హిందూ జైన మతాల సమ్మేళనం పద్మాక్షమ్మ దేవాలయం


Sun,February 3, 2019 01:35 AM

temple
అది అతి పురాతన ఆలయం. దాన్ని 12వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించాడని చెబుతారు. కాకతీయుల కంటే ముందే ఇక్కడ జైనులు నివసించారని చెప్పే ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడే కాకతీయులు హనుమకొండ దుర్గం నిర్మించారు. అద్భుత శిల్పకళా సంపదతో అలరారే ఈ దేవాలయం వరంగల్ జిల్లా హనుమకొండలో ఉంది. పద్మాక్షి గుట్టలపై కొలువై పద్మాక్షమ్మగా ప్రజలతో ఆరాధించబడుతూ కోరిన కోరికలు తీర్చే దేవతగా కీర్తిని గడించిన హనుమకొండ పద్మాక్షమ్మ దేవాలయ దర్శనం.

ఎక్కడ ఉంది?: ప్రస్తుత వరంగల్ జిల్లా హన్మకొండ నగరం నడిబొడ్డున వేయి స్తంభాల గుడికి అతి దగ్గరలో పద్మాక్షమ్మ దేవాలయం ఉంది.

ఎలా వెళ్లాలి?: హైదరాబాద్ నుండి హనుమకొండ పద్మాక్షి దేవాలయం సుమారు 143 కి.మీ దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్ నుండి కాజీపేటకు రైలు ద్వారా, హైదరాబాద్ నుండి హనుమకొండకు బస్సుద్వారా వెళ్లి దేవాలయానికి చేరుకోవచ్చు.

ఇది 12వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన దేవాలయం. ఈ ఆలయంలోని ప్రధానదైవం పద్మాక్షి అమ్మవారు. కాకతీయ రాజుల ఇలవేల్పు, ఆరాధ్య దైవం పద్మాక్షమ్మ. 10వ శతాబ్ది కాలంలో ప్రతాపరుద్రుడు వేయిస్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే పద్మాక్షి గుడిని నిర్మించాడని కొందరు చరిత్రకారుల వాదన. కాకతీయ రాజులు అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం యుద్ధ ముహూర్తాలకు, శుభగడియలుగా భావించి శత్రువులపై యుద్ధం ప్రకటించి విజయం సాధించే వారట. ఈ దేవాలయాన్ని పద్మాక్షిదేవికి అంకితం చేశారని చెబుతారు.

ఈ ఆలయం హిందూ, జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురిచేస్తున్నది. మతపరమైన ప్రకృతికి సంబంధించిన శిల్పకళతో పర్యాటకులను, నగరవాసులను ఆకర్షిస్తున్నది. కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి ఒకప్పుడు ఇక్కడ బసది అనే జైనమందిరం ఉండేదని చరిత్రకారులు చెపుతున్నారు. గుడి ఆవరణలో వర్ధమాన మహావీరుడు, పాశ్వీనాథుడి విగ్రహాలతో ఇప్పటికీ అబ్బురపరిచే అందమైన శిల్ప సౌందర్యం ఈ దేవాలయం సొంతం.

పద్మాక్షి అమ్మవారి పేరుమీదే ఇక్కడి గుట్టల్ని పద్మాక్షి గుట్టలుగా పిలుస్తారు. కాకతీయుల కాలం కంటే ముందే ఇక్కడ జైనులు సంచరించేవాళ్లని గుట్టపైన ఉన్న ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి. కొండను తొలచి మొదటి కాకతీయులు హమకొండ గిరి దుర్గాన్ని నిర్మించిన ఆనవాళ్లు ఇప్పటికీ సజీవ సాక్ష్యంగానే ఉన్నాయి. గణపతిదేవుని సోదరి మైలాంబిక హన్మకొండలోని పద్మాక్షిగుట్టపైన కడలాలయ బసది నిర్మించారని చరిత్ర చెబుతున్నది. ఈ బసది గర్భగృహం, ముఖ మండపం ఇందులో ఇప్పటికీ ఉన్నాయి. సంవత్సరం పొడుగునా వచ్చే సందర్శకులు ఈ స్తంభం ఉపరితలాన్నిచూసి ఆశ్చర్యానందాలతో ఈ కట్టడం వెనుక ఉన్న పనితనాన్ని పొగుడుతుంటారు. గుట్టపై భాగంలో భక్తులు సేదతీరడానికి ఆలయ ప్రాంగణం ఉంటుంది. అక్కడి నుండి చూస్తే హన్మకొండ నగరమంతా కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న గరుడ రూపాన్నే కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ధ్వజపతాకంగా ఉపయోగించుకొన్నాడట. అంతేకాదు జైన తీర్థంకరులు శాంతినాద తమ లాంచనానికి కూడా వాడుకొన్నారట. ఇది మరో విశేషం.

పద్మాక్షిదేవి ఆలయంలో ఒక అద్దం ఉండేదట. అద్దం వెనుక నుండి ఉన్న సొరంగం భద్రకాళి దేవాలయం వరకూ ఉండేదని, కాలక్రమంలో దానిని కాస్తా మూసివేశారని కొందరు అంటున్నారు. పద్మాక్షమ్మ గుట్ట దిగువన ఓ అందమైన చెరువు కూడా ఉంది. దీన్ని పద్మాక్షమ్మ చెరువు, బతుకమ్మ చెరువు అని పిలుస్తారు. ఈ చెరువులో బతుకమ్మలు ఎత్తుకున్న తల్లీబిడ్డల విగ్రహాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ వేడుకల వేయిస్తంబాల గుడితో పాటు పద్మాక్షమ్మ గుట్టసమీపంలోనూ అత్యంత వైభవంగా జరుగుతాయి.

ప్రత్యేకతలు

ఈ ఆలయాన్ని గుట్టను తొలిచి నిర్మించిన వైనం అబ్బురపరుస్తుం ది. గుట్ట కింది భాగం నుండి ఆలయాన్ని చేరుకోవడానికి గుట్టనే తొలిచి మెట్లుగా రూపొందించారు. ఆలయ ప్రవేశద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన మూడు జట్ల నిలువు వరుసలను చూడవచ్చు. దీనిని అన్నకొండ స్తంభం అంటారు. దీనిమీద ఉన్న చెక్కడా లు, శాసనాలు చూస్తే ఇది జైనుల స్తూపం అని, జైనుల దేవతలకు అంకితం చేసారని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

- అన్వేషిక

1029
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles