జినోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్సీ అవార్డుకు సౌమ్య స్వామినాథన్


Sun,February 3, 2019 02:27 AM

Soumya-Swaminathan
ఈ ఏడాదికిగాను ప్రతిష్ఠాత్మక జినోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్సీ అవార్డులను బయోఏషియా ప్రకటించింది. అవార్డుకు ఎంపికైన వారిలో ప్రపం చ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రోగ్రామ్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఒకరు. ఫిబ్రవరి 25 నుంచి బయోఏషియా 2019 హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వద్ద ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. తన జీవితాన్ని మెరుగైన జీవన విధానానికి అంకితం చేసిన సౌమ్య స్వామినాథన్‌ను గౌరవించుకోనున్నామని తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్, కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ఈ సందర్భంగా సౌమ్యస్వామినాథన్ ప్రస్థానం.

సౌమ్య స్వామినాథన్ భారతీయ హరితవిప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్, ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఆధ్యురాలైన మీనా స్వామినాథన్‌ల కూతురు. ఇటీవలె ప్రపంచ ఆరోగ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ప్రోగ్రామ్స్)గా నియమితురాలయ్యారు. ఇందులో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్థాయికి చేరిన తొలి భారతీయురాలు సౌమ్య.

విద్యా ఉద్యోగం

సౌమ్య చదువు చెన్నై నుండి మొదలైంది. ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేశారు. ఎంబీబీఎస్ పుణెలోని ఎఎఫ్‌ఎమ్‌సీ(ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్)లో, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎం.డి. చేశారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీడియాట్రిక్ పల్మనాలజీలో పరిశోధనను (పీహెచ్‌డీ) పూర్తి చేశారు. అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని పలు ప్రతిష్ఠాత్మక వైద్యసంస్థల్లో పరిశోధనా విభాగాల్లో పనిచేశారు. మన దేశంలో భారతీయ హెల్త్ డిపార్ట్‌మెంట్ (రీసెర్జ్)లో సెక్రటరీగా, ప్రతిష్ఠాత్మక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ.సి.ఎం.ఆర్)కు డైరెక్టర్ జనరల్‌గా అత్యున్నత పదవులు అలంకరించారు. ఐ.సి.ఎం. ఆర్. వందేళ్ల చరిత్రలో ఆ స్థాయికి ఎదిగిన రెండో మహిళ సౌమ్య కావడం విశేషం.

కీలక పరిశోధనలు

పిల్లల వైద్యురాలిగా కెరీర్ మొదలుపెట్టి, వైద్య పరిశోధనల్లో మునిగి తేలారు డాక్టర్ సౌమ్యా. పిల్లల వ్యాధులతోపాటు క్షయ, హెచ్‌ఐవీలో పోషకాహారం పాత్ర.. ఇలా ఎన్నో పరిశోధనల్లో నూతన కోణాలను ఆవిష్కరించి పేరు తెచ్చుకున్నారు. సౌమ్య 30 ఏండ్లుగా అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. చెన్నైలోని ఎన్‌టీఐ డైరెక్టర్‌గా టీబీ వ్యాధిని నిర్మూలించడానికి రీసెర్చ్ చేశారు. టీబీ జీరో సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా క్షయను తేలికగా గుర్తించడం కోసం మాలిక్యులర్ డయాగ్నొస్టిక్స్ అనే కొత్త పద్ధతిని అవలంబించారు. ఏకంగా 250 వైద్య పరిశోధనా వ్యాసాలు రాశారు.

యునిసెఫ్‌తో..

పబ్లిక్ హెల్త్ కోసం ప్రపంచ స్థాయి సమీక్షలలో సౌమ్య పాత్ర కీలకం. క్లినికల్ కేర్, రీసెర్చ్‌లో ఆమె అనుభవం, చిత్తశుద్ధి ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి హెచ్‌ఐవీ/ ఎయిడ్స్, ట్యూబర్క్యొలోసిస్, మలేరియాలను తరిమి కొట్టడానికి పనికొస్తున్నది. ఆ వ్యాధుల నిర్మూలన కోసం ప్రోగ్రామ్ రూపొందించి సేవలందిస్తున్నారు సౌమ్య. యునిసెఫ్‌తో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమన్వయకర్తగా ఉష్ణమండల దేశాల్లో వచ్చే వ్యాధులు, చికిత్స, నివారణ కోసం పరిశోధన, శిక్షణ కార్యక్రమాల రూపకల్పనలో ప్రపంచానికి ఓ దారి చూపిస్తున్నారు సౌమ్య స్వామినాథన్.

టీబీ రహిత సమాజం కోసం..

మూడో ప్రపంచ దేశాల మహిళా శాస్త్రవేత్తల సమాఖ్యలో కూడా సౌమ్య కీలకమైన సభ్యురాలు. పరిశోధనా రంగంలో మహిళల పాత్ర అపారం అంటారామె. మహిళ ఆలోచనలు ఎప్పుడూ ఇంట్లో వాళ్ల సౌఖ్యం, సంక్షేమం, సంతోషాల చుట్టూ తిరుగుతుంటాయి. ప్రతి తల్లి.. తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, తన బిడ్డ సమాజంలో గౌరవస్థానంలో ఉండాలని కోరుకుంటుంది. మహిళలు చేసే పరిశోధనలు ప్రధానంగా వీటి చుట్టూనే సాగితే, వాటి ఫలితంగా ఆరోగ్యవంతమైన, గౌరవప్రదమైన సమాజం ఏర్పడుతుంది అంటారు సౌమ్యా. ఇప్పుడామె ముందున్న ప్రధాన లక్ష్యం టీబీ రహిత సమాజం. టీబీ జీరో సిటీ ప్రాజెక్టులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి టీబీ నిర్మూలనకు కృషిచేస్తున్నారామె.

సౌమ్య చేసిన వైద్య పరిశోధనలకు గాను ఆమెకు ఎన్నో అవార్డులు దక్కాయి వాటిలో కొన్ని..జినో మ్ వ్యాలీ ఎక్స్‌లెన్సీ అవార్డు (2019) ద ఆస్ట్రా జెనికా రీసెర్చ్ ఎండోమెంట్ అవార్డు(2016), ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్ (2013), తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు (2012), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అప్లయిడ్ మైక్రోబయాలజిస్ట్స్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ (2011), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ క్షణిక ఓరేషన్ అవార్డు (2008), డాక్టర్ కేయా లహరీ గోల్డ్‌మెడల్ (1999).
Soumya-Swaminathan1

సరోగసీ బిల్లుకు ప్రత్యేక హోదా

అద్దె గర్భం, వాటిని ప్రోత్సహించే ఫెర్టిలిటీ క్లినిక్స్ గురించి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటానికి ఆలోచిస్తున్న సమయంలో సౌమ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు డైరెక్టర్ జనరల్‌గా నియమితురాలయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే సౌమ్య చేసిన పని సరోగసీ బిల్లుకు ప్రత్యేక హోదా కల్పించటం. అంతకుముందు వరకూ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో భాగంగా కొనసాగిన సరోగసీ బిల్లును దాన్నుంచి వేరు చేసి అద్దె గర్భం ప్రక్రియ దుర్వినియోగం కాకుండా కాపాడారు.

- మధుకర్ వైద్యుల

1718
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles