విద్యాభారతం


Sun,January 20, 2019 03:37 AM

Students
ఇల్లాలి చదువు.. ఇంటికి వెలుగు అంటారు. ప్రతి ఇంట్లో విద్యా వెలుగుతో దేశం ఎంతో పురోగతి సాధిస్తుంది. మరి, ఈ విద్యా వెలుగులో మనం ఎక్కడున్నాం? ప్రపంచ దేశాల పురోగతి సాధన, ప్రపంచ శాంతిలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది అని ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ పేర్కొంది. అసమానతలు లేకుండా యావత్ ప్రపంచ
బాలబాలికలకు నాణ్యమైన విద్య అందిస్తే వారు పరివర్తన, సత్ప్రవర్తనతో మంచి పౌరులుగా మారతారని పునరుద్ఘాటించింది. డిసెంబరు 3, 2018న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఐక్యరాజ్యసమితి జనవరి 24ను అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా భారత దేశ విద్యా వ్యవస్థ పరిణామక్రమం, అందులో మహిళల స్థానం గురించి ఈ వారం ముఖచిత్ర కథనం.

- సునీల్ ధవళ, సెల్ : 9741747700

కొన్ని శతాబ్దాల పాటు మనం పోర్చ్‌గీసు, డచ్, బ్రిటీష్, ఫ్రెంచ్ వారి కింద బానిసలుగా ఉన్నాం. భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన బ్రిటీషు వారి ఆర్థిక వ్యవస్థను స్వాతంత్య్రం సిద్ధించాక 70 సంవత్సరాల్లో అధిగమించి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదిగింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దడంలో మన విద్యావ్యవస్థ ప్రముఖ పాత్ర వహించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలోనే పురాతనమైన విశ్వవిద్యాలయాల్లో రెండు విశ్వవిద్యాలయాలు భారత గడ్డ మీద ఉనికిలో ఉండడం విశేషం.

తక్షశిల విద్యాలయం : క్రీ.పూ. 1000లో గాంధార సామ్రాజ్యం (ఇప్పటి పాకిస్తాన్)లో తక్షశిల విద్యాలయం వెలిసింది. క్రీ.శ. 500 వరకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులకు రాజనీతి, వాణిజ్యం, తత్వశాస్త్రం, ఖగోళ శాస్త్రం, సంగీతం, విలువిద్య, వేదాంతం, వ్యాకరణం, ఔషధం, శస్త్రచికిత్స మొదలైన 68 శాస్ర్తాలను, కళలను ఇక్కడ బోధించేవారు.

నలంద విశ్వవిద్యాలయం : ఐదో శతాబ్దంలో మన దేశంలో నలందా విశ్వవిద్యాలయం స్థాపన జరిగింది. క్రీ.శ. 1193లో ఆక్రమణదారులు నాశనం చేసే వరకు ఆసియా ఖండంలో వివిధ దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి విద్యను అభ్యసించేవారు. తక్షశిల, నలందాలు శిథిలావస్థకు చేరుకొనేనాటికి విశ్వవిఖ్యాత ఆక్స్‌ఫర్డ్ (క్రీ.శ. 1096), కేంబ్రిడ్జ్ (క్రీ.శ. 1209) ఐరోపాలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయమైన బోలోగ్నా (క్రీ. శ. 1088) ఇంకా స్థాపితం కాలేదు కూడా.

బ్రిటీష్ వారి పాలనలో విద్యాసంస్థలు

మొఘల్ చక్రవర్తుల పాలనా కాలంలో విద్యపై ఇస్లామిక్ ప్రభావం అంతెక్కువగా లేదు. బ్రిటీష్ వారు వచ్చాకా అనేక మిషనరీ పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించారు. దీంతో బ్రిటీష్ పాలనా వ్యవస్థ తరువాత, ఆంగ్ల భాష వాడకం మన దేశంలో విస్తరించింది. ఈ సమయంలో, భారతదేశ విద్యావ్యవస్థ రూపురేఖలు మారిపోయి, ఉన్నత విద్య, సాంకేతిక విద్యకు నాంది పలికింది.

సెరంపూర్ కళాశాల : పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని 1818లో మిషనరీ సంస్థ స్థాపించిన సెరంపూర్ కళాశాల ఇప్పటికీ భారతదేశంలోని అతి పురాతన కళాశాల.
ఇండియన్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ : ఇది ఆసియా ఖండంలోనే అత్యంత పురాతన సాంకేతిక సంస్థ. ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీలో 1847లో దీన్ని స్థాపించారు. గతంలో దీన్ని రూర్కీ విశ్వవిద్యాలయంగా, థామ్సన్ కాలేజ్ అఫ్ సివిల్ ఇంజినీరింగ్‌గా పిలిచేవారు. 1949లో విశ్వవిద్యాలయ హోదా పొంది 2001లో భారతదేశ ఏడో ఐఐటీగా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మార్పు చెందింది.

కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలు : 24 జనవరి 1857న కలకత్తాలో, 18 జూలై 1857న బొంబాయిలో, సెప్టెంబర్ 5, 1857న మద్రాస్‌లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసింది అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం. ఈ మూడు విద్యాలయాలు ఎంతోమంది గొప్ప వ్యక్తులను, నోబెల్ గ్రహీతలను మనకు అందించాయి.

అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ : 1875లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే ఇస్లామిక్ సంస్కర్త, తత్వవేత్త ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఈ యూనివర్సిటీని స్థాపించారు. ఇప్పుడు అనేక అంశాల్లో 300లకు పైగా కోర్సులను అందిస్తున్నది ఈ విశ్వవిద్యాలయం.

అలహాబాద్ యూనివర్సిటీ : అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ విలియమ్ ముయిర్ ఆలోచన మేరకు అయన పేరు మీద 1887లో స్థాపించిన ముయిర్ సెంట్రల్ కాలేజీ క్రమేపీ అలహాబాద్ యూనివర్సిటీగా రూపుదాల్చింది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, పూర్వ ప్రధానులు అలహాబాద్ యూనివర్సిటీ పూర్వవిద్యార్థులే.

బనారస్ హిందూ యూనివర్శిటీ : దేశయాటన చేసి చందాలు పోగు చేసి 1916లో పార్లమెంటరీ శాసనం ద్వారా బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించడానికి కృషి చేశారు మదన్ మోహన్ మాలవీయ. 1898లో తాను స్థాపించిన సెంట్రల్ హిందూ కాలేజీని ఈ యూనివర్శిటీలో విలీనం చేయడానికి ఒప్పుకొన్నారు అన్నీబిసెంట్. పండిట్ మాలవీయ, సర్వేపల్లి రాధాకృష్ణ , భారత రెండో విద్యాశాఖమంత్రి కే. ఎల్. శ్రీమాలి మొదలైన వారు బీహెచ్‌యూకి వైస్‌ఛాన్సలర్స్‌గా పదవినలంకరించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆసియా ఖండంలోనే అతిపెద్ద నివాస విశ్వవిద్యాలయం. వారణాసిలో ప్రధాన క్యాంపస్, ఉండగా దక్షిణ క్యాంపస్ మిర్జాపూర్‌లో నెలకొల్పారు.

స్వాతంత్య్రానంతరం..

భారతదేశంలో సామాజిక మార్పు , జాతీయ ఉద్ధరణలో విద్య ప్రాధాన్యాన్ని గుర్తించి స్వాతంత్య్రానంతరం దేశ విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టింది ప్రభుత్వం. దీంతో విద్యాసంబంధ సమస్యలను సమీక్షించడానికి అనేక కమిటీలు, కమిషన్లు ఏర్పడ్డాయి. స్వాతంత్య్రానంతరం అనేక విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో పాటు కాకుండా సాంకేతిక విద్య కోసం ఐటీఐ, పాలిటెక్నిక్, రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలు, ఐఐటీలు, మేనేజ్‌మెంట్ విద్య కోసం ఐఐఎంలు, వైద్యవిద్య కోసం మెడికల్ కాలేజీలు అనేక ప్రధాన నగరాల్లో ఏర్పాటయ్యాయి. నాణ్యమైన విద్య అందించడంలో మన ఐఐటీలు, ఐఐఎంలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి.

ఆపరేషన్ బ్లాక్‌బోర్డు : 1986 నాటి కొత్త విద్యావిధానంలో భాగంగా 1987లో ఆపరేషన్ బ్లాక్‌బోర్డు అనే పథకాన్ని భారత ప్రభుత్వం అమలు చేసింది. దీని ప్రధాన లక్ష్యం ప్రాథమిక విద్య నాణ్యతను మెరుగుపరిచి, విద్యార్థుల గైర్హాజరు, మధ్యలో చదువు మానేసే వారి సంఖ్యను తగ్గించడం. ఉపాధ్యాయులను నియమించి కనీసం 50 శాతం భర్తీలను పూరించడం మరో లక్ష్యం. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం రెండు పక్కా తరగతి గదులను కట్టించడం, బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు కట్టించడం ఇతర లక్ష్యాలు.

మిడ్ డే మీల్ : పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు జాతీయ పౌష్టికాహార పథకాన్ని తెచ్చారు. ఈ పథకం 15 ఆగస్టు 1995న మొదలైంది. దీనిలో భాగమే మధ్యాహ్న భోజన పథకం. ప్రాథమిక విద్య దశలో బడిపిల్లలు రోజూ స్కూలుకు హాజరయ్యేలా ప్రోత్సహించడానికి, అర్ధాంతరంగా స్కూల్, చదువు మానేయకుండా ఆకర్షించడానికి, పిల్లల పోషక స్థాయిని మెరుగుపర్చడం ఈ పథకం లక్ష్యాలు.

ఆర్‌ఈసి / నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ : రెండో పంచవర్ష ప్రణాళిక 1956-60 సమయంలో, అనేక పారిశ్రామిక ప్రాజెక్టులు వెలిశాయి. వీటిని నిర్మించడానికి తగినంత శిక్షణ పొందిన సిబ్బందిని పెంపొందించడానికి ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాలల (ఆర్‌ఈసి) స్థాపన జరిగింది. ఇంజినీరింగ్, సాంకేతిక విద్య బోధించే రీజినల్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా స్థాపించారు. 1959-67లో 15, 1986-87లో 2, 2002-2006లో 3 మొత్తం 20 ఆర్‌ఈసిలుండగా 2010-18 మధ్య మరో 11 నెలకొల్పి వీటన్నింటీనీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)గా నామకరణం చేశారు.

వ్యవసాయ విద్య : వ్యవసాయంలో ఉత్పాదకత, సాగుదల మెరుగుపరచడానికి దాదాపు అన్ని రాష్ర్టాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వెలిశాయి. ఈ విశ్వవిద్యాలయాలు వ్యవసాయం, అటవీ, ఉద్యానవన పెంపకం, జంతువుల పెంపకం, మత్స్య, పట్టు పెంపకం, పశువైద్య శాస్ర్తాలు మొదలైన వాటిలో విద్యను, పరిశోధనను అందిస్తాయి.

వృత్తి విద్య : జాతీయ విద్యా విధానం 1986లో భాగంగా మాధ్యమిక విద్య శ్రేణిలో వ్యవసాయం, పాల ఉత్పత్తి, కోళ్ల పెంపకం, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, ఆటోమొబైల్, ఇతర చేతివృత్తులతో కూడిన పాఠ్య ప్రణాళికను చేర్చి వృత్తివిద్యకు పెద్ద పీట వేసింది కేంద్ర ప్రభుత్వం. 1988 నుంచీ ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల మంజూరు చేస్తున్నది.

మాతృభాషలో బోధనా మాధ్యమం : 1968 నాటి జాతీయ విద్యా విధానం అమలులోకి వచ్చాక ఉన్నత విద్యా స్థాయిలో ప్రాంతీయ భాష బోధనా మాధ్యమంగా మారింది. పాఠ్యపుస్తకాలు, ప్రశ్నాపత్రాలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. అదే తరుణంలో భారతదేశ చరిత్ర, సంస్కృతి పాఠశాల, కళాశాల పాఠ్య ప్రణాళికలో చేర్చబడింది.

వయోజన విద్య : అక్షరాస్యులు కాని 15-35 సంవత్సరాల వయస్సు వారికి క్రియాత్మక అక్షరాస్యతను అందించి వయోజన విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో 1988లో జాతీయ అక్షరాస్యతా కార్యక్రమం ఆరంభమైంది. గ్రామీణ స్థాయిలో వయోజన విద్యవల్ల అక్షరాస్యతలో పురోగతి సాధన జరిగింది.

సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) : 2001లో సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) అనే ప్రభుత్వ పాఠశాల విద్యా పథకం ఆరంభమైంది. ఈ పథకం మొదట ప్రాథమిక విద్యను పెంచడానికి మొదలైనా క్రమంగా రైట్ టు ఎడ్యుకేషన్ (విద్యాహక్కు చట్టం) అమలుకు సాధనంగా మారింది. ప్రతి ఒక్కరికి పాఠశాల అందుబాటులో ఏర్పరిచి విద్యను అందించడమే సర్వ శిక్షా అభియాన్ ముఖ్యఉద్దేశం. 6 నుంచి 14 ఏళ్ళ వయస్సులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడం ఈ విధానం ఉద్దేశం. భారత రాజ్యాంగంలోని 86వ సవరణ ద్వారా సర్వ శిక్షా అభియాన్ పథకం అమలైంది. దీన్ని పరిచయం చేయకముందు ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండేది. పంచాయతీ రాజ్, పాఠశాల నిర్వహణ కమిటీలు, గ్రామ, పట్టణ మురికివాడల స్థాయి విద్యా సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాలు, మదర్ టీచర్ అసోసియేషన్, గిరిజన అటానమస్ కౌన్సిల్ వంటి దేశంలోని అన్ని సంస్థలను అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క తాటిమీదకి తెచ్చి విజయవంతంగా ఈ పథకం అమలయ్యేలా చేసింది. ప్రాథమిక స్థాయిలో ప్రస్తుతం దేశంలో 14.5 లక్షల ప్రాథమిక పాఠశాలల్లో 19.67 కోట్ల మంది పిల్లలకి 66.27 లక్షల ఉపాధ్యాయులు విద్యనందిస్తున్నారు. సర్వ శిక్షా అభియాన్‌ను ఆధారంగా చేసుకొని 2009లో విద్యాహక్కు చట్టం అమలు చేశారు. దీంతో 2009-10లో పాఠశాలల సంఖ్య 2 లక్షల నుంచి 2015-16లో 10 లక్షలకు గణనీయంగా పెరిగింది.

చదువు-సంస్కారం (2018 నాటికి విద్యారంగం)

20వ శతాబ్ది మొదట్లో 1901లో భారతదేశ జనాభా 23 కోట్లుండగా కేవలం 5% మాత్రమే అక్షరాస్యులుండేవారు. అప్పట్లో చదువు మగవాడి సొత్తు మాత్రమే అని చెప్పడానికి నిదర్శనంగా అక్షరాస్యులలో 9.5% పురుషులు కాగా నామమాత్రంగా 0.5% మహిళలు ఉండేవారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభాలో పురుషుల్లో 82%, స్త్రీలలో 65% అక్షరాస్యత సాధించడంతో దేశం మొత్తం అక్షరాస్యత రేటు 74 శాతానికి చేరుకొంది. విద్యారంగంలో అభివృద్ధి నత్తనడకలో మొదలయినా మొత్తానికి సంతృప్తికరమైన పురోగతిని సాధించింది. నేడు భారత గడ్డమీద 47 కేంద్ర విశ్వవిద్యాలయాలు (సెంట్రల్ యూనివర్సిటీలు), 370 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 125 డీమ్డ్ యూనివర్సిటీలు, 300కి పైగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 2014 నాటికి దేశంలో 10 లక్షల ప్రాథమిక పాఠశాలలు, 6.5 లక్షల మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు, 39000 కాలేజీలు 770కి పైగా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 7 కోట్ల బాలురు, 6.5 కోట్ల బాలికలు, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో 6 కోట్ల బాలురు, 5 కోట్ల బాలికలు చదువుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 28 లక్షల ఉపాధ్యాయులు ఉండగా, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో 27 లక్షలున్నారు. 2018లో దేశంలో విద్యావ్యవస్థ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి స్థూల జాతీయోత్పత్తిలో సుమారు 3% శాతం ఖర్చు చేస్తున్నాయి.
Students1

1947-2018 మధ్య విద్యాభివృద్ధి

సమర్థవంతమైన విద్యావ్యవస్థను ఏర్పాటు చేయడానికి 1964-66లో కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం జాతీయ విద్యా విధానాన్ని ప్రభుత్వం స్వాగతించింది. 1968లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేసింది. విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చి హెచ్చు కేటాయింపులు చేసింది. దీంతో 1985 నాటికి సుమారు 5,20,000 ప్రాథమిక పాఠశాలలు, 1,90,000 మాధ్యమిక పాఠశాలలు, 6,000 డిగ్రీ కళాశాలలు, 17 అగ్రికల్చరల్ కాలేజీలు, 117 మెడికల్ కాలేజీలు, 135 విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. అత్యధిక రాష్ర్టాల్లో 10+2+3 విద్యావ్యవస్థను అమలు చేయడం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సాధించిన ఘనత. 1947 నుంచి 1985 వరకు ఉన్న కేంద్ర విద్యామంత్రిత్వ శాఖని రద్దు చేసి మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్.ఆర్.డి.) అనే నూతన మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఈ శాఖకు పీవీ నరసింహారావు తొలి మంత్రి. 1986లో పాత విద్యా విధానాన్ని మార్పు చేసి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 అనే విద్యావిధానాన్ని రూపొందించింది. పీవీ వ్యూహం, ప్రణాళిక, అనుభవం, కృషిల మిళితమే ఈ నూతన విద్యావిధానం. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986లో భాగంగా దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ సమితి స్కూళ్ళు ఏర్పాటు చేశారు. 23 పాయింట్లతో కూడిన టాస్క్‌ఫోర్స్ ఎజెండా పెట్టింది హెచ్‌ఆర్‌డీ.

- 1956లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేశారు.
- 1958లో కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ ఉద్భవించింది.
- 1958లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కి స్వయం ప్రతిపత్తి కలిపిస్తూ డీమ్డ్ యూనివర్సిటీగా ప్రకటించారు.
- 1961లో నేషనల్ కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సంస్థను నెలకొల్పారు.
- 1962లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబీఎస్‌ఈ) మనుగడలో కొచ్చింది.
- 1963లో సెంట్రల్ స్కూళ్ళు అనే కేంద్రీయ విద్యాలయాలు పుట్టుకొచ్చాయి.
- 2018 నాటికి దేశవ్యాప్తంగా 1195 కేంద్రీయ విద్యాలయాలలో 11 లక్షల విద్యార్థినీ విద్యార్థులు, 56 వేల మంది సిబ్బంది పర్యవేక్షణలో విద్యాబుద్ధులు అభ్యసిస్తున్నారు.
Students2

సాంకేతిక విద్య అభివృద్ధి :

సాధారణ విద్యతోపాటు మానవవికాసం, జీవనోపాధి కల్పన, మూలధనీయ నిర్మాణంలో సాంకేతిక విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అనేక పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్స్, ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ అండ్ డెంటల్ కాలేజీలు, మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లు మొదలైన వాటిని ప్రభుత్వం స్థాపించింది. 1951లో ఖరగ్‌పూర్, 1958లో ముంబై, 1959లో కాన్పూర్, చెన్నై, 1963లో ఢిల్లీ, 1994లో గౌహతిలో ఐఐటీలు నెలకొల్పింది. 2001లో రూర్కీ విశ్వవిద్యాలయం ఐఐటీ రూర్కీ గా రూపాంతరం చెందింది. ఇంజినీరింగ్, టెక్నాలజీలో విద్య, పరిశోధన కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యా సంస్థలను స్థాపించారు. గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ స్థాయిలలో నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నారు. 1969లో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఆరంభించారు.
Students3

నిద్ర లేచింది మహిళాలోకం..

విద్యను అందించడంలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించడానికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యార్థినుల ట్యూషన్ ఫీజును మినహాయించాయి. మహిళల్లో అక్షరాస్యత స్థాయిని పెంచడానికి ప్రత్యేక పాఠశాలలు, కళాశాలను స్థాపించాయి. మహిళా అక్షరాస్యతలో ప్రపంచ సగటు రేటు 80% కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం 65% మహిళల అక్షరాస్యత రేటుతో, మన దేశంలో మహిళల విద్య నేటికీ ప్రశ్నార్థకంగా ఉంది.

- తెలుగు రాష్ర్టాల జనసంఖ్య 8.40 కోట్లు కాగా, జనాభాలో దాదాపు సగం మంది మహిళలే. 2011 నాటికి సమైక్య తెలుగు రాష్ట్ర అక్షరాస్యత రేటు 67%. పురుషుల్లో 75%, మహిళలల్లో 59% మాత్రమే అక్షరాస్యత సాధించారు. అటు దేశంలోని, ఇటు రాష్ట్రంలోని స్త్రీ, పురుషుల అక్షరాస్యత రేట్ల మధ్య గణనీయమైన తేడా ఉంది. ప్రస్తుత ప్రగతి ప్రకారం 2060 వరకూ దేశం సార్వత్రిక అక్షరాస్యత సాధించలేదని అంచనా. 1962లో గుండమ్మ కథలో లేచింది మహిళా లోకం నిద్ర లేచింది అని చిగురాశ కలిపించారు. కానీ చదువు సంధ్యల్లో మహిళా లోకం పురుష ప్రపంచంతో పాటు సమానంగా ఉండడానికి ప్రయత్నించింది 2001 తరువాతే. 2001-11 మధ్య 11 కోట్ల మంది స్త్రీలు అక్షరాస్యత సాధిస్తే ఆ పదేళ్లలో 10 కోట్ల మంది పురుషులు అక్షరాస్యులుగా మారారు, అంటే మహిళల్లో 12% వృద్ధి, పురుషుల్లో 9% వృద్ధి సాధించారు.

- 1947లో దేశం స్వాతంత్య్రం పొందినా మహిళలకు మాత్రం లభించలేదు, వారి తెలివితేటలు, మేథాశక్తిని అప్పుడు గుర్తించిన వాళ్ళే లేరు. చదువెందుకు.. ఉద్యోగాలు చేయాలా? అని ఫస్ట్ పారంలోనే మాన్పించి మూడుముళ్ల బంధంలోకి తోసేవారు. పిల్లల పెంపకంతో పాటు వారిని కూర్చోబెట్టి చదివించడంలో మాత్రం తల్లి మీద ఆధారపడే సమాజం మనది అప్పుడూ ఇప్పుడూనూ. ఆ తల్లి నిరక్షరాస్యులైనట్లయితే తరువాత తరానికి విద్య ఎలా అందిస్తుంది. పదో క్లాస్ పాసవ్వకపోయినా పర్వాలేదు, కుట్లు అల్లికలు, వంటా వార్పూ నేర్పించి ఆడపిల్లలని ఒక అయ్య చేతిలో పెట్టేవరకు గుండెల మీద కుంపటి, ఆడపిల్లలు అంటే వంటింటి కుందేళ్లు అన్న భావన 1980ల వరకు ఉండేది. టైపు, షార్ట్‌హ్యాండ్ నేర్పించి ఇంటర్మీడియట్ వరకు చదువు చెప్పించి పెండ్లి చేసేస్తే తర్వాత ఇంట్లో కూచుని ట్యూషన్‌లు చెప్పుకొంటుంది, అదృష్టం బాగుంటే ఏ బ్యాంకులోనో క్లర్క్ గానో దొరికితే చాలు - మహిళా ఉద్యోగం చేయాలంటే టీచరమ్మ లేదా టైపిస్ట్ మాత్రమే అనుకొనే 1990ల నాటి రోజులవి.

- మరిప్పుడో? మగవాళ్ళతో సమానంగా ఏరోనాటికల్ ఇంజినీరింగ్ నుంచి వ్యాపారం చేసే వరకు, అప్పడాలు ఒత్తడం నుంచి అంతరిక్షంలోకి వెళ్లడం దాకా అన్ని రంగాల్లో రాణించి ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్ అని అక్షరాలా నిరూపిస్తూ వస్తున్నారు నేటి వనితలు. అతివలకు అరడజను చేతులు లేకపోయినా ఒక మాతృమూర్తిగా, గృహిణిగా, కోడలుగా, కూతురుగా బాధ్యతలు వహిస్తూ, ఉద్యోగాల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇంటా-బయటా గెలిచి చూపిస్తున్నారు. మహిళాలోకం ఆలస్యమైనా మొత్తానికి నిదుర లేచింది.

- 25 ఏళ్ళ క్రితం ఆడపిల్లకు చదువంటే ఆకాశంలో హరివిల్లు లాంటిది, అందని చందమామ. పైగా మహిళా నిరక్షరాస్యత కుటుంబం, పిల్లల భవిష్యత్తు, చివరిగా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపింది. మూడేళ్ళ ప్రాయంలోనే బడిలో ప్రవేశం పొంది, రంగు రంగుల యూనిఫారాలు వేసుకొని రిక్షాలు, బస్సుల్లో స్కూల్ కెళ్లే బాలికలు పట్టణాలలో కనిపించినట్టుగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనబడరు. బాలికల విద్యకు గ్రామీణంలో ఇప్పటికీ అనేక అడ్డంకులున్నాయి. పేదరికం తాండవిస్తున్నప్పుడు ఉన్న డబ్బుల్లో కొడుక్కి చదువు చెప్పిస్తారు కానీ కూతురుకి చదువు అనవసరం అని భావించి ఇంటిపని, వంటపని చివరికి కూలీపనిలోకి దింపే తల్లిదండ్రులు కోకొల్లలు. ఆడపిల్లకి చదువు పై ఖర్చు చేయడం కన్నా అప్పు చేసి మరీ ఆడపిల్ల పెండ్లి ఆర్భాటంగా చేసే మన దేశ సంస్కృతి నెమ్మదిగా మారుతున్నది. కొడుక్కి చదువు చెప్పిస్తే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదుకొంటాడు, కూతురు ఎప్పటికైనా పరాయింటిదే అన్న అపోహ కూడా నెమ్మదిగా తొలగిపోతున్నది.

రచయిత : సీఈవో, ద థర్డ్ అంపైర్ మీడియా అండ్ అనలిటిక్స్

1271
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles