోడుల ఆలయాలు, శాసనాలు పార్ట్ 2)

PACHALA-SOMESHWARA
కందూరు చోడుల ఆలయాల్లో ఛాయా సోమేశ్వరాలయం ఆనాటి రాజుల కళాతృష్ణకు, శిల్పుల అపార మేథాసంపత్తికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. దీనికి కొద్దిదూరంలోనే వారే నిర్మించిన పచ్చల సోమేశ్వరాలయమూ వారి అద్భుత నిర్మాణ శైలికి, ప్రజ్ఞాపాటవాలకు కూడా నిలువుటద్దంలా నేటికీ కనబడుతున్నది. ఈ ఆలయ నల్లరాతి శిలలు ఆనాటి శిల్పుల చేతుల్లో మైనపు ముద్దల్లాగా ఒదిగి అపురూప శిల్పాలుగా అవతరించిన తీరు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

నల్లగొండ జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని పానగల్‌లో కందూరు చోడులు నిర్మించిన పచ్చల సోమేశ్వరాలయం ఉంది. శ్రీ ఛాయా సోమేశ్వరాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పానగల్లు ఊరు మధ్యలో వెలిసిన దివ్యాలయం ఇది. ఈ ఆలయం నాలుగు దిక్కులకు అభిముఖంగా రాతి కట్టడాలతో కూడిన నాలుగు దేవాలయాల క్షేత్రంగా వెలుగొందుతున్నది.
PACHALA-SOMESHWARA1
నల్లశానపు రాళ్లపై రమ్యంగా మలచిన శిల్పాలు, ఆలయాలు మధ్యయుగ వాస్తు సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి. ఆలయం బయటి గోడలపైన వినాయకస్వామి, కుమారస్వామి, మహిషాసురమర్దిని, దిక్పాలక, రతి మన్మథ, శివ, నటరాజ, ఉమామహేశ్వర శిల్పాలు ఆనాటి శిల్పుల పనితనాన్ని గొప్పగా తెలియజేస్తున్నాయి. అధిష్టానం, పాదవర్గం, ప్రస్తారం, విమానం, సుఖనాసులతో అలరారుతున్న ఈ ఆలయాలు క్రీ.శ. 11-12 శతాబ్దాలకు చెందినవి.

70 స్తంభాలతో మహామండపం మూడు రంగమండపాలను కలుపుతూ ఉంటుంది. తూర్పు ముఖంగా మూడు ఆలయాలు, పడమర ముఖంగా ఒక ఆలయం ఈ మహాముఖ మండపంతో అనుసంధానమై ఉన్నాయి. ఈ ఆలయ ముఖ మండప స్తంభాలపై ఎన్నో పురాణగాథలను తెలిపే అపురూప శిల్పాలు ఉన్నాయి. అందుకే వీటిని ప్రదర్శన మండపాలు అని అంటారు.

ఈ ఆలయ స్తంభాలు, గోడలపై శైవ రీతులు, గజాశుర సంహారం, నరసింహ రూపకం, రావణాసురుడు కైలాసాన్ని కదిలించడం, దేవ నర్తకీమణుల నాగినీ నృత్య రూపాలు, రామాయణ మహాభారత భాగవత గాథలతో కూడిన ఘట్టాలను అద్భుతంగా చెక్కారు. స్తంభాలపైన, పైకప్పులపైన చెక్కిన అష్టదిక్పాలక శిల్పాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
PACHALA-SOMESHWARA2
పచ్చల సోమేశ్వర స్వామి వారి ముందున్న రంగ మండపంలోని నాలుగు స్తంభాల మీద వరుసగా భారత, భాగవత, రామాయణ, శివపురాణ గాథల్ని చెక్కిన తీరు చూస్తే వర్ణించడానికి అక్షరాలు చాలవు. ఈ మండంలో స్వామి వారికి ఎదురుగా సుందర నందీశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. ఆంత్రాలయ ప్రవేశం వద్ద మరొక చిన్న నందీశ్వరుడు కాపలా కాస్తూ దర్శనమిస్తాడు. గర్భగుడిలో శ్రీ పచ్చల సోమేశ్వరుడు దివ్యకాంతితో విరాజిల్లుతూ, భక్తులతో నీరాజనాలందుకుంటున్నాడు. ఈ ఆలయ శివలింగానికి అమర్చిన పచ్చల వెలుగు గర్భగుడి అంతటా ఒకప్పుడు కన్పించేదట. ఈ కారణంగానే ఈ ఆలయానికి పచ్చల సోమేశ్వరాలయం అనే పేరు వచ్చిందని అంటారు. మహ్మదీయుల దండయాత్రలో పచ్చల సోమేశ్వరాలయం లింగం పచ్చలను దొంగిలించినట్లు కథనం.

స్వామి వారికి ఎదురుగా ఉన్న ఉపాలయంలో సంకట గణపతి దర్శనమిస్తాడు. ఈయనను చూస్తే ఏదో చరిత్రకందని విశేషాన్ని దాచుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే, శివునికి అభిముఖంగా గణపతిని ప్రతిష్ఠించడం కొంచెం అరుదైన విషయమేనని చరిత్రకారులు చెబుతారు. అది కూడా విగ్రహం, పీఠం కలిపి ఏక కవచంతో కప్పి ఉంచడం కూడా ఈ ఆలయం ప్రత్యేకతగా చెబుతారు. ఈ ఆలయానికి రెండు వైపులా దగ్గర దగ్గరగా రెండు స్తంభాలు, ఈ రెండింటికి మధ్యలో 12 అడుగుల దూరంలో గణపతి ఎదురుగా మరో స్తంభం నిలపెట్టి ఉన్నాయి. అంటే శివుని వద్ద నుంచి చూస్తే గణపతి సూటిగా కనబడడు.

ఈ ప్రాంగణంలో శ్రీ స్వామి వారికి కుడివైపున ఉన్న మరొక ఉపాలయంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ రెండు ఆలయాల మధ్యలో మరొక ఉపాలయం అర్ధాంతరంగా నిర్మాణం నిలిచిపోయి మనకు కన్పిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం చెక్కిన శిలలు, శిల్పాలన్నీ ఆలయం వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో వెయ్యి సంవత్సరాలుగా పడి ఉన్నట్లు స్థానికులు చెబుతారు. ఆలయ ఆవరణ నిండా శిథిలాలు, శిల్పాలు కుప్పలు తెప్పలుగా కన్పిస్తూ, ఆనాటి విధ్వంసానికి చెరగని సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి.

పచ్చల సోమేశ్వర ఆలయం పక్కనే చెన్నకేశవాలయం కూడా అద్భుత శిల్పకళతో నిర్మితమైంది. దీని ఎదురుగా రాతిపై చెక్కిన తామర పుష్పాల పద్మపీఠం చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది.

ఈ ఆలయ ప్రాంగణంలోనే పురావస్తు ప్రదర్శన శాల ఉంది. 1994లో పురావస్తు శాఖ వారు ఆలయం వెనుక భాగంలో మ్యూజియంను నెలకొల్పారు. దేవరకొండ, భువనగిరి, ఏలేశ్వరం, పిల్లలమర్రి మొదలైన ప్రాంతాల నుంచి సేకరించిన అనేక చారిత్రక వస్తువులను ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. ముఖ్యంగా ఆదిమ మానవుడు ఉపయోగించిన ఆయుధాలు, వంటపాత్రలు, లిపి, దేవతా విగ్రహాలు, పలు నాణేలు మొదలైనవి ఇక్కడ దర్శనమిస్తాయి. ఇవన్నీ 1వ శతాబ్ది నుంచి 18వ శతాబ్దం మధ్య వాడినవిగా చెప్తారు. ఈ మ్యూజియం సందర్శన వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు. సోమవారం సెలవు.

వచ్చేవారం :
కొలనుపాక, ఆగామోత్కూర్, వల్లాల శాసనాలు

నగేష్ బీరెడ్డి
ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ
సెల్ : 80966 77 177

2119
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles